"జైజవాన్ కన్ స్ట్రక్షన్స్ అంటే.....షామీర్ పేట ఏరియా" ఏదో జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించాడు పీతాంబరం.
"అదేనండీ బాబూ.... ఆ ఫైల్ ని పాత గవర్నమెంట్ ఎందుక్జు ప్రక్కన పెట్టిందో నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫైల్ కి ఇప్పటికయినా మోక్షం కలిగించాలని విశ్వమోహన్ రావు గట్టిగా చెప్పమన్నాడు మీతో"
"అంటే....."
"అంటే ఏంటండీ గురూగారూ..... మీ రూమ్ లో గాడ్రేజ్ బీరువాలో రెండో బ్లాక్ లో ఉన్న ఆ ఫైల్ మీద సెక్షన్ హెడ్ గా మీరొక సంతకం చేసేసి మినిష్టర్ గారికి పంపించేసారనుకోండి అక్కడ పని ఈజీగా అయిపోతుంది. మీ కష్టం ఉంచుకోంలెండి" నర్మగర్భంగా నవ్వాడు భుజంగపతి.
"ఏ ఫైల్ అయిన ఒరిజినల్ ప్రొసీజర్ లో వెళ్ళాలి తప్ప నేను రికమెండ్ చేయలేను. ఎందుకంటే....ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ ఫైల్.....మినిస్టర్ గారు అడిగితేనే ఆ ఫైల్ ని పంపించగలను తప్ప అంతకుమించి నేనేం చెయ్యలేను"
సీట్లోంచి లేచి నిలబడ్డాడు పీతాంబరం.
"అది కాదయ్యా మగడా! నీ మంచికే చెపుతున్నాను విను. నీకు పిల్లా పాపా వున్నారు. ఎదిగిన కూతురు వుంది. ఇంకా అయిదేళ్ళలో రిటయిర్ అవుతున్నారా లేదా.... చూసి చూడనట్లు చిన్న సంతకం చేశారనుకో మినిష్టర్ కూడా ఏం మాట్లాడడని నీకు తెల్సు. ముప్పై ఏళ్ళ నీ సీనియారిటీ అంతకు మించిన నీ సిన్సియారిటీ"
"అంటే ఇన్నాళ్ళూ చెయ్యని వెధవ పని ఇవాళ చెయ్యమంటున్నావా? నువ్వనుకునే మనిషిని నేను కాను__అయామ్ సారీ__నేనిలా అన్నానని ఆ విశ్వమోహనరావుతో చెప్పు" కోపంగా ముందుకు నడిచాడు పీతాంబరం.
గబా గబా ముందుకు నడిచి పీతాంబరం మొహంలోకి తీవ్రంగా చూస్తూ__
"మరొక్కసారి ఆలోచించు.... ఎందుకయినా మంచిది. రేపు ఇదే టైముకి ఫోన్ చేస్తాను" అని చెప్పేసి ముందుకు నడిచాడు భుజంగపతి.
పీతాంబరం ఒక్క క్షణం వెళ్ళిపోతున్న భుజంగపతి వేపు చూశాడు.
"నేను కుక్కలా కక్కుర్తిపడతాననుకున్నాడు ఇడియట్" అని సణుక్కుంటూ డిపార్ట్ మెంట్ వేపు నడిచాడాయన.
సరిగ్గా మూడున్నర గంటలకు ఆఫీసు నుంచి బయటపడి ఆర్ట్స్ కాలేజీ దగ్గరకెళ్ళి మయూషను స్కూటర్ మీద ఎక్కించుకుని అబిడ్స్ కెళ్ళారు.
* * * *
అబిడ్స్ లో షాపింగ్ ముగించుకుని స్కూటర్ పార్కింగ్ వేపు వస్తున్నపుడు మయూష క్లాస్ మేట్ నీలిమ, వాళ్ళన్నయ్యతో పాటు కలిసింది-
"సినిమాకి వెళుతున్నాం..... రా....." బలవంతం చేయడంతో-
"అయితే నే వెళతాను. నువ్వు సినిమా చూసి జాగ్రత్తగా ఇంటి కొచ్చెయ్" చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసాడు పీతాంబరం.
సూర్యాలో ఇంగ్లీష్ మూవీ-వార్ పిక్చర్ - బాల్కనీలో పదిహేను మందికంటే ఎక్కువలేరు.
సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.
మధ్యలో యధాలాపంగా తల తిప్పిన మయూష రెండో వరసలో దృశ్యాన్ని ఆసక్తిగా చూడసాగింది.
ఒక ఆడ, ఒక మగ ప్రేమికులో, దంపతులో తెలియడము లేదు.
అతను ప్రేమగా ఆమె భుజమ్మీద చెయ్యి వేసి దగ్గరగా లాగుతుంటే ఆమె అభ్యంతరం చెపుతోంది.
"ష్.... ఎవరయినా చూస్తారు" సన్నగా ఆమె మాటలు విన్పిస్తున్నాయి.
"వార్ సినిమాలో ఎవరూ తెర వేపు తప్ప పక్కనున్న వాళ్ళ వేపు చూడరు"
"అందుకేనా ఈ సినిమాకు తీసుకొచ్చింది"
"మొద్దావతారానికి ఇప్పుడర్ధమైందన్నమాట" నవ్వుతూ అతను ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.
"చాల్లెండి.....సినిమా చూడండి...."
"ఈ సినిమాను నేను కాలేజీ రోజుల్లో పదిసార్లు చూసాను" అన్నాడతను తిరిగి ఆమె వేపుకి జరుగుతూ.
"ఇక్కడ బాగుందండీ" ఆమె నెమ్మదిగా బతిమాలుతోంది.
"నేను నా భార్యను ముద్దు పెట్టుకుంటున్నాను. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నానా"
మామూలుగా ఏదో అనబోయి తల పక్కకు తిప్పిన ఆ వ్యక్తి వెనక సీట్లోంచి తమవేపే చూస్తున మయూషణు చూసి సిగ్గుపడిపోయి భార్య భుజమ్మీద నుంచి చేతిని తీసేసాడు.
ఈసారి సిగ్గుపడడం మయూష వంతయింది. చేతిలోని చిన్న కర్చీఫ్ తో ఆమె నుదుటును పట్టిన చెమటను తుడుచుకుంది.
భర్త సడన్ గా చెయ్యి తీసివేయడంతో ఆ భార్యకి ఏమీ అర్ధంకాలేదు.
విచిత్రంగా అతని కళ్ళలోకి చూసింది.
"ఏంటి సడన్ గా మూడే మారిపోయిందా?" నవ్వుతూ అంది ఆమె.
"కా..... కాదు.... తెర వేపు చూడు.... అద్భుతమైన సీన్ వస్తుంది. అందుకని...." ఓరకంట చీకటిలో వెనక వేపుకు చూస్తూ అన్నాడు భర్త.
ఆ మాటకు మయూషకు నవ్వొచ్చింది.
"ఏంటా సీన్" అడిగింది భార్య.
"వార్ సీన్" చెప్పాడు భర్త. ఆ భార్య అలాగే తెరవేపుకు సీరియస్ గా చూస్తోంది.
తెర మీద అకస్మాత్తుగా ఇంటర్వెల్ అనే స్లయిడ్ ప్రత్యక్షమవడంతో ఆ భార్య భర్త వేపు అయోమయంగా చూసింది.
మయూషకు ఎంత ఆపుకుందామనుకున్నా నవ్వాగలేదు. పెద్దగా నవ్వేసింది.
అలా నవ్వుతున్న మయూష వేపు నీలిమ, వాళ్ళన్నయ్య విచిత్రంగా చూసారు.
* * * *
భోజనం చేసాక టీ.వీలో వార్తలు చూసాక, వదినతో ఏవో కబుర్లాడి తన రూమ్ లో కెళ్ళిన మయూష నోట్స్ రాసుకోవడానికి ఉపక్రమించింది.
కానీ ఏ మాత్రం రాయలేకపోయింది.
సినిమా హాల్లో చూసిన ఆ భార్య భర్తలే గుర్తుకొస్తున్నారు.
అదే సమయంలో పక్కింటి గాయత్రి, ఆమె భర్త గుర్తుకు వచ్చారు.
అందరూ పెళ్ళయిన వాళ్ళే.
ఎందుకూ ఈ రహస్య శృంగారం కోసం వెంపర్లాడుతున్నారు?