Previous Page Next Page 
జీవనయానం పేజి 12


    వాస్తు ప్రకారం భద్రాచలం ఆలయ పర్వతం వెనుకది. అది ముంపుకు గురికాదు. దురాశతో గోదావరి ఒడ్డున కట్టినవే మునిగేది.

 

    ఖుతుబ్ షా భాగ్యనగరం చార్మినార్ నుంచి మొదలవుతుంది. ఎంతటి వరద అయినా ముసే ముంచలేదు. దురాశవల్లనే భాగ్యనగరం 1908 లో మునిగింది.

 

    చిన్నగూడూరు మరొక వైపు "తుమ్మిడి చెరువు" ఉంది. ఇది పెద్ద చెరువు. దీని కింద రెండు పంటలు పండుతాయి. దీని క్రిందనే మాకు పొలం ఉండింది.

 

    తుమ్మిడి చెరువు నిండుతే "మత్తడి" మీది నుంచి దూకుతుంది. ఆ నీరు "కట్టు కాలువ" లో నుంచి ప్రవహిస్తుంది. కట్టు కాలువ నీరు "ముత్యాలమ్మ కుంట" నింపుతుంది. ఇదే తామరల అందాలరాణి. ముత్యాలమ్మ కుంటనీరు "తిరుమణి కుంట" నింపుతుంది. ఇంకా నీరువస్తే ఏటిలోకి వెళ్లిపోతుంది. గ్రామాన్ని అంటదు.

 

    ఇంజనీరింగ్ తెలియని మన మూర్ఖులు పారుదల విషయంలో ఇంతటి నైపుణ్యం ప్రదర్శించారు!

 

    ఊరిని ఆనుకుని ఒక పెద్ద మామిడితోట ఉండేది. అది "ధర్మతోట." అది ఒకరికి చెందింది కాదు. గ్రామానిది. ఆ తోట కాయలు అమ్మరు. ఆడుకునే పిల్లలు తప్ప కోయరు! అది పక్షుల ఆహారం కోసం వేసింది. అక్కడ ఎండిన మామిడి ఆకు మీద అడుగువేస్తే ఒక లయబద్ధ ధ్వని వచ్చేది. చిలకలు గుంపులుగా కిలకిల లాడేవి. చిలకలు గుంపులుగా ఆకాశానికి ఎగిరితే పంట చేలు ఆకాశంలో తేలియాడుతున్నట్లు ఉండేది.   

 

    వీధులు మరీ తిన్నగా ఉండవు. వంకరలుగా ఉన్నా ఏ సందునుంచి వచ్చినా ముఖ్య మార్గానికి కలుస్తాయి. వీధులు శుభ్రంగా ఉండేవి. నిత్యకృత్యంగా అన్ని ఇళ్ళముందూ ఊడిచి పెండనీళ్లు చానిపించల్లేవారు. పచ్చని నేలమీద పడుచు పిల్లలు తెల్లని ముగ్గులు వేసేవారు. ముగ్గు అంటే రాతిపిండి కాదు. వరి పిండి - బియ్యం లేక నూకల పిండి. అది చీమలలాంటి వాటికి ఆహారంగా పనికి వస్తుంది. సాయంకాలం కాగానే ఇళ్లముందరి గూళ్ళలో - ముందు - ప్రమిదలు వెలిగించి పెట్టేవారు. అవి వీధికి వెలుగు! గూటికి అందం!!

 

    ఇదంతా స్వచ్ఛందం. అనూచానంగా వస్తున్న ఆచారం. సంప్రదాయం. దీనిలో ఎవరి బలవంతమూ లేదు. పంచాయతి కమిటీ లేదు. పన్నుల వసూళ్లు లేవు. పదవి కోసం పోరాటం లేదు. డబ్బుకోసం కుమ్ములాటలు లేవు.   

 

    ప్రభుత్వం భూమిశిస్తుపై రూపాయికి ఒక అణాచొప్పున లోకల్ ఫండు - స్థానిక నిధి వసూలు చేసేది. సర్కారువారి దయాధర్మాలనుబట్టి అక్కడక్కడా మంచినీటి బావులు ఏర్పరచేవారు.

 

    సర్కారువారి దయా ధర్మాలమీద ఆధారపడక - ధర్మాత్ముల మంచినీటి బావులు - దేవాలయాలు - సత్రాలు నిర్మించేవారు. ఇందుకు ఒక విశిష్ఠం అయిన వ్యవస్థ ఉండేది. వర్తకులు రూపాయికీ ఒక పైస చొప్పున ధర్మఖాతా నిర్వహించేవారు. ఆ డబ్బు విషయంలో మాత్రం మోసం చేయడంగాని - అబద్ధం ఆడడంగాని చేసేవారు కాదు. ఆ డబ్బు ధర్మకార్యానికే వెచ్చించేవారు.

 

    మరొక విషయం. కీర్తికి అధిక ప్రాధాన్యత ఉండేది. కీర్తికోసం బావులు తవ్వించేవారు. తోటలు వేయించేవారు. ఇవి సంతానం వంటివి. వీటిని సప్త సంతానాలు అనేవారు.

 

    గృహనిర్మాణం విషయంలో తరతరాలుగా వస్తున్న ఒక వాస్తుపద్ధతిని అనుసరించే వారు. ఇందుకు అనుభవం తప్ప అధ్యయనం లేదు. ప్రతి ఇంటికీ విడిస్థలం తప్పనిసరి. ఇంటి ముందు అచ్ఛాదన కింద అరుగులు ఉండాలి. అవి బాటసారులకు ఉపయోగపడడానికి.

 

    మా ఇంట్లోనే కాదు. అందరి కుటుంబాల్లో ఉందనుకుంటా - ఒక మానవతా పూర్ణ ఆచారం. భోజనం చేసేముందు ఇంటి ముందున్న అరుగుల మీద చూడాలి. కుల మతాలతో సంబంధం లేదు. అతడు అతిథి దేవుడు. అతనికి ముందు వడ్డించాలి. అతని భోజనం అయింతరువాతనే ఇంటివారి భోజనం.  

 

    అన్నం అమ్మడం మహాపాపం! పట్టపగలు భోజనానికి వచ్చిన అతిథి ఈశ్వరుడు!

 

    ఇళ్లు కట్టడానికి గ్రామంలో లభించే పదార్థాలు మాత్రమే వాడేవారు. పనివాళ్లూ ఊళ్ళో వాళ్లే. మేకులు, గొళ్ళేలు, గడియలు వంటి ఇనుప పదార్థాలు బయటినుంచి తెచ్చుకునేవారు. అడవి ఊరు ప్రక్కనే. వాసాలు వగైరా అక్కడివి. నక్కల ఊళలు వినిపిస్తుండేవి. చిరుతపులులు - ఎలుగ్గొడ్ల లాంటివి ఊళ్ళోకి రావడం, ఉమ్మడిగా వాటిని సాగదోలడం సర్వసాధారణం.

 

    ఊళ్లో ఎక్కువ మట్టి ఇళ్లు - పూరిండ్లు. మట్టిగోడలు పెంకుటిళ్లు తక్కువ. పెంకులు కుమ్మరి చేసేవాడు. వడ్లతను - ఉప్పరి అంతా వూరివారే.

 

    గడీ మాత్రం ఇటుక సున్నంతో కట్టిన మేడ. "గడీ" అంటే మహారాష్ట్రంలో కోట అని అర్థం. గడీ అనే పదం అక్కడినుంచే వచ్చింది. దేశ్ ముఖ్ - దేశపాండ్యా సంప్రదాయం కూడా మహారాష్ట్రులదే. నిజాం రాజులు మహారాష్ట్ర పద్ధతిని తమ రాజ్యమంతటా ప్రవేశపెట్టినట్లున్నారు.

 

    గడీ అంటే దొర ఇల్లు. దాన్నిమించింది ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఉండదు. ఎంచాతంటే - భూములన్నీ దొరవే! ఊరు సాంతం దొరకు ఊడిగం చేయడానికే ఏర్పడింది. ఇది దొర అభిప్రాయం మాత్రం కాదు. సమాజం దాన్ని అంగీకరించింది. అలాకాకుంటే ఏ శాసన బలమూ లేకుండా దొరలు అంత విశృంఖలంగా - నిరంకుశంగా పాలించలేరు!

 

    ఒక కథనం ప్రకారం దొరలే గ్రామాలను ఏర్పరచారు. అడవులు కొట్టించారు. చెరువులు వగైరా సాగునీటి ఏర్పాట్లు చేశారు. వ్యవసాయానికి, ఆవాసానికి అనువయిన వాతావరణం సృష్టించారు. జనాన్ని పిలిపించి ఊళ్లల్లో ఉంచారు.

 

    గ్రామం ఏర్పడడానికి మొట్టమొదటి అవసరం వృత్తిపని వాళ్లది. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, కంచరి, వడ్ల, మూల మాదుగులు. వీరు గ్రామానికి సప్తాంగములు. వారిని పిలిపించడానికి ఇనాములు ఇచ్చారు. ఇనాము భూముల మీద సర్కారు కిస్తు లేదు. వీటిని అమ్మడానికి, కుదువ పెట్టడానికి వీలులేదు. వంశపారంపర్యంగా వృత్తులు చేయాలి, అనుభవించాలి. అందువల్ల భూమిలేని వృత్తి పనివారు తెలంగాణంలో లేకుండిరి.

 

    వేల సంవత్సరాల నుంచి వచ్చిన గ్రామ వ్యవస్థ అత్యంత పటిష్టం అయింది. ఇది సమాజం ఏర్పరచుకున్నది. రాజకీయంతో ఏమాత్రం నిమిత్తం లేనిది. ఎన్ని దండయాత్రలు జరిగినా. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ వ్యవస్థ చెక్కు చెదరలేదు!

 

    ఈ వ్యవస్థలో భూమి లేనివాడు, ఇల్లు లేనివాడు, పని లేనివాడు, తిండి లేనివాడు ఉండడు. కాకుంటే వ్యత్యాసాలు విపరీతంగా ఉంటాయి.

 

    పరిపూర్ణం అయిన వ్యవస్థ ప్రపంచంలో లేదు. ఎందుకంటే, సృష్టిలో భగవంతునికి తప్ప దేనికీ పరిపూర్ణత లేదు. దేనికయినా అలవాటు పడాల్సిందే!

 

    వృత్తుల వారికి ఇచ్చిన ఇనాములు ఆంధ్రప్రదేశం వచ్చిం తరువాత పట్టాలు చేశారు. వృత్తి పనులవారు వాటిని అమ్ముకున్నారు. బస్తీలు పట్టారు. ఈ సమస్యలు నేను రచించిన "జనపదం" నవలలో చర్చించాను.

 

    దొరల బలం మీద ఊరి ప్రాధాన్యత ఆధారపడి ఉండేది. చిన్న గూడూరు దొరలు రావులవారు. వారు బలవంతులు. కావున ఆ చుట్టుపట్ల గ్రామాలలో దానికి ప్రాధాన్యత వచ్చింది. వర్తకులు తమ భద్రత చూచుకుంటారు. వ్యాపారాన్ని బట్టి ప్రాధాన్యత వస్తుంది. ఈ ఊరిలో యాభైకి పైగా వర్తక కుటుంబాలుండేవి. దుకాణాలు, లావాదేవీలు బాగా ఉండేవి. కాబట్టి చుట్టుపట్ల జనం అమ్మకానికి, ఖరీదుకు, అప్పులకు, దాచుకోవడానికి ఇక్కడికే వచ్చేవారు.

 

    నిజాం రాజ్యంలో పోలీసునాకా - స్కూలు - టపాఖానా ఉన్నది ప్రధాన గ్రామం. ఈ ఊళ్లో ఇవన్నీ ఉన్నాయి. "మాసూమలీ" అనే పోస్టు బంట్రోతు విచిత్రంగా ఉండేవాడు. అతని నడుముకు పటకా, వానికి తళతళమెరిసే ఇత్తడి బిళ్ల. దానిమీద ఊర్దూలో నిజాం సర్కారు ఉద్యోగి టపాజవాను అని వ్రాసి ఉండేది. అతని చేత ఒక బల్లెం. ఆ బల్లానికి గజ్జెలు. గజ్జెలు గలగలలాడిస్తూ ఉరికేవాడు.

 

    టపాపని - మదర్స అంటే స్కూలు సదర్ ముదర్రిస్ అంటే ప్రధానోపాధ్యాయుడు నిర్వహించేవాడు. మదర్సలో ఛౌదీ జమాత్ అంటే నాలుగవ క్లాసువరకు ఉండేది. ముగ్గురు మదర్సిలు అంటే టీచర్లు. ఉర్దూమీడియంలో చదువు.

 

    గడీముందు పోలీసునాకా. దానిముందు వేపచెట్లు. వాటికింద అరుగుంది. దొర అక్కడే ఉండేవాడు. పోలీసులు దొర బంట్రోతులని జనం నమ్మకం. పోలీసుల నమ్మకం కూడా అదే! సరిగ్గా ఎదురు సందులో పట్వారీ - కరణం ఇళ్ళు.   

 

    ఇండ్లు మట్టివి అని ఇదివరకు చెప్పాను. కొందరు - కోమట్లవి ఇటుక సున్నం ఇండ్లు ఉండేవి. నేల మాత్రం అలుకే. ఎర్రమన్ను లేక పుట్టమన్ను పేడతో కలిపి అలుకుతారు. దానిమీద నాము ముగ్గు రకరకాలుగా అందంగా పెడ్తారు. పండుగలు వస్తే గోడలు కూడా అలికి పట్టెలు పెడ్తారు. పండుగ వస్తే ఊరు కళకళ లాడుతుంది.  

 

    అన్ని ఇండ్లకూ బావులు ఉండేవి. మా మాతామహులు భట్టరాచార్యులవారి ఇంట్లో ఎంత తవ్వినా బావిలో నీరు రాలేదు. వారు కొండ్లెవారి ఇంటినుంచి తెచ్చుకునేవారు.

 Previous Page Next Page