4. ఇంద్రా! విష్ణువు సోమ పానమునకు వచ్చినంత నీవు వేరొక యజ్ఞమున సోమ పానము చేయుదువు. 'ఆప్తి' పుత్రుడగు 'త్రితు' ని యజ్ఞమున సోమపానము చేయుదువు. మరుత్తులు సోమపానమునాకు వచ్చినంత మరొకరి యజ్ఞమున సోమపానము చేసి ప్రసన్నుడవు అగుదువు. అట్టి నీవు మేము అర్పించు ఉత్తమ సోమము సేవించుము. ప్రసన్నుడవు అగుము.
5. అధ్వర్యులారా! మాదకము, ఆనంద దాయకమగు సోమమునే ఇంద్రునకు అర్పించండి. సమర్ధుడు, వర్దమానుడే కదా కీర్తనీయుడు!
6. అధ్వర్యులారా! ఇంద్రుని ముందు, ఇంద్రుని కొరకు సోమబిందువులను రాల్చండి. ఇంద్రుడు ఆ మధుర సోమరసమును త్రావి తన మహిమచే స్తోతలకు అధిక అన్నములను ప్రసాదించును గాత.
7. ఇంద్రుడు స్తోతవ్యుడు. నాయకుడు, ఒక్కడే సకల శత్రుసేనలను హతమార్చువాడు. మిత్రులారా! రండి. త్వరత్వరగా రండి. ఆ ఇంద్రుని స్తుతించండి.
8. ఉద్గాతలారా! మేధావి, మహానుడు, అన్నకర్త, విధ్వాంసుడు, స్తుతి ప్రియుడగు ఇంద్రుని బృహత్ సామముల గానము చేయండి.
9. ఇంద్రుడు ఎదురులేని వాడు. జగదీశ్వరుడు. అతడు ఒక్కడే ఉపాసకులకు విశేష ధనము ఇచ్చువాడు అగుచున్నాడు. మరొకడుకాడు.
10. మిత్రులారా! వజ్రప్రాణిని మంత్రములచే ప్రార్దించండి. మీ అందరి కొరకని నరశ్రేష్టుడు, శత్రు భయంకరుడగు ఇంద్రుని స్తుతించుచున్నాను.
అయిదవ ఖండము
ఋషులు :- 1. ప్రగాథుడు 2. భరద్వాజుడు 3. నృమేధ 4. పర్వతుడు 5,7. ఇరిమిఠి. 6. విశ్వమనుడు 8. వసిష్ఠుడు.
1. ఇంద్రా! నీవు పుట్టుకతోనే శత్రు రహితుడవు. నియంత్రించువారు లేనివాడవు. సనాతన బందు రహితుడవు. నీవు బాంధవ్యము కోరునపుడు యుద్దమున సాయమునకు పిలిచినవానికి స్నేహితుడవు అగుచున్నావు.
2. మిత్రులారా! ఇంద్రుడు ముందు మాకు శ్రేష్ఠమగు ధనమును విశేషముగా ఇచ్చుచున్నాడు. ఆ ఇంద్రునే మీకు ధనమునిమ్మని రక్షణ కల్పించమని ప్రార్దించుచున్నాను.
3. సంచలన మరుత్తులారా! రండి, మా వద్దకు రండి. రాకున్నను మాకు హాని కలిగించకండి. సమతేజ స్కులును, పర్వతములను సహితము నియంత్రించు మరుత్తులారా! మమ్ము విడువకండి. మరొకచోట నిలువకండి.
4. అశ్వపతి, గోపతి, భూపతివగు ఇంద్రా! నీ కొరకు సోమము సిద్దపరచినాము. సోమపతీ! విచ్చేయుము. సోమపానము చేయుము.
5. వరదా! ఇంద్రా! మా గోష్టమునకు క్రోధమున శ్వాసల మంటలతో వచ్చువానిని నీ సహాయముననే మాటలతో మరలింపగలము.
6. సతేజస్క మరుత్తులారా! మీ తల్లులగు గోవులు సహజాతలు, సహబాంధవులు అవి అన్ని దిక్కులందుండును. ఒకదానిని మరొకటి నాకును.
7. ఇంద్రదేవా! నిన్ను స్తుతియుక్తుని చేయుచున్నాము. జలములున్న బాటసారిని అన్యుడు అర్ధించినట్లు మా కోరికలు తీర్చుమని నిన్ను అర్ధించుచున్నాము.
9. ఇంద్రదేవా! పాడితో కూడినదియు, ఆనందదాయకమును, స్వర్గము కలిగించు సోమమును సిద్దము చేసినాము. పక్షులవలె కూడి నిరీక్షించుచు నమస్కరించుచున్నాము.
10. వజ్రధారీ! నీవు మూడు సవనములకు ప్రత్యక్షమగుచున్నావు. మేము నిన్ను సోమము సమర్పించి పోషించుచున్నాము. తన ఇంట అన్నము కలుగవలెననుకొను సజ్జనుడు ఇతరులను పిలిచినట్లు మమ్ము కాపాడుమని నిన్ను ఆహ్వానించుచున్నాము.
ఆరవ ఖండము
ఋషులు : 1,2,3,4,5,6,9,10. సోభరి. 7,8. నృమేధ.
1. ఇంద్రా! నీవు జన్మముననే శత్రు రహితుడవు. నియంతలేనివాడవు. నీకు బందువులు ఉండరు.కాని నీవు కోరినంత యజకులు, యోద్దలు నీకు బంధువులగుచున్నారు.
2. ఋత్విక్కులారా! మిత్రులారా! ఇంద్రుడు మున్ను మా కొరకు సమృద్ద ధనము ఇవ్వదలచినాడు. అట్టి ధనమునే అందించుమని అర్ధించండి - రక్షించమని స్తుతించండి.
3. ప్రస్థానించు మరుత్తులారా! విచ్చేయండి. రానప్పుడు హాని కలిగించకండి. మీరు సమతేజోవంతులు. పర్వతములను సహితము నియంత్రించగలవారు. మమ్ము విడువకండి. అన్యుల వద్దకు చేరకండి.
4. ఇంద్రా! నీవు అశ్వపతివి. గోపతివి. అన్నపతివి. సోమపతివి. సోమము సేవింపుము 'సోమంపిబ"
5. ఇంద్రా! నీవు వరదుడవు. మేము గోధనులము - నీ భక్తులము. శత్రువు మా మీద అధిక క్రోధం గలవాడు అయినాడు. ఊపిరి పీల్చలేకపోతున్నాడు. మీ సహాయం ఉంటేనే మేము శత్రువును తొలగించగలము.
6. మరుత్తులారా! మీరు సమతేజం కలవారు. గోవులు మీ తల్లులు. మీకు సజాతీయులు బంధువులు అందుకే అవి దశదిశలందు ప్రేమగా పరస్పరం నాకుచున్నవి.
7. ఇంద్రా! నీవు శతక్రతువవు. బహుదృష్టులవాడవు. మాకు ధనము, బలము ప్రసాదించుము. నీవు శత్రుహంతవు. వీరుడవు. నిన్ను ఆహ్వానించుచున్నాము.
8. నీటికుండతో సాగేవాడు బాటసారి దోసిట్లో నీళ్ళు పోస్తాడు. అదే విధంగా ఇంద్రా! నిన్ను యాచిస్తున్నాము. నిన్నే స్తుతించుచున్నాము.
9. ఇంద్రా! నీ మధువు పాలుకలిపినది. హర్షదాయకము. స్వర్గమున లభించునది. పక్షులు కూడినట్లు కూడి నీకు ప్రణమిల్లుచున్నాము.
10. ఇంద్రా! నీవు బహురూపములవాడవు. మూడు సవనాల్లో దర్శనం ఇస్తావు. గృహపతి గుణవంతుని ఆహ్వానిస్తాడు. అట్లే మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.
ఏడవ ఖండము
ఋషులు : 1-8. గోతముడు. 9. త్రితుడు. 10. అవస్యుడు.
1. ఇది సోమము. ఇది మధురము. యజ్ఞములకు చేరునది. దీనిని గోవులు పానము చేయుచున్నవి. అవి వారములు ఇచ్చునవై, ఇంద్రునితో సాగి ప్రసన్నులై, శోభాయమానలు అగుచున్నవి. అవి స్వరాజ్యమున ఉండుచున్నవి.
(స్వకేయస్యేన్ధ్రప్య యద్రాజ్యం స్వరాజ్యం అని సాయణుడు. ఇంద్రుని రాజ్యము స్వరాజ్యమని.)
2. ఇంద్రా! నీవు బలశాలివి. వజ్రివి. నీ కొరకని విధివిహితముగ సోమము పట్టి నిలిచినాము. నీవు వర్ధిల్లు స్తుతులు వచించినాము. నీరాజ్యమున నీ అధికారము ప్రకటించుము. వృత్రుని భూమండలము నుండి తొలగించుము.
(అహిమ్-హంతారం వృత్రం అని సాయణుడు అహి సర్పము అని మెక్డొనాల్ద్. అహి అనగా పాము, శత్రువు, వృత్రుడు అని నిఘంటువు. కావున భూమండలము నుండి తొలగించవలసినవి విషము, పగ, పాపము కావచ్చును.)
3. వృత్రహంత ఇంద్రా! నరులు నీకు సోమమున హర్షము, స్తోత్రములచే బలము కలిగించుచున్నారు. అందువలననే నిన్ను పెద్ద, చిన్న యుద్దములకు ఆహ్వానించుచున్నారు. మా ఆహ్వానములు విన్న ఇంద్రుడు మమ్ము యుద్దములందు రక్షించునుగాత.
4. మేఘవాహన, వజ్రహస్త ఇంద్రా! నీ సామర్ధ్యమును కాదన్న శత్రువు లేడు. దానితోటే స్వరాజ్యమున ప్రభుత్వము చేయుచున్నావు. మాయమృగమగు వృత్రుని నీ మాయతోనే హతమార్చినావు. ఆనాడే నీ బలము ప్రసిద్దమైనది.
5. ఇంద్రా! దండెత్తుము. శత్రువును ఎదుట నిలిచి పట్టుము. శత్రువులు నీ వజ్రమును నిలుపజాలరు. నరులు దాని ముందు తలలు వంచెదరు. కావున స్వరాజ్యమున నీ అధికారము చూపుము. వృత్రుని వధించుము. అతడు కట్టిన నీటిని విడిపించుము.
(వృత్రుడు నీటిని కట్టి పెట్టినాడని వృత్తాంతము.)
6. యుద్దము జరిగినపుడు గెలిచినా వానికి ధనము లభించును. ఇంద్రదేవా! శత్రువుల మదమును అణచు హర్యశ్వములను రథమునకు పూన్చుము. నిన్ను ఆరాధించని వానిని ఓడించుము. నిన్ను ఆరాధించు వానికి ధనమును నిలుపుము.
7. ఇంద్రా! నరులు నీవు ప్రసాదించిన అన్నము తిన్నారు. తృప్తులైనారు. ఆనందమున మాటరాక తలలు ఆడించినారు. తదుపరి తేజోవంతులగు ఋత్విజులు నవ్యస్తుతులచే నిన్ను స్తుతించినారు. నీవు హర్యశ్వములను రథమునాకు కట్టుము.
8. మఘవా! మా స్తుతులను దగ్గరి నుండి స్పష్టముగ ఆకర్షించుము. నీవు ముందు వలెనే ఉండుము. మారకుము. మమ్ము ఎప్పుడు స్తుతివంతులను చేయుదువు? మా స్తుతులను స్వీకరించుటకు త్వరగా హర్యశ్వములను రథమునకు పూన్చుము.
9. ఉదక మండలమున సూర్య కిరణ యుక్తుడగు చంద్రుడు ఉరుకులు పెట్టుచున్నాడు. చండ్ర సంబంధులగు బంగరు మొనల కిరణములారా! నేనుకూపమున ఉన్నందున మీ కిరణములు అందుత లేదు. నన్ను కూపము నుంచి లేపండి.
ద్యావాపృథ్వులారా! నా స్తుతులు వినండి.
(ద్యావాపృథ్వులను కూడ తనను బయటికి లాగవలసినదని ప్రార్దించుచున్నాడు. కూపము అజ్ఞానాంధకారము - కిరణములు జ్ఞాన జ్యోత్స్న కావచ్చును.)