"విక్రమదేవరావుగారి వంశంలో ఇంకా ఒక వారసుడు మిగిలే వున్నాట్ట! వాడి పేరు డైమెండ్ రాజట! నైట్ క్లబ్బు సింగరట! వాడి దగ్గరికెళ్ళడు జస్వంతరావు. పొద్దున్న వచ్చి యావదాస్తిని సకలహక్కు భుక్తాలతో స్వాధీనం చేసేసుకోమని ఆహ్వానించాడు వాడిని."
"ఆహా! అలాగా!"
నిటార్గా నిలబడి, సద్గుణం వైపు ఎగాదిగా చూశాడు సుందరం.
"ఇదిగో! నువ్వేం తెల్ల గుర్రం ఎక్కిలేవు గదా!
"లేదులే చెప్పు"
"మరి అంత తేలిగ్గా తీసేస్తావేమయ్యా మగడా! ఆ డైమెండ్ రాజాగాడు వచ్చాడంటే హోల్ మొత్తం పదివేల కోట్ల రూపాయల ఆస్తికి మనం తిలోదకాలు వదులుకోవాల్సిందే" అన్నాడు సద్గుణం తాపీగా.
"అంటే?" అన్నాడు సుందరం బుర్ర గోక్కుంటూ.
కులాసాగా అన్నాడు సద్గుణం.
"మా అమ్మాయి అయేషా వుంది గదా!"
"మీ అమ్మాయి పేరు అలివేలు మంగ కదా!"
"బాంబే వెళ్ళాక పేరు మార్చుకుందిలే! మా అయేషా మిస్సిండియా పోటీల్లో పార్టిసిపేట్ చెయ్యడానికి బోంబే వెళ్ళింది."
"మీ అమ్మాయి మిస్సిండియా కావడానికినూ, ఈ డైమండ్ రాజా రాకకి ఏంటి సంబంధం?" అన్నాడు సుందరం చిరాగ్గా.
కులుకుతూ చెప్పాడు సద్గుణం.
"అమ్మాయి బోంబే నుంచి బ్యూటీక్వీన్ గా తిరిగి వస్తుంది. ఈ అబ్బాయి డైమెండ్ రాజా వచ్చి రాజా ఆఫ్ రానీపూర్ పట్టాభిషేకం చేసుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరికీ నేను పెళ్ళి చేయించేస్తా! ఆ తర్వాత ఇంక మా అమ్మాయి , మా అబ్బాయి, మా ఆస్తినూ! నువ్వు మూటా ముల్లె సర్దుకోవడం మంచిది!"
"ఇది మిత్రదోహం! నీకు తగదు" అన్నాడు సుందరం ఉక్రోషంగా.
"ఇది ఆస్తి కోసం యుద్ధం! యుద్దంలో ఏమయినా చెల్లుతుంది.
న్యాయంగా అయితే నీకు పూర్తిగా ఉద్వాసనే చెప్పాలి! కానీ ఇన్నాళ్ళ నుంచి నన్ను కనిపెట్టుకుని వున్నావు కనుక దయతలచి కాస్త షేరిస్తా! విశ్వాసంగా ఉండు!" అన్నాడు సద్గుణం.
దాంతో సుందరానికి తిక్కరేగింది.
"ఇదిగో ! అంతా అయిపోయిందని సంబరపడకు! ముందుంది ముసళ్ళ పండుగ!" అన్నాడు కచ్చగా.
కుడి కనుబొమ్మ పైకి ఎత్తి ప్రశ్నార్ధకంగా చూశాడు సద్గుణం.
కసిగా, ఒక్కొక్క ఆక్షరం వత్తి పలుకుతూ చెప్పాడు సుందరం.........
"ఆ డైమండ్ రాజా, జస్వంతరావు మళ్ళీ ఈ పాలెస్ లో అడుగుపెట్టరు"
"ఏం? ఎందుకని?" అన్నాడు సద్గుణం.
"విమానంలో బాంబు పెట్టిన బాంబర్ గాడిచేతే ఇప్పుడు జస్వంతరావు కారులో కూడా ఒక బాంబు పెట్టించా! డైమండ్ రాజాని వెంటబెట్టుకు వచ్చి వాడు కారు డోర్ తెరిచాడా.......డాం!" అన్నాడు సుందరం.
"కొంపముంచావు గదయ్యా!" అన్నాడు సద్గుణం కంగారుగా.
* * *
డైమండ్ రాజా ఇంటి దగ్గర/............
తను ఇంటిలో వున్నంతసేపు తనని అంటిపెట్టుకుని ఉండి , రకరకాల అప్రభ్రంశాలు పలుకుతూ, అందర్నీ నవ్వించే భార్గవ్, తన కారణంగా అంత భయంకరమైన చావు చావడం చూస్తుంటే జీవితంలో మొదటిసారిగా కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి డైమండ్ రాజాకి.
కానీ తను విచారిస్తూ కూర్చోవడానికి ఇది సమయం కాదు. విచారిస్తూ కూర్చోగలగడం ఒక పెద్ద లగ్జరీ!
ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం భార్గవ్ తల్లిదండ్రులని ఉరడించడం..........
అది సాధ్యం కాని పని అని తెలుసు..........
అయినా కూడా.........
భార్గవ్ తల్లిదండ్రుల పక్కన కూర్చుని వాళ్ళని ఉరడించడానికి వ్యర్ధప్రయత్నం మొదలెట్టాడు రాజా.......
జస్వంతరావు పక్కా మిలటరీ ఆఫీసరులాగా, పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకున్నాడు.
అక్కడున్నవారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు.
ఆ తర్వాత, తను వెళ్ళి పోలీసులకి ఫోన్ చేశాడు.
దాదాపు తెలవారుతుండగా అప్పుడు దిగబడ్డారు పోలీసులు -
వచ్చిన పొలిసు అధికారి భార్గవ్ శవాన్ని అనాసక్తిగా , యధాలాపంగా చూశాడు.
"ఈ పిల్లవాడు ఆడుకుంటూ పడివుంటాడు. రాయి ఏదో తగిలి మరణం సంభవించి వుంటుంది" అన్నాడు తేలిగ్గా.
వింటున్న రాజా రక్తం మరిగిపోయింది.
"మరి ఈ ఉత్తరం ఏమిటి?" అన్నాడు బెదిరింపు ఉత్తరాన్ని చూపిస్తూ.
"కనబడుతూనే ఉందిగా -- కేసు తప్పుదారి పట్టించడానికి దాన్ని మీరే రాసి పెట్టి వుంటారు. " అన్నాడు పొలిసు ఆఫీసరు.
పిల్లాడిని చంపించిన వాళ్ళే పొలిసు అధికారిని కొనేసి వుంటారని కూడా రాజాకి అర్ధం అయింది.
"శవాన్ని పోస్ట్ మర్టమ్ చెయ్యాలి!" అంటూ భార్గవ్ శవాన్ని వ్యాన్ లోకి ఎక్కించమని ఆర్డర్ ఇచ్చాడు ఇన్స్ పెక్టర్.
తను కూడా వస్తానన్నాడు రాజా. ఈ గొడవ జరుగుతూ ఉండగానే తెల్లారిపోయింది.
పసివాడు భార్గవ్ శవంతో కదిలి వెళ్ళిపోయింది పొలిసు వ్యాను-
హృదయవిదారకంగా , గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది భార్గవ్ తల్లి -
"నేనూ వెళ్ళిపోతా! నేనూ వెళ్ళిపోతా!" అని సోకిస్తోంది.
రాబోయే పోస్ట్ మార్టమ్ రిపోర్టు నిజాయితిగా ఉంటుందన్న నమ్మకం అక్కడివారికి లేదు -
"లెటజ్ గో!" అన్నాడు డైమండ్ రాజా జస్వంతరావుతో త్వరత్వరగా - అంటూనే రోల్స్ రాయిస్ కారు దగ్గరికి వెళ్ళిపోయి, డోర్ తాలూకు హ్యాండిల్ మీద చెయ్యి వేశాడు అతను. హేండిల్ లాగితే, కారులో ఉన్న బాంబు బ్లాస్ట్ అయిపోతుందని అతనికి తెలిదు.
డైమండ్ రాజా ఆ రోల్స్ రాయిస్ కారు డోర్ హండిల్ మీద చెయ్యి వేసి ఓపెన్ చేసేలోగానే వెనకాతలనుంచి పెద్దగా కలకలం వినబడింది.
చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు రాజా.
రక్కసి మూకలా వున్న ఒక గుంపు.
కర్రలు, కత్తులు, కటార్లు, ఝూళపిస్తూ పరిగెత్తి వస్తున్నారు.
వాళ్ళ కళ్ళలో క్రౌర్యం!
కనుబొమ్మల మధ్య కుంకుమ బొట్టు!
ఒకప్పుడు -
సదాచారాలని సక్తమంగా పాటించేవాళ్ళు ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు బొట్టుని.
ఇప్పుడు బొట్టుకి పవిత్రత లేదు.
కొంతమందికి అదొక సింబల్ గా మాత్రం మారింది.
పార్టీలు ఫిరాయించడానికి వెళుతూ కూడా వీరగంధం పూసుకున్నట్లు ఇంతేసి పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకునేవాళ్ళని చూశాడు రాజా.
ఆ రక్కసి మూకలోంచి ఒకడు గొంతు చించుకున్నట్లు పెద్దగా అరిచాడు.
"అందరూ ఇళ్ళలోకి వెళ్ళండి! ఇయ్యాల డే అండ్ నైట్ బంద్ రాస్తారోకో! రైల్ రోకో! ధర్నా! అన్ని! ఇయ్యాల ఎవ్వరు, పాలు నీళ్ళు కూడా తాగడానికి లేదు!" అంటున్నాడు బడితే తిప్పుతూ.
"ఏమయింది?" అన్నాడు డైమండ్ రాజా అతన్ని నిశితంగా చూస్తూ.
"తెల్డా! రామ్ లూని ఖతం చేసిండ్రూ!"
"ఎవరు! రౌడీ రాములా?"
"లీడర్ రాములు"
"రాములు చచ్చిపోయాడా?"
"చంపిండ్రు బద్మాష్ గాల్లు! అందుకే ఇయ్యాల డే అండ్ నైట్ బంద్! రాస్తారోకో! రైల్ రోకో! పాలూ! నీళ్ళు మందులు అన్నీ బంద్" అన్నాడు గుండా.
"రౌడీ రాములు చచ్చిపోతే బంద్ ఎందుకు!" అన్నాడు రాజా.
"రామ్ లూ మా లీడర్!"
"రాములు ఒక రౌడీ! రౌడీ మామూళ్ళు వసూలు చేస్తాడు. మానభంగాలు చేస్తాడు. రాములుకి అనేకమంది ప్రత్యర్ధులు ఉన్నారు. పవర్ కోసం వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారు. ఇంతకు ముందు రాములు కనీసం పాతికమందిని చంపి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ తాలూకు వాళ్ళు రాములుని చంపి ఉంటారు. కత్తితో బతికేవాళ్ళు, కత్తితోనే చస్తాడని సామెత! మధ్యలో ప్రజలనెందుకు చంపుతారు!" అన్నాడు రాజా ఉద్వేగంగా.
"ఏం తమ్మి! ఎక్వతక్వ మాట్లాడుతున్నావ్! సర్కార్ పార్టీనా నీది?" అన్నాడు గూండా మీది మీదికి వస్తూ.
"మాది ఏ పార్టీ కాదు! ప్రజల పార్టీ! అన్నాడు రాజా.
అతని రక్తం సలసల మరిగిపోతున్నట్లు అనిపించింది.
పార్టీలు, రాజకీయాలు, కక్షలు, పవర్ - అంతే - ప్రజలతోడు అక్కర్లేదు ఎవ్వరికీ!
"అరె! జర్గురా! ఏం వాగుతున్నావ్!" అన్నాడు గుండా ఆగ్రహంగా.
ఇంతలో -