Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 14

 

     "అంతా బాగుంది కానీ హేమాద్రి శర్మగారూ....మంత్రిని అద్యక్షున్ని చెయ్యడమే బాగోలేదు....మన ఎక్సయిజ్ మినిస్టర్ రాజయ్యలాంటి వారిని మధ్య నిషేధానికి అద్యక్షుడిగా పెడితే..." నవ్వింది త్రిభువనేశ్వరీదేవి. ఆ నవ్వుతో శ్రుతి కలిపారు అధికారులిద్దరూ.
    
    నవ్వుతూనే థానే స్వయంగా ఫోన్ రిసీవర్ని ఎత్తి ఎవరికో ఫోన్ చేసింది ఆ సంభాషణ పదినిమిషాలసేపు సాగింది.
    
    స్పెషల్ లీగల్ ఎద్వయిజర్ టూ సి.ఎమ్ తో మాట్లాడిందావిడ. ఫోన్ పెట్టేసి వరదరాజన్ వేపు తిరిగి-
    
    "ప్రొహిబిషన్ జీవోను ప్రిపేర్ చెయ్యండి....జీవో సాయంత్రంలోపు తయారు కావాలి. సాయంత్రం 'ప్రెస్ మీట్'లో నేను ఎనౌన్స్ చేస్తాను."
    
    "సారా కంట్రాక్టర్లు కోర్టు కెళ్ళితె..." వెంటనే ప్రశ్న వేసాడు హేమాద్రి శర్మ.
    
    "వెళ్ళరు....వెళ్ళలేరు..." ధీమాగా చెప్పింది సి.ఎమ్.
    
    "ఎలా..."
    
    నవ్వింది త్రిభువనేశ్వరీ దేవి.
    
    "ఈ రోజు గురువారం.... ఈరోజు మనం జీ.వో. ఇష్యూ చేస్తాం. రేపు శుక్రవారం....రేపొక్కరోజు ....కోర్టుని మనం- మానేజ్ చెయ్యగలిగితే శనివారం.... ఆదివారం కోర్టుకు హాలీడేస్ కాబట్టి పిటిషనర్లు కోర్టు స్టే తెచ్చుకోడానికి ఆస్కారం ఉండదు. అవునా."
    
    "యూ ఆర్ కరెక్టు మేడమ్....కానీ."
    
    "ఇప్పటికిప్పుడు కోర్టుకు హాలీడే అంటే..." సందేహం వ్యక్తం చేసాడు చీఫ్ సెక్రట్రీ వరదరాజన్.
    
    ఆలోచనలో పడింది త్రిభువనేశ్వరి.
    
    ఆ చిక్కుముడిని ఎలా విడదీయాలో ఆవిడ కేం అర్ధంకావడం లేదు.
    
    టేబిల్ కెదురుగా గోడ మీదున్న కేలండర్ వేపు చూసాడు వరదరాజన్....శుక్రవారం నాడు ఏ హాలీడే లేదు.
    
    "చీఫ్ జస్టిస్ తో మీరొకసారి మాట్లాడితే..." సలహా ఇచ్చాడు హేమాద్రి శర్మ.
    
    "ట్రై చెయ్యడంలో తప్పులేదు కదా.... ఒకసారి ఫోన్ చెయ్యండి, నేను మాట్లాడతాను."
    
    హేమాద్రి ఫోనందుకుని, డయల్ చేస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి.
    
    హైకోర్టు చీఫ్ జస్టిస్ సుఖరామ్ కారంత్ లైన్ లో కొచ్చారు.
    
    వెంటనే రిసీవర్ని తను అందుకుంది.
    
    ప్రోబ్లమ్ ని విశదీకరించింది.
    
    "ఇప్పటికిప్పుడు హాలీడేసు డిక్లేర్ చెయ్యడమంటే.....గవర్నమెంట్ ఏదైనా 'అకేషన్'ని సజెన్స్ చేసి, రిక్వెస్ట్ చేస్తే....కోర్టు 'కన్సిడర్' చెయ్యడానికి వీలవుతుంది. ఆ 'రిక్వెస్ట్' రిటన్ గా చీఫ్ సెక్రట్రీ సైన్ తో ఉండాలి" చెప్పాడాయన.
    
    "ఒకే సర్.... ఒన్ అవర్ లో మీకు ఇన్ ఫామ్ చేస్తే సరిపోతుందా..."
    
    చీఫ్ మినిస్టర్ మాటకు ఆయన అంగీకారం తెలిపారు. ఫోన్ పెట్టేసింది త్రిభువనేశ్వరి.
    
    "మనవో...అకేషన్ ని క్రియేట్ చెయ్యాలి."
    
    అయిదు నిమిషాలు... పది నిమిషాలు పావుగంట గడిచింది.
    
    నేషనల్ లీడర్స్ జయంతులు, వర్ధంతులూ చూసారు....స్టేట్ లీడర్స్....ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎక్కడా అవకాశం దొరకడం లేదు.
    
    క్షణాలు గడుస్తున్నాయి.
    
    ఈ నాలుగు రోజుల అవకాశాన్ని ఉపయోగించుకోవాలి....ఈ నాలుగు రోజుల్లోనే పటిష్టమైన ప్రొహిబిషన్ సెల్ ని ఏర్పాటు చేయాలి.
    
    ఎలా... ఎలా... ఎలా...?
    
    సీట్లోంచి లేచి, అటూ ఇటూ పచార్లు చేస్తోంది త్రిభువనేశ్వరిదేవి. అదే సమయంలో 'ప్యూన్' కొన్ని మ్యాగజైన్ లు తెచ్చి టేబిల్ మీద పెట్టి వినయంగా నుంచుని వాళ్ళ సంభాషణను వింటున్నాడు.
    
    వాడి మొహంలోకి చూసింది త్రిభువనేశ్వరి.
    
    "శెలవివ్వడానికి అంత ఆలోచన ఎందుకమ్మా.... మన 'పార్టీ' అధికారంలో కొచ్చిన రోజని... శెలవు ఇచ్చెయ్యండమ్మా... ఓ పనైపోతుంది" నసుగుతూ చెప్పాడతను.
    
    "మన 'పార్టీ' అధికారంలోకొచ్చిన రోజు.... నీకెలా తెల్సు..." ఆ విషయం అతనికి జ్ఞాపకం ఉండడం ఆశ్చర్యంగా ఉంది త్రిభువనేశ్వరికి.
    
    "అదేంటమ్మా... ఆ రోజే గదమ్మా.... నేను డ్యూటీలో కూడా చేరింది. ఏడాది అయ్యిందమ్మా నేను డ్యూటీలో చేరి."
    
    నవ్వుతూ వరదరాజన్ వేపు, హేమాద్రిశర్మవేపు చూసింది త్రిభువనేశ్వరి.
    
    "అతనిచ్చిన 'ఐడియా' బాగానే ఉంది మేడమ్"
    
    "ఒక్కొక్కప్పుడు....ఇంటలెక్చువల్స్ కి అందని చిన్న పాయింట్ కామన్ మేన్ కి అందడం అంటే ఇదే..." నవ్వుతూ అంది త్రిభువనేశ్వరి...అదే సమయంలో ఆమెకో విషయం జ్ఞాపకానికొచ్చింది.
    
    "మా 'డాడీ' నాకెప్పుడూ ఓ విషయం చెప్తుండేవారు...పాండిత్యం, విద్యుత్తు కన్నా, సమస్యని పరిష్కరించే తక్షణ జ్ఞానమే గొప్పదని అందుకు ఆయన ఓ ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు. ఓ పడవలో ఓ మహా పండితునిని, పడవవాడు నదిని దాటిస్తున్నాట్ట....ఆ పండితుడు ప్రయాణం మధ్యలో ఒరేయ్....పడవవాడా....నీకు వేదాలు వచ్చుట్రా..." అని అడిగాట్ట...అందుకా పడవ వాడు-
    
    "వేదాలొస్తే నేనెందుకు బాబూ... పడవ తోల్తాను" అని జవాబిచ్చాడు.
    
    "భారత భాగవతాలు-"
    
    "తెలీవు బాబూ..."
    
    "ఒరేయ్...అంత అధ్వాన్నంగా, జ్ఞానం లేకుండా ఉంటే ఎలారా పోనీ... తెలుగువాచకమైనా చదువుకున్నావురా..."
    
    "లేదండి..." జవాబిచ్చాడు పల్లెపడవవాడు.
    
    "నీ జన్మకు అర్ధం కాదురా..."
    
    నవ్వుకున్నాడు పడవవాడు....అదే సమయంలో నదిలో, అలల తీవ్రత పెరిగింది. భోరున వర్షం, గాలి... పడవ దరి తప్పుతోంది. ఆ విషయం గ్రహించిన పడవవాడు.
    
    "అయ్యా! పండితుల వారూ...పడవ ఒడ్డు చేరడం కష్టం.... తమకు ఈత వచ్చునా" అని అడిగాడు.

 Previous Page Next Page