Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 13


    ఓ మూల నిలబడి వున్నాడో వ్యక్తి.
    "ఎవర్నువ్వు?" అడిగింది సుకృతి ఆవేశంగా.
    "రమణ....స్టిల్ ఫోటోగ్రాఫర్ రమణ" చిదానందంగా నవ్వుతున్నాడు. తప్పచాటుగా ఫోటో తీయడం నేరమన్న భావం లేదతడిలో.
    "నువ్వు ఆకతాయిగా ప్రవర్తించడం చూశాను సుకృతీ.
    అందుకే అడిగిన ఫోజు ఎలాగూ పెట్టవని పైగా నీ రియాక్ట్ ను సహజంగా వుంటుందని యిలా చెప్పకుండా తీశాను కంగారుపడకు.....చేతుల్తో గుండెల్ని దాచేశావుగా."
    అతడిదీ తన తండ్రి వయసే.....అయినా తనతో ఆడుకుంటున్నాడు. మొత్తమంతా కాలుష్యమే అయితే ఎవర్నని నిలదీయాలి.
    "ప్లీజ్ ఆ ఫోటో ఎవరికీ యివ్వకండి" అర్దింపులా అడిగింది. అలాంటి అసభ్యత నాకు యిష్టం వుండదు."
    "నిజమా" ఎగతాళిగా నవ్వాడు రమణ. "నీకు అసభ్యతంటే అసలు పట్టదా....అంత నీతిగానే సినిమారంగంలో ఎదిగిపోదామనుకుంటున్నావా?"
    అతడి మాటల్లో నువ్వు డైరెక్టరు దగ్గర పడుకోకుండానే ఈ అవకాశం సంపాదించగలిగావా అన్న ప్రశ్న తోబాటు నా దగ్గరైనా పడుకుని వుండాలన్న హెచ్చరిక వినిపిస్తూంది.
    "మిస్టర్ రమణా.....నీ వ్యంగ్యం నాకు అర్ధమైంది. అయితే ఒక్క విషయం నువ్వూ అర్ధంచేసుకోవాలి."
    రోషంగా చూశాడు "నువ్వు అనకు."
    "నన్ను మాట్లాడనియ్ రమణా.....నువ్వూ అనకుండా మీరూ అని సంబోధించే స్థాయిలో నువ్వు ప్రవర్తించలేదు కాబట్టి నిన్ను అలాగే అడ్రసు చేయాలనుంది కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకచోట కాలు ఆడపిల్ల ప్రతి స్టుపిడ్ ముందూ జారి జారుడుబల్లలా శరీరాన్ని అందివ్వాలనుకోవటం న్యాయం కాదని నీకెందుకు అనిపించడంలేదో నాకు బోధపడటం లేదు. అలా రోషంగా చూడకు....యస్......నేను డైరెక్టర్ ఓ రాత్రి గడిపాను ఎందుకంటే నా అవసరం కోసం.... దాన్ని అడ్వాన్ టేజ్ గా తీసుకోవడం అన్యాయం....."
    "అలా నాకు నిబంధనల్ని విధిస్తే నువ్వీ ఇండస్ట్రీలో పైకి రాలేవు సుకృతీ. నీ భవిష్యత్తు ఆధారపడేది నేను తీసే యీ తొలి స్టిల్సు మీద నేనేమిటీ అన్నది అడగాల్సింది నన్ను కాదు. ఈరోజు ఇండస్ట్రీని ఏలుతున్న ఏ హీరోయిల్ని అడిగినా తెలిసిపోతుంది. నేను కావాలీ అంటే ఫోటోగ్రఫీ అనుభవంతో కాకిని హంసగా, హంసని కాకిగా మార్చి చూపించగలను. యస్ అదే ఈ రమణలో ప్రత్యేకత."
    "నీ శక్తికి నా జోహార్లు. కానీ నేనుగానే వుంటాను తప్ప కాకి హంసనో కాదలుచుకోలేదు."
    "అలా అని నువ్వు నన్ను శాసించలేవు. ఎందుకంటే నేను ఫోటో తీస్తున్నది ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టరు అయిన సుదర్శనం ఆదేశంపై...." ఇలా ప్రశ్నించిన తొలి ఆడపిల్లలు పనిగట్టుకుని చేతనే స్టిల్సు తీయించుకోవడం కెమెరాముందే కాక తన బెడ్ మీద సైతం కావాల్సిన ఏంగిల్సుకి సిద్దమై పైకి రావాలనుకోవడం రెగ్యులర్ గా జరుగుతున్న తంతు. అలా చాలామంది పైకి వచ్చారు. "అయినా నీకంటూ ప్రత్యేక గౌరవం యివ్వటానికి నువ్వేమన్నా ప్రొడ్యూసర్ కూతురి డైరెక్టరు చెల్లివా? ఇప్పుడు ఇండస్ట్రీలో లేని ఓ మాజీనటి కూతురు అంతేగా?"
    కోపాన్ని నిభాయించుకుంది సుకృతి. "గౌరవం యివ్వటానికి గొప్పింటి అమ్మాయే కావాల్సిన అవసరం లేదు రమణా! మనిషైతే చాలు....."
    "మనిషైతే చాలదు సుకృతీ! నా మనిషి అవ్వాలి. అంటే" ఆగాడు రమణ. "నాతో ఓ గంట గడపాలి అప్పుడే నిన్ను ఫోటోజనిక్ కనిపించేట్టు చేస్తాను. లేదూ అంటూ నీకంటూ కెరీర్ లేకుండా చేయగలను."
    "నువ్వు నన్నేం బెదిరించనవసరంలేదు రమణా.....ఫోటోలు నీకు తోచినట్టు తియ్..... చాలు...." వార్నింగ్ లా అంది సుకృతి.
    రమణ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు.
    ఏ మూలనుంచి వచ్చాడో రాజు ప్రత్యక్షమయ్యాడు "టైం వేస్ట్ చేయడమెందుకు రమణగారూ! ఇలాంటి కేసులు...."
    "మిస్టర్ రాజూ! భాష.....భాష విషయంలో కాస్త జాగ్రత్త పాటించు."
    ఇద్దరికీ బోధపడిపోయింది. సుకృతి అందరి అమ్మాయిల్లా కోపరేట్ చేయదు. మొండిఘటం......ఇప్పుడు రమణ ఆలోచన ఒక్కటే. సుకృతి ఫోటోల్లో జుగుప్సగా కనిపించాలి. అలా కనిపించేట్టు చేయడమూ కష్టమని పించిందేమో.
    అందుకే ఓ ఏభైదాకా ఫోటోలు తీశాడు.
    నచ్చనివి ఏరుకోవటానికి, అవి మాత్రమే సుదర్శనరావుకి చూపించటానికి.
    
                                                             *    *    *    *
    
    "అంటే......నీ ప్రారంభం యిలా జరిగిందన్నమాట."
    అలివేలు ఉదాసీనంగా నవ్వింది సుకృతిని చూస్తూ.
    "అయినా గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు గొంతులో కొస్తున్నాయని బాధపడటం నేరం సుకృతీ. నీకు జరిగింది యిప్పటిదాకా యిండస్ట్రీలో కొన్ని వేలమందికి జరిగింది. కాబట్టి అంతా పైకి రాగలిగారని కాదు. కొందరు తెరమీద వెలిగితే మరికొందరు అమ్మాయిలు వ్యభిచారపు చీకటి గదుల్లోకి జారిపోయారు. అంతెందుకు.....రమణ తండ్రి కూడా ఒక నాడు పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫరే..... అందుకే ఆదిలో నేనూ అతడి దగ్గరే స్టిల్సు తీయించుకున్నాను. అందుకు పెట్టుబడిగా వారం రోజులు అతడితో పడుకున్నాను. అయినా నేను స్టార్ ని కాలేకపోయనుగా. అలా అని అందరూ నాలాగే మిగిలిపోతారని కాదు. ఇప్పుడు తెలుగు యిండస్ట్రీని ఏలుతున్న రమ్యశ్రీ ఒకప్పుడు రమణ యింట్లోనే వుండేది. రెండేళ్ళపాటు రమణే కీప్ చేశాడు. ఆ తర్వాత రమ్యశ్రీ స్టిల్సు తీసి తనే ఆ ఫోటోలు పట్టుకుని ప్రొడక్షన్ ఆఫీసులకి తిరిగి తిరిగి ఆమెకి అవకాశం దక్కేట్టు చేశాడు. ఇప్పుడు రమ్యశ్రీ నెంబర్ వన్ హీరోయిన్.... కాబట్టి రమణతో పనిలేదు."

 Previous Page Next Page