ఆగలేదు సుకృతి. కారిడార్ ని దాటి హాస్పిటల్ ప్రాంగణంలోని గార్డెన్ లోకి వచ్చింది.
"ఎక్కడికి పారిపోతున్నావ్" భుజం పట్టుకుని నిలదీసింది అలివేలు.
"లేదాంటీ....." తొట్రుపడింది సుకృతి. గిల్టీనెస్ ఇంత బాధాకరంగా వుంటుందని తెలిసింది యిప్పుడే. "నిద్రొస్తుంటే ఇంటికెళ్ళాలను కుంటున్నాను....."
తల వంచుకున్న సుకృతి తలని పైకెత్తి పరిశీలనగా చూసింది అలివేలు.
ఆందోళనగా విదిలించుకోబోయిందిగాని అలివేలు పట్టు విడిపించుకోలేక పోయింది.
"తెల్లారి పోయిందా సుకృతీ?"
టప్ మని రాలిపడింది ఓ కన్నీటిబొట్టు. "అవును ఆంటీ తెల్లారింది" తెల్లవారిన సూచనగా హాస్పిటల్లో సందడి మొదలుకావటాన్ని అన్వయిస్తూ చెప్పింది.
మనసు దేవుకుపోతుంటే కందిన మోముతో ఆకాశంలోని ఆరు రేఖల్ని చూస్తూ అంది అలివేలు.
"ఎంత పని చేశావమ్మా...... తనకు కాలం చెల్లిపోతూందని తెలిసినా ఆ కాలాన్నే నీకు ఆలయంగా అనుకుంది. బ్రతుకేనని తెలిసిన క్షణాల్లో సైతం ఆకాశంలోని సంధ్యకాంతిని చూస్తూ ఉదయ సూర్యుడి కిరణాలని తాకుతూ నిన్నే స్పృశించినంత ఆనందంతో నీ తల్లి పులకించి పోయేది ఏం మిగిల్చావు.....పతనమై ఏం సాధించావు."
"ఆంటీ" కంపించిపోతూంది సుకృతి. "అసలు నేను....."
అర్దోక్తిగా అంది అలివేలు. "పతనం కాలేదూ అని బుకాయించకు సుకృతీ..... పదిహేను సంవత్సరాలుగా పతితనై బ్రతుకుతున్నదాన్ని.....అపవిత్రత కుళ్ళులో కొట్టుకుపోతున్నదాన్ని నీకు రవ్వంత మైల అంటినా నేను గుర్తించగలనమ్మా...."
"సో వాట్...." సుకృతి కళ్ళనుంచి నీళ్ళు ధార కడుతున్నాయి. "అయితే ఏమిటట......అసలు అమ్మకోసం నేనేం త్యాగం చేయలేదు ఆంటీ..... అలా అని బాధ్యతనీ తీసుకోలేదు. రేపు బ్రతికుండగానే స్పృహలోకి వస్తే ఓ షాక్ లా నా జీవితం గురించి నేనే తెలియ చెప్పాలనుకుంటున్నాను. దాని వలన నేను సాధించేదేమిటో తెలుసా.....అమ్మ మీద పగ తీర్చుకోవడం..... అవును ఆంటీ...... ఇరవై సంవత్సరాల నా జీవితం ఈ రాత్రి గడి తప్పటానికిగాని, లక్షల ఆస్థిలో డబ్బు అనే రెండక్షరాల వస్తువు కోసం నేను కుమిలిపోవటానికి గాని కారణం అమ్మ నిర్లక్ష్యమేగా.....అసలు అమ్మ నిజంగా నన్ను ప్రేమించి వుంటే జ్ఞానం తెలీని వయసులోనే తనకు దూరంగా నన్ను పెంచేది కాదు. అమ్మకి కావాల్సింది తన భర్త. ఆ భర్తకి అంతా దోచిపెట్టడం....అంతే తప్ప నేను కాదు. ఇలా అంటున్నది ఈ క్షణంలో తోచిన ఆలోచనతో కాదు ఆంటీ..... ఈ మూడు రోజుల జీవితం విశ్లేషణతో......ఏదీ.....అమ్మకే నేను అవసరమైన ప్రాణిననిపిస్తే నాకంటూ కొంత మిగిల్చేదిగా......అది నా కోసం కాకపోయినా ఇప్పుడు అమ్మ కోసమైనా నేను వినియోగించేదాన్నిగా. ఆ మాత్రం కూతురిమీద జాలి, మమకారంలేని అమ్మకీ, వయసు ఖర్చుచేసి డబ్బు సంపాదించమన్న నాన్నకీ తేడా ఏమిటి ఆంటీ..... ఇద్దరూ యిద్దరే.... ఇద్దరూ కలిసే నన్ను నాశనం చేశారు. అయినా నేను నా బాధ్యత నుంచి దూరంగా పారిపోలేదు ఆంటీ....పాతికవేలు సంపాదించాను. అమ్మకోసం ఇంకా సంపాదిస్తూనే వుంటాను....అంతే...."
సుకృతి అశ్రుశిక్త నయనాలలో రుద్దమైన కంఠంతో ఎంతటి అంతర్మధనపు జీరలే కనిపించాయో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న అలివేలు బుజ్జగిస్తున్నట్టుగా అంది.
"ఏ తల్లిగానీ కోరుకోవాల్సిన గొప్ప కూతురివి సుకృతీ..... నువ్వు ప్రదర్శించిన కోపంలో సైతం నీ తల్లిపై మమకారమే కనిపించింది తప్ప ద్వేషం కనిపించలేదమ్మా నేను బాధపడుతున్నది ఒక్క దానికేనే పిచ్చి తల్లీ, రేపో మాపో రాలిపోవాల్సిన కాయకోసం సవ్యం కాదనే...."
"ఆంటీ" స్థిరంగా అంది సుకృతి.
"ఎందుకు జరిగినాగాని, ఎలా జరిగినాకాని జరగకూడనిది జరిగి పోయింది. ఇక దాని గురించి నేను పశ్చాత్తాపపడను.... ఎందుకంటే అది మరింత బాధాకరం కాబట్టి...... అయితే ఒకటి మాత్రం నిజం ఆంటీ.....అమ్మకోసం, అమ్మ బ్రతికినంత కాలం డబ్బు సంపాదిస్తూనే వుంటాను. ఎలా అయినా సరే. ఒకసారి వూబిలో అడుగుపెట్టిన ఆడపిల్లగా యిక నేను దేనికీ వెనకాడాల్సిన అవసరం లేదు."
ఆ మధ్యాహ్నమే సుదర్శనరావుగారు పంపిన కారు వచ్చింది హాస్పిటల్ కి. ప్రొడక్షను ఎగ్జిక్యూటివ్ రాజు కారిడార్ లో నడుస్తూ అలివేలుని చూసి ఆగాడు. "ఏం తల్లీ.....ఆ పిల్లెక్కడా?"
తొట్రుపడింది అలివేలు. సుదర్శనరావుకి ప్రియశిష్యుడే కాక ఇంచుమించు అతడి ప్రతి సినిమాకీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా వుండే రాజు కనిపించిన ప్రతిసారీ యిలాగే పిలుస్తుంటాడు. కోపం వచ్చినా నిగ్రహించుకోక తప్పదు. తిరగబడితే ఒకటీ అరా దొరికే జూనియర్ ఆర్టిస్టు వేషాలూ దక్కవు.
"ఏంటే....మాట్లాడవు" రాజు గొంతులో అధికారానికి కారణం అలివేలు స్థాయి యువతులు తనకు భయపడతారన్న నమ్మకం ఒకటే కాదు.....అడపాతడపా అతని పక్కన పడుకోవాల్సి రావడం కూడా.....ఈ చిత్ర పరిశ్రమలో యిలాంటి ఘట్టాలు మామూలే అయినా సుకృతి యిదంతా గమనిస్తే పట్టుకోలేదు.