Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 11

 

    

హరీన్ ని, కరుణ ని చిన్న స్టూల్స్ లాగా వుండే చెట్ల మానుల మీద కూర్చోబెట్టారు గూడెంలో వుండే మరికొందరు. చిన్న పెద్ద, ముసలీ, ముతకా ఆడామగా వచ్చి హరీన్ వంక అమితాశ్చర్యంతో చూస్తూ వాళ్ళలో వాళ్ళు వారి భాషలో మాట్లాడుకుంటున్నారు.
ఆ గుమిగూడిన జనంలోంచి దూసుకుంటూ ఓ యువకుడు మెరుపులా హరీన్ ముందుకొచ్చి అతన్ని ఓ క్షణం నిర్నిమేషంగా చూశాడు. ఆ యువకుడి మొహంలో మహదానందం కన్పించింది.
"జింబురూకా పరికిమ్య కలబిసి యురాగోన హోమా" అని గావుకేకలు పెడుతూ పెద్ద గంతులేస్తూ సంబరపడిపోయాడు.
హరీన్ కి - కరుణకి ఇదంతా అయోమయంగా వుంది.
ఉన్నట్లుండి జనం కోలాహలం సర్దుమణిగింది - అంతా వినయంగా తలొంచుకుని ఓ పక్కకి తప్పుకున్నారు.
అప్పుడు చూశాడు హరీన్ ఆ వస్తున్న వ్యక్తిని .
ఆరున్నర అడుగుల ఆజానుభాహుడు - పులితోలు చుట్టుకుని వున్నాడు - బహుశా వాళ్ళ నాయకుడెమో!
ఆ వ్యక్తీ వచ్చి హరీన్ ముందు ఆగాడు. తీక్షణంగా అతన్నే చూస్తున్నాడు. కరుణ వణికిపోతోంది. అలా చూస్తున్న ఆ వ్యక్తీ కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి.
"జింబురూ' అనరుస్తూ హరీన్ ని కౌగలించుకుని మొహమంతా ముద్దులతో నింపేశాడు - హరీన్ కి చిరాకనిపించింది.
సాధారణంగా ఆటవికులు నరమాంసభక్షకులు. మనుషులు దొరకగానే హింసించి, రాచిరంపాన పెడతారని తను చదివాడు, సినిమాల్లో చూశాడేకాని ఇలా కన్నీళ్ళు పెట్టుకుని, కావలించుకుని, ముద్దులు పెట్టుకోవడం చాలా వింతగా అనిపించింది హరీన్ కి.
నాయకుడి పట్టునుంచి మెల్లిగా విడిపించుకున్నాడు హరీన్.
"బిడ్డా..నువ్వు.....నువ్వు సరింగా మా జింబురూలాగే వున్నావ్ బిడ్డా" అన్నాడు నాయకుడు. తనకి అర్ధమయ్యే భాషలో మాట్లాడినందుకు కాస్త సంతోషమనిపించినా, ఈ జింబురూ గోలేమిటో అర్ధం కాలేదు హరీన్ కి.
"నా బిడ్డ జింబూరూ మా గొప్ప వేటగాడూ బిడ్డా! ఓ మాసం క్రితం వేటకేడితే సింహం మీదికి ఉరికింది. ఉత్తచేతులతో ఆ సింహంతో కలబడ్డాడు నా బిడ్డ .....హోరాహోరీ గా పోరుసాగింది. సింహం నోరు సాగదీసి దాని దవాళ్ళు ఇరిపేసి సంపేశాడు. అమ్మోరి దయలేదు ......ఆ పోరులో ఒంట్లో రక్తమంతా పోగొట్టుకుని నా బిడ్డ నేలకొరిగిపోయాడు బిడ్డా!"
హరీన్ కి జాలనిపించింది - ఆటవికులు మనుషులే - వాళ్ళకీ ప్రేమానురాగాలు, మమతా వాత్సల్యాలు ఉంటాయ్!
"నా తల్లికి నూటరెండేళ్ళు బిడ్డా.....మనవడు సచ్చాదని తెలవగానే ఇరుసుకుపడిపోయింది. అడులేడన్నా బెంగతో కుంగిపోయింది. ఆబాధతోనే సచ్చిపోయేట్టుంది బిడ్డా....ఒక్కసారి నువ్వా ముసలదానికి అగపడితే పోయేముందైనా దానికి కాసింత మనశ్శాంతి మిగుల్తాది . కాదనకు బిడ్డా.....నీ తండ్రి లాంటోడ్నీ"
రెండు చేతులూ జోడించి ప్రాదేయపడుతున్న ఆ మనిషిని కాదనలేకపోయాడు హరీన్.
ఆ ఆటవికులు హరీన్ ని కాలు కింద పెట్టనివ్వలేదు. భుజాల మీద ఎత్తుకుని ఓ గుడిసెలోకి తీసుకెళ్ళారు.
ప్రాణభయం లేదని తెలిశాక కాస్త హాయిగా ఉపిరి పీల్చుకుంది కరుణ.
కాస్సేపటికి హరీన్ ని ఆ వ్యక్తులు పాకలోంచి బైటికి తెచ్చారు. పులితోలు కట్టుకుని పరమశివుడిలా కన్పిస్తున్నాడు హరీన్.
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భాస్మంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయశుద్దాయ దిగంబరాయ.
తస్మై 'న' కారాయ నమశ్శివాయః
తన చిన్నతనంలో అమ్మపాడే ఆ శ్లోకం స్పురణకి వచ్చింది కరుణకి.
అలా చేతులతో మోసుకుంటూనే మరో పెద్ద పాకలోకి తీసుకెళ్ళారు హరీన్ ని. ఆ పాకలో ఓ పండుముసలి అవ్వ మంచం మీద పడుకుని వుంది. చూపు సరిగా అనక కళ్ళకి చేతులడ్డు పెట్టుకుని చూస్తోంది.
"మాయ్...జింబురూకా అలస్తికా" అన్నాడు నాయకుడు. ఆ అవ్వ మోహంలో అరక్షణం ఆశ్చర్యం.
ఓ క్షణం సంభ్రమం
మరోక్షణం అనందం.
"జింబురూ" అంటూ చేతులు జాపింది.
హరీన్ ముందుకెళ్ళడు. అవ్వ వణుకుతున్న చేతులతో హరీన్ ని కావలించుకుంది. ఆమె కళ్ళ నిండా అనందాశ్రువులు.
"భోజా........." తన కొడుకు వైపు చూస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది.
"మాయ్.........." నాయకుడి ఆవేదన!
"జిం.....జింబురూ......."ఏదో చెప్పాలని విశ్వప్రయత్నం చేస్తూ అనందాతిశయంతో చిగురుటాకులా కదిలిపోతూ కన్నీరూ ధారాపాతంగా కురుస్తుండగా ...........ఆ పెదవులతో వణుకు ఆగిపోయింది. ఆ మనిషిలో చలనం ఆగిపోయింది.
రెండు వెచ్చటి కన్నీటిబొట్లు హరీన్ కళ్ళనుంచి జాలువారాయి.
"పోయినోళ్ళందరూ మంచోళ్ళు......
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!"

                                                                     10

నరమాంసభక్షకుల నాయకుడి తల్లి నిశ్చింతగా చనిపోయాక, బరువెక్కిన మనసుతో బయటికి వచ్చాడు హరీన్. గంభీరంగా వుంది అతని మొహం. ఆలోచనలో మునిగిపోయి అడుగులు వెయ్యడం సాగించాడు.
అతన్ని అనుసరించడానికి సాహసించలేదు ఎవ్వరూ. చివరికి కరుణ కూడా సందిగ్ధంగా చూస్తూ అక్కడే ఆగిపోయింది.
నెమ్మదిగా నడిచి వెళుతున్నాడు హరీన్.
అతని మనసులో మెదులుతోంది ఒకే ఆలోచన.
మరణశయ్య మీద వున్న తల్లి కోసం ఎంత తపించిపోయాడు ఈ ఆటవికుడు. మనవుడిని చూడకుండా మరణిస్తే ఆమెకు మనశ్శాంతి వుండదేమో అన్న వ్యధతో ముక్కూ మొహం తెలియని తనను తీసుకెళ్ళి కొడుకుగా పరిచయం చేశాడు.
కానీ నాగరికతా, మనోవికాసం వున్నాయని విర్రవీగే తనేం చేశాడూ? తల్లి మొహం తిరిగి చూడకుండా ఇల్లు వదిలి వచ్చేశాడు.
ఎన్నాళ్ళయింది అమ్మని చూసి!
దాదాపు పదేళ్ళు!
పంతం కోసం పదేళ్ళపాటు తల్లిని చూడని తనయుడుంటాడా? తను తప్ప!
కానీ తన పంతం తల్లితో కాదు. తండ్రితో.
తండ్రిని గుర్తుతెచ్చుకోకుండా వుండటానికి ప్రయత్నించాడు హరీన్. తండ్రి గుర్తుకు వస్తే తనకు మూడ్ పాడయిపోతుంది. అందుకనే తల్లిని తలచుకున్నాడు హరీన్.
అమ్మ!
చిన్నప్పుడు వురుములు వురిమినా, దూరంగా ఎక్కడో పిడుగులు పడినా తను భయపడిపోయి, పరిగెత్తివెళ్ళి అమ్మ కొంగులో మొహం దాచేసుకునేవాడు.
అమ్మ తన వెన్ను నిమిరి , :"అర్జునా , ఫల్గుణ .....' అని దండకం చదివి, తనకు ధైర్యం చెప్పి భయం పోగొట్టేది.
ఇప్పుడు అమ్మే దైన్యస్థితిలో వుంది. వెళ్ళి ఆమెకి ధైర్యం చెప్పి, పరిస్థితులు చక్కపరచవలసిన కర్తవ్యం తనకు లేదా?
తనకేం పట్టనట్లు దూరంగా వుండిపోవడం న్యాయమా?
పైన ఏదో కువకువశబ్దం వినబడితే తలఎత్తి చూశాడు.
ఒక పక్షి ముక్కుతో ఆహారం తెచ్చి తన పిల్లకు పెడుతోంది. కీచుకీచుమని ఆరుస్తూ తన ఎర్రటి చిన్న నోటిని తెరచి తల్లి తెచ్చిన ఆహారాన్ని తింటోంది ఆ పిల్ల. దానికి ఇంకా రెక్కలు కూడా రాలేదు. చిన్న దూదిబొమ్మలా వుంది చూడటానికి.
రేపు రెక్కలు వచ్చాక అది తన గూటిని,  తల్లిని వదిలేసి తన దారి తను వెతుక్కుంటూ వెళ్ళిపోతుందా?
తనలాగా?
నేరస్థుడిలాగా ఫీలయ్యాడు హరీన్. చుట్టూ చూశాడు ఒకసారి. ఆ పక్షులని చూస్తుంటే అమ్మ చెప్పిన కధ ఒకటి గుర్తొస్తోంది. ఒక అడపక్షి తన జంట అయిన మగపక్షి చనిపోతే, ఆ దుఃఖాన్ని భరించలేక చిన్న చిన్న గులకరాళ్ళు పోగుచేసి కడుపు బరువెక్కిపోయేలా వాటిని మింగి, చెట్టు కొమ్మ మీదనుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుందిట.
ఆ ఆడపక్షిలాంటిదే అమ్మ కూడా!
భర్త దుర్మర్గుడయిపోయాడని తెలిసినా కూడా, అయన తన మొహం చూడట్లేదానీ , మొహం చూపట్లేదనీ తెలిసినా కూడా అయన మీద అనురాగాన్ని చంపుకోలేక అతి హీనమైన స్థితిలో జీవచ్చవంలా అక్కడే రోజులు వెళ్ళదీస్తోంది.
కట్టుకున్నవాడికి, కన్నవాడికి, మధ్య పెరిగిన పట్టింపుల మధ్య నలిగి కృశించిపోయి మానసికంగా కృంగిపోతోంది.
కానీ తన తండ్రి?
అయన జల్సారాయుడిలాగా ఖుషిగా కాలం గడిపేస్తూ వుండివుంటాడు - తన రెండో భార్యతో.
ఎలా వచ్చింది నాన్నకి హటాత్తుగా అంత డబ్బు? లాటరీ వచ్చిందా? కాదు! లాటరీనే వచ్చి ఉంటే ఆ సంగతి అందరికి ధైర్యంగా చెప్పి వుండే వాడుగా? లాటరీ కాకపోతే మరింకేలా వస్తుంది ఒక్కసారిగా అంత డబ్బు?
నిన్నటిదాకా ఒక బాల్ కొనివ్వమని అడిగినా బాల్ పాయింట్ పెన్ను కొనివ్వమని అడిగినా డబ్బులేని కసిరి కొట్టిన తండ్రి ఇవాళ హటాత్తుగా అడక్కుండానే పార్కర్ పెన్నూ, షార్క్ స్కిన్ కోటూ కొనిస్తే ఏమనుకోవాలి? ఎలా వచ్చింది ఆయనకంత డబ్బు? అయన ఎప్పుడూ డబ్బు ధారాళంగా సంపాదించలేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఎన్జోవో అయన. చాలీ చాలని జీతం. బొటాబోటి ఖర్చులు.
అలా బతికిన మనిషి రాత్రికి రాత్రే ధనవంతుడయిపోయాడంటే ఏమిటి కారణం? ఏం జరిగింది?
కానీ జరగరానిది ఏదో జరిగి వుంటుందని మాత్రం నమ్మకం కుదిరింది. తండ్రి తెచ్చింది పాపపు సొమ్ము అన్న భావం బలంగా మనసులో నాటుకుపోయింది.
ఏం చేశాడు తండ్రి? ఎవరిని అన్యాయం చేశాడు?
ఆ అన్యాయం వాళ్ళ ఎవరు నష్టపోయారు?
ఆ నష్టపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎలా వున్నారు? బతికే ఉన్నారా అసలు?
జరిగిందేమిటో తెలుసుకోవాలనీ , తన తండ్రి వల్ల ఎవరికన్నా అన్యాయం జరిగి వుంటే వాళ్ళెక్కడున్నారో తెలుసుకుని, వాళ్ళు కనక ఒకవేళ దీనస్థితిలో వుంటే, తనకు చేతనయిన సాయం చెయ్యాలని తాపత్రయం తనకి.
కానీ ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు?
తండ్రి చెప్పడు.
ఆ పాపిష్టి డబ్బు వచ్చాక పూర్తిగా మారిపోయాడు. వున్న ఉళ్ళో మకాం ఎత్తేసి కొత్త ఉళ్ళో కాపురం పెట్టాడు. ఆస్తులు కొన్నాడు. వ్యాపారాలు పెట్టాడు. గొప్పవాడయ్యాడు.
తనకి వచ్చిన అనుమానమే అమ్మకి వచ్చింది. ఆ మాట కొస్తే ఆ అనుమానం ఎవరికైనా వస్తుంది. ఎలా వచ్చింది ఆయనకు అంత డబ్బు? ఆ డబ్బు వచ్చాక నాన్నకు డబ్బు యావ పెరిగింది.
డబ్బే లోకమై పోయింది. ఆ మాట కొస్తే ఆయనకు మొదటి నుంచి డబ్బు యావే! "జీతం రాళ్ళతో జీవితం ఏం గడుస్తుంది వరలక్ష్మి! కుప్పలు తెప్పలుగా, కట్టలు కట్టలుగా, లక్షలు లక్షలు, కోట్లు కోట్లు గడిస్తే గానీ బతుక్కి అర్ధం వుండదు. మనం బతుకుతున్నదీ ఒక బతుకేనా..........ఛీ! ఛీ!" అనేవాడే ఎప్పుడూ.

 Previous Page Next Page