కలత నిద్రలో నున్న మాధురి ఒక్కసారి ఎవరో తట్టినట్లుగా కళ్లిప్పింది.
ప్రశాంతంగా తనవేపు చూస్తున్న -----
తండ్రి వేపు ప్రేమగా చూసింది.
"ఎలా వుంది డాడీ. డాడీ నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగింది.
"నువ్వొచ్చావు కదా........ఎంతటి గాయమైనా మాయమైపోతుందమ్మా, నువ్వు రాకముందు చచ్చిపోయినా నువ్వోచ్చావని తెలిసాక బతికేస్తానమ్మా......"
"ఏంటి డాడీ అలాంటి మాటలు........."
బెడ్ నుంచి కొంచెం లేచి తలగడ అనుకుని కూర్చున్నాడాయన.
"ఎలాగున్నాయమ్మా నీ సినిమా షూటింగ్......వద్దంటే వినవు ......అలాంటి సినిమాలు, ఓ వంద సినిమాలు తీసే డబ్బుంది మన దగ్గర........నువ్వు మళ్ళీ సినిమాల్లో యాక్టు చెయ్యడం ఎందుకమ్మా......" ఆ ప్రశ్నకు ఎన్నోసార్లు వేసాడు ధనుంజయరావు.
మాధురి మౌనంగా వుండిపోయింది.
"నువ్వు కోరుకున్న దానిని ఎప్పుడూ కాదనకూడదని నీ మనసెప్పుడూ కష్టపెట్టకూడదని మీ అమ్మ కొచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం అడ్డు రావడం లేదమ్మా.......కానీ మధూ.......ఈ తండ్రి దగ్గర వుండాలని లేదామ్మా........."
"ఏంటి డాడీ, ఎంతో దూరం వెళ్ళిపోయినట్లు మాట్లాడుతున్నావ్. ప్రతిరోజూ నీతో గంటలు గంటలూ ఫోన్ లో మాట్లాడినా, నీకు సంతృప్తి వుండదు డాడీ.......ఈ సినిమా ఫీల్డ్ శాశ్వతమా ....ఆ విసహాయం నీకూ తెలుసు......నేనెందుకు సినిమా ఫీల్డ్ లో కొచ్చానో నీకు తెల్సు........నీ డబ్బు ఏ పలుకుబడి ఏమీ ఉపయోగించకుండా "సిన్మా స్టార్ నౌతానని ఫ్రెండ్స్ తో పందెం కట్టానన్న విషయం నీకు తెలుసు. అనుకున్నది సాధించాను......ఈ డిసెంబర్ చివర లోపల ఇంకో అయిదు సినిమాలు యాక్టు చేస్తాను ......
అంతే
గుడ్ బై టు సినిమాస్.
నువ్వేవర్ని చేసుకోమంటే వాళ్ళనే పెళ్ళి చేసుకుంటాను...... నీ ఎదురుగానే వుంటాను డాడీ......అమ్మ మీదొట్టు..........." చిన్నపిల్లలా అంది మాధురి.
అమ్మ మీదొట్టు.
మాధురి తల్లి మాలతి జ్ఞాపకం రాగానే ధనుంజయరావు కళ్ళు ఆర్ద్రభూతమయ్యాయి.
"మీ అమ్మఎంత మంచిదో తెల్సమ్మా.........ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ......అప్పుడు మీ నాన్న లక్షాధికారి కాదు. రోడ్డు పక్కన చిత్తు కాగితాలు లేరుకునే వ్యక్తీ.
మీ అమ్మ బిల్డింగు పనుల దగ్గర ఇటుకరాళ్ళు మోసే వ్యక్తీ. ఒక రోజు, ఓ పాడుబడ్డ భవనం దగ్గర జ్వరంతో పడుకున్నాను. అక్క్కడ ఆ పక్కనే పనిచేస్తున్న మీ అమ్మ నన్ను చూసింది. తన గుడిసెకు నన్ను తీసుకెళ్ళింది.
మనిషిని చేసింది.
మీ అమ్మకు కూడా ఎవరూ లేరు. గుళ్ళో పెళ్ళి చేసుకున్నాం నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు.
ఆ తర్వాత -----
నువ్వు పుట్టిన తర్వాత -
ఓ రోజు , రోజూలాగానే మీ అమ్మ కూలి కెళ్ళింది. ఇటికలు మోస్తూ , పాడుబడ్డ పక్కగా వెళ్తున్నప్పుడు ,
ఆ గోడ మీద పడి-----"
చెప్పడం ఆపాడు తండ్రి.
ఈ సంఘటనని తండ్రి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాడో తెలీదు .
"ఎందుకు తల్చుకుని, తల్చుకుని బాధపడతావ్ ......' తండ్రి కళ్ళు తన పైట చెంగుతో తుడుస్తూ అంది మాధవి.
"అదికాదమ్మా , మేమిద్దరం ....గడిపింది కొన్ని నెలలే అయినా ........నా మీద ఎన్ని ఆశలు పెట్టుకుందమ్మా.......మమ్మీ......నేను సంఘంలో పెద్ద వాడిని కావాలని ఎన్ని కలలు కందమ్మ మీ అమ్మ.......
ఇవాళ ------నేను ......ఇలా వున్నానంటే .......నా కష్టం ఒక్కటే కారణం కాదమ్మా.......
మీ అమ్మ ఆశ......ఆ ఆశే మనల్ని నడిపించిందమ్మా...."
చెప్పడం ఆపాడు ధనుంజయరావు.
"డాడీ నిన్ను నాలుగు రోజుల తర్వాత డిస చార్జ్ చేస్తానన్నారు. డాక్టర్లు....అప్పటికి నేను ఊటీ నుంచి వచ్చేస్తాను.......ప్రస్తుతం షూటింగ్ మధ్యలో వచ్చాను.....మార్నింగ్ ఫ్లయిట్ లో వెళ్తాను.....చెప్పింది మాధురి"
"నీ ఇష్టం - అలాగయితే .....కాసేపు రెస్టు తీసుకో అమ్మా...... కూతురి వేపు ప్రేమగా చూస్తూ అన్నాడు ధనుంజయరావు.
"నేను రెస్టు తీసుకోవడం కాదు. నీకు రెస్టు అవసరం ........పడుకో డాడీ" గదిలో లైటార్పి ఆ రూమ్ కి అనుకుని వున్న స్పెషల్ రూంలో కొచ్చింది.
బెడ్ మీద పడుకున్న మాధురికి నిద్రపట్టలేదు.
తండ్రి విషయంలో బెంగ తీరిపోయింది.
మాధురి ఆలోచనలు అకస్మాత్తుగా విమల్ వేపు మళ్ళాయి.
విమల్ గనక - బలవంతంగా ఊటీ నుంచి తనని పంపించి ఉండకపోతే ......
తను ఎదురుగా లేననే బెంగతో డాడీ చచ్చిపోయేవాడు.
"థాంక్యూ విమల్ . థాంక్యూ వెరీమచ్. " కళ్ళమీదకు నిద్ర ముంచుకొస్తున్న సమయంలో - అనుకుంది - అలా ఎన్ని సార్లో
విమల్ చిరునవ్వు ముఖం గుర్తు కొచ్చింది మాధురికి.
ప్రశాంతంగా నిద్రపోయింది.
సరిగ్గా ఆరుగంటలకు లేచి తయారైపోయింది.
తండ్రితో చెప్పి ఎయిర్ పోర్ట్ కొచ్చింది. ఓ అరగంట తర్వాత మధురి కోయంబత్తూర్ వెళ్ళే విమానంలో కూర్చుంది.