Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 13

   

      సీట్లో కూర్చుంటూ, తన వెనకే ఫైల్క్ తో వచ్చిన పి.ఎ. అరవింద్ వేపు చూసింది. ఆ చూపును అర్ధం చేసుకున్న అరవింద్ ఫైల్స్ ను టేబిల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.
    
    కళ్ళద్దాల్ని సవరించుకుంటూ, వరదరాజన్ వేపు, హేమాద్రివేపు చూసింది సి.ఎమ్.
    
    "రెస్పెక్టెడ్ జంటిల్ మాన్.... నాకు సబ్ కమిటీల మీద, ఎక్సయిజ్ మినిస్ట్రీ మీద నమంకం పోయింది... లిక్కర్ ప్రొహిబిషన్, టోటల్ కంట్రోల్ అంతా.... సి.ఎమ్... అధీనంలోనే వుంటుంది...ఆ ప్రొహిబిషన్ సెల్ కు మీ ఇద్దరూ....చీఫ్ ఎడ్వయిజర్స్ గా ఉంటారు..." తన నిర్ణయాన్ని చెప్పింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "మద్య నిషేధానికే నిర్ణయించుకున్నారా..." హేమాద్రిశర్మ సీరియస్ గా అడిగాడు.
    
    "మరొక్కసారి ముందూ, వెనుకలు ఆలోచించడం మంచిది....నేను చెప్పేది పొలిటికల్ రిఫర్ కేషన్స్ గురించి..." వరదరాజన్ నెమ్మదిగా అన్నాడు.
    
    వాళ్ళిద్దరి వేపు, సూటిగా చూసింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "థాంక్యూ ఫర్ యువర్ ఎడ్వయిజ్...ఏమిటండీ....పొలిటికల్ రిఫర్ కేషన్స్....మీకు తెలుసు... నేను అధికారం కోసం, ఈ పదవిని చేపట్టలేదని.....మనం బ్రతుకుతున్నది ప్రజల ఓట్లవల్ల.... కార్లల్లో దర్జాగా తిరుగుతున్నది ప్రజలు కట్టే పన్నుల వల్ల....ప్రజల సమస్యని పరిష్కరించడానికి రాజకీయానికి అసలు సంబంధం లేదు- ఉయ్ ఆర్ బిగ్ సర్వెంట్స్....ఉయ్ హేవ్ టు డూ... సమ్ థింగ్...దట్స్ మై పాలసీ అండ్....దట్స్ మై అల్టిమేట్ డెసిషన్..."
    
    "ఒ.కే. మేడమ్.... ఐ టూ ఎగ్రి విత్ యూ....బాట్....అదొక విషవలయం.... అబ్బయ్యనాయుడులాంటి సారా కంట్రాక్టర్లు...శాసిస్తున్న విషవలయం... నేను ఆలోచించమంటున్నది...ఆ విషయం గురించి...."
    
    ఆ మాటకు త్రిభువనేశ్వరీదేవికి కోపం వచ్చింది...
    
    "ఎవడండీ అబ్బయ్యనాయుడు....ఏం చేస్తాడు....వాడు ఆఫ్ట్రాల్ లిక్కర్ సిండికేట్ లీడర్... ట్వంటీఫోర్- ట్వంటీఫోర్ అవర్స్ లో వాడ్ని నేను... అరెస్ట్ చేయగలను... అయ్ వాంట్ యువర్ కోపరేషన్.... దట్సాల్..."
    
    "అబ్బయ్యనాయుడు మీద.... ఎన్నో కేసులున్నాయ్.... ఇంత వరకూ ఏ గవర్నమెంటూ, ఏ సి.ఎం. ఎందుకు చర్య తీసుకోలేదు....ఆ ఒక్క విషయం మీరు ఆలోచించండి మేడమ్" వరదరాజన్ అన్నాడు నెమ్మదిగా.
    
    "అబ్బయ్యనాయుడ్ని ఎలా టాకిల్ చెయ్యాలో తర్వాత డిస్ కస్ చేద్దాం....ముందు ప్రొహిబిషన్ గురించి ఆలోచించండి....నెంబర్ వన్, ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్రొహిబిషన్ జీవో రావాలి....నెంబర్ టూ, ప్రొహిబిషన్ సెల్ ఏర్పాటు కావాలి.
    
    "కొన్ని జిల్లాల్లో సారా పాటలు.... ఇంకా జరగాల్సి ఉంది మేడమ్....ఈ పరిస్థితుల్లో గవర్నమెంటు జీ.వోను లిక్కర్ సిండికేట్లు అడ్డుకునే ప్రమాదం ఉంది మేడమ్....వాళ్ళు కోర్టుకు ప్రొసీడ్ అయితే స్టే తెచ్చుకుంటే" వరదరాజన్ సందేహాన్ని వ్యక్తం చేసాడు.
    
    "లిక్కర్ సిండికేట్లు కోర్టుకి వెళ్ళే అవకాశం ఇవ్వకుండా మనం చెయ్యగలగాలి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా, అక్రమ సారా తయారీదార్ల మీద, దాడులు జరగాలి....ఎంతటి కంట్రాక్టరైనా, ఎవర్నీ ఎక్కడా ఉపేక్షించకుండా అడ్డొచ్చిన ప్రతివాడ్నీ...అరెస్ట్ చెయ్యాలి. గవర్నమెంటు ఎంత కఠినంగా ఉండగలదో....అంత కఠినంగానూ ఉండాలి" సలహా ఇచ్చాడు హేమాద్రిశర్మ.
    
    "మేడమ్...గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఇన్ ప్లేషన్....స్మగ్లింగ్ ఇకడ ఎప్పుడు మద్యనిషేధం జరిగినా... ఈ రెంటివల్లే, ప్రభుత్వాలు అల్లకల్లోలమై పోయాయి. ఇందుకు మనం అమెరికాలో జరిగిన మద్య నిషేధం, తదనంతర పరిణామాలని గుర్తుంచుకోవాలి."

    "చెప్పండి- మీలాంటి అనుభవజ్ఞుల వల్ల నాకు కావాల్సింది....అలాంటి వివరాలే చెప్పండి" చేతిలోని ఫైలుని పక్కన పెడుతూ అంది సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి.
    
    "అమెరికాలో 1920 జనవరి 17 నుంచి 1933 డిసెంబర్ వరకూ, మద్య నిషేధం అమల్లో ఉంది. అమెరికా జాతిపిత జార్జి వాషింగ్టన్, ఆశయాలతో మొదలై దాదాపు ఒక దశాబ్దం పాటు సాగిన మద్యపాన వ్యతిరేక ఉద్యమం ఫలితంగా, 1920 ఫెడరల్ మధ్యనిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. అమెరికా రాజ్యాంగానికి 18వ సవరణ చేయడం ద్వారా మద్యపాన నిషేధం విధించారు.
    
    1906వ సంవత్సరం నాటికే అమెరికాలోనో 30 రాష్ట్రాలు లోకల్ ఆప్షన్ లాను అమలుపరిచాయి. దీని ప్రకారం ఏ ప్రాంతంలో అయినా, ప్రజలు తమకు మద్య దుకాణాలు అక్కర్లేదని, వాటిని మూసివేయాలని తీర్మానం చస్తే, ఆ ప్రాంతంలో మద్యం దుకాణాలు మూసివేస్తారు. 1918 నాటికి అమెరికాలో 90 శాతం భూభాగంలో లోకల్ ఆప్షన్ లా ద్వారా మధ్యనిషేధం అమల్లోకి వచ్చింది. అయితే దేశమంతటా ఒకే చట్టం అమల్లో లేనందువల్ల స్మగ్లింగ్ విపరీతంగా పెరిగి పోయింది. దీనికి పరిష్కారంగా 18వ రాజ్యాంగ సవరణ (ఫెడరల్ ప్రొహిబిషన్ లా) వచ్చింది.
    
    మద్యపాన నిషేధం వల్ల అమెరికాలో ఎన్నో సత్ఫలితాలు కూడా కనిపించాయి. మద్యపాన నిషేధం వల్ల ఉత్పాదకత సామర్ధ్యం 10 శాతం పెరిగిందని, 1925 లో అమెరికా వాణిజ్య శాఖామంత్రి ప్రకటించారు. అంతేకాక 1920-25 మధ్య కాలంలో భవన నిర్మాణాలకు రుణాలు ఇచ్చే సంస్థల ఆస్తులు 150 శాతం పెరిగాయి. 1920 నాటికి గృహ నిర్మాణ సంస్థల్లో సభ్యత్వం 50 లక్షలు ఉండగా, 1930 నాటికి 192 లక్షలకు పెరిగింది. 1920 నాటికి 144 డాలర్లుగా ఉన్న సగటు పొదుపు మొత్తం 1926 నాటికి 211 డాలర్లకు పెరిగింది. 1920 నాటికి కీవిత భీమా పాలసీల్లో 342 డాలర్లు ఉన్న సగటు పెట్టుబడి అదే కాలంలో 680 డాలర్లకు పెరిగింది. 1920-26 మధ్య కాలంలో మోటారుకార్ల అమ్మకాలు మూడురెట్లు పెరిగాయి. ఫలాలు కూరగాయలు, పాల వినియోగం విపరీతంగా పెరిగింది. 1920లో అమెరికా తీసుకున్న జీవిత భీమా పాలసీల విలువ 1,063 మిలియన్ డాలర్లు. 1920 బ్యాంకు డిపాజిట్లు 37 బిలియన్ డాలర్లు కాగా 1928 నాటికి 57 బిలియాన్ డాలర్లకు పెరిగాయి. 1919లో 387 డాలర్లు ఉన్న తలసరి ఆదాయం 1928 నాటికి 574 డాలర్లకు పెరిగింది.
    
    కానీ ఈ ఫలితాలు అన్నీ స్వార్ధపర శక్తుల ప్రయత్నాలనుంచి, అమెరికా సమాజాన్ని కాపాడలేకపోయాయి. స్వార్ధపర శక్తులు మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించాయి. మద్యపాన నిషేధం వల్ల ప్రభుత్వం ఆదాయానికి ఏర్పడిన లోటును పూడ్చుకొనేందుకు ప్రభుత్వం కోటీశ్వరులపై అదనపు పన్నులు విధించింది. ఈ అదనపు పన్నులకు గురైన కోటీశ్వరులు మద్యపాన నిషేధ వ్యతిరేక పోరాటంతో గొంతు కలిపారు. దాంతో అక్రమ సారా, స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయాయి. 1930 ప్రాంతంలో అమెరికాతో పాటు, ప్రపంచంలోని పలు దేశాలను కుదిపి వేసిన ఆర్ధిక మాంద్యాన్ని మద్యపాన నిషేధ వ్యతిరేక ఆందోళనకారులు తమ ప్రయోజనాలకు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు దాంతో 1933లో అమెరికాలో మద్యపాన నిషేధానికి తెరపడింది. ఫెడరల్ ప్రొహిబిషన్ చట్టం రద్దయింది. మద్యనిషేధం రద్దయిన అనతి కాలంలోనే దాని ప్రభావం...అమెరికా సమాజమ్మీద స్పష్టంగా కనిపించింది..." చెప్పడం ముగించాడు వరదరాజన్.
    
    "ఇంకో పాయింట్ మేడమ్..." హేమాద్రిశర్మ గొంతు విప్పాడు.
    
    "చెప్పండి...."
    
    "దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి, పటిష్టంగా అమలు పరిచేందుకు జస్టిస్ టేక్ చంద్ కమిటీ కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలు తప్పకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. కానీ వీలు కాలేదు....ఆ అంశాల్ని మనం అమలు చేస్తే బాగుంటుంది..."

    "చెప్పండి..."
    
    మొదటి పాయింట్ మద్యంవల్ల వచ్చే  అనర్ధాలను, వ్యక్తికి సంఘానికి దీనివల్ల కలిగే దుష్ఫలితహాలను విరివిగా ప్రచారం చెయ్యాలి. రెండు- మద్యపానం ఒక సాంఘిక దురాచారంగా ప్రభుత్వం పరిగణించాలి. మూడు సాయుధ దళాల్లోని వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని సేవించకుండా నిషేధించాలి. నాలుగు- దొంగసారా తయారీ, అక్రమంగా కల్లుగీయడం పెరిగిపోయి. అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నాయి....దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అధికారులు చిత్తశుద్దితో ప్రయత్నించాలి. అయిది.... అవినీతి పరులైన ఉద్యోగులు అధికారుల విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలి. ఆరు- అమెరికాలో మధ్యనిషేధం అమలు జరిగిన కాలంలో సంఘ విద్రోహులు సాగించిన కార్యకలాపాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, అలాంటివి మన రాష్ట్రంలో జరగకుండా జాగ్రత్తపడాలి. ఏడు- ధనికవర్గాల వారు విలాసం కోసం మద్యాన్ని సేవించడం అనే అలవాటును మాన్పించాలి. ఎనిమిది-మద్యపాన నేరానికి శిక్ష విధించాలి... ఆ శిక్ష పడిన వ్యక్తిని స్తహనిక సంస్థలు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హునిగా ప్రకటించాలి. తొమ్మిది- రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య నిషేధానికి సంబంధించిన పనిని స్వచ్చంద సంస్థలకు అప్పగించాలి. పది- మద్యపాన నిషేదోద్యమానికి ప్రత్యేకంగా మహిళా కార్యకర్తల విభాగం ఉండాలి. పదకొండు- ప్రభుత్వానికి సరైన సలహా, ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలి. దానికి హోంశాఖ మధ్య నిషేధ శాఖ మంత్రి అద్యక్షుడై వుండాలి అందులో సిన్సియర్ అధికారులు అనాధికారులు సభ్యులుగా ఉండాలి. అలాంటి సంఘాలు జిల్లా తాలూకాల స్థాయిల్లో కూడా ఉండాలి..." చెప్పడం ముగించాడు హేమాద్రిశర్మ.

 Previous Page Next Page