Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 13


    
    "ఒంటరిగా ఏం పోతారే?" ఒకడు మాధవి చుట్టూ చెయ్యివేసి దాన్ని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు.
    
    "ఒదులు....ఒదులు.....డ్రైవర్ పోలీసులని పిలు...." నేను వాడి చేతుల్లోంచి మాధవిని ఒదిలించాలని చూశాను.
    
    వాడు వదలకుండా మాధవి బుగ్గని గట్టిగా కొరికాడు. "మాధవి- "అ...మ్మో" అని అరిచింది. ఇంకా దారుణంగా చెప్పరాని చోట్ల చేతులు పెడుతూ అనరాని మాటలన్నాడు.
    
    "హెల్ప్....హెల్ప్" నేను గొంతు చించుకుని అరిచాను.
    
    ఎవరూ రాలేదు.
    
    బయట నిలబడ్డ ఇద్దరు మాధవిని బయటికి లాగి రెండు చెంపలూ వాచేటట్లు కొట్టారు. ఆ దెబ్బలు మగవాళ్ళు ఓర్చుకోడం కూడా కష్టమే.
    
    "ఆటోని ఎక్కడినుండి తెచ్చావో అక్కడికే పోనీయ్" అని ఆటో డ్రైవర్ ని ఆజ్ఞాపించారు.

    మా ఆటో వెనక్కి తిరిగింది. వాళ్ళు మాధవిని ఏం చేస్తారో అని నేను గుండెలు పగిలేటట్లు ఏడుస్తూ ఇంటికి బలవంతంగా తీసుకురాబడ్డాను.
    
    గేట్ దగ్గర సిగరెట్ కాలుస్తూ ఆనంద్ కనబడ్డాడు.
    
    "వెల్ కమ్ హోమ్!" అన్నాడు.
    
    నేను ఛీత్కారంగా చూశాను.
    
    "ఇంకోసారి నీ స్నేహితురాలు పిచ్చివేషాలు వేసినా, అతి తెలివి ప్రదర్శించినా మానంతోపాటు ప్రాణం కూడా పోగొట్టుకుంటుంది..." అన్నాడు.
    
    నేను లోపలికి వెళ్ళి మాధవి తండ్రికి ఫోన్ చేద్దామని చూశాను.
    
    "నేను లాక్ చేశాను. ఫోన్ చెయ్యలేవు" అన్నాడు.
    
    నేను ఏడుస్తూ - దాన్ని ఏం చెయ్యకండి అదొక్కటే నాకు జీవితంలో మిగిలిన తోడు. ప్లీజ్! ఇంకెప్పుడూ నీ మాట కాదనను" అని బతిమాలాను.
    
    "సరే...." అని సెల్ ఫోన్ తీసి మాట్లాడాడు. "వదిలిపెట్టెయ్యండి....ఏం చెయ్యకండి" అని చెప్పాడు.
    
    నేను ఎంత పెద్ద సాలెగూడులో ఇరుక్కున్నానో నాకు అర్ధమైంది.
    
    తెల్లవారగానే బయటకి వెళ్ళి పబ్లిక్ బూత్ నుండి మాధవికి ఫోన్ చేశాను. వాళ్ళ నాన్న ఎత్తారు.
    
    "మాధవి వచ్చిందా?" ఏం వినాల్సొస్తుందోనని అదిరే గుండెలతో అడిగాను.
    
    "ఎవరూ? సుమతా?" అడిగాడాయన.
    
    "అవునంకుల్" ఆతృతగా అడిగాను మాధవి వచ్చిందా అని.
    
    ".....స్నానం చేస్తోంది."
    
    ఆ సమాధానానికి గుండెలనిండా వూపిరి పీల్చి వదిలి ఏడుకొండల వాడికి నూరు కొబ్బరికాయలు కొట్టాలి అనుకున్నాను.
    
    "మా ఇంటికి పది గంటల తర్వాత ఫోన్ చెయ్యమనండి" అని చెప్పి వచ్చేశాను.
    
    నేను వచ్చేసరికి ఆనంద్ ఇంకా పడుకునే వున్నాడు. మౌనంగా వంటింట్లోకి వెళ్ళి నా పనులు నేను చూసుకోసాగాను.
    
    ఆనంద్ లేచి బ్రష్ చేసుకుని రాగానే కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను. ఇవన్నీ ఎంత మనసు చంపుకుని చేశానో నా ఒక్కదానికే తెలుసు.
    
    "నీ ఫ్రెండ్ క్షేమంగా చేరిందటనా?" కాఫీ సిప్ చేస్తూ కులాసాగా అడిగాడు.
    
    నేను భయంగా చూశాను.
    
    "పి.బీ. కెళ్ళి చేయటం ఎందుకూ? మన పరువేం కావాలి? ఇంట్లోంచే చేయాల్సింది. లాక్ రాత్రే ఓపెన్ చేసేశాను" అన్నాడు.
    
    మాధవి మాటలు గుర్తొచ్చాయి. శత్రువులను దెబ్బతీయాలంటే వాళ్ళ వీక్ నెస్ ఏమిటో కనిపెట్టాలి. వీళ్ళ ఫ్యామిలీ వీక్ నెస్ పరువు. దానికి వీళ్ళిచ్చే డెఫినెషన్ 'ఎవరికీ ఏమీ అనుకోడానికి ఛాన్స్ ఇవ్వకపోవడం.
    
    అతను ఆఫీసుకి వెళ్ళిపోయాకా మాధవి నుండి ఫోన్ వచ్చింది.
    
    "మధూ.....నా కోసం నువ్వింక ఏం చెయ్యకే" అంటూ ఏడ్చేశాను.
    
    "పిచ్చీ! ఊర్కో....నీ జీవితం నిప్పుల గుండంలో పడివుంటే నేను నిశ్చింతగా వుండగలనా?" అంది.
    
    "పెళ్ళికాని పిల్లవి. ఇక కలగజేసుకోకు. నాకేమైతే అదే కానీ" అన్నాను.
    
    "వాళ్ళనలా వదిలేస్తావా? వాళ్ళ బలానికి తలవంచి పడుంటావా? ప్రతిఘటించవా?" అంది.
    
    "ఇంట్లోంచి బయటకు కాలుపెడితే గొడవలైపోతాయి. ఎక్కడా బతకనివ్వరు" అన్నాను.
    
    "కాలు బయట పెట్టకుండానే రాజాలా వాళ్ళని హింసించవచ్చు. అంత ఆస్తినీ, అంతస్తునీ వదిలేసి బయటికి వచ్చి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కష్టాలు పడడం అవివేకం. ఇక్కడే ఉండి వాడి చేత్తోనే వాడి కన్ను పొడు! ఈసారి కడుపు తెచ్చుకున్నా వాడితో చెప్పకు" అంది.
    
    నేను ఆశ్చర్యంగా - "ఈసారి జాగ్రత్తపడడూ?" అన్నాను.
    
    "వాడితోనే కడుపురావాలని రూలేం లేదుగా" దాని కంఠం కసితో ఒణికింది.
    
    "మాధవీ!" అన్నాను.
    
    "ఔను వాడి రోగం, వాడి పరువూ అలాగే కుదర్చాలి" అంది.
    
    "అలాగే...కానీ నువ్వు జాగ్రత్త" చెప్పాను.
    
    "మరి నాకో మాటియ్యి" అంది.
    
    "ఏమిటీ?"
    
    "ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యా ప్రయత్నాలు చెయ్యనని" అంది.
    
    "ప్రయత్నమే కాదు, ఆ ఊహ కూడా రానివ్వను. నాకు దారుణంగా కసి కలుగుతోంది మధూ......దాంట్లోంచే జీవితం మీద ఆశ కలుగుతోంది. నా మొగుడులాంటివాడినీ, వాడి అబ్బలాంటి వాడినీ ఏం చెయ్యాలన్నా మెంటల్ గానే దెబ్బతీయాలి. ఇంకోరకంగా అయితే డబ్బుతో గెలిచేస్తారు" అన్నాను.
    
    "కీప్ ఇట్ అప్ బీ బ్రేవ్!" అంది.
    
    "మధూ.....థాంక్యూ!" అన్నాను.
    
    ఈ రోజు స్వీకరించను. నా ఫ్రెండ్ ఏదైనా ఎఛీవ్ చేసినరోజు దీన్ని రిసీవ్ చేసుకుంటాను. బై!" ఫోన్ పెట్టేసింది.
    
    రోజులు వాటి మానాన అవి నడిచిపోతూనే వున్నాయి. మామయ్య నడిగి కంప్యూటర్ క్లాసెస్ లో చేరాను. ఆనంద్ ని నేనేం పట్టించుకోవడం లేదు. అతనూ నన్ను ఈ మధ్య పట్టించుకోవడం లేదు.
    
    ఎదురింట్లో అల్పనా వాళ్ళు వచ్చారు. ఎప్పుడైనా ఆ పిల్లలు వచ్చినప్పుడు ఇంట్లో కాస్త ఉత్సాహం వెల్లి విరుస్తుంది. మరు నిమిషంలో నేనేం పోగొట్టుకున్నానో గుర్తొస్తుంది. ఆ రోజంతా శూన్యంగా వెలితిగా మారిపోతుంది.
    
    మాధవి ఉత్తరం రేపిన గత స్మ్రుతులలో నుండి నేను నెమ్మదిగా బయట పడ్డాను.

 Previous Page Next Page