Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 11

 

    "అమ్మో! అవి తేళ్ళు - మండ్రగబ్బాలునూ! విషప్పురుగులు! మనం వాటికీ దూరంగా ఉంచడమే మంచిది" అనుకుని ఉరుకుంటే అవి ఇవాళ కాకపోతే రేపు మన ఇంట్లోకి వచ్చి మనల్ని కాటేయ్యవచ్చు -


    సొసైటీలో ఎక్కడయినా సరే మాములుగా జరిగేది అదే! రౌడియిజమే ఉంది.


    "మనం రౌడిలకు దూరంగా వుంటే ఈ రౌడియిజం మనల్నేం చేస్తుంది! అనుకుంది పాతతరం.


    కానీ ఇవాళ ఆ రౌడియిజం మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని విచక్షణ లేకుండా అందరిని తన గుప్పెట్లో ఇరికించుకుంటోంది. చివరికి రాజకీయాలు కూడా రౌడీల చేతుల్లోకి పోయాయి.


    సరే! మళ్ళీ ఉదాహరణకి వస్తే మనం ఏం చెయ్యాలి?


    బండని పక్కకి తొయ్యాలి. అక్కడ ఉన్నదేదో మనకి సరిగ్గా కనబడకపోతే టార్చ్ లైట్ వేసి మరి చూడాలి. తేళ్ళు వుంటే చెప్పుతోనే కొట్టాలి. చంపాలి!


    అంతేగాని!

 

    అమ్మో అక్కడున్నది తేలు! నేనేమో మంచిదాన్ని! నేను దాని జోలికిపోకపోతే అది నాజోలికి ఎందుకు వస్తుంది? అంచేత దాని ఉసే నాకు అనవసరం! అనుకుంటే ఇవాళ - కాకపోతే రేపు -రేపు కాకపొతే ఎల్లుండి తేలు నిన్ను కుట్టడం ఖాయం!


    సరిగ్గా అందుకే - తను ఆ ఫ్లెష్ ట్రేడ్ గురించి అంతు తెలుసుకోవాలి.


    అంతా తెలుసుకున్నాక .........


    అప్పుడింక తిరగాబడాలి!


    ఎవరూ తనవెంట రాకపోయినా సరే - ఒంటరిగా తనొక్కతే తిరగబడుతుంది.


    ష్యూర్!


    అలా ఒక నిశ్చయానికి వచ్చాక, "సెక్స్ ఇండస్ట్రి గురించి మల్ హోత్రా ఇచ్చిన మిగతా నోట్సు , మేటరూ మళ్ళీ చదవడం మొదలెట్టింది మీనాక్షి.


    కొంత చదివి తర్వాత అసహ్యంగా మొహం చిట్లించి , అప్రయత్నంగానే , ఇంకొన్ని పేజీలు  తిప్పేసింది.


    తర్వాత ఒక పెజీలో రాసి వుంది.


    "అమ్ స్టర్ డామ్ నగరంలో ఒక ఎరోటికల్ మ్యూజియం, ఒక సెక్సు మ్యూజియం ఉన్నాయి - పురాతన కాలం నుంచి శృంగారంలో ఉపయోగపబడిన సాధనాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాంటి మ్యూజియం మన హోటల్లో సెల్లార్ లో పెట్టవచ్ఘు.


    అసహనంగా ఇంకొన్ని పేజీలు  తిప్పింది మీనాక్షి.

 

    "ఫాన్స్ లో లైన్ షోలు ఎక్కువ! పారిస్ లో యివి మరీ ప్రసిద్ది!"

    
    "బార్ సెలోనాలో వేశ్యలు క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు."


    "కోపెన్ హెగెన్ లోని క్లబ్ 20 కి వెళ్ళే జంటలు కంపల్సరీగా పార్టనర్స్ ని మార్చుకోవాలి.


    గ్రూప్ సెక్స్ తప్పనిసరి."


    అతి జుగుప్సాకరంగా వున్న వివరాలు వదిలేసి ముఖ్యమయిన సమాచారం మాత్రమే చదువుతూ వున్నా కూడా మీనాక్షి కి వికారం కలిగినట్లయింది.


    ఆ వెగటు పోవాలంటే నోట్లో యాలక్కాయో, లవంగమో పెట్టుకోక తప్పదనిపించింది.


    వీళ్ళు మనుషులా? జంతువులా?


    అబ్బే! జంతువులు కూడా కాదు!


    జంతువుల శృంగారానికి కూడా ఒక సీజన్ ఒక నియమము వుంటాయి -


    ఈ ఇరవయ్యో శతాబ్దపు మనుషులు మాత్రం పశువులూ , పక్షుల కంటే దిగజారిపోయి.........


    చీ చీ....

    
    మీనాక్షి అలా అనుకుంటూ ఉండగానే.........


    తలుపు దబదబా చప్పుడయింది.


    ఉలిక్కిపడి లేచి కాయితాలు కనబడకుండా ఆదరాబాదరాగా పక్కన పెట్టేసి, పమిట సవరించుకుంటూ తలుపు తీసింది మీనాక్షి.


    అక్కడ-


    గుమ్మానికి అడ్డంగా నిలబడి వున్నాడు సర్కిల్ యిన్స్ పెక్టర్!


    గుమ్మంలో హటాత్తుగా ఓ పొలిసు ఆఫీసర్ ని చూసేసరికి షాకయింది మీనాక్షి!


    సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఉపోద్ఘాతం ఏమి లేకుండానే అన్నాడు.


    "మల్ హోత్రా ఇక్కడికి వచ్చాడా?"


    మీనాక్షి మోహంలో కన్ ఫ్యుజన్, భయమూ రెండూ కనబడ్డాయి.


    "ఏమిటి......?" అని అంతలోనే 'అవును' అంది.


    "లోపల ఉన్నాడా?" అన్నాడు సర్కిల్ పౌరుషంగా.


    తల కొట్టేసినట్లయింది మీనాక్షికి.


    "ఎక్కడికెళ్ళాడు?"


    "తెలిదు! ఒక అరగంట క్రితం వచ్చి వెళ్ళాడు. "మీనాక్షి గొంతు వణుకుతోంది. గొంతుతోబాటు ఒళ్ళు కూడా వొణకడం మొదలెట్టింది.


    ఆమె పరిస్థితిని గమనించాడు సర్కిల్. కొంచెం మృదువుగా మారింది అతని గొంతు.


    "భయపడకమ్మా! మల్ హోత్రాగాడు మహా కిలాడి! వాడిని అరెస్ట్ చేస్తున్నాం. నువ్వు పొలిసు స్టేషన్ కు వచ్చి హోటల్లో జరిగినదంతా రాసి సంతకం పెట్టాలి. అరగంటలో నిన్ను ఇక్కడ దింపేస్తాం" అన్నాడు.


    ఒక్కక్షణం తటపటాయించి , ఆ తర్వాత ఒక్కసారి తన తల్లి వైపు చూసి, సర్కిల్ తో బాటు నడిచింది మీనాక్షి.


    ఆమె ఎక్కి కూచోగానే , జీపు కదిలి, తక్షణం వేగం అందుకుంది.


    పావుగంట ప్రయాణం చేశాక హటాత్తుగా ఒక పెద్ద బంగాళా తాలుకు గేట్లో ప్రవేశించింది పొలిసు జీపు.


    "ఎక్కడికి!" అంది మీనాక్షి భయంగా.


    నవ్వాడు సర్కిల్.


    "దేశ్ పాండే దగ్గరికి" అన్నాడు.


    "దేశ్ పాండే ఎవరూ?"


    "వాడు మల్ హోత్రాకి రైవల్! గట్టి ప్రత్యర్ధి!" అన్నాడు ఇన్ స్పెక్టర్.


    "అతని దగ్గరికి నేనెందుకు?"


    "నిన్ను అతనికి హేండోవర్ చేసేస్తున్నాం"


    "వాటీజ్ దిస్?" అంది మీనాక్షి కోపంగా......


    మళ్ళీ నవ్వాడు ఇన్ స్పెక్టర్.


    "సింపుల్! మల్ హోత్రా గాడు నాకు ఇవ్వాల్సిన మామూలు ఎగ్గోట్టాడు. వాడి విరోధి అయిన దేశ్ పాండే నాకు దండిగా డబ్బు ముట్టచెప్పాడు.


    అందుకని నా సపోర్టు దేశ్ పాండేకే! వాడు చేసే దందానే వీడూ చేస్తాడు. నీకు మాత్రం ఎవరిదగ్గరున్నా ఒక్కటే!" అన్నాడు.


    తక్షణం పెద్ద గా అరవబోయింది మీనాక్షి.


    వెంటనే - వెనకనున్న ఒక కానిస్టేబుల్ మొరటుగా ఉన్న చేత్తో ఆమె నోరు నొక్కేశాడు. అతని రెండో చేతిలో వున్న సర్విస్ రివాల్వర్ మీనాక్షి నడుముని చల్లగా తాకుతోంది.


    "అరిచి అల్లరి చేయ్యాకు" అన్నాడు ఇన్ స్పెక్టర్ కటినంగా.

 

                                                    * * *


    "రాణీ పూర్ పాలెస్ లో........


    అక్కడ రెండు పెద్ద హాల్సు వున్నాయి. ఒకదాని పేరు దివాన్ - ఏ- అమ్. రెండో దాని పేరు దివాన్- ఏ- ఖాస్.


    మొగలాయి పద్దతిలో పెట్టిన పేర్లు అవి.


    అందులో "దివాన్ - ఏ- అమ్" (???) అంటే రాజు తన ప్రజలకు దర్శనమిచ్చే దర్బారు హాలు. బహుశా దివానే అమ్ లో నుంచే దివాణం అనే పదం వచ్చి వుంటుంది.


    "దివానే ఖాస్" అంటే రాజు తన మంత్రులతో, సన్నిహితులతో , యంత్రాంగంతో సాగించే చోటు.


    రాణీపూర్ పాలెస్ లోని దివానే అమ్ హాలు తాలుకు గోడలు, కప్పు అంతా కూడా అంగుళం ఖాళి లేకుండా బంగారు లతలు నగిషితో నిండిపోయి వుంది. నేలంతా ఇటాలియన్ పాలరాయి!


    అక్కడ ఒక పెడగా నిలబడి వున్నారు సూట్ వాలా సుందరం, ధోవతి , షర్టులలో వున్న సద్గుణం. వాళ్ళిద్దరూ విక్రమదేవరావుగారు పెట్టిన ట్రస్టీలు. సుందోపసుందుల్లా కరటక దమనకుల్లా ఉంటారు వాళ్ళు.


    చింతపండు బస్తాలా ఉన్న సుందరం తన నోట్లో వున్న ఒక కట్ట తమలపాకుల నములుతూ అన్నాడు!


    "లేటెస్ట్ డెవలప్ మెంట్స్ ఏంటని అడగవెం?"


    "ఏం డెవలప్ మెంట్స్?" అన్నాడు సద్గుణం అనాసక్తిగా.


    "మన జస్వంతరావుగాడు విక్రమదేవరావుగారి వారసుణ్ణి పట్టేశాడు" అన్నాడు సుందరం డ్రమేటిక్ గా.


    "అయితే?" అన్నాడు సద్గుణం విసుగ్గా.


    తెల్లబోయి చూశాడు సుందరం.


    "అటంబాంబుకి బాబులాంటి సమాచారం చెపితే ఆ బ్లాంక్ ఫేసెంటి?" అన్నాడు అనుమానంగా.


    "చెప్పదల్చుకున్నది త్వరగా చెప్పు!" అన్నాడు సద్గుణం.

 Previous Page Next Page