నైజాం నవాబు కాలంలో పకడ్భందీ అయిన పరిపాలన ఎన్నడూ లేదు. అడవిమయంగా వున్న దేశంలో బందిపోటు ముఠాలు రాజ్యం చేసేవి. బందిపోట్ల బాధ తట్టుకోలేకపోయింది ప్రభుత్వం. వారితో ఒక ఒప్పందం కుదిరించుకొని వారిని దేశ ప్రముఖులను ,దేశ పాండ్యాలను చేసింది. దొంగలను దొరలను చేసింది. శిస్తు వసూలు చేసే హక్కు వారికీ ధారాదత్తం చేసింది. కొంతకాలం పద్దతి బాగానే నడిచింది . కాని తరవాత తరవాత దొరలు శిస్తులు ఎగాబెట్టసాగారు. శిస్తు వసూళ్ళకు అధికారులు వస్తే వారి గుడారాలను తగలబెట్టించారు. వారి ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారు. ఒక్కొక్కసారి శిస్తులు కట్టినట్టే కట్టేవారు. శిస్తులు పట్టుకెళ్ళే ఆహికారులను అడవుల్లో దోషించేవారు. దాంతో ప్రభుత్వం తల ప్రాణం తోకకు వచ్చింది. "ఘర్ ఘర్ దేశ్ ముఖ్" విధానం ప్రవేశ పెడ్తామని ప్రతిజ్ఞా చేసింది ప్రభుత్వం. అందు'ననుసరించి రైత్వారీ పట్టా పద్దతి ప్రవేశపెట్టారు. అయినా దేశముఖులు వారి తాబెదార్లె అన్ని భూములు వ్రాయించుకున్నారు. శిస్తు వసూలు హక్కుని దేశముఖుల నుండి లాక్కొని కారణాలకు కట్టబెట్టింది ప్రభుత్వం. గ్రామాల్లో పటేల్ పట్వారీల రాజ్యం వెలిసింది. దేశముఖులు నామమాత్రులైనారు. అయినా వారి దొరతనానికి అడ్డు లేకుండేది. అందరినీ లొంగదీసుకొని సాగించిన నిరంకుశ ప్రభుత్వం తెలంగాణం జాగృతం అయ్యేదాకా సాగింది. రైతులు తుపాకులు పట్టుకున్నారు. కాల రుద్రులైనారు. దేశముఖులు ఊళ్లు వదిలి యూనియన్ ప్రాంతాలకు పారిపోయారు - వారు హిందువులు కావడాన వారికీ నిజాం ప్రభుత్వపు అండ లభించకపోవడం ఇందుకు ప్రధాన కారణం. దొరలను ప్రాలద్రోలిన రైతు , దొరల భూములను పంచుకున్నాడు. పది లక్షల ఎకరాలు పేదలకు పంచాడు. పల్లెల్లో రైతురాజ్యం స్థాపించాడు. హైదరాబాదు రాజ్యం మీద పోలీసు చర్య జరగడంతో దొరలూ మళ్ళీ చేరారు. వారి అవాంతరాలు మార్చుకొని ఖద్దరు దొరలైనారు. అలాంటి వారిలో మన బలరామయ్య ఒకరు. వారి పలుకుబడి ప్రభుత్వంలో పెరిగి పోవడంతో శివరావు జరిపిన దౌర్జన్యాలను విచారించడానికి ఏర్పరిచిన కమీషన్ లో బలరామయ్యను కూడా సభ్యునిగా నియమించారు. అందువల్ల శివరావు బలరామయ్యను ఎక్కువగా ఆశ్రయించాల్సి వచ్చింది.
దొరవారు కమీషన్ కార్యక్రమంలో మునిగి ఉన్నారు. రాష్ట్రం మొత్తంలోనూ పర్యటన సాగిస్తున్నాడు.తీరిక బొత్తిగా ఉండటం లేదు. అందుకే ఉదయమే వచ్చాడు శివరావు బలరామయ్య బంగ్లాకు. అప్పటికే డ్రైవరు కారు తుడుస్తున్నాడు. శివరావును సోఫాలో కూర్చోమని చెప్పి రాముడు బలరామయ్యాకు చెప్పడానికి వెళ్ళాడు. బలరామయ్య లేచాడు. తెలుగు పత్రిక గణింఛుకొని చదువుతున్నాడు. తెలుగు చదవడం నేర్చుకుంటున్నాడతను. ఊర్దూ కాలం పోయింది మరి. ఇంగ్లీషు అక్షరాలు కూడా నేర్చుకుంటున్నాడు, రాజకీయ బాషగా ఊర్దూ తొలగించి ఇంగ్లీషు ఏర్పరచారు.
"దొరా! శివరావుగారోచ్చిండు"
"ఎందుకొచ్చిండట?"
"నాకు చెప్పాడుండి?"
"చెప్పకుంటే ఇంతేజార్ చెయ్యమను స్థానం గీనం చేసి గాని వెళ్ళం. అన్నట్లు మరిచిన పదికొట్టంగ పోయెడిదున్నది . జర జల్ది కానియ్యి"
"అట్లనే నుండి"
శివరవుతో దొర చెప్పిన మాట చెప్పి వెళ్ళిపోయాడు రాముడు దొరవారికి ఏర్పాట్లు చేయటానికి.
శివరావు సిగరెట్టు కాల్చాడు. అటూ ఇటూ పచార్లు చేశాడు. బంగాళా ముందున్న మొక్కల్ని పరిశీలించాడు. గోడలకున్న పటాల్ను చూశాడు. ఆఖరుకు పత్రిక చదువుతూ కూర్చున్నాడు. భారతదేశానికి గాను ఒక రాజ్యాంగం సిద్దం చేయడం, అందరికీ సమాన హక్కు లివ్వడం లాంటి వార్తలేవో కనిపించాయి. శివరావు చిర చిరలడాడు. అందరికీ సమాన హక్కులేమిటి? పిచ్చిగానీ ఇంగ్లీషు వాళ్ళకే తప్ప వీళ్ళకు ప్రభుత్వం చేయడం రాదనీ తెల్చుకున్నాడు.
"ఏమో వచ్చినవు?" టోపీ సవరించుకుంటూ వచ్చారు దొరవారు.
పత్రిక అక్కడ పడేసి లేచి నుంచొని నమస్కరించాడు శివరావు. "దర్శనం చేసుకుందామని...."
చేసుకున్నవ్ గద...."అంటూ కూర్చున్నాడు బలరామయ్య.
తికమక పడ్డాడు శివరావు. "ఏదో మీ దయ ఉండాలి"
"ఏందో దయ దయ అంటున్నావు ఊళ్ళన్నీ తిరిగి చుస్తున్నం గద ఎన్ని షికాయతు లోస్తున్నయనుకున్నావ్?"
"నేనేం చేయాలనీ చేశానండీ. అంతా చేసినా వాళ్ళు లొంగందే. విన్నారుగా మొన్న పోలీస్ క్యాంప్ మీదనే దాడి చేశారు. నలుగురు పోలీసులనే హతమార్చారు."
"నిజమేనయ్యా! అసలు తుపాకులొండ్లను ఎంతమందిని చంపినవంట. మొన్నగా ఊళ్ళో ఇల్లు తగలబెట్టి పల్లీలు కాల్చుక తిన్నావట గద."
"రామ రామ . ఇల్లు తగల బెట్టింది నిజమే నండి. కాని శనక్కాయ కాల్చుకోవడానికి క్కాడు. కాలుతున్న ఇంట్లో శనక్కాయలున్నాయండి. అవి బయటపడ్తే పోలీసులు తలా నాలుగు కొట్టుకు తిన్నరండి."
నీకేమి నాలుగొద్దులుంటవు మూట కట్టుకుంటవ్ ఎల్లిపోతవు/ మేము జవాబు చెప్పాలే ప్రజలకు. మళ్ళీ ఆ ఊళ్ళ మనిషిని బందూఖత్ కాలిస్తివి. మొఖం కండ్లబడ కుండ కట్తెల్ల. పెట్టి కాల పెడ్తివి . తుపాకులోండ్లు లీడర్ను చంపినన్ని బజాబజాయిస్తివి అదేందంటావు?"
"ఆ మాత్రం చేయకుంటే ప్రజలు చేతిలో ఉంటారండి? యేవో కొన్ని తప్పులు చేశా. అందుకే తమను వేడుకుంటున్నాను రక్షించాలె"
"అది సర్లే మా ఊళ్ళ గాంధీ విగ్రహం పెడదామనుకుంటున్న ఏమంటావ్"
"చాల మంచి దండి. చేయమంటే ఏర్పాట్లన్నీ చేస్తానండీ. ఏం లేదు మీరో కంట కనిపేట్టాలండీ."
"సరే విగ్రహం బాగుండాలే చూడు. లీడర్లు గీడర్లు అందరు వస్తమంటున్నారు"
"చిత్తం వేరే చెప్పలండీ! శలవు తీసుకుంటా మరి" అని వెళ్ళిపోతూ విగ్రహం ఖరీదు కూడా తనమీడనే వేసినందుకు బలరామయ్యను మనసులో తిట్టుకున్నాడు.
"ఇగో చూడు" మళ్ళీ పిలిచాడు బలరామయ్య. పోతున్నావాడల్లా వెనక్కి తిరిగీ "చిత్తం " అన్నాడు.
"రాముణ్ణి ఊరికి పంపుదామనుకుంటున్నా. మనోడేవ్వరు లెకుంటెట్లు అడ? జర పోలీసుల్నిచ్చి పంపుండి. జర బందోబస్తు గట్టిగ చెయ్యండి. రాముడి కేమన్నాయేనా...."