"కాళ్ళదగ్గరే ఉండడం మీకిష్టమన్నమాట. సెల్ లో ఉండరన్న మాట - కానీ పెట్టీకేస్ మీద వచ్చి వెళ్ళిపోయే దొంగలుమీరు. నా దగ్గర శిష్యరికం చెయ్యాలంటే పర్మనెంట్ జైలుశిక్ష, యావజ్జీవ ఖయిదీలై ఉండాలి."
"పర్మనెంట్ జైలుశిక్ష పడాలంటే, ఏంచెయ్యాలి గురువుగారూ?"
ముగ్గురివేపూ ఎగాదిగా చూశాడు ఆందోళనరావు.
జైల్లో ఎవర్నయినా మర్డర్ చేసేసి, జైల్లోంచి సొరంగం తవ్వుకుని బయటకు వెళ్ళిపోయారనుకోండి_ ఇట్స్ ఏ సీరియస్ కేస్....ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి పరిస్థితే మీకొస్తే, ఎవర్ని మర్డరు చేస్తారు?" చిత్రంగా అభినయిస్తూ అన్నాడు ఆందోళనరావు.
"మిమ్మల్నే" ముగ్గురూ ఏక కంఠంతో అనేసరికి, ఢామ్మని కింద పడిపోయాడు ఆందోళనరావు.
౦ ౦ ౦
ఉదయం పది, యాభయి నిమిషాలయింది.
మెయిన్ బిల్డింగ్ కి కొంచెం దూరంలోవున్న రెసిడెన్స్ ఆఫీస్ రూమ్ లో పి.ఎ. రమాకాంత్, జి. ఎమ్. అరుణాచలం తదితరులు వెయిట్ చేస్తున్నారు.
సరిగ్గా పదిగంటలకల్లా ఇంటిలోంచి బయటికొచ్చే కాళేశ్వరప్రసాద్ టైమ్ సెన్స్ తప్పడం ఆశ్చర్యంగా వుంది రమాకాంత్ కి.
"అరుణాచలంగారూ! మన గెస్ట్స్ పదకొండు గంటలకల్లా వచ్చేస్తారు కదా! మీరు వార్ని ఎంగేజ్ చేస్తుండండి. సార్ ని తీసుకుని నేనొచ్చేస్తాను" పి.ఎ రమాకాంత్ చెప్పాడు.
"గుడ్ ఐడియా! నేను వెళతాను మరి" అరుణాచలం గబ గబా వెళ్ళిపోయాడు.
సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ లోంచి వచ్చిన ఆయాను అడిగాడు రమాకాంత్.
"మేడమ్ ఎక్కడున్నారు ఆయా."
"గుడికెళ్ళారు కదా!
"మరి అయ్యగారూ?"
"బాబుని ఆడిస్తున్నారు."
"అయ్యగారు బాబుని ఆడించడమా! ఈ టైమ్ లోనా?" నిర్ఘాంతపోయాడు రమాకాంత్.
౦ ౦ ౦
"ఏడవకు, ఏడవకు వెర్రి నాగన్నా!
ఏడిస్తే నీకళ్ళు నీలాలు కారు-
నీలాలుకారితే- నే జూడలేను-నేజూడలేను!" ఆపాట ఫినిష్ చెయ్యడానికి, చివరి చరణం నోటికిరాలేదు కాళేశ్వరప్రసాద్ కి.
"వీడ్ని తీసికెళితే- అక్కడందరూ రకరకాల ప్రశ్నలు, హడావుడి పైగా దిష్టికూడాను. అరగంటలో వచ్చేస్తాను- నేను రాగానే మీరు ఫ్యాక్టరీకెళ్ళిపోదురుగాని" తేజను, అతని చేతిలో పెట్టేసి పూల సజ్జతో బయటికెళ్ళిపోయింది సుదేష్ణాదేవి.
పది నిమిషాలసేపు బాగానే ఆడుకున్నాడు తేజ__ ఆ తర్వాత మొదలయింది అసలు కథ. ఏడుపు మొదలెట్టాడు. కాసేపు సముదాయించి పాలసీసాను నోటికందిస్తే విసిరికొట్టాడు తేజ.
"ఏంకావాలి- నీకు- గాగుల్స్, వాచీ, టై, బ్రౌనీ చూడు. బ్రౌనీ తోక ఎంత వంకరగా ఉందో- ఈ తోకకి మనం ఇప్పుడు ఒక స్కేలు కట్టి, స్ట్రయిట్ గా చేద్దాం- సరేనా" అంటూ రబ్బర్ బ్యాండుతో స్కేలుని కుక్కతోకకి కట్టాడు కాళేశ్వరప్రసాద్.
ఒక్క నిమిషం ఆ తోకవేపు, ఆ స్కేలువేపు చూసి తేజ, చేత్తో ఆ స్కేలుని లాగేసి, కిందపడేసి మళ్ళీ ఏడవడం మొదలెట్టాడు.
"వాట్ డూ యూ- వాంట్ మై చైల్డు" అంటూ టాయస్ రూమ్ లోకి తీసికెళ్ళాడు___అక్కడ
బొమ్మలన్నింటినీ విసిరికొడుతూ, ఏడుస్తున్నాడు తేజ.
పాక్కుంటూ, పాక్కుంటూ నెమ్మదిగా, దూరంగా గోడకు తగిలించివున్న తల్లి ఫోటోవేపు చూస్తూ__
"అ...మ్....మ్..మ్...." అని చేతులు చాస్తుంటే__
"మమ్మీ కావాలా" అంటూ "ఆయా, ఆయా" అని పిలిచాడు.
ఆయా ఆ టైములో తన రూమ్ లో వుంది.
తల్లిని చూపిస్తూ మరీ ఏడుస్తున్నాడు.
మనీపర్స్, ఉంగరం, ఏనుగుబొమ్మ, టెలిఫోన్, లైట్స్ ఆన్ ఆఫ్....ఏంచేసినా తేజ ఏడుపు మానకపోవడంతో ఆలోచనలో పడ్డాడు.
ప్లాష్ లాంటి ఐడియా వచ్చింది కాళేశ్వరప్రసాద్ కి.
"పెద్ద పెద్ద సమస్యల్ని అవలీలగా పరిష్కరించగలిగే ఈ బిజినెస్ మాగ్నెట్ ఈ చిన్న ప్రాబ్లమ్ ని పరిష్కరించ లేడనుకున్నావా?' అంటూ గబ గబా బీరువా తెరిచి, సుదేష్ణాదేవి పట్టుచీరను చేతుల్లోకి తీసుకుని, అద్దం ముందు నుంచొని, సూటుమీదే ఆ చీరను కట్టుకుని, పైట వేసుకుని తేజవేపు చూశాడు.
తల్లి చీరను చూసాడో లేక చీరను కట్టుకున్న తండ్రి విచిత్రంగా అనిపించాడో గానీ టక్ మని ఏడుపు ఆపేసాడు.
"అ....హ్....హ - కరెక్టు మెడిసన్ ఫర్ కరెక్టు ప్రాబ్లమ్__ నీ దృష్టి మమ్మీ వేపు పోయిందన్నమాట" అంటూ కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతుండగా, చిన్నారి తేజ కుడిచేయి తండ్రి రొమ్ముమీద పడింది.
ఒరేయ్__ నేను మమ్మీని కాదూ__ నీకు పాలు పట్టడానికి" అని గట్టిగా అని నలువేపులా చూసి రహస్యంగా కొడుకు చెవిలో__
"ఒరేయ్ చిట్టికన్నా- మగవాళ్ళు పాలు పట్టలేరు. ఆడవాళ్లే పడతారు, తెలుసుకో" అంటూ వాడ్ని బెడ్ మీద కూర్చోబెట్టి, భార్యవచ్చి తన వేషాన్ని చూసేసి ఎగతాళి చేస్తుందేమోననే గబ గబా చీర విప్పేసాడు.
చీర విప్పేసిన తండ్రిని చూసి తేజ మళ్ళీ ఏడుపు లంకించుకొన్నాడు.
"ఓర్నాయనోయ్- నన్నీచీరతో సెటిల్ చేయించేస్తావేంట్రా__" అంటూ మళ్ళీ చీర కట్టుకున్నాడు.
అదేదో మంత్రం వేసినట్టుగా తేజ మళ్ళీ ఏడుపు కట్టేశాడు.
ఇలా పది నిమిషాలసేపు కార్యక్రమం కొనసాగగా_
మీసాల తల్లిలా తేజను ఒడిలో కూర్చోపెట్టుకుని ఆడిస్తూ "మమ్మీకి చెప్పకేం" అని అంటుండగా_