అవకాశమొస్తే తన అంతు చూడాలనుకుంటుందే తప్ప తనను రక్షించాలని ఎప్పుడూ అనుకోదు. సరిగ్గా ఆమె తనకెప్పుడు తారసపడ్డా తను కష్టకాలంలో వుండగానో, దిగజారిన స్థితిలో వుండగానే ప్రత్యక్షమవుతుంది.
సో..... వీనస్ కాదు.
ఇక మిగిలింది ప్రమీలారాణి.... ది గ్రేట్ వదినమ్మ..... తనలోని లోపాల్ని వెతికి పట్టుకొని మరీ పరిహసిస్తుంది. తన అసమర్థతని పదే పదే ఎత్తిపొడుస్తుంది. తన అప్రయోజకత్వాన్ని గేలిచేస్తుంది.
సో.... ప్రమీలారాణి కాదు
మరెవరు?
తనను కాపాడాలని ఈ ప్రపంచంలో మరెవరికుంది?
తనను గుర్తించే వాళ్ళెవరున్నారు?
"నాన్నా! నువ్విక్కడే వుండు" అంటూ తండ్రిని స్టేషన్ గేట్ ప్రక్కనే వుంచి మాధుర్ తిరిగి లోపలకు వచ్చాడు.
అప్పుడే లోపలినుంచి ఓ వ్యక్తి బయటకు వస్తూ కనిపించాడు. అతని చేతిలో వున్న కోర్టు కాగితాల్ని, వంటిపై ఉన్న నల్లకోటుని చూసి అతనే తనను విడిపించిన లాయర్ అయి వుంటాడన్న ఉద్దేశ్యంతో పలకరింపుగా నవ్వాడు అతనికేసి చూస్తూ.
"ఐ థింక్... యూ ఆర్ మిస్టర్ మాధుర్?"
"యస్... బట్..."
మాధుర్ సందేహాన్ని ఆ లాయర్ గ్రహించాడు.
"అవును.... నేనే మీకు బెయిల్ ఇచ్చాను- మరలా లోపలకెందుకు వస్తున్నారు?" అడిగాడా లాయర్.
"మీరెవరో నాకు తెలీదు- నేనెవరో కూడా మీకు తెలుసుండదు. తెలిసేంత గొప్పవాడ్ని అంతకంటే కాదు. అలాంటప్పుడు నన్నే ఎందుకు విడిపించాలనుకున్నారు?"
అదొక వెర్రి ప్రశ్నయినట్టు ఆ లాయర్ మాధుర్ కేసి చూశాడు.
"మీరన్నది నిజమే! ఒకళ్ళకొకళ్ళము తెలియకపోయినా మనిద్దర్నీ ఎరిగినవాళ్ళు వేరే వారున్నారు. వారికీ మనం తెలుసు. నా వృత్తి లాయర్. మీ వృత్తేమిటో నాకు తెలీదు. నా వృత్తికి పని కల్పించారు. పదండి వెళదాం..." అన్నాడతను మాధుర్ కేసి రమ్మన్నట్టు చూస్తూ.
"ఇద్దరమూ తెలిసిన ఆ మూడో వ్యక్తెవరు?"
"తెలీదు.... తెల్సుకోవల్సిన అవసరం వున్నా, అక్కర్లేదని వాళ్ళన్నారు. నా ఫీజు నాకు ఇచ్చారు."
"అపాత్రదానం ఎంత తప్పో.... మనకు దానం చేసే దాతకా అర్హత వుందో, లేదో తెలుసుకోకపోవడం కూడా అంతే తప్పు."
"మీరు మొండివాళ్ళలా కనబడుతున్నారు. ఎవరైతేనేం? దానం తీసుకునే స్థితిలో మనం వున్నప్పుడు ఆహ్ది ఎవరు చేసిన దానమైతేనేం?
మాధుర్ చిన్నగా నవ్వాడు.
"మన శత్రువు మనకు ఏం దానం చేసినా తప్పులేదు. నష్టంలేదు. కాని క్షమనూ, జాలినీ దానంచేస్తే తెలీక వాటిని స్వీకరిస్తే అంతకంటే అసహ్యమైనది మరొకటుండదు. యామై రైట్?"
అతనో క్షణం కలవరపడ్డాడు.
"ఇన్ని తెలివితేటలు, ఎంతో విచక్షణా జ్ఞానం వున్న మీరు ఒక బడుగు జీవిలా వూచల వెనక్కి ఎలా వెళ్ళారు?"
"తెలివిగలవాడు భోంచేయడా? గాలి పీల్చడా....? ఇంగితజ్ఞానం, విచక్షణా వున్నవాడికి ఎవరేమిటో తెలియవచ్చుగానీ, ఖాకీ దుస్తులకెలా తెలుస్తుంది? అయినా ఐ.పి.సి తప్పు చేసినవాడికి అనేది ఒకప్పుడు..... ఇప్పుడు తప్పు చేసినట్టు కనిపించిన వారికి, అనిపించిన వారికి.... నేను తప్పు చేసినట్టు వారికి అనిపించి వుండవచ్చు..... లేదా కనిపించి వుండవచ్చు..... ఇప్పుడు చెప్పండి.... ఎవరు నన్ను మీ ద్వారా విడిపించాలను కున్నవాళ్ళు....?"
"మీరూ ఎల్.ఎల్.బి. చదివారా?" అతను మాధుర్ వాదనకు ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు.
"లాజిక్ ఆలోచించడానికి లాయరు కానక్కర్లేదు. ఎల్.ఎల్.బి. చదవనక్కర్లేదు."
"అఫ్ కోర్స్...... బట్ ఎవరు అనే వాళ్ళు మీనుంచి దాచమన్నారు. ఇన్ని తెలివితేటలున్న మీరు నేను దాచినా తెలుసుకోగలరనిపిస్తోంది.....అందుకే చెబుతున్నాను. నాకు ఫీజ్ అందింది. ది గ్రేట్ జె.జె. ఎంఫైర్ నుంచి."
"వ్వాట్?!"
మాధుర్ అరిచిన అరుపుకు అతను బిత్తరపోయాడు.
"వెళదాం పదండి" అన్నాడతను తేరుకుంటూ.
"శత్రువు- దానం చేసే విషాన్నయినా స్వీకరించవచ్చేమోకాని జాలిని కాదు. నాకీ బెయిల్ అక్కర్లేదు" అంటూ సి.ఐ.. గదికేసి వేగంగా దూసుకుపోయాడు మాధుర్.
అతను మాధుర్ వింత ప్రవర్తనకు షాక్ తిన్నాడు.
* * * * *
"మనం నియమించిన లాయర్ మన కంపెనీ పేరు చెప్పి పొరపాటే చేసినా- మాధుర్ రియాక్షన్ ఏ స్థాయిలో వుందో చూశారా? బెయిల్ ని తిరస్కరించి సాయంత్రం వరకు తిరిగి పోలీస్ స్టేషన్ లోనే వుండిపోయాడు. ఇంతక్రితమే అందర్నీ వదిలేశారు..... ఆ అందరితోపాటు అతనూ రిలీజ్ అయ్యాడు...." రమణయ్య మౌనిక ఛాంబర్ లోకి వస్తూనే అన్నాడు.
ఆమె తడిదేరిన పెదవులపై చిరునవ్వు ఓ క్షణం తళుక్కున మెరిసి మాయమయింది.
"అవును.... అది తెలిసే అందర్నీ విడిపించే ప్రయత్నం చేశాను" ఆమె కూల్ గా అంది.
రమణయ్య అదిరిపోయాడో క్షణం.... ఎంత నెట్ వర్క్ వుంటే తనొచ్చేలోపే జరిగింది తెలుసుకుని మరో పద్దతి ద్వారా విడిపించగలిగిందామె?
"రెండో పద్దతి ద్వారా విడిపించవచ్చని నాకు తెలుసు రమణయ్యగారు. దానివలన అతన్ని విడిపించడమే జరిగేది.... కానతని రియాక్షన్ తెలియాలంటే మొదటి పద్దతి ముందు అనుసరించాలి గదా. ఆ లాయర్ తప్పు చేయలేదు. నేనేం జరగాలనుకున్నానో అదే జరిగేలా చేశాడతను."
ఆమె తెలివితేటలకు రమణయ్య దిగ్భ్రాంతి చెందుతూ "విడిపించడమే ముఖ్య విషయమైనప్పుడు ఎవరు విడిపించారన్నది చెప్పకుండా దాచమని నేను లాయర్ని కోరతాను గదా? మరలాంటప్పుడు మొదటి పద్దతి ద్వారా మాధుర్ రియాక్షన్ తెలుసుకోవడం ఎలా సాధ్యమనుకున్నారు?"
ఆమె వాల్ కి అతికించి వున్న ఖరీదైన సిల్క్ క్లాత్ కేసి చూస్తోంది.
దానిమీద ఇన్ అవర్ ఫేక్టరీ ఉయ్ మేక్ లిప్ స్టిక్ ఇన్ అవర్ ఎడ్వర్టయిజింగ్ ఉయ్ సెల్ హోప్ జె.జె. కాస్మోటిక్స్.
అని వ్రాసున్న ఇంగ్లీషు అక్షరాలు గోల్డ్ కలర్ లో మెరుస్తున్నాయి.
అలవోకగా తలతిప్పి "మాధుర్ ఒక మామూలు మనిషే అయితే ఎవరు బెయిల్ ఇచ్చి విడిపిస్తేనేమిటి మనం బయటపడ్డాం కదా అని ఆనందంగా వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి మనకక్కర్లేదు. అలా కాకుండా నన్నెవరు విడిపించింది అని ఓ క్షణం ఆగి గట్టిగా మనం నియమించిన లాయర్ ని నిలదీస్తే, ఆ లాయర్ అప్రయత్నంగానే మన కంపెనీ పేరు బయటపెడతాడు. అప్పుడు మాధుర్ రియాక్షన్ నా దృష్టికి రాకుండా పోతుందా?"
రమణయ్య ఆమె తెలివితేటలకు అదిరిపోయాడు.
"ఆ సిల్క్ క్లాత్ మీదున్న అక్షరాన్ని చూడండి. మా ఫ్యాక్టరీలో మేం లిప్ స్టిక్ తయారుచేస్తాం. మా ప్రచారంలో ఆశాభావాన్ని అమ్ముతాం. ఎంత గొప్ప స్లోగన్ అది. దాన్ని రాసిందెవరో తెలుసా రమణయ్యగారూ? మాధుర్ .....ఎస్ మీరన్నట్టు మాధుర్ మహా మేధావి.... అది అక్షరాలా నిజం. అక్షరాలతో ఆడుకుంటాడు.... అక్షరాల్నే ఆయుధాలుగా మారుస్తాడు- ఆ అక్షరాల్నే అక్షయపాత్రలుగా మలుస్తాడు. ఐ వాంట్ హిమ్ నాకతను కావాలి. ఆరు నూరైనా, ప్రపంచం తల్లక్రిందులైనా నాకతను కావాలి. అందుకోసం నేనిప్పుడు సిద్దమవుతున్నాను... నాకిప్పుడు మధ్యతరగతి ఆడపిల్ల- పెళ్ళికాని ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుంది? ఎలాంటి బట్టలు ధరిస్తుంది? ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటుంది? ఎలా జీవిస్తుంది? లాంటి వివరాలు మొత్తం కావాలి. అందుకు సంబందించిన వస్తువులన్నిటిని కొనండి. మౌనిక విశాలంగా వున్న తన టేబుల్ పై తెరిచి వుంచిన ఫైల్ లోకి చూస్తూ అంది.
కోట్లకు కోట్ల ఆస్తులకు వారసురాలిన ఒక హైలీ సోఫిస్టికేటెడ్ గర్ల్ సరికొత్త వేషం వేయబోతోంది. రమణయ్య ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు.
వరల్డ్ వండర్స్ ముందు నించుని వాటిని ధిక్కరించే మరో వండర్ ని చూస్తున్న భ్రాంతికి గురయ్యాడు ఆయన.
"అతను చాలా తెలివికలవాడమ్మా...."
"అందుకే నేనతన్ని కోరుకుంటున్నాను...."
"అతనెవరో ఎలా వుంటాడో తెలీకుండా.... అది ప్రమాదకరమేమో?"
ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడు, చేతిలో బొచ్చుకుక్క తిరిగేందుకు ఇంపాలా వున్న అర్భకుడ్ని కావాలనుకుంటే, అది ప్రమాదం....మీరన్నట్టు అద్భుతమైన తెలివితేటలున్న వాడ్ని కోరుకోవడం ప్రమాదాన్ని ఆహ్వానించడం కాదు. వాడికి అవేమీ లేకపోయినా అనర్హత కాదు, కలలు వద్దు- కలల్లో కరుగుతూ వాస్తవాలకు దూరంగా పారిపోయే వ్యక్తి నాకొద్దు...."