Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 11

    ఎంత దవుర్జన్యం! మత పిశాచం తాండవిస్తూందనుకున్నాడు పాణి. హోటలు రావడంతో దిగిపోయాడు. స్నానాదులు ముగించుకొని సుల్తాన్ బజార్లో ఉన్న మాడపాటి వారింటికి వెళ్ళాడు పాణి. ఏవో కాగితాలు చూసుకుంటున్నారు. హనుమంతరావుగారు. పాణి నమస్కారానికి ప్రతినమస్కారం చేసి "రాండి. కూర్చోండి" అని కుర్చీ చూపించాడు.
    కుర్చీలో కూర్చుంటూ "ఇవ్వాళ సుదినమండీ, మీ దర్శనం అయింది. మాది బెజవాడ, నా పేరు సారంగపాణి, నైజాంలోనే ఒక పల్లెలో సంగీతం చెప్పుకుంటున్నాను. ఇదే మొదటి తడవ హైదరాబాదు రావడం. ఇదేదో తురకదేశంలా కనిపిస్తూంది. తెలుగువారుగాని, తెలుగుదనంగాని మచ్చుకైనా కనిపించదు. మీ పేరు విన్నాను కాబట్టి దర్శనం చేసుకోవడానికి వచ్చాను" అన్నాడు.
    "సారంగపాణిగారూ, తెలుగు మాట్లాడేవారంతా ఒకే సంతతికి చెందినవారు. వారి ఆచారవ్యవహారాలు, నాగరికత, సంస్కృతి, స్వభావం అన్ని ఒకలాంటివే. అయితే రాజకీయ కారణాలవల్ల తెలంగాణలోని తెలుగువారు చీలిపోయారు. తెలంగాణం అనే ప్రాంతంలో ఉన్న తెలుగువారిని ఆరువందల సంవత్సరాలనుండి తురుష్కులు అవిచ్చిన్నంగా పాలిస్తున్నారనే విషయం తాము గుర్తుంచుకోవాలి. రెండవ ప్రతాపరుద్రుని తరవాత ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూరాజు లేడు. ఇంతకాలంగా ఉర్దూయే రాజభాషగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వం వారిది కావడం మూలాన వేషభాషల్లో మార్పురావడం సహజం.
    "కొంత పశ్చిమాన మహారాష్ట్రుల్తోనూ, కొంత పశ్చిమాన కర్ణాటకల్తోనూ సంపర్కం ఉంది మాకు. వారి ప్రభావం కూడా మా వేషభాషల మీద పడింది. మహారాష్ట్ర ప్రభావంగల నిజామాబాదు భాష ఇలా ఉంటుంది:
    "ఇదేమా మాయి. రొండు దివ్యలు ఆయె సాళెకు పోవు. ఏనుగు సొండెము ఏదిరా? కాకకు మౌశీకి భేటీ కాలేదు" - అంటే, ఇదేమిరా నాయనా, రెండు దినములాయెను బడికిపోవు..ఏనుగుతొండము ఏదిరా? చిన్నాయనకు మేనత్త దర్శనము కాలేదు.
    "ఇక కర్ణాటక ప్రభావంగల మహబూబు నగరపు భాష. "మాసన్న పిల్లకు పెసర బేడలు పట్టవు. దొడ్డు పిల్ల బేకైనంత తింటది." అంటే "మా చిన్నపిల్లకు పెసరపప్పు ఇష్టంలేదు. పెద్దపిల్ల పొట్టపగల తింటుంది" అని అర్ధం.
    "రాజకీయభాష ప్రభావం పడిన భాష : "ఈ మొకద్దమాల చలాయించిన కార్రవాయంత జాలీది సాహేబుజిల్లా జాయె మౌఖ్ఖకుపోయి తహకీ కాతుచేసి కైఫియతు రాసినాడు కదాకే పరీఖు దావాబిల్కులు నాజాయజు" అంటే "ఈ వ్యవహారములో నడచిన చర్య అంతా తప్పు సృష్టి జిల్లా తాలూక్దారుగారు ఆ స్థలమునకు పోయి విచారణ చేసి నివేదిక వ్రాసినది ఏమనగా, "కక్షిదారు చేసిన వాదము పూర్తిగా.' అక్రమమైనది" అని అర్ధం."
    "అయితే తమ తెలుగు కొంత కాలానికి ఉర్దూగా మారేట్లుంది. ఆంధ్రోద్యమం ఎలా ఉందండీ?"
    "రాజ్యం తురుష్కులది. ఉర్దూను అభివృద్ది పర్చడం వారి లక్ష్యం. అందుకే 3-10-1918న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. ఇక్కడ నాల్గవ తరగతి వరకు మాత్రమే తెలుగు, ఏడవ తరగతి దాకా తెలుగు రెండవ భాషగా ఉంటుంది. ఆ తరువాత చదువంతా ఉర్దూలోనే. విద్యావంతుల సంఖ్య వెయింటికి 82. అందులోనూ తురకల్లో 59 మంది కాగా, హిందువుల్లో 23 మంది. ప్రజాహిత కార్యాల్లో అభిరుచి కలవారంతా మహారాష్ట్రులే.
    "తెలుగు వారిలో విద్యాధికుడు ఎక్కడైనా వెక్కిరించినట్లు కనిపించినా, హైద్రాబాద్ తన నగరమనీ, తెలుగు తన మాతృభాషా అనీ సాధారణంగా భావించడు. అతని వేషభాషల్లో ఆంద్రత్వం వెదకాల్సి ఉంటుందని చెపితే సరిపోతుంది. తెలుగువారికి తమ భాషను గుర్తుకు తేవాలనే ఉద్దేశ్యంతో 1-9-1901 నాడు రెసిడెన్సీబజార్ లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించబడింది. అందుకు కారకులు నాయని వెంకటరంగారావు బహద్దూర్ గారు, కొమర్రాజు లక్ష్మణరావుగారు, రావిచెట్టు రంగారావుగారు.
    "11-11-1922న కార్వే పండితుని అధ్యక్షతన నిజాం రాష్ట్రసంఘ సంస్కార మహాసభ సమావేశమైంది. అధ్యక్షులు కొంత ఇంగ్లీషులోనూ, కొంత మహారాష్ట్రంలోనూ మాట్లాడితే తెలుగువాళ్ళమైన మాకు మనస్తాపం కలిగింది. శ్రీ అల్లంపెల్లి వెంకట్రామారావుగారు ఒక ఉపన్యాసం తెలుగులో ఇవ్వపోగా, సభాసదులు, ముఖ్యంగా మహారాష్ట్రులు - చప్పట్లు చరిచి ఉపన్యాసకుడు ప్రసంగం ఆపుచేసి కూర్చొనేట్లు చేశారు. తెలుగువాళ్ళమైన మాకు మనస్తాపం కలిగింది. శ్రీ అల్లంపెల్లి వెంకట్రామారావుగారు ఒక ఉపన్యాసం తెలుగులో ఇవ్వపోగా, సభాసదులు, ముఖ్యంగా మహారాష్ట్రులు - చప్పట్లు చరిచి ఉపన్యాసకుడు ప్రసంగం ఆపుచేసి కూర్చొనేట్లు చేశారు. తెలుగువాళ్ళు సభ ముగియకముందే వెళ్ళిపోయారు. తెల్లవారి ట్రూపు బజారులో టేకుమాల రంగారావుగారి ఇంట్లో పదకొండుగురం ఆంద్రులం సమావేశమై నిజం రాష్ట్రాంధ్రజన సంఘం స్థాపించాం. నిజాం రాష్ట్రంలోని తెలుగువారిలో పరస్పర సహానుభూతి కలిగించి, వారి అభివృద్ధి కోసం ప్రయత్నించడం, సంఘాలనూ స్థాపించడం దాని ముఖ్య ఉద్దేశ్యాలు."
    "అయితే రాజకీయ లక్ష్యాలేం లేవన్నమాట."
    "నిజాం రాష్ట్రపు రాజకీయాలు విచిత్రమైనవి. ఇక్కడ పోలీసులు రాక్షసుల్ని తలతన్నినవారు. 1919లో ఒక ఫర్మానా (రాజశాసనం) ద్వారా నిజాం నవాబు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలును విస్తరింపజేస్తే అందుకు కృతజ్ఞత తెలియజేయడానికి జరిగిన సభలే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సభలు, భారతదేశంలో వ్యాపించిన ఖిలాఫత్ ఉద్యమం హైదరాబాదుకు కూడా వ్యాపించి 20, 25 వేల మందితో బహిరంగసభలు జరగడం ఇక్కడ మామూలైపోయింది. హిందూ ముస్లిముల ఐక్యం బలపడ్డం చూచి ప్రభుత్వానికి కన్నుకుట్టింది. హిందువులతో కలిశారనే నేరానికి కొందరు ముస్లిం యువకుల్ని అరెస్టు చేసి మన్నునూరు పంపడం జరిగింది."
    "మన్ననూరంటే?"
    "నిజాం రాష్ట్రంలో రాజకీయ దోషులనూ విచారణ లేకుండా ఉంచే ప్రాంతం. అది మహబూబ్ నగరం జిల్లా అమరాబాద్ కొండల ప్రాంతంలో ఉంది."
    "తరువాత?"
    "ఖిలాఫత్ సమావేశాలను నిషేధించడమేకాక, ఒక ఫర్మానా ద్వారా బహిరంగసభలు జరుపరాదని ఆదేశించబడింది. హైదరాబాద్ రాజకీయ సంస్కరణల సంఘంవారు నగరంలో మహాసభ జరుపుకోడానికిగాను అనుమతినికోర్తె పదిసంవత్సరాల వరకు అవునని కాని, కాదని కాని జవాబు రాలేదు ప్రభుత్వం నుండి 1931 లో. ఆ సభలు బెరార్ లోని అకోలాలో జరిగాయి.
    "తర్వాత ప్రభుత్వపు పాక్షిక విధానాన్ని బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో కాశీనాధరావు వైద్యవంటి ప్రముఖులు హిందూ స్టాండింగ్ కమిటీ స్థాపించారు. 1932లో ఈ రాజ్యంలోని హిందువులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూందని తెలియజేస్తూ కరపత్రాలు అచ్చువేసి పంచిపెట్టారు. జనాభా లెక్కల్ని చూపి హిందువుల సంఖ్య ఈ రాజ్యంలో తగ్గుతూందని నిరూపించారు. ఈ సంఖ్యలు గమనించండి:
    1901లో                    జనాభాలో                 హిందువుల                  శాతం                   88.6
    1911లో                          ,,                             ,,                          ,,                      88.9
    1921లో                           ,,                            ,,                          ,,                      85.4
    1931లో                            ,,                           ,,                          ,,                      84.0
    "ప్రస్తుతపు నిజాం 1911లో గద్దెనెక్కాడు. అప్పట్నుంచి మాతాంతరీకరణం ఎక్కువకావడమే కాక, ఉత్తరదేశం నుండి ముస్లింల దిగుమతి కూడా ఎక్కువకాసాగింది. ఉద్యోగాలకు సంబంధించినంతవరకు 1931 లెక్కల ప్రకారం సైన్యంలో 51,149 మంది తురకలుంటే 6,495 మంది హిందువులున్నారు. ఉద్యోగాల్లో 58,188 మంది మహమ్మదీయులుంటే, 16,873 మంది హిందువులున్నారు. ఈ హిందూ ఉద్యోగస్తుల్లో వంశపారంపర్యంగా వచ్చే వతన్ దార్లయిన గ్రామాధికార్లు కూడా చేరి ఉన్నారు. వారిని మినహాయిస్తే హిందూ ఉద్యోగస్తుల సంఖ్య నామమాత్రం అవుతుందని భయపడి ప్రభుత్వం వారినికూడా ఈ సంఖ్యలో చేర్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు ప్రభుత్వ పాక్షిక విధానాన్ని గురించి సంపాదకీయాలు రాశాయి."
    'అయితే తమకా ఉద్యమాలతో సంబంధం లేదా?' పాణి ప్రశ్నించాడు.
    "నన్ను ఆ ఉద్యమాలలో పాల్గొనమన్నారు. కాని నేను అంగీకరించలేదు. ఎంచాతంటే అవి మతపరములైన ఉద్యమములు. మతపరాలైన ఉద్యమాలంటే మహాత్ముడు హర్షించడు. ఆయనకు నచ్చని పని చేయడం నా అభిమతం కాదు. అందుకే ఆంద్ర జనసంఘాన్ని మతపరంగాకాక భాషాపరంగా ఏర్పాటు చేశాం."
    "ఆంధ్రోద్యమం విషయం మాట్లాడుతూ మతోద్యమం వైపు మళ్ళాం. ఆంద్రజన సంఘాన్ని గురించి శలవిచ్చారు కారు."
    "ఆంధ్రజన సంఘాలు నగరంలో ఉపన్యాసాలు, సమావేశాలు ఏర్పాటు చేసేవి. దీనివల్ల తెలంగాణలో జాగృతి కలిగింది. అనేక చోట్ల ఆంద్రజన సంఘాలు ఏర్పాటైనాయి. వీటి అన్నింటికి ఒక కేంద్ర సంఘం ఉండాలనే ఉద్దేశంతో 923లో హనుమకొండలో జరిగిన ప్రతినిధుల సభలో 'ఆంద్రజన కేంద్ర సంఘం' స్థాపించడం జరిగింది. గ్రంధాలయాలు,పాఠశాలలు,వర్తక సంఘాలు స్థాపించడం, లఘు పుస్తకాలు ప్రకటించడం ఈ సంఘపు లక్ష్యాలు."
    "రాజకీయాల జోలికి పోకుండా మడికట్టుకొని కూర్చున్న మీ ఉద్యమాన్ని ప్రభుత్వం సాఫీగా సాగనిచ్చిందా?"
    "బ్రిటిషిండియాలోని ప్రజలు మహాత్ముని నాయకత్వాన స్వరాజ్య సాధనకు పోరాటం సలుపుతూ, ద్వంద్వ పరిపాలన సాధించి, రాష్ట్రాలలో ప్రజామంత్రివర్గాలు స్థాపించకోబోతున్న సమయంలో నిజాం రాష్ట్రంలోని ప్రజలలో ఎట్టి రాజకీయ చైతన్యంలేదని ఒప్పుకొనక తప్పదు. ఒప్పుకునేప్పుడు సిగ్గుతోచక మానదు. కాని రాజకీయాల జోలికి పోకుండా మడికట్టుకున్నా మమ్ములను ప్రభుత్వం ఎన్ని హింసలు పెట్టిందో తెల్సుకుంటే ఆశ్చర్యపోతారు.అంత జాగ్రత్తగా ఉద్యమం నడుపుతూ ఉండినప్పటికి పాలకోడేటి వేంకట రామశర్మ లాంటి కొందరు తెలుగు సోదరులే "అగ్నికి కట్టెలకు" ఎట్టి సంబధమో, ఆంద్రజన సంఘమునకు రాజకీయములకు అట్టి స్నేహము" అని నీలగిరి పత్రిక వంటివాటిలో వ్రాశారు. దాంతో ప్రభుత్వాధికారులకు అనుమానం కలిగి కార్యకర్తలను ఎన్నో చిక్కులపాలు చేశారు.   

 Previous Page Next Page