Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 12

  

    అదే సమయంలో పి.ఎ. అరవింద్ తలుపు తెరుచుకుని లోనికొచ్చాడు.
    
    "మేడమ్....లంచ్ టైమ్."
    
    చేతి వాచీ చూసుకుంది సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి.
    
    "ఓ.కే...ఉయ్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్....వరదరాజన్, హేమాద్రి శర్మ, శ్రీధర్ లేచి నిలబడ్డారు.
    
    అంతవరకూ ఇబ్బందిగా ముఖం పెట్టిన ఎక్సయిజ్ మినిస్టర్ రాజ్య, ఆ మీటింగ్ అంతటితో ఆగిపోయినందుకు మనసులోనే ఆనందించాడు.
    
    అధికారులు ముగ్గురూ బయటికొచ్చేసారు. తను కూడా వెళ్ళడానికి సిద్దమయ్యాడు రాజయ్య.
    
    "రాజయ్యగారూ! మీరుండండి..." సి.ఎం.త్రిభువనేశ్వరీదేవి మాటలకు ఉలిక్కిపడ్డాడు రాజ్య.
    
    "ఏంటి మేడమ్..." గొంతు తడారిపోయిందాయనకు. కళ్ళప్పగించి చూస్తున్నాడు.
    
    "ఇవాళ పేపర్లో న్యూస్ చూసారా!"
    
    తడబడ్డాడు రాజయ్య.
    
    "చూసాను మేడమ్...ఆ న్యూస్ ఫేక్ న్యూస్ మేడమ్...నేనంటే గిట్టని వాళ్ళు..."
    
    "దిసీజ్... నాట్ టైమ్ ఫర్ జోక్స్....ఎడ్యుకేషన్ మినిస్టర్ స్కూల్స్ పెట్టుకొని. సివిల్ సప్లయిస్ మినిస్టర్ రేషన్ షాపులు పెట్టుకుని ఎక్సయిజ్ మినిస్టర్ బార్లూ, కల్లు కాంపౌండ్లూ పెట్టుకుంటే- మరి నేనెందుకు... ఈ గవర్నమెంట్ ఎందుకు....ఏ మినిస్టర్ కయినా- మినిమమ్ మోరల్స్ వుండాలి...మోరల్స్ లేనప్పుడు ఆ పదవిలో వుండడం అనవసరం."
    
    నువ్వు నన్ను ఉతకడానికే వుండమన్నావా తల్లీ....అని మనసులోనే గింజుకుంటున్నాడు రాజయ్య.
    
    "ఐ వాంట్ యువర్ ఎక్స్ ప్లనేషన్" త్రిభువనేశ్వరి కోపాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాడు రాజయ్య.
    
    "మీరేమంటున్నారో నాకు తెలీడం లేదు మేడమ్."
    
    ఆ మాటకు తీవ్రంగా కోపం వచ్చింది త్రిభువనేశ్వరీదేవికి.
    
    "అవును ఏమీ తెలీదు...మీలాంటి వాళ్ళు వుండబట్టే...మత్రులపట్ల గవర్నమెంట్ పట్ల ప్రజలకు నమ్మకం పోతోంది.... మనం "సారా"ను నిషేధించడానికి, అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం...అవునా...ఆ సబ్ కమిటీకి మీరు వైస్ చైర్మెన్ అవునా... ఆర్యూ ఎషేమిడ్ ఆఫ్ ఇట్..."
    
    "మేడమ్...ఆ కల్లు కాంపౌండ్స్ అన్నీ....ఎక్స్ ఎమ్మెల్యే...సూర్య ప్రకాశరెడ్డివి మేడమ్.... నాకేం సంబంధంలేదు- అసెంబ్లీ సాక్షిగా నాకేం సంబంధం లేదు" అమాయకంగా మొహంపెట్టి అన్నాడు రాజయ్య.

    "అసెంబలీ సాక్షిగా మీకేం సంబంధం లేదా" అంత కోపంలోనూ నవ్వింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "అసెంబ్లీ అంటే....మీకెంత చులకనై పోయిందండీ."
    
    "అది కాదు మేడమ్- నా ఉద్దేశం."
    
    "నో మిస్టర్ రాజ్యగారూ....సమాజం పేపరులో వచ్చిన న్యూస్ కి సంబంధించి నాకు మీ ఎక్స్ ప్లనేషన్ రిటన్ గా కావాలి....దట్సాల్."
    
    "లేదు మేడమ్....నేను పేపర్ కి లిజాయండర్ ఇస్తున్నాను" ఏదో చెప్పబోయాడు రాజయ్య.
    
    "యూకెన్ గో..." కుర్చీలోంచి లేచిపోయింది త్రిభువనేశ్వరి...
    
    మరి చేసేదేం లేక వెనుదిరిగాడు ఎక్సయిజ్ మినిస్టర్ రాజయ్య.
    
    సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి....ఆఫీస్ రూమ్ కి, ఎటాచ్డ్ గా వున్న గెస్ట్ రూమ్ లోకి అడుగుపెట్టింది.
    
                                                       *    *    *    *    *
    
    గెస్ట్ రూమ్ లో సీరియస్ గా ఆలోచిస్తూ పచార్లు చేస్తోంది సి.ఎం. త్రిభువనేశ్వరి.
    
    అంతకుముందే ఆవిడ ఇంటర్ కమ్ లో ప్రెస్ పి.ఎ.ను రమ్మని కబురు పెట్టింది.
    
    చేతిలో ఫైల్స్ తో లోనికొచ్చిన ప్రసాదరావు- ఫైల్స్ ని టేబిల్ మీద పెట్టి నిల్చున్నాడు.
    
    ఆ ఫైల్స్ ని అందుకుని చూస్తోంది త్రిభువనేశ్వరీదేవి.
    
    "నెల్లూరు దగ్గర నాతపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీకర్... మృతి న్యూస్ అన్ని పేపర్లూ కవర్ చేశాయి. మేడమ్....ఎక్సెప్ట్....ఒన్ పేపర్....సమాజం డైలీ..."
    
    ఆ మాటకు తలెత్తి ఆశ్చర్యంగా చూసింది త్రిభువనేశ్వరి.
    
    "పేపర్లన్నీ ఏం రాసాయి."
    
    "దాదాపు పేపర్లన్నీ....పోలీస్ వెర్షన్ నే రాసాయి మేడమ్....వర్షం కారణంగా.... ఓ యింట్లో తలదాచుకున్న శ్రీకర్ 'షార్ట్ సర్క్యూట్ కు లోని చనిపోయాడని."
    
    బ్రీఫ్ చేస్తున్నాడు ప్రసాదరావు.
    
    "దిసీజ్ కాక్ అండ్ బుల్ స్టోరీ...అందుకే సమాజం వాళ్ళు  వెయ్యలేదనుకుంటాను."
    
    "యస్... మేడమ్... వాళ్ళ రిపోర్టర్ మధూలి.... ప్రస్తుతం ఆ కేసుని డీల్ చేస్తోందట మేడమ్."
    
    "మధూలి" సి.ఎం. పెదవుల మీద చిరునవ్వు కదలాడింది.
    
    మధూలి పేరు జ్ఞాపకం రాగానే సి.ఎం కళ్ళ ముందు, అందం, ఆకర్షణ, అల్లరి కలగలిసిన ఒక రూపం కదలాడింది.
    
    "షీ ఈజ్ ఫన్నీ అండ్ ఆల్సో జీనియస్" కామెంట్ చేసింది త్రిభువనేశ్వరీ దేవి.
    
    తను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజున తనని అల్లరి చిల్లర ప్రశ్నలతో తెలివిగా ఉక్కిరిబిక్కిరి చేసిన మధూలి.
    
    మధూలిపట్ల ఏదో తెలీని అభిమానం ఆ మొట్టమొదటి కలయికలోనే ఏర్పరచుకుంది త్రిభువనేశ్వరీదేవి.
    
    మధూలిని చూసినప్పుడల్లా...ఆ వయసులో తనని, ఊహించుకోవడం అలవాటై పోయింది త్రిభువనేశ్వరీదేవికి.
    
    "ఎమ్మెల్యేలు... మంత్రుల ఆస్తులకు సంబంధించి మీరు వివరణ ఇస్తానన్నారు కదా మేడమ్.... ఫైవ్ థర్టీకి ప్ర్రెస్ మీట్...ఏర్పాటు చేసాను మేడమ్..." ప్రెస్ మీట్ లో రిలీజ్ చెయ్యాల్సిన ప్రెస్ నోట్ ను అందిస్తూ అన్నాడు ప్రసాదరావు.
    
    "సో... మధూలితో భేటీ అన్నమాట" మనసులోనే అనుకుంది త్రిభువనేశ్వరీదేవి.
    
    ప్రసాదరావు, రూమ్ లోంచి బయటకెళ్ళి పోయాక చాలాసేపు ఆలోచనల్తో గడిపింది త్రిభువనేశ్వరి.
    
    ఆ ఆలోచనల నిండా "మధూలి" నిండిపోయింది.
    
    మానవ సంబంధాలు చాలా విచిత్రంగా వుంటాయి. మనకేమీ సంబంధం లేని మబ్బులు, వెన్నెల సముద్రం...అన్నీ... మనకు తెలీకుండానే ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాగే కొంతమంది మనుషులు కూడా.
    
    పరిచయాలు, బాంధవ్యాలు అక్కర్లేని మధుర స్మృతులు మానవ సంబంధాలు ఆ మానవ సంబంధాల మూలాల్ని ఎవరూ పట్టించుకోక పోయినా మలుపులు- అనూహ్యమైన మలుపులు.
    
    ఆ మలుపుల్ని ఏ సృష్టికర్తా ఊహించలేదు.
    
    అలాంటి మలుపుకి మధూలి కారణమౌతుందన్న విషయం త్రిభువనేశ్వరీ దేవి ఊహించలేదు.... వూహించబోడు.
    
    ఆలోచనలతోనే ఆఫీస్ రూమ్ లోకి అడుగుపెట్టింది సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి."
    
                                        *    *    *    *    *
    
    చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్...
    
    హాల్లోకి అడుగుపెట్టిన సి.ఎం. త్రిభువనేశ్వరీదేవిని చూడగానే చీఫ్ సెక్రట్రీ వరదరాజన్, పర్సనల్ సెక్రట్రీ హేమాద్రిశర్మ లేచి నిలబడ్డారు గౌరవ సూచికంగా.

 Previous Page Next Page