ఎదురుగా వీనస్!
అద్భుతమైన అందాలరాణి....
బ్లాక్ ఈజ్ బ్యూటీఫుల్....!
బ్రిజిత్ బార్డో వర్నర్ బిలిటీ!
మెరిల్ స్ట్రీఫ్ సుకుమారం...!
ఆ నలుపులో అంతటి అందం ఎలా ఇమిడిపోయింది?
నల్లటి కురులు...
కారుమబ్బులా వరద ప్రవాహంలో జాలువారి, చిరుగాలికి అల్లనల్లన కదలాడే ఒత్తయిన కురులు.
ఓ క్షణం తల విదిలించి స్థిమితపది ఆమెకేసి సూటిగా చూశాడు.
ఆమె మౌనంగా, కాంక్షగా, చిలిపిగా మాధుర్ కేసి చూస్తోంది.... మరీ మరీ అతని కళ్ళలోకే చూస్తోంది.
ఆమెకు తెలుసు తన చూపులు మాధుర్ పాలిట సూదంటు రాళ్ళని.
అతను చప్పున చూపులు మార్చి క్రిందికి చూశాడు.
నున్నటి శరీరం-
నల్లటి శరీరం-
తనలోని ఏకాగ్రతను భగ్నం చేస్తూ, తనలోని కోర్కలకు ఊపిరిపోస్తూ అద్భుతమైన ఆమె వైటల్ స్టాటిస్టిక్స్-
తనని చూసిన ప్రతిసారి రెచ్చగొట్టే వర్నర్ బిలిటీ.
ప్రవరాఖ్యుడి ప్రతాపానికి సయితం ఆమె ఓ ప్రశ్నే-
ఉన్నట్టుండి ఆమె ఇక్కడ..... తనీ స్థితిలో వుండగా కావాలనే వచ్చిందా? కాకతాళీయమా?
ఆమె మోములోని భావాల్ని చదవడం, అంచనా వేయడం చాలా కష్టం.
ఇప్పుడిక తను మరీ తలదించుకుంటే ఆమె అహానికి తనే సరికొత్త బలాన్ని సమకూర్చినట్లవుతుంది.
అతను చటుక్కున తలెత్తాడు.
ఆమె ముక్కున తళుక్కున మెరిసే ముక్కెర- తనెంతో ఇష్టపడే ముక్కుపుడక-
సెల్ ముందున్న హాల్లో పైభాగాన వెలుగుతున్న లైటుకాంతి ఆమె ముక్కెరపై వక్రీభవిస్తోంది.
తెల్లటి... చిన్న రాయి అద్భుతంగా కనిపించిందతనికి.
ఆమె మరోసారి నవ్వింది.
తడితో మెరిసే ఆమె పెదవులు విడిపడ్డాయి.... దాన్నిమ్మగింజల్లా అందమైన, ముద్దొచ్చే పలువరస-
"నన్నేం చేశావు?" ఆమె నవ్వుతూనే ప్రశ్నించింది. అతనేం సమాధానం ఇవ్వలేదు.
"నాకు 24 సంవత్సరాలు... పెద్దమనిషినయి పదేండ్లయింది.....ఊపిరి సలపని భౌతిక వాంఛలు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి."
మాధుర్ పక్కనున్న వాళ్ళు షాక్ తిన్నారొక్కసారి ఆమె మాటలకి.
"అవునూ, నాకు కన్నెరికం ఎప్పుడు చేస్తావు?" ప్రక్కనున్న వాళ్ళు బిత్తరపోయి ఆమెకేసి, మాధుర్ కేసి చూడసాగారు.
మాధుర్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆమె మాటల్ని కాని తన తండ్రి విన్నాడా అని ఆందోళనగా ప్రక్కకు చూశాడు.
ముసలి ప్రాణం ఆయాసం తీర్చుకొనేందుకు గోడకు చేరగిలబడి వుంది.
అతనో క్షణం రిలాక్స్ గా ఫీలయ్యాడు. "చెప్పు... మనూ మన ఫస్ట్ నైటెప్పుడు...?" ఆమె అదే చిర్నవ్వుతో చిలిపిగా చూస్తూ ప్రశ్నించడం...ప్రక్కనున్న వాళ్ళు పిచ్చిచూపులు చూడడం ఒకేసారి జరిగింది.
అందులో కాస్త వయస్సులో వున్న ఒక యువకుడు మాధుర్ భుజాన్ని తడుతూ "ఏంటి గురూ.... ఇంకా ఆలోచిస్తున్నావ్.....ఫస్ట్ నైట్ పెళ్ళిగాని పిల్ల....కోరి నిన్ను అడుగుతుంటే పిచ్చిచూపులు చూస్తావేం? మేం అటు తిరుగుతాం......కనీసం ఓ ముద్దన్నా పెట్టుకో గురూ...." అన్నాడు.
అతని మాటలు పూర్తవుతుండగానే మాధుర్ కొట్టిన దెబ్బకి అతని కళ్ళు బైర్లు కమ్మాయి.
"సెభాష్.... పౌరుషం అంటే అదీ..... ఓ ఆడపిల్లను చూసి అలుసుగా ఎవరన్నా మాట్లాడితే ముందుగా అతని గూబ పగలగొట్టేది ఇద్దరే..... ఒకరు ఆమె సోదరుడు..... రెండు ఆమె ప్రియుడు. మొదటి వరసలేదు. రెండోది ఉందంటే నమ్మశక్యంగా లేదు. అవును ఎన్నాళ్ళు నేను కన్యగానే వుండిపోవాలి? నాలో ఫ్రిజిడిటి అంటే జడత్వం రాకముందే ఫస్ట్ నైట్ వస్తే బావుంటుంది. చెప్పు- ఎప్పుడు మన శోభనం?"
మాధుర్ రక్తం సలసల కాగిపోతోంది. ఉన్న పళాన లేచి వెళ్ళి ఆమె పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా వున్నాడు.
"ఎందుకు మేడమ్.... అతను ముక్కు మూసుకుని తపస్సు చేస్తుంటే అతన్నే వేధిస్తారు? మీరంటే ఎవరు మాత్రం పడిచావరు? అలా పడి చచ్చేవాడిని చూసుకోక, చచ్చిపడున్న ఇతన్ని వేధిస్తారు?" మరొకడు ధైర్యం చేసి అన్నాడు మాధుర్ కి దూరంగా జరుగుతూ.
"నాకు చచ్చిపడున్నా ఇతనితోనే పడిచావాలని వుందే? నిజమే! నేనంటే ఎవరైనా పడిచస్తారు. యూ సీ నాకు నేను పడివచ్చే యితనే కావాలి. అందుకోసం ఇలాగే మిగిలిపోవడానికైనా సిద్దమే."
మాధుర్ చటుక్కున తలతిప్పి అంతకుముందు మాట్లాడిన వ్యక్తి కేసి సీరియస్ గా చూసి, లేచెళ్ళి కటకటాల ముందు నిలబడి ఆమెకేసి కోపంగా చూశాడు.
"నేను చాలా కలలు కంటున్నాను..... వాటిలోనే కరిగిపోవాలని చచ్చిపోతున్నాను. ఇదిగో మన ఫస్ట్ నైట్ అని చెప్పి మరలా కనపడలేదు. నాకు నేను మోస్తున్న కన్యత్వం బరువుగాను, శాపంగాను వుంది. లేట్ చేయకు ప్లీజ్..... ఫస్ట్ నైట్ కి బందర్ స్వీట్స్..... హెలెన్ దర్భార్ బత్తి, క్రిస్టియన్ స్ప్రేని ఒక బోగిలో ఆర్డరిచ్చి తెప్పిద్దామనుకొంటున్నాను. పాలు డెన్మార్క్ నుంచి కొరియర్ సర్వీస్ లో తెప్పించాలను కొంటున్నాను. ఆపై నీ ఇష్టం" ఆమె చటుక్కున వంగి మెరుపు వేగంతో చేతిని ఇనుప చువ్వల గుండా లోపలకు చాపి అతని చేతిని బయటకు లాగి, ఆ చేతిపై సుతారంగా తన పెదవులను చేర్చి, క్షణాల్లో అదృశ్యమై పోయింది. మాధుర్ మెదడు మొద్దు బారిపోయింది ఆమె చర్యకు.
* * * * *
"చెప్పిందా గుర్తుందా రమణయ్యగారూ?" మౌనిక మెత్తని పర్షియన్ కార్పెట్ మీద మెల్లగా నడుస్తూ అడిగింది.
"గుర్తుందమ్మా..... కానీ మీరు వేస్తున్న పథకమే నాకు మ్రింగుడు పడడం లేదు...." రమణయ్య నెమ్మదిగా అన్నాడు.
ఆమె వింటూ చిరునవ్వు నవ్వింది.
"నిచ్చెన మెట్లు తయారుచేసుకోవాలి.....అలా చేసుకునే సామర్ధ్యమో, అనుభవమో లేకుంటే తయారుగా వున్న.....అది ఎవరు తయారు చేసిందైనా ఎక్కేందుకు వుపయోగించుకోవాలి. తప్పదు.....లేదంటే నా అస్థిత్వం తాతగారి ముందు ప్రశ్నయిపోతుంది. మీకు తెలుసు తాతగారు ఏమంటుంటారో....ఆమె ఒకింతసేపు ఆగి-
"ఐ వాంట్ సొల్యూషన్ దేన్ ప్రాబ్లమ్స్ అండ్ సజెషన్స్.... నేనొకటి అనుకుంటే అది జరిగి తీరాలి. కారణాల్ని తలుచుకొని వ్యధ చెందడం...కాన్ సీక్వెన్సెస్ గురించి భయపడడం కానీ నాకిష్టముండదు. మీరు వెంటనే ఒక లాయర్ ని తీసుకొని వెళ్ళి జైల్లో వున్న మాధుర్ ని, అతని తండ్రిని బెయిల్ మీద విడిపించండి. తరువాత ఏమిటన్నది ఆలోచిస్తాను" అందామె స్థిరంగా.
రమణయ్య లేచి నిలబడి ఆమె వైపే చూశాడు కొద్దిక్షణాలు.
ఆనందంతో, మాటలు ద్వారా చెప్పలేని ఉద్వేగంతో "ఆ తాతగారికి తగ్గ మనుమరాలి వనిపించుకున్నావమ్మా ..... ఇప్పుడే ఆ ఏర్పాట్లు చూస్తాను" అంటూ రమణయ్య బయటకెళ్ళి పోయాడు.
మౌనికలో మాధుర్ ఎలా వుంటాడు? ఎలా బిహేవ్ చేస్తాడు అనే ఆసక్తి పెరగసాగింది.
ముడుచుకొని కూచునున్న మాధుర్ తన పేరు పెట్టి ఎవరో పిలిచినట్టనిపించడంతో తలెత్తి చూశాడు.
"మిస్టర్! మీరు, మీ ఫాదర్ వెళ్ళిపోవచ్చు...." అన్నాడో కానిస్టేబుల్.
మాధుర్ ఆశ్చర్యపోయి దిగ్గున లేచి తండ్రికి ఆసరా ఇచ్చి బయటకు తీసుకొని వచ్చేశాడు.
బయటకు వచ్చేవరకు ముళ్ళమీద వున్నట్లు ఫీలయిన మాధుర్ స్టేషన్ బయటకు వస్తూనే ఎవరా పనిచేసిందని ఆలోచించసాగాడు.
వీనస్....?
నో..... నో....
ఆమె తనను పరిహసించడానికే వచ్చింది తప్ప, తనను విడిపించడానికి కాదు. విడిపించే ఉద్దేశ్యంతోటే అయితే అలా సర్ క్కాస్టిక్ గ్గా మాట్లాడి వుండేది కాదు.