"అతనో వ్యసనాల పుట్ట."
"అందం, ఆకర్షణ వున్న అతివకన్నా వేరే పెద్ద వ్యసనం మగాడికి మరేదీ వుండదు."
"అతనిలో మార్పు అసాధ్యమని అంటారు."
"ఛేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్. మార్పు అన్నది జీవన సిద్దాంతం అందుకు నేనదయినా చేస్తాను. నాకు కావలసింది గెలుపు..."
"మీ స్థాయి తగ్గిపోతుందేమో?"
"స్థాయి పెరగడం, తగ్గడం సాధించే విజయాల్ని బట్టే వుంటుంది."
"అతను డబ్బున్న వాళ్ళను అసహ్యించుకుంటాడు."
"అందుకే లేనిదానిగా వేషం మారుస్తాను."
రమణయ్య ఆమె స్థిరత్వానికి ఆశ్చర్యపోతున్నాడు. ఆమె మొండితనానికి పిచ్చెక్కిపోతున్నాడు.
అనవసరంగా థానే మాధుర్ గురించి కదిలించాడు. తెలివికలవాడని పొగిడాడు. ఫలితంగా యీ సామ్రాజ్యాన్ని భావి నిర్ణేత- వారసురాలు కోరి కష్టాల్ని ఆహ్వానిస్తూ ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకోబోతోంది.
తను అడ్డుకోక తప్పదు.
"అతను మనం అనుకున్నంత తెలివికలవాడు కాదమ్మా! కాకపోతే ఉపమానాలు, ఉత్ప్రేక్షకాలు వాడటం మానవనైజం. అందుకే అలా చెప్పి వుంటాను అతని గురించి పొరపాటున మరొక్కసారి ఆలోచించమ్మా!" రమణయ్య ఆమెను దాదాపు అభ్యర్ధించాడు.....ఆమె నిర్ణయించుకున్న మార్గం నుంచి విముఖురాల్ని చేయడం కోసం.
"ఎవరైనా ఒక రంగంలో విజయం సాధించాలనుకుంటే....ఆ రంగంలో అంతవరకు సాధించిన అభివృద్దినీ, విజయం సాధించేందుకు అవసరమయిన అవకాశాల్ని అన్వేషించాలి. గ్రంథాలయాల్లోని పుస్తకాలన్నీ ఆరంగం గురించి ఎం చెపుతున్నాయో తెలుసుకోవాలి. మొదటినుండీ అప్పటి వరకూ జరిగిన ప్రయోగాలనీ, వాటికి సంబందించిన వాస్తవాలనీ సేకరించాలి. కేవలం మూడంటే మూడే విషయాలమీద విజయం ఆధారపడి వుంటుంది. ఒకటి కష్టించి పనిచేయడం... రెండు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం..... మూడు కామన్ సెన్స్! ఎంత గొప్ప సూత్రమో చూశారా? ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి గొప్పవాడు కావాలన్నా ఈ సూత్రం ప్రకారమే అవుతాడు. దటీజ్ మాధుర్! ఇది అతను ఇక్కడ ఉద్యోగం వదిలేసి మర్చిపోయి వెళుతూ మనకు మిగిల్చిన ఫైల్..... అతను ఎంత తెలివికలవాడో ముందు ముందు కూడా పరీక్షిస్తాను. అది నాకొదిలేయండి! నాకిప్పుడు మధ్యతరగతి ఆడపిల్ల అలవాట్లను నేర్పండి..... ఆ మధ్యతరగతి ఆడపిల్లగానే అతన్ని కల్సుకుంటాను...." ఆమె ఆ ఫైల్ ని మూస్తూ లేచింది.
ఇంకామె నిర్ణయానికి తిరుగుండదని భావించిన రమణయ్య ఆమెను తనతో రమ్మన్నట్లుగా చూస్తూ రూమ్ లోంచి బయటకు నడిచాడు.
మౌనిక జె.జె. ఎంపైర్ పదహారవ అంతస్తు టెర్రస్ పైకి చేరుకుంది. అప్పటికే రమణయ్య అక్కడకు చేరుకున్నాడు.
అప్పుడే సరిగ్గా సూర్యాస్తమయం జరుగుతోంది.
నగరం ఆ సూర్యాస్తమయానికి రక్తపు వరద ముంచెత్తినట్టుగా వుంది.
కొద్దిక్షణాలు అటుకేసి చూసిన మౌనిక చటుక్కున, తలతిప్పి రమణయ్య కేసి చూసింది.
"చెప్పండంకుల్!" అంది పట్టుదల ధ్వనించే కంఠంతో.
"తీరని కలలకి- తీరే స్వల్ప కోర్కెలకీ మధ్య వుంటారమ్మా మధ్యతరగతి యువతులు మోడరన్ సొసైటీ, రిచ్ క్లాస్ వాడె వస్తువులను, అనుభవించే సుఖాల్ని చూసి ప్రభావితమవుతారు. అందవని తెలిసినా, అందేవాటిని నిర్లక్ష్యం చేసి, అందనివాటిపై మనస్సు పెట్టుకుని తీరని అసంతృప్తితో మగ్గిపోతుంటారు."
సాయంత్రపు చల్లనిగాలి అల్లనల్లన వీస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
ఆమె రమణయ్య చెప్పే వివరాల్ని భద్రంగా తన జ్ఞాపకాల అరల్లో నిశ్శబ్దంగా నిక్షిప్తం చేసుకుపోతోంది.
"చిన్న మినహాయింపు చెపుతానమ్మా ముందే. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు ఈ దేశంలో మధ్యతరగతి యువతులందరికీ సరిపోలవు. నాకు తెలిసిన మధ్యతరగతి ఆడపిల్లల గురించే నేను చెబుతున్నాను.... కొందరు నేను చెప్పేలా- ఇంకొందరు మరోలా- మరికొందరు నేను చెప్పే వాటికి పూర్తిగా వ్యతిరేకంగా వుండవచ్చు."
ఆమె మెల్లగా నవ్వింది.
"ఏం లేదు! నీవదే అభిప్రాయాన్ని అందరిపట్ల ఏర్పరుచుకుంటే ఆ ప్రభావం కొందరిపైన పడితే అందుకు నేను బాధ్యుడ్ని అవుతానేమోననే శంఖ..."
"ఫర్వాలేదు చెప్పండంకుల్! మా రిచ్ క్లాస్ లో యువతులు మాత్రం అందరూ ఒకేలా వుంటారా? అలా వుండి వుంటే నేను కావాలని ఏరి కోరి యిలా మధ్యతరగతి ఆడపిల్లలా మారాలనుకోరుగదా? కమాన్ టెల్ మీ" అందామె రహదారుల్లో ప్రవహిస్తున్నట్టు కనిపిస్తున్న క్రాంతి ప్రవాహానికేసి చూస్తూ.
"చిన్న వయస్సునుంచే వారిలో కలలు మొదలవుతాయి. ఖరీదైన బట్టలు కట్టాలని..... తమ అందాన్ని ద్విగుణీకృతం చేసే సౌందర్య సాధనల్ని వాడాలని తమ తల్లిదండ్రుల మీద వత్తిడి తెస్తారు. కన్న ప్రేమతో వారి తల్లిదండ్రులు వాటిలో కొన్నిటినైనా సమకూర్చుతారు. వారి భయం మరొకటుంటుంది. ఆడపిల్ల పుట్టగానే ఎన్ని లక్షలు కట్నమిస్తే వీళ్ళ వివాహాలు చేయగలమని భయపడిపోతుంటారు. ఆడపిల్ల పెళ్ళిని తమ ప్రాధమిక బాధ్యతగా గుర్తిస్తారు. ఆ యువతులు తమ తల్లిదండ్రులు పడే బాధను, అనుభవించే భయాన్ని గుర్తించరు.
ఈలోపు వాళ్ళు చదివే సాహిత్య ప్రభావం, చూసే సినిమాల ప్రభావం వారిమీద పడుతుంది. అందమైన ఆరడుగుల ఎత్తున్న మొగుడు కావాలని, అతనికి ఇంపాలాలాంటి పడవంత కారుండాలని, అతను రోజూ తెల్లటి సూట్ లో వుండాలని, చేతిలో అందమైన బొచ్చుకుక్క వుండాలని అతనికి తెలీని విషయం, రాని పని అంటూ వుండకూడదని కలలు కంటారు. అలాంటి భర్తనే తమ తల్లిదండ్రులు తమకు తీసుకురావాలని ఆశపడుతుంటారు...." అతను ఒకింతసేపు ఆగాడు.
మౌనిక ఆయన చెప్పే వివరాలు వింటూ ఆశ్చర్యపోతోంది.
"ఇంపాలా కారు ఇండియాలో తయారుకాదని, ఫారెన్ కార్లు ఇండియాలో అంత తేలిగ్గా, అంత చవకగా ప్రతి ఒక్కరికి దొరకవని వారికి తెలీదు. అందరూ ఆరడుగుల ఎత్తు పెరగరని ఇండియాలాంటి ఉష్ణోగ్రత ఎక్కువగా వుండే దేశంలో సూట్స్, బొచ్చుకుక్క పిల్లల్ని చేతుల్లో పట్టుకుని తిరగడం గొప్ప హోదా ఏమీ కాదని, పైగా జబ్బులొస్తాయని వారికి తెలీదు.
ఎంత గొప్పవాడికయినా అన్ని విద్యలు రావడం దుర్లభమని- టైపు చేయడం దగ్గర్నుంచి విమానాల్ని నడపడం వరకు అన్ని రంగాల్లో ఆపరేటివ్ ఎక్స్ పీరియన్స్ అసాధ్యమని వారికి తెలుసో లేదో తెలీదు.
తమకు ఆత్మాభిమానం, పౌరుషం వుంటే చాలని, అవే తమపరంగా గొప్ప అర్హతలుగా భావిస్తారు.
తమ స్థాయేమిటో.... ఆ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించకపోతే ఎన్ని బాధలు పడవలసి వస్తుందో ఎవరు చెప్పినా, ఎందరు చెప్పినా ప్రయోజనం శూన్యం.
అన్నిట్లోకి విచిత్రమేమిటంటే- తమ మొగుడు కోటీశ్వరుడు కావాలి, కోట్లకు కోట్లు ఇంకా సంపాదించాలి. కానీ మొగుడెప్పుడూ తమ కొంగు పట్టుకొని తిరగాలి. నాకిదేనమ్మా అర్ధమయి చావదు. మగాడు నాలుగుచోట్లకు తిరిగి నాలుగు పనులు చేసినప్పుడు గదా నాలుగురాళ్ళు సంపాదించగలిగేది. ప్రొద్దస్తమానం కొంగుపట్టుకు తిరిగితే డబ్బొచ్చి వడిలో పడడానికి ఆడదాని కొంగు అల్లాఉద్దీన్ అద్భుత దీపం కాదుగదా!
మోస్ట్ కాంప్లికేటెడ్....
తను అందంగా వున్నానని, తనకేసి అందరూ పిచ్చి ఆరాధనతో చూడాలని కోరుకుంటారు. తీరా ఎవరన్నా కొద్దిసేపు ఎక్కువగా చూస్తే అది మహా నేరమయినట్లు చివాట్లు పెడతారు.
వారికి పెద్ద పెద్ద ఆశయాలు, లక్ష్యాలు వుండవు. తమకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటీ కోసం ప్రయత్నించరు. ఏదో సాధిద్దామని, ఎంతో ఎత్తుకు ఎదుగుధామని భావించరు.
తీరా పెళ్ళయ్యాక భర్తలకు సహకరిస్తారా అంటే అదీ లేదు- భర్త యింటికి వచ్చేసరికి విచారంగా భూగోళాన్ని మోస్తున్న అట్లాస్ మహావీరుడి ఫేస్ లో కనిపించే భారం, చిరాకు చూపెడతారు. విచారించినా, ఏడ్చినా సమస్యలు తీరవని తెలుసో లేదో తెలీదు. చిర్నవ్వుతో ఎలాంటి కష్టాన్నయినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు భర్తకు ఆత్మవిశ్వాసాన్ని అందించరు. పుట్టెడు సమస్యల్ని ప్రోగుచేసి చెబుతారు. చిరునవ్వుతో, ప్రేమతో ఏది చెప్పినా భర్త చేస్తాడని తెలుసు. కాని భార్యననే అహం- అంత తేలిగ్గా తనని వదిలేసి రెండో పెళ్ళికి తన భర్త సిద్దపడడని- పరువు కోసం భయపడతాడనే అహంతో శాసిస్తారు. అక్కడే మగవాడు ఇరిటేట్ అయి అసలు తమను నిర్లక్ష్యం చేస్తారని భావించరు.