Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 12


    "నన్నెలాగైనా పిలువ్ రాజూ కానీ సుకృతిని అలా పిల్లా అంటూ సంబోధించకు."
    "ఏం....పిల్లకాక అప్పుడే స్టారైపోయిందా?"
    "స్టార్ అయిందో లేదో నాకు తెలీదు. కానీ సుకృతి ఒకనాడు ఇండస్ట్రీలో నువ్వు ప్రొడక్షన్ బోయ్ గా అడుగు పెట్టటానికి కారణమైన రాజ్యం కూతురు."
    రాజ్యం నటిగా వెలిగిపోతున్న రోజుల్లో చాలామందికి సహాయపడింది. అసలు రాజు ముందు రాజ్యం ఇంటిలోనే పనివాడుగా చేరి తర్వాత ఆమె అభిమానం మూలంగానే ప్రొడక్షన్ బోయ్ గా తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ గా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ గా ఎదిగాడు.
    "సుకృతి రాజ్యం కూతురు కాబట్టి గౌరవించాలంటావ్.....కానీ యిప్పుడు ఆ స్థాయి నుంచి పడిపోయి నిన్న రాత్రి మా గురువుగారితో జంబలకిడి పంబ....."
    జుగుప్సగా మాట్లాడుతుంటే వినడం లేదు అలివేలు పతనమైన సుకృతి బ్రతుకు డైరీ మొదటి పేజీ ఎవరో  తెలుసుకుని స్థాణువైంది.
    "ఏంటీ అలా తెల్లమొహం వేస్తావే.... నేను చెప్పేది అబద్దమనుకుంటున్నావా."
    నిర్వేదంగా చూసింది అలివేలు. "కడుపులో ఆకలి దేవుకుపోతుంటే ఓ దోశ కోసం శీలం కోల్పోయి తర్వాత అగ్రతారలైన అమ్మాయిల గురించి తెలిసిన నేను ఈ చిత్ర పరిశ్ర్తమలోని విచిత్రాలను ఆలోచించడం లేదు రాజూ. యువరాణిలా బ్రతకాల్సిన ఓ ముగ్ధ యిలా దిగజారాల్సి వచ్చిన స్థితికి కుమిలిపోతున్నాను. బంగారు సింహాసనంపై కూర్చోబెట్టిన బాల్యం నుంచి యిప్పటి భస్మ సింహాసనం వైపుకి ఆ దేవుడు ఎందుకు నెట్టిందీ అర్ధంకాక ఆశ్చర్యపోతున్నాను."
    "నీయమ్మ, నీమీద తీరే అంత....అదరగొడతావనుకో.....అవును. ఈ రాత్రికి కాల్ షీటు యిస్తావా?" రాజు దృష్టిలో కాల్ షీటంటే ఓ రాత్రి గడపడం.
    జవాబు చెప్పేదేకానీ ఇంతలో సుకృతి రావడంతో ఆగిపోయింది. సుకృతిని ఆపాదమస్తకం చూస్తూ నిలబడిపోయిన రాజుతో అంది అలివేలు- "సుకృతి కోసం వచ్చారుగా."
    తేరుకున్నాడు రాజు "మరేం....మీ స్టిల్సు తీయించటానికి మిమ్మలని తీసుకెళ్ళమని పంపారు డైరెక్టరుగారు...."
    సుకృతి నిశ్శబ్దంగా అతడ్ని అనుసరించబోతుంటే అడిగింది అలివేలు- "నన్ను తోడు రమ్మంటావా....."
    "అవసరంలేదు"
    "అదికాదమ్మా....." రహస్యంగా అంది అలివేలు. "నువ్వు వెళ్ళే చోట ప్రతివాడూ అవకాశం తీసుకోవాలనుకుంటాడు"
    "ఏం మిగిలిందని భయపడాలి?" భావరహితంగా అన్న సుకృతి వెళ్ళి కారులో కూర్చుంది.
    పదిహేను నిమిషాలలో ఓ స్టూడియోని చేరుకుంది కారు.
    ముందు మేకప్ టేస్ట్ కోసం గ్రీన్ రూంలోకి తీసుకువెళ్ళాడు రాజు. ఏభై ఏళ్ల వయసులో పళ్ళకు గారలుపట్టి జుగుప్సగా కనిపిస్తున్నాడు మేకప్ మేన్. అది కూడా భరించేదే. కానీ చెంపలపై మేకప్ ప్రారంభించిన ఆ వ్యక్తి క్రమంగా మెడ దగ్గరికి అక్కడ నుంచి గుండెలపైకి చేతుల్ని మళ్ళిస్తుంటే జుగుప్సగా పైకి లేవబోయింది.
    "అలా కంగారుపడకు అమ్మడూ" గారపళ్ళ మేకప్ మేన్ జోక్ చేశాడు. "ఇప్పుడున్న ప్రతి లేడీ స్టార్ ముందు నా చేత వేయించుకున్న వాళ్ళే."
    "అదే.....మేకప్" ద్వంద్వార్ద సినిమా సంభాషణలా సపోర్ట్ చేసే రాజు...." మీరు  కానివ్వండి రావుగారూ కొత్తపిల్ల కదా....."
    "పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా మీ పని కొనసాగించరనుకుంటాను."
    ఉలికిపడ్డాడు రావుతోబాటు రాజు కూడా.
    "ఇలా అయితే సినిమా ఫీల్డులో పైకి రావడం కష్టం."
    "పైకి రావడమూ అంటే....మీ చేతుల్ని మెడనుంచి క్రిందికి ఇవ్వడమే అయితే ప్రస్తుతం మేకప్ ని యిక్కడే ముగించడం మంచిది.
    ఇంతగా హ్యూమిలియేట్ చేస్తున్నారేం.
    తనమాట అటుంచితే నటి కావాలనుకున్న ప్రతీ ఆడపిల్లా యిక యిలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటం తప్పనిసరా? అది కాదు ఆమె అంతగా కలవరించింది. ఇది కోరి తను ఎన్నుకున్న జీవితం కాకపోతే అడుగడుగునా సమస్యల సౌలభంజికల్లా తన ఉనికిని ప్రశ్నిస్తున్నాడు వాడూ.
    "మేకప్ అయిపోయింది మేడమ్" కొరుకుడు పడని సుకృతి హారం నచ్చకపోవడంతో విసుగ్గా అన్నాడు రాజు. "ఈ గదిలోకి మీరు డ్రెస్ చేసుకుని రడీ అయితే స్టిల్సు తీస్తాను."
    సుకృతి రాజు చూపించిన గదిలోకి వెళ్ళింది. నిజానికి అది డ్రెస్సింగ్ రూంలా కాక చిన్న స్టూడియో ఫ్లోరులా వుంది. మసక చీకటి, హేంగర్ కు వేళ్ళాడుతున్న చీరలతోబాటు మోడరన్ డ్రెస్సెస్సూ వున్నాయి.
    ఆలోచిస్తూనే చీర విప్పింది. బ్లౌజు తీసి నైటీలా వున్న ఓ కాముని అందుకుంది. మరో అరనిముషంలో వేసుకునేదే....
    అదిగో అప్పుడు వినిపించింది ఏదో అలికిడి.
    గభాలున అనాచ్చాదితంగా వున్న గుండెల్ని చేతుల్తో కప్పబోతుండగా ఫ్లేష్ లైటు వెలిగి ఆరిపోయింది.

 Previous Page Next Page