అతని మనస్సుకి అతని మనస్సు కనపడింది. ఆ మనస్సులో ఒక పెద్ద విద్యుత్తు ఉంది. అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు ఉన్నాయి. చక్రాలు గిర్రున తిరుగుతున్నడైనమో వుంది. మనిషిలో ఉండే 'అహం' అది. నరుడి పతనానికి, ఔన్నత్యానికీ, పరిశ్రమకీ, పరిణామానికీ కారణభూతమైన మూలశక్తి అది. అలెగ్జాండరునీ, గజనీనీ, నాదిర్షానీ సముద్రాలూ, భూములూ, పర్వతాలూ దాటించిన బలీయ స్వభావం అది. జిన్నా మనస్సులో ఉన్న భయంకర పరమాణువుని చూసి యిలా అన్నాడు.
"నీ భావం నాకు వద్దు. నీ భావం అనేకమందిని చంపింది. నీ భావం అబద్ధం, కృత్రిమం. నిజమైనా కూడా నాకువద్దు. నేను అందరితోనూ నిజం చెప్పేస్తాను. నాకు అలసట కలుగుతోంది. ఇంక నాకు శాంతి కావాలి. నాకు మైత్రి కావాలి"
పరమాణువుకు కోపం వచ్చింది. 'అహం' ఎర్రగా ఎదురుతిరిగింది. డైనమో చక్రాలు గిర్రున తిరిగాయి. తీగలు టకటకమని కదిలాయి. మనస్సు అంతా భరింపరాని వేడితో, మంటతో నిండిపోయింది. జిన్నా హడలిపోయాడు. తల వంచాడు.
జిన్నా కళ్ళు తెరిచాడు. ఒక అబద్దాన్ని నిజం అని చెప్పి నమ్మించవచ్చును. తర్వాత ఆ అబద్దం అబద్దమేనర్రోయ్ అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఇంక దారి లేదు. నాయకుడెప్పుడూ నాయకుడులాగే ఉండాలి. అలా ఉండకపోతే నాయకుడినే చంపేస్తారు. సాంఘిక మతపరమయిన ఒక మూర్ఖతని తానూ తల ఒగ్గాలి చివరికి. నాయకుడు అత్రానాన్ని అభివృద్ధి చెయ్యాలి. అజ్ఞానం బలమైనది. జ్ఞానం చురుకైనది.
పత్రికా విలేఖరులు కిటికీల దగ్గర మూగి 'సందేశం' యిమ్మని ప్రార్ధించారు. సంతృప్తిలేని ధీమాతో, అసహజమైన చిరునవ్వుతో జిన్నా యిలా అన్నాడు. "నా భావం నశించదు. నా భావాన్ని రథంలా పరుగెత్తించండి"
రథం పరుగెత్తింది. బెలూచిస్థాన్, పంజాబు, బెంగాల్, అస్సాం భూములమీద రథం పరుగెత్తింది. జిన్నా అద్దంలో చూచుకున్నాడు. అద్దంలో జిన్నచాలా గొప్పవాడు. తన వెనకాల పదికోట్లమంది మహమ్మదీయులున్నారు. పదికోట్లమంది మనస్సుల్లో తన భావం విద్యుత్తులా మెరిసింది. వానలా కురిసింది. కొండగుహలా ప్రతి ధ్వనించింది. తానొక ప్రాణి కాదు. విచిత్రం కాదు. ఒక మనస్సు.
"ఆయా!" అని పిలిచాడు జిన్నా
"చిత్తం ప్రభూ" అంది ఆయా.
"ఎవరివి ఆ అరుపులు? ఏఁవిటి ఈ గదిలో నన్ను చుట్టబెట్టుకుంటున్నాయి?" అని అడిగాడు.
ఆయా మాట్లాడలేదు.
జిన్నా అద్దంలో తన గుండెని చూశాడు. మళ్ళీ "ఆయా" అన్నాడు.
"చిత్తం ప్రభూ" అంది ఆయా.
"ఈ రక్తపు మరకని చెరిపెయ్యి" అన్నాడు గుండెని చూపిస్తూ.
"అది చెరగదు ప్రభూ" అంది ఆయా.
జిన్నా ఉలిక్కిపడ్డాడు. "చెరగదా?" అని తిరిగి ప్రశ్నించాడు.
తొందరగా కోటు తొడుక్కున్నాడు. కోటు గుండీలు పెట్టుకున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడికన్నా గొప్పవాడు. జిన్నా వెనుక పదికోట్లమంది మహమ్మదీయుల, ఇరవైకోట్ల కళ్ళల్లో.....