ఇంటికి రాగానే అత్తయ్యే అన్నం వండి సాంబారు చేసి పెట్టింది. కడుపు నిండా తినేశాను. వాళ్ళు నాకు చేసిన అవమానాలన్నీ, నష్టాలన్నీ, అన్నింటినీ మరిచిపోయాను.
ఆ సమయంలో ఆవిడ దేవతలా కనిపించింది.
"బాగా అలిసిపోయినట్లు కనిపిస్తున్నావు! పడుకుని రెస్ట్ తీసుకో..." అని వెళ్ళిపోయింది.
నిజంగానే రాత్రి కూడా ఒళ్ళూ, మనసూ చాలా అలసిపోయి వుండడంతో వెంటనే నిద్రపట్టేసింది. నిద్రలో ఎన్నెన్ని కలలు. చిన్నారి బాబుని పొత్తిళ్ళలో ఎత్తుకుని మురిసిపోతున్నట్లూ...ఆనంద్ కూడా ఎత్తుకున్నట్లూ, అత్తయ్యా మావయ్యా అందర్నీ పిలిచి మనవడిని గొప్పగా చూపిస్తున్నట్లూ...బాబుని ఊయలలో వేసి ఊపుతూ...అదేమిటో ఇలా ఒళ్ళంతా వూగుతోంది....మంచం పట్టీ పట్టుకుని గభాల్న కళ్ళు తెరిచేశాను. కడుపులో ఏదో కదలిక, ఒకటే వికారం, లేస్తుంటేనే భళ్ళున వాంతైంది. లేచి సింక్ దాకా వెళ్ళలేకపోయాను. లేస్తుంటేనే తెలిసింది.....నాకేమైందో! బాత్ రూమ్ లోకి వెళ్ళి చూసుకున్నాను. నా గుండె పగిలి ముక్కలైపోయింది. నేను కలలు కన్న అపురూప ఫలం బాత్ రూమ్ లో మోరీ గుండా ప్రవహిస్తోంది. అత్తయ్య ప్రేమతో వండి పెట్టిన సాంబారులో ఏం కలిపింది? డాక్టర్ నాకు బలానికి ఇచ్చిన ఇంజక్షన్ సిరెంజిలో ఏం నింపింది? నోట్లోంచి 'అ....మ్మా...' అన్న శబ్దం వచ్చేట్లు అంత పెద్దగా అరిచి ఏడవడం ఈ మధ్యలో జరగలేదు. అమ్మమ్మ పోయినప్పుడు కూడా నేను అంతలా ఏడవలేదు. పోయింది.....అంతా అయిపోయింది. ఏదైతే ప్రాణం పోయినా సరే పోగొట్టుకోకూడదు అనుకున్నానో....అదే పోయింది. నా శరీరంలో నుండి ఓ ముక్కుని ఎవరో కోసి వేరి చేసినట్లుగా వుంది. పరీక్ష ఫెయిలయినప్పుడూ...ప్రేమ ఫెయిలయినప్పుడూ ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి గర్భం ఫెయిలయితే కూడా చేసుకుంటారా? నాకు వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.
వంటింట్లోకి వెళ్ళి చాకు కోసం వెతికాను. దాంతో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోస్తుండగా డోర్ బెల్ వినిపించింది. పట్టించుకోకూడదనుకున్నాను. ఇంకా గట్టిగా మ్రోగింది. అత్తయ్యేమో! తను అనుకున్నది అయిందా లేదా చూసి నిర్ధారించుకోడానికి వచ్చి వుంటుంది అని ఒక్క వూపులో ముందు గదిలోకి వెళ్ళాను. తలుపు తీస్తే మాధవి కనిపించింది.
లోపలికి వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుంది. "నిన్నిలా చూస్తాననుకోలేదే!" అంది.
ఇంకో అరగంట ఆలస్యంగా వస్తే చూసి వుండేది కాదు!
"విరించి ఫోన్ చేశాడు. నిన్ను అబార్షన్ కే బలవంతపెడ్తున్నారటగా. ఒద్దు.....ఒద్దు అని ఏడుస్తున్నావటగా! పద పోలీస్ హెల్ప్ తీసుకుందాం. వీళ్ళెవరు నీ శరీరం మీద ఆధిపత్యం చూపించడానికి?" అంది.
న్నెఉ నవ్వాను.
"అలా నవ్వుతావేమిటి? ఈ చేతిలో చాకేమిటి?" కంగారుగా అంది.
"నా శరీరంమీద వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వకూడదని నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను" అన్నాను.
"నీకేం మతిపోయిందా?" అంది.
"పోవడానికి ఇంక అదొక్కటే మిగిలింది" అన్నాను.
మాధవి నా చెయ్యి పట్టుకుని "అంటే..." అని నా మొహంలోకి చూసింది.
"వాళ్ళు అనుకున్నది చేసేసారు. నేను వాళ్ళని ఎదిరించలేని అశక్తురాలినన్న విషయం మరోసారి గుర్తు చేశారు" నిర్లిప్తంగా అన్నాను. ఇందాకటి దుఃఖంగానీ ఆవేశంగానీ నాలో లేవు.
"మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?" అడిగింది.
"చచ్చిపోవాలనుకుంటున్నాను."
"నీ చావుకి కారణం నీ అత్తా మావా మొగుడులే అని వ్రాసి పెట్టా?"
"అంత ఆలోచన కూడా నాకు లేదులే."
"ఒసే పిచ్చి సుమతీ...నువ్వు అలా చేసినా వేస్టేనే! డబ్బుంటే ఏదైనా మాఫీ అయిపోతుంది. శత్రువుని కొట్టాలంటే వాళ్ళ వీక్ నెస్ లేమిటో ముందు తెలుసుకోవాలి. నాకు తెలిసినంతవరకూ స్టేటస్ ఒక్కటే వాళ్ళ వీక్ నెస్! దాని మీద కొట్టు. ఇంట్లోంచి బైటికొచ్చెయ్యి విమెన్ ప్రొటెక్షన్ సెల్ లో కేసు వెయ్యి" అంది.
"అమ్మమ్మ పోగానే ఆ పని చేసి వుండాల్సింది. కానీ ఇంతలో ఇదొకటి వచ్చిపడింది. ఎన్నెన్నో కలలు కన్నాను....ఇలా అయిపోయింది!" కళ్ళల్లో నీళ్ళు మళ్ళీ పిలవని పేరంటానికి వచ్చేశాయి.
"నీ మొగుడు ఈ టైంలో ఆఫీసులో వుంటాడా?" అడిగింది.
"ఔను."
"నువ్వు సామాన్లు సర్దుకుని రెడీగా వుండు, నేవెళ్ళి ఆటో తీసుకొస్తాను" అని అది రాయిన బైటికి వెళ్ళింది.
నా మనసంతా భావరహితంగా వుంది. ఇదివరకు పెళ్ళికాని పిల్లగా ఉద్యోగాల కోసం తెగ తిరిగాను. ఉద్యోగం వచ్చేది కానీ నిలిచేది కాదు. ఈసారి మొగుడు విడిచిన ఇల్లాలు స్టేజ్ లోకొచ్చాను. ప్రమోషన్ అన్నమాట. ఈసారి ఈ తోడేళ్ళు ఇంకా దారుణంగా ప్రవర్తించవచ్చు.
గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటుంటే డబల్ కాట్ బెడ్ కనిపించింది. నా వైవాహిక జీవితం తలుచుకాగానే కంటనీరు గిర్రున తిరిగింది.
మాధవి ఓ గంటకి కానీ రాలేదు. వస్తూనే పెద్ద పెద్దగా ఆనంద్ ని తిట్టింది. "ఆ దొంగ..... కొడుకు ఆఫీసులో లేడే! వాడికి ఆ పనికన్నా వుంచుకున్నదాని దగ్గర పని ఎక్కువ. అందుకే నీ మావని ఎమ్.డి.పోస్టులో....వీడ్ని జి.ఎమ్. పోస్ట్ లో వుండనిస్తున్నారనుకుంట. నే వెళ్ళి వాడినీ, దాన్నీ బైటకి పిలిచి పనివాళ్ళముందే అరిచి చెప్పాను - 'ఒరే.....నీ పెళ్ళానికి అబార్షన్ అయిందిరా...ఇంటికి వెళ్ళి దాని మొహం చూడు అని' ఆ మాట వినగానే దాని మొహంలో రంగులు మారాయి.
వీడ్ని తినేసేటట్లు చూస్తూ - 'ఏమిటి....ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా....నీ భార్యకి కడుపొచ్చిందా?' అని గద్దించింది. వీడు నీళ్ళు నముల్తూ....దానికి నా వల్ల మాత్రం రాలేదు. నా సంగతి నీకు తెలీదా? అని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. నామీద రంకెలు వేశాడు. ఎక్కువ అరిస్తే ఇదంతా పేపర్లకెక్కిస్తాననీ వీళ్ళ రంకు బట్టబయలు చేస్తానని బెదిరించి వచ్చాను. అందరూ వింటుండగా నేను వాడ్ని అన్న మాటలకి మొహం ఎలా అయిందనుకున్నావ్? మహా బాగా అయిందిలే" మాధవి విరగబడి నవ్వింది.
నేను భయంగా "మధూ....ఎందుకలా చేశావు? ఆ ప్రియంవద సంగతి నీకు తెలీదు" అన్నాను.
"మకకెందుకూ? మనం ఇక్కడ వుండబోవడం లేదుగా! పద" అంది.
మేం ఇద్దరం ఆటోలో సూట్ కేస్ పెట్టుకుని స్టేషన్ కి బయల్దేరాం.
మాధవి దారి పొడుగునా ప్రియంవదని తను ఎలా కడిగేసిందో చెప్తోంది. ఇంతలో సడెన్ గా ఆటో ఆగింది. మేం తుళ్ళిపడి చూశాం. ఆటోకి ఎదురుగా నలుగురు బలిష్ఠులైన మనుషులు నిలబడి వున్నారు. ఆటోలో ఇద్దరు ఎక్కారు.
"ఏయ్....ఎవరు మీరు? ఆటోని ఎందుకు ఆపావు? వీళ్ళని బయటికి పొమ్మను" అని మాధవి అరిచింది.