Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 12

    ఎనిమిదీ ఏభై అయిదు నిమిషాలు!

    __సరిగ్గా అదే సమయంలో "అ...మ్....మ్...మ్..."  అని శబ్దం వినబడగా, తలతిప్పి చూశాడు.

    పక్క రూమ్ లోంచి వచ్చిన ఆయా చేతుల్లో తేజ!

    తండ్రిని చూడగానే చేతులు చాస్తూ-

    ఒక్క ఉదుటున ముందుకెళ్ళి కొడుకుని అందుకుని, గుండెలకత్తుకున్నాడు!

    అదికవి నన్నయ్య చెప్పిన-

    పుత్ర గాత్ర పరిష్వంగ సుఖమది! ప్రపంచంలో అతి అద్భుతమైన మాధుర్యం, ఆనందం కన్నబిడ్డల్ని కౌగలించుకున్న స్పర్శలోనే వుంటుందాని, అ స్పర్శ విలువ తల్లిదండ్రులకే తెలుస్తుందని దానర్ధం.

    అయిదు నిమిషాల తర్వాతః అడిగింది సుదేష్ణాదేవి.

    "కొడుకును చూస్తూ, పెళ్ళాన్ని మరిచిపోయే తండ్రిని నేనెక్కడా చూడలేదు - రేపు వీడు మనతో చెప్పకుండా, ఎక్కడికైనా వెళ్ళిపోయాడనుకోండి_ అప్పుడేం చేస్తారు?"

    "నా కొడుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళడు- నా చివరి ఊపిరి పోయే వరకూ, నా చిన్నారి తేజ చేతిని నేను వదలను!" గంధం రంగుతో మెరుస్తున్న, ఆ చేతుల్తో తన మీసాలను రాసుకొంటూ అన్నాడు కాళేశ్వర ప్రసాద్.

    ఆస్తి, ఐస్వర్యం, అధికారం, వందలాదిమంది సేవకులు_వీటన్నిటికన్నా మిన్న తేజ!

    చిన్నపిల్లాడిలా ఆ కొడుకుతో ఆడుకుంటున్న ఆ తండ్రిని చూసి, ఆ తల్లి మనసు గోదావరిలా ఆనందంతో పొంగిపోయింది.

    అక్కడకు కొంచెం దూరంలో__

    మసక చీకట్లో వరండా మీద అపురూపమైన కొడుకుతో, తన్మయతతో ఆడుకుంటున్న ఆ తండ్రిని, ఆ దృశ్యాన్ని రెండు కళ్ళు ఈర్ష్యగా, అసూయగా చూస్తున్నాయి.

    ఆ కళ్ళలో ద్వేషం భుగ భుగమని మండుతోంది. ఆ కళ్ళలో క్రోధం నిగ నిగలాడుతోంది.

    ఆ కళ్ళు సత్తిపండువి!


                               ౦    ౦    ౦

    ముషీరాబాద్ సెంట్రల్ జైల్!

    ఎక్కడి ఖైదీలక్కడ- యెవరి పనుల్లో వారున్నారు.

    "ఒరే! ఆడెవడో యేళ్ళి, ఆకాశంలో నడిచి, చంద్రమండలాన్ని కనిపెట్టాట్ట- అదికాదురా అసలు గొప్ప!- ఆ బ్రిటీషోడి బుర్రే బుర్ర!- జైల్లో ఇన్ని ఫెసిలిటీస్ కనిపెట్టాడా- ఆ ఫుడ్డు ఎంత బాగుందిరా!" మూతి తుడుచుకుంటూ అన్నాడు వీర్రాజు.

    "మనకు చికెన్ రోజూ పెట్టరా?" బీడీ వెలిగిస్తూ అన్నాడు పోతురాజు.

    "చికెన్లూ, బిర్యానీలు మనకెందుకు పెడతారూ?- పెద్ద పెద్ద గజదొంగలకు పెడతార్రా! శోభరాజ్ గారని- మన పెద్దన్నయ్య తీహార్ జైల్లో ఉన్నాడు. ఆడికి పెడతారు. చికెనేంటీ- మందూ, కిచ కిచలాడ్డానికి మగువలు, ఏ.సీ., టీ.వీ.__ ఎక్స్ ట్రా- వగైరా-"

    "ఆడిలా ఆ గౌరవం మనకు రావాలంటే, ఏం చెయ్యాలిరా?" తన్మయత్వంగా అడిగాడు సేతురాజు.

    "ఇంకా పెద్ద దాదాలమై పోవాలి! ఆ ఒంటేద్దులా ఉమ్తాడే- ఆ జైలర్ ఆందోళనరావ్- ఆడని మనం కాల్చుకు తినాలన్నమాట!"

    "ఎంత తినేసినా, మనం ఇక్కడుండేది - కొన్ని రోజులేగా! ఈ చిన్న శిక్షను పెద్ద శిక్షగా మార్చుకోవాల్రా!"
    "ఎలా?"
    "అయిడియాల్లో నువ్వు అఖండుడివి కదా- నువ్వే ఒక అయిడియా వెయ్యరా!" వీర్రాజుని అడిగాడు పోతురాజు.
    "వేస్తా-వేస్తా- టైముకి చూసి- బాంబులాంటి ఐడియా వేస్తా. అప్పుడు ఈ జైలర్ ఆందోళనరావుగాడి దిమ్మ తిరిగిపోద్ది."
    సరిగ్గా అదే సమయమ్లో నక్క, గాడిద కలిసి అరిచినట్టుగా ఓ కూత వినబడేసరికి ముగ్గురూ ఎలర్టయిపోయారు.

    "ఎవడక్కడ- నా పేరుని డిస్కషన్ లోకి లాగుతున్న దెవడక్కడ?" అరుస్తూ పిట్టలాంటి శరీరానికి యూనిఫార్మ్ తగిలించుకున్నట్టుగా ఉన్న వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఆందోళనరావు...జైలర్.

    "డిస్కషన్ కాదు బాసూ - మీ నేమ్ వాల్యూ గురించి మాట్లాడుకుంటున్నాం ఇంత చండాలమయిన నేమ్, మరెవరూ పెట్టుకోరుగదా....గట్స్ ఉన్నాయిగనకే గురువుగారు తగిలించుకున్నారని అనుకుంటూ ఆనందిస్తున్నామంతే" హుషారుగా అన్నాడు వీర్రాజు.

    "ఎస్-గట్స్- ఐ హేవ్ గట్స్- యూ నో ఫ్రీడమ్ ఫైట్.

    "తెలీదు సార్" వినయంగా అన్నాడు సేతురాజు.

    "స్వాతంత్ర్య ఉద్యమం అన్నమాట, అప్పుడు. నేను ఈ విశాలమయిన భూమ్మీద దబ్ మని పడ్డాను- నేనెక్కడ పుట్టానో తెలుసా!"

    "తెలీదు సార్!"

    "తెలుసుకొ, నా గురించి ఖైదీలందరూ తెలుసుకోవాలి. తెల్సుకుని జ్ఞానులవ్వాలి. నేను పోర్ బందర్ జైల్లో  పుట్టాను. జైల్లోనే పెరిగాను__జైల్లోనే చదివాను. నన్ను జైల్లోంచి పంపించెయ్యాలని చాలామంది గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి వాళ్ళందరూ కుట్రలు చేశారు. అయినా నేను జైలుని వదల్లేదు- నా పట్టుదలను చూసిన గవర్నమెంట్ జైలర్ జాబ్ ఇచ్చేసి, ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేసింది. మీరు ఎర్లీగా జైల్లోంచి వెళ్ళిపోతారు కాబట్టి, నా గురించి అందరకూ చెప్పండి" ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు ఆందోళనరావు.

    ముందుకెళ్తూన్న ఆందోళనరావుని వెనక్కిపిల్చాడు వీర్రాజు.

    "ఏమిటి?"

    "మీలాంటి మహాత్ముడి కాళ్ళదగ్గరే పదికాలాలపాటు పడుండాలని మా ముగ్గురికోరిక" మిగతా ఇద్దరివేపూ కన్నుగోడుతూ అన్నాడతను.

 Previous Page Next Page