కస్టమ్స్ షాపులో అతి సున్నితమైన పిల్లల నోటిశబ్దాలను స్పష్టంగా రికార్డ్ చేసే 'ఇంపోర్టెడ్ వాయస్ రికార్డర్' ను కొన్నాడతను.
తేజ చిన్నప్పటినుంచీ, ఊహవచ్చేవరకూ ప్రతిమాటను రికార్డ్ చేసి బర్త్ డే గిఫ్టుగా ఇవ్వాలనేది కాళేస్వరప్రసాద్ ఆశ!
ఇప్పటినుంచే తేజను ఎక్కడ పెంచాలో, ఎలా పెంచాలో అలోచిస్తున్నాడతను.
తన తండ్రి తేజేశ్వరప్రసాద్ జమిందారుగా మెలిగిన వ్యక్తి.
ఆ రోజుల్లో ఆయన లక్షల్ని సంపాదిస్తే, వాటిని కోట్లాది ఆస్తిగా మార్చింది తను.
వీటన్నిటినీ ఏకైక వారసుడు తనకు లేకలేక కలిగిన తేజ-
తేజ భవిష్యత్తును గురించి ఆలోచించడంలో చాలా తాదాత్మ్యతను పొందుతాడు కాళేశ్వరప్రసాద్.
స్మూత్ గా, ఏమాత్రం డిస్ట్రబెన్స్ లేకుండా వెళ్తున్నకారు సడన్ గా ఆగిపోవడంతో చికాగ్గా మిర్రర్ లోంచి చూశాడు కాళేశ్వరప్రసాద్.
పంజగుట్ట దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది!
చాలా అసహనంగా ఉంది.
"చీఫ్ మినిస్టర్ ఇంటికెళుతున్నట్టున్నాడు సర్-" చెప్పాడు రమాకాంత్.
"దానికోసం ట్రాఫిక్ జామ్ చెయ్యాలా- మనవాళ్ళు పవర్ ని మిస్ యూజ్ చేస్తారు-" ఆగ్రహంతో అన్నాడతను.
సరిగ్గా నాలుగు నిమిషాల తర్వాత కారు ముందుకు దూసుకెళ్ళింది. బంజారా హిల్స్ వేపు మలుపు తిరిగింది.
సరిగ్గా దర్గా ప్రాంతంలో, ఏదో ఊరేగింపు. డ్రైవర్ ఆ ఊరేగింపును తప్పించటానికి లెప్టువేపు టర్న్ తిప్పి పోనిచ్చాడు- సందుల్లోంచి కారెళ్తోంది.
మళ్ళీ చేతి గడియారం చూసుకున్నాడు కాళేశ్వర ప్రసాద్.
చిన్నారి తేజ, ఉయ్యాల ఎక్కి నడుపుకోబోయేలోపు వచ్చేస్తానని సుదేష్ణాదేవితో చెప్పిన విషయం జ్ఞాపకం వస్తున్నప్పుడల్లా అతనిలో బ్లడ్ ప్రజర్ పెరుగుతోంది.
కాళేశ్వర ప్రసాద్ కి టైమ్ సెన్స్ ఎక్కువ!
తేజ నవ్వు, తేజ ముఖం, తేజ కళ్ళు- ఆ కళ్ళల్లో నవ్వు, బోసి నోరు...తనొకసారి కొత్త సూట్లో, అమెరికన్ డెలిగేట్స్ మీటింగ్ కి వెళ్తున్న సమయంలో, ఆప్యాయంగా ఎత్తుకోగా- తన కోట్ మీద పాస్ పోసేయ్యడం, టైమ్ లేక అప్పుడు అలాగే తను వెళ్ళిపోవడం, తన కోటు మీద మచ్చ గురించి ఒక డెలిగేట్ అడగడం, తను నవ్వుకోవడం....ఆ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బిజినెస్ లో సడన్ గా కోటి రూపాయలు వచ్చిన వాడిలా ఆనంద పడిపోతాడు కాళేశ్వర ప్రసాద్.
కారు బ్రేక్ తో, అతను డ్రైవర్ వేపు చూశాడు. చుట్టూ దట్టమైన చీకటి.
హెడ్ లైట్స్ కాంతిలో- దూరంగా డెడ్ ఎండ్ బోర్డు కన్పిస్తోంది. దానికితోడు కారు బురదలో కూరుకుపోయి, ముందుకు కదలడంలేదు.
అసహనం, కోపం రెండూ కలగలసిపోయాయి.
"డెడ్ ఎండ్ రోద్దని తెలీదా?" డ్రైవర్ని ప్రశ్నించాడు.
"లేదు సర్ - ఇక్కడ ఇదివరకు ఈ బోర్డు లేదు!" డ్రైవరు భయం, భయంగా జవాబు చెప్పాడు.
"అసలే గతుకుల రోడ్డు- దానికితోడు డెడ్ ఎండ్...థర్టీ మినిట్స్ వేస్ట్....నెమ్మదిగా కారుని తోసుకుని రండి- నేను వెళ్తున్నాను!" సడన్ గా కాళేశ్వర ప్రసాద్ డోర్ తెరచుకుని, దిగిపోతాడని ఊహించని పి.ఎ. రమాకాంత్ "సారీ సర్!" అన్నాడు తనలో తాను గొణుక్కుంటున్నట్టుగా.
ఆ మాటల్ని విన్పించుకోకుండా, మెయిన్ రోడ్డుకొచ్చి ఆటో ఎక్కి కూర్చున్న ఆ కోటీస్వరుడి వేపు మాటలు రాణి బొమ్మల్లా చూస్తున్నారు పి.ఎ. డ్రైవర్.
౦ ౦ ౦
ఆటోలోంచి దిగుతున్న కాళేశ్వర ప్రసాద్ ను నిర్ఘాంతపోతూ చూస్తూ సెక్యూరిటీ మిలట్రీ స్టయిల్లో సెల్యూట్ చేసి డోర్ తెరిచాడు.
వరసగా నుంచున్న సెక్యూరిటీ గార్డ్స్ సెల్యూట్ ను పట్టించుకోకుండా, ముందుకెళ్ళి పోయాడతను.
నేరుగా హాల్లోకి వెళ్ళాడు. హాల్లో చేతిలో తేజతోసహా, సుదేష్ణాదేవి ఎదురు చూస్తుంటుందని ఊహించిన కాళేశ్వర ప్రసాద్, ఆమె చేతిలో తేజ లేకపోవడంతో__
ఖిన్నుడయ్యాడు.
"తేజ ఏడీ?" భర్త మొదటి ప్రశ్న అదేనని ఆమెకు తెల్సు. చిన్నగా నవ్వుతూ గోడ గడియారంవేపు చేయి చూపించింది.
సరిగ్గా తొమ్మిదీ పదిహేను నిమిషాలు!
ఏం జరిగినా, ఎన్ని పనులున్నా టంచన్ గా తొమ్మిది గంటలకల్లా తేజను పడుకోబెట్టెయ్యాలని అతనెప్పుడో నిబంధన విధించాడు.
ఆశ్చర్యంగా తన చేతి వాచీవేపు చూసుకున్నాడు.
ఎనిమిదీ నలభై అయిదు నిమిషాలు మాత్రమే!
లక్ష రూపాయలు విలువచేసే, వజ్రాలు పొదిగిన ఆనిస్క్ చేతి వాచీ తప్పు తిరుగుతోందా?
సమ్ థింగ్ ఫ్రమ్ వేర్ మిశ్చిఫ్!
"నో-నో! దిసీజ్ రాంగ్- హాల్లో వాచీ తప్పు!" అంటూ గబగబా మేడ మెట్లెక్కి తేజ రూమ్ లో కెళ్ళాడు.
గోధుమ కలర్ బ్లాంకెట్ కప్పుకొని ఉయ్యాల్లో తేజ!
ముందుకెళ్ళి, ఆ బ్లాంకెట్ ని నెమ్మదిగా తొలగించి, అక్కడ కన్పించిన దృశ్యానికి పెద్దగా నవ్వాడు కాళేశ్వర ప్రసాద్.
ఉయ్యాల్లో వున్నది తేజ కాదు-తేజలాగే వుండే రబ్బరు బొమ్మ! లాస్ట్ ట్రిప్ లో అమెరికా నుంచి తేచాడది.
"హాల్లో టైమ్ ని మార్చేసి, నువ్వు నన్ను బోల్తా కొట్టించాలనుకున్నావు కానీ, డియర్- నువ్విక్కడ పప్పులో కాలేసావ్!" అంటూ అక్కడున్న మిక్కీ మౌస్ బొమ్మలో ఫిట్స్ చేసిన గడియారం వేపు చూపిస్తూ అన్నాడతను నవ్వుతూ.