Previous Page Next Page 
శుభోదయం పేజి 11

 

    ఆమె మొహంలో భావం చెప్పక్కరలేకుండానే అర్ధం అయింది మాధవ్ కి. ఆర్ద్రంగా ఆమె వంక చూసి ఆ చెయ్యి మృదువుగా నొక్కి "నీ ఇష్టాన్ని నేను కాదనను రాధా....ఇలాతే అది , టాక్సీలోనే కట్టేయమంటావా ఏమిటి, లేక యింటికి వెళ్ళాక...."అన్నాడు.
    "కాదు , దేవాలయానికి వెడదాం....టాక్సీ వాడికి చెప్పు..."
    "చంపావు . ఇదంతా ఏమిటి రాధా.....యూ సిల్లీ గర్ల్.....ముందేందుకు చెప్పలేదు.... సరే పద, నీ ముచ్చట నేనెందుకు కాదనడం."
    దేవాలయంలో అర్చకుడు మంత్రం చదువుతుండగా మాధవ్ రాధ మెడలో మంగళ నూత్రం కట్టాడు. పూజారి అందించిన కుంకుమ నుదుట దిద్దాడు. మెడలో పసుపు తాడుతో , నుదుట కుంకుమతో కళకళలాడే రాధ మొహం చూసి రాధ కోరిక అర్ధం అయి సంతృప్తిగా నిట్టూర్చాడు . రాధ .....రాధ మోహంలో ఎన్నాళ్ళకి కళ కన్పించింది..... రాధ అందుకోసమే మంగళసూత్రం కట్టించుకుంది. పచ్చని పసుపుతాడుకి వున్న పవిత్రత రిజిస్ట్రార్ అదీసులో సంతకాలతో ఎలా వస్తుంది? ఎంత అధునికులమానుకున్నా ఈ సెంటిమెంట్లు చందాసభావాలు మనుషులని వదలవు కాబోలు.... నవ్వు వచ్చింది మాధవ్ కి.
    "ఇంకేమన్నా తంతు వుందా, అయిందా' అన్నాడు మాధవ్ నవ్వుతూ . రాధ కోపంగా చూసింది "పద యింటికి వెడదాం"
    టాక్సీ కదిలింది.
    "రాదా ..... అందరు వుండి ఎవరూ లేనివాడిలా ఈరోజు నాకై నేను నిన్ను తీసుకేడుతున్నాను. అమ్మవాళ్ళు యిదంతా ఎంత సంబరంగా చేసి వుండేవారు. యిదంతా యింకో సందర్భంలో అయితే....." దిగులుగా అన్నాడు మాధవ్.
    "నా వల్లే కదూ.....అన్నింటికి దూరం అయ్యావు మధూ....." బాధగా అంది.
    "అదికాదు రాధ.... నాకోసం కాదు ఈ బాధ.....నీకోసం .....నీకెవరూ లేరూ ఎలాగూ.....నా వారు వుండీ.....ఇంటికేడితే కొత్త కోడలిని గుమ్మంలో ఆహ్వానించే వారైనా లేకుండా కొత్త పెళ్ళి కూతురిలా నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నానని నా బాధ."
    "పిచ్చి మధూ.....నా యింటికి నన్ను ఒకరు ఆహ్వానించేదేమిటి, నీవే దగ్గరుండి తీసు కేడ్తుండగా ఇంకెవరో లేరన్న దిగులెందుకు" రాధ నిండుగా అంది.
    టాక్సీ యింటి ముందాగింది. ఇద్దరూ దిగి లోపలికి నడిచారు.
    "అగు నాయనా, ఆగండి ...." యింటావిడ పార్వతమ్మ ఆదరా బాదరాగా లోపల్నుంచి వచ్చింది. సంబరంగా చూస్తూ....."అమ్మాయి శారదా, హారతి తీసుకురా...." హడావుడిగా లోపలికి కేక పెట్టింది. మాధవ్, రాధ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
    మాధవ్ యింటి పోర్షన్ గుమ్మానికి పసుపు పూసి కుంకుం పెట్టి వుంది. వరండాలో ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి వుంది. మాధవ్ ఆశ్చర్యంగా చూశాడు..... "మీరు......మీరు చేశారా యిదంతా...." అన్నాడు ఆనందంగా.
    "అవున్నాయనా , ఎంత రిజిస్టరు పెళ్ళి చేసుకు వస్తున్నా కొత్త కోడలు గుమ్మంలోకి వస్తుంటే గుమ్మానికి పసుపు పూసి మామిడాకన్నా కట్టకుండా వుంచడానికి నా ప్రాణం వప్పలేదు సుమా.....అందుకే ఉదయం తాళం అడిగి పుచ్చుకున్నాను."
    మాధవ్ కళ్ళు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి. తల్లి గుర్తుకు వచ్చింది ఆ క్షణాన. చటుక్కున వంగి పార్వతమ్మ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. రాధ కూడా వంగింది.
    "అయ్యొయ్యో ......వుండు నాయనా. ముందు హారతి యియ్యనియ్యి. పార్వతమ్మ గాభరాగా యిద్దరిని లేపి కూతురి చేతిలో పళ్ళెం అందుకుని యిద్దరికీ బొట్టుపెట్టి హారతి యిచ్చి అక్షింతలు చల్లింది. "కుడిపాదం ముందు పెట్టి లోపలికి పదమ్మ...." అంది రాధ చెయ్యి పట్టి నడిపిస్తూ - రాధ లోపలికి రాగానే మెడలో మంగళసూత్రం వంక ఆశ్చర్యంగా చూసి "రిజిస్టర్ పెళ్ళాన్నవుగా నాయనా" అంది పార్వతమ్మ. "అయ్యో ఈ మాట ముందుగా చెపితే మేం రాకపోయేవారమా , వంటరిగా వెళ్ళకుండా" అంది నొచ్చుకుంటూ.
    "అబ్బే లేదండి రిజిస్టర్ పెళ్ళే చేసుకున్నాం, కాని యిదుగో ఈవిడ ముచ్చట యిది. మంగసూత్రం చూపించి కట్టమంది. దేముడి గుళ్ళో మూడు ముళ్ళు వేశాను" నవ్వుతూ అన్నాడు మాధవ్.
    "మంచిపని చేశావు నాయనా, అమ్మాయి! నిజంగా యిప్పుడు నిండుగా వున్నావు. పసుపుతాడు లేకపోతే పెళ్ళికి నిండేమిటి" పార్వతమ్మ రాదని చూసి "బంగారు బొమ్మని సంపాదించావు. యిలాంటి కోడలిని చూసుకునే అదృష్టం మీవాళ్ళకి లేదు. దేనికన్నా పెట్టి పుట్టాలి. ఒసేవ్ శారదా , ఏమిటలా చూస్తున్నావు ముందు కాఫీ తీసుకురా" అంది పార్వతమ్మ. "ఉదయం నించి ఒకటే సంబరపడిపోతుంది నాయనా! ముగ్గులు పెట్టి, పసుపు కుంకుమలు పెట్టి.....వూరికే గాభరపడిపోతుంది. చూడు బాబూ మీ ఇద్దరి భోజనం ఈ పూట మా యింట్లోనే. నాలుగు బూరెలు, యింత పులిహోర కలిపాను. పెళ్ళి రోజు కదా అని.....శారదే చేసింది నాయనా అన్నీ.....కూతుర్ని చూస్తూ అంది.
    "ఓ.....యిదంతా శారద పనన్నమాట. థాంక్స్ చెప్పండి" మాధవ్ నవ్వుతూ అన్నాడు.
    శారద సిగ్గుగా తల దించుకుంది.
    "కూర్చో అమ్మా కూర్చో. ఈ ఇల్లు నీది, నీ ఇంట్లో నీకు సిగ్గెందుకు, కొత్త పెళ్ళి కూతురివి యింటి వస్తే, నా అన్నవాళ్ళు లేకపోయారేనని నా బాధ"
    "ఎవరూ లేని లోటు మీరు తీర్చారు పిన్నిగారూ' రాధ మనస్పూర్తిగా అంది.
    "నే చేసిందేముందమ్మా - అబ్బాయి నిన్ను తీసుకోస్తున్నానని చెప్పాగానే అయ్యో అందరూ వుండి ఎవరూ లేని వారయ్యరే , హారతిచ్చి లోపలికి తీసికెళ్ళేవారన్నా లేరే అన్పించి ఈమాత్రం చొరవ తీసుకున్నాను అబ్బాయికి చెప్పకుండా. ఆ, అవును గాని నాయనా అమ్మ నాన్న దగ్గిరికి తీసికెళ్ళావా.....ఒకసారి చూపించి ఆశీర్వాదం తీసుకో బాబు" అంది పార్వతమ్మ.
    "వెళ్ళాలంటారా? ....వెడితే ....మొహం చూడను పొమ్మన్న యింటికి ఏ మొహంతో వెళ్ళను....." సందిగ్ధంలో పడి అన్నాడు.
    "పిచ్చివాడా , తల్లిదండ్రుల కోపం ఎన్నాళ్ళు ఉంటుంది? వున్నా బంగారు లాంటి కోడలుని చూశాక కరిగిపోతుందిలే. వాళ్ళెం అన్నా ఒకసారి వెళ్ళడం నీ ధర్మం.... తప్పకుండా వెళ్ళి కనపడండి బాబూ...."
    "హు....మీకు నాన్న సంగతి తెలియదు.....అయినా ....సరే మీదన్నట్లు కొడుకుగా నా ధర్మం నెరవేరుస్తాను...." అన్నాడు మాధవ్.

 Previous Page Next Page