Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 13

 

    పుత్రశోకం మళ్ళీ ఉప్పెనలా పొంగిరాగా, పెద్దగా శోకించడం మొదలెట్టింది భార్గవ్ తల్లి.


    ఆమె భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు రాజా. తర్వాత ఆ గూండాతో కటువుగా అన్నాడు.


    "ఈ పిచ్చితల్లి కన్న కొడుకుని కూడా ఎవరో దారుణంగా చంపేశారు. మరి ఇట్లాంటి వాటికి మీరింత హంగామా చెయ్యరేం?"


    "ఈ పోరగాడి ప్రాణం, మా లీడర్ సాబ్ ప్రాణం ఒక్కటే నంటావ్ రా?"


    "మీ రౌడీ లెదరు ప్రాణంకంటే మాకు ఏ పాపం ఎరగని ఈ పాపడి ప్రాణాలే ఎక్కువ అంటాను - అడ్డంలే - అర్జెంటుగా మేం హాస్పిటల్ కి వెళ్ళాలి!"


    "ఓలూ కూడా అంగుళం కధల్నికి లేదు!" అన్నాడు గూండా.


    బలంగా అతన్ని పక్కకి నెట్టేశాడు డైమండ్ రాజా.


    రౌడీ బడితే కిందపడేసి, పక్కనున్నవాడి చేతిలోని మరకత్తిని పట్టుకుని "నర్కుతా" అంటూ కత్తిని పైకెత్తాడు.


    మెరుపులా గాల్లోకి ఎగిరి, కాళ్ళు వాళ్ళవైపుకి గురిపెట్టి, రాకెట్ లా దూసుకెళ్ళాడు రాజా.


    కత్తిపట్టుకున్న రౌడీ వెనక్కి విరుచుకుపడ్డాడు. అతనితో బాటు మరో పదిమంది కూడా కిందపడ్డారు.


    వెంటనే గందరగోళం మొదలయింది.


    తనకి వందకాళ్ళు, వెయ్యి చేతులు ఉన్నట్లు ఎక్కడ చూసిన తనే కనబడుతూ, దొరికిన రౌడీగాడినల్లా, ఉతికేస్తున్నాడు రాజా.


    ఆ గందరగోళంలో అతను కారుకి చాలా దూరంగా వెళ్ళిపోయాడు.


    జస్వంతరావు అసలే ఎక్స్ సర్విస్ మాన్. అతను ఏమాత్రం తొణక్కుండా ఒక్కొక్క దెబ్బా కొడుకుతుంటే రౌడీలు, కాళ్ళు, చేతులు, బెణికి ఏడుస్తూ కిందపడుతున్నారు.


    ఇంతలో -


    ఒక గూండాగాడు ఉన్మాదం పూనినట్లు రోల్స్ రాయిస్ కారువైపు పరిగెత్తాడు -


    రోల్స్ రాయిస్ అంటే ప్రపంచంలో అతి ఖరీదైన కార్లలో ఒకటి. రోల్స్ రాయిస్ , ఫేర్రారీ - ఇలాంటివి మల్టి మిలియనీర్సు తప్ప కొనలేరు.


    అందులోను ఈ రోల్స్ రాయ్స్ కారు కస్టమ్ బిల్డ్. రాజా విక్రమదేవరావు ప్రత్యేకంగా తనకోసం చేయించుకున్న కారు అది. లోపల వైపు డోర్ హండిల్స్ బంగారపువి ఉన్నాయి. బ్యాక్ సీట్ని, ఫ్రంట్ సీట్ ని డివైడ్ చేస్తూ ఒక గ్లాస్ పార్టీషన్ ఉంది. మీట నొక్కితే అది మూసుకుపోతుంది. మళ్ళీ మీట నొక్కితే అది తెరచుకుంటుంది. బ్యాక్ పోర్షన్ విశాలంగా ఉంది. చాలా సౌఖ్యంగా ఉన్న సీట్లు. అందులోనే చిన్న బార్, చిన్న టివీ స్టీరియో , సెల్యులార్ ఫోన్.


    అత్యంత విలాసకరంగా ఉన్న ఆ కారు దగ్గరికి పరిగెడుతూ వెళ్ళాడు ఆ రౌడీ.


    అతనితోబాటు ఇంకో పదిమంది గూండాగాళ్ళు కూడా పరిగెత్తారు.


    తలో చెయ్యి వేసి, ఆ కారుని మొరటుగా ఒకవైపు నుంచి పైకి లేపారు.


    డైమండ్ రాజాని  ఫినిష్ చేసెయ్యడానికిగానూ ట్రస్టీ సుందరం పెట్టించిన బాంబు అందులో ఉంది.


    ఆ సంగతి డైమండ్ రాజాకి తెలిదు.


    ఆ రౌడీలకు కూడా తెలిదు.


    కారు నెమ్మదిగా ఒరగడం మొదలెట్టింది.

 

    
                                                   * * *


    మీనాక్షి దేశ్ పాండే బంగళాలో దింపేశాడు ఇన్ స్పెక్టర్.


    సంతలో పశువుని చూసినట్లు మీనాక్షిని పట్టిపట్టి చూశాడు దేశ్ పాండే.


    ఆరడగుల ఎత్తు ఉన్నాడు అతను. చాలా పెద్దవిగా, ఎర్రవిగా ఉన్న కళ్ళు. మిడిగుడ్లు మొహం కుడివైపున అంతా యాసిడ్ తో కాలిపోయి ఉంది. ఒక కొట్లాటలో అతనిమీద యాసిడ్ పోసి అట్లా చేసేశారు ప్రత్యర్ధులు. దాని ఫలితంగా అతని చెవికి ఏదో అయింది. అతని ఎడమ చెవిలో నుంచి కొద్దిగా చీము కారుతూ ఉంటుంది.


    హటాత్తుగా చూస్తే దడుచుకునే స్వరూపం దేశ్ పాండేది.


    ఎడంచేతిని నిర్లక్ష్యంగా సిల్కులాల్చి జేవులో పెట్టి అందినన్ని వందరూపాయలనోట్లు తీసి ఇన్స్ పెక్టర్ కి ఇచ్చాడు దేశ్ పాండే.


    "ఏం సుదర్శన్! హపీగా ఉన్నావా?" అన్నాడు.


    "దేశ్ పాండే భాయ్! నువ్వు ఉన్నంక ఇంక మేం హేపీగా ఎందుకుండమ్?" అన్నాడు ఇన్ స్పెక్టర్ చేతివేళ్ళ
తోనే తడిమి నోట్లు ఎన్ని ఉన్నాయో అంచనా వేస్తూ.


    "మంచిది సుదర్శన్! ఎల్లిరా! సాయంత్రం కలుస్తావులే? ఖానా పీనా బజానా అన్నీ ఉంటాయ్! మినిస్టర్ సాబ్ కూడా వస్తుండు!"


    "నేను రాకుండా దావత్ ఎట్ల జరుగుతది?" అన్నాడు ఇన్ స్పెక్టర్ నవ్వుతూ. అని నడుం దగ్గర్నుంచి ముందుకి ఒంగి సలాం పెడుతున్నట్లు వందనం చేసి వెళ్ళిపోయాడు ఆ సర్కారీ ఆఫీసరు.


    "అరె ఎవడ్రా అక్కడ! నువ్వేనా రాంనారాయణ్! నేను జర బయటికేల్లోస్తా! ఈ చొక్రిని సక్కగ చూడు! నా గదిలో ఉంచు! నేను అప్పటికి వస్తా!" అంటూ తన జీపు ఎక్కాడు దేశ్ పాండే. జీపు రాష్ గా వెళ్ళిపోయింది.


    ఇదంతా కులలగా ఉంది ఆఠీన్ రాణీ మీనాక్షికి. పెనుగులాడుతున్న మీనాక్షిని బలంగా నెట్టుకుంటూ దేశ్ పాండే గదిలోకి తీసుకెళ్ళాడు. రామ్ నారాయణ్. ఆమెని మోటుగా గదిలోకి తోసేసి, వెంటనే బయట నుంచి గడియ పెట్టి, తాళం వేసేశాడు. తాళం చెవి జేబులో వేసుకుని, ఒక అడుగు వెనక్కి వేసి, మూతబడి ఉన్న తలుపు వైపూ, బోదురుకప్పలా వేళ్ళాడుతున్న తాళం వైపూ చూసి తృప్తిగా తలపంకించి ఆలూ పరాటాలు తయారుచేసే నిమిత్తం కిచెన్ లోకి వెళ్ళాడు.


    మీనాక్షిని పకడ్భందిగా గదిలో బంధించానని అనుకున్నాడు రాంనారాయణ్.


    కానీ-


    అతను, దేశ్ పాండే కూడా మర్చిపోయిన విషయం ఒకటి ఉంది.


    మీనాక్షి బందీ అయి ఉన్న దేశ్ పాండే రూంలో టెలిఫోన్ వుంది.


    ఉంది కాదు - ఉన్నాయ్! రెండు టెలిఫోన్లు!


    ఆ గదిలోకి వెళ్ళివెళ్ళగానే ఆ విషయం గ్రహించింది మీనాక్షి.


    ఈ గదిలో ఫోన్ ఉంది!


    డాక్టర్ లత భర్త అలోక్ ఆఫీస్ ఫోన్ నెంబర్ తనకి తెలుసు! వాళ్ళ ప్లాట్ లో ఉన్న ఫోన్ నెంబరు తనకి తెలుసు! డాక్టర్ లత వాళ్ళ హాస్పిటల్ నెంబరు కూడా తనకి తెలుసు!


    వీటిలో ఏ ఒక్క నెంబరు దొరికినా ,తను ఈ అపాయంలోనుంఛి బయటపడిపోతుంది!


    దేశ్ పాండే మధ్యాహ్నం దాకా రాడు!


    ఆలోగా తను ఫోన్ చేసేస్తే........


    లతా, అలోక్ వచ్చేసి తనని తీసుకెళ్ళిపోతారు. దట్ సింపుల్!


    ఈ దేశ్ పాండేగాడు డిటెక్టివ్ పుస్తకాలు ఎప్పుడూ చదవడేమో! చదివి ఉంటే , ముందుగా ఈ గదిలో ఫోన్ కనెక్షన్ తీసేసి వుండేవాడు.


    కొంపదీసి ఆ పని ఇప్పటికే చేసెయ్యలేదుగదా!


    ఒక్క అంగలో టెలిఫోన్ దగ్గరికి వెళ్ళిపోయింది మీనాక్షి. రిసీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది.


    ర్ ర్ ర్ ర్ .......అని డయల్ టోన్ వినబడుతోంది.


    స్థిమితపడి , దీర్ఘంగా శ్వాసతీసుకుని, అలోక్ ఆఫీస్ నెంబరు డయిల్ చేయడం మొదలెట్టింది మీనాక్షి.


    ఉన్నట్లుండి-


    లైన్ డేడ్ అయిపొయింది!


    ఏమయింది?


    హటాత్తుగా ప్రాణభయం పట్టుకున్నట్లు అయిపొయింది మీనాక్షికి.


    ఏమయింది?


    ఏమయింది?


    లైన్ పాడయిపోయిందా?


    సరిగ్గా అదే టైంలో.........


    ఒక చిన్న దొంగ , అక్కడికి దగ్గరలోన ఉన్న టెలిఫోన్ స్థంభం ఎక్కి, కాపర్ వైర్లు కట్ చేసి కాన్వాస్ భ్యాగులో వేసుకుని తీరిగ్గా స్థంభం దిగి వెళ్ళిపోయాడు.


    అతని వృత్తే అది! టెలిఫోన్ వైర్లు కట్ చేసి అమ్ముకురావడం! అతను రెండురోజుల క్రితమే నాగ పూర్ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యాడు. అందుకే దేశ్ పాండే తడఖా తేలిక ఈ లోకాలిటిలో దొంగతనానికి వచ్చాడు.


    ఆ సంగతి అర్ధంకాని మీనాక్షి భయంతో, వివశురాలయపోతూ టెలిఫోన్ లో మళ్ళీ డయల్ టోన్ వస్తుందేమోనని విశ్వప్రయత్నం చేస్తోంది.


     తను ఈ ప్లేష్ ట్రేడర్స్ తో కలిసిపోయినట్లే ఉండి, ఏదో ఒక రోజున చల్లగా వాళ్ళ భరతం పడుతానని ఉహించింది గాని,


    ఇప్పుడెం జరుగుతుంది?


    ఇంక తనని రక్షించేవాళ్ళెవరు!


    ఇంతలోనే -


    అన్ చేసివున్న టీవిలో నుంచి భక్తీ పారవశ్యంతో ఒక పాట వినబడడం మొదలెట్టింది.


    చిరపరిచితమైన గొంతు!


    లత!


    లతామంగిష్కర్ కాదు!


    డాక్టర్ లత!


    విభ్రాంతితో చూస్తూ వుండిపోయింది మీనాక్షి.


    అవును! నిజమే!


    డాక్టర్ లత టీవి స్కీన్ మీద కనబడుతోంది. పాడుతోంది తను!


    "బ్రోచేవారెవరురా ..........నినువినా.......రఘువరా..........నీ చరణాంబుజమూలనే విడజాల......కరుణాలవాల........."


    "అక్కా!" అంది మీనాక్షి పెద్దగా, పట్టలేని సంతోషంతో - లత నిజంగానే తన ఎదురుగా నిలబడి వున్నట్లే ఫీలవుతూ!


    కానీ - ఆ పిలుపు లతకి ఎలా వినబడుతుంది? టీవిలో పాడుతూనే వుంది లత.


    "..........వాతాత్మజార్చిత -


    నా మొరలను వినరాదా!


    ఆతురముగా కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవుకదా........"


    "అక్కా! లతక్కా!" అంది మీనాక్షి మళ్ళీ.


    లత పాడుతూనే వుంది.


    "నా పాతకమెల్ల బోగొట్టి గట్టిగ నా చేయి బట్టి విడువక ........."


    అప్పుడు హటాత్తుగా స్పృహలోకి వచ్చినట్లయింది మీనాక్షికి. తన ఎదురుగా నిజంగా డాక్టర్ లత లేదు!


    అందులో కనబడుతుంది డాక్టర్ లత ప్రతిరూపం! మీనాక్షి కళ్ళలో నీళ్ళు నిలిచాయి -


    నిజంగానే -


    ఇంక తనని రక్షించే వాళ్ళెవరూ?


    లత పాడుతూనే ఉంది.


    "బ్రోచే.......వారెవరురా.....నినువినా.......రాఘవరా.........."

 

                                                  * * *


    రోల్స్ రాయ్స్ కారుని ఒక్కసారిగా దొర్లించారు గూండాలు.


    కారు వెల్లకిలా పడింది -


    తక్షణం -


    బ్రహ్మాండం బద్దలైపోయినట్లు శబ్దం!


    కారులో ఉన్న బాంబు పేలింది.


    కత్తి పట్టుకుని ఉన్న గూండాగాడి చెయ్యి అతని శరీరం నుంచి విడివడి, గాల్లో వందగజాల ఎత్తున ఎగిరింది.


    కారులో నుంచి పెనుమంటలు లేచాయి.


    బంద్ చేయించడానికి వచ్చిన రౌడీమూకల్లో సగంమంది దారుణమైన చావు చచ్చారు.


    వెంటనే -


    అప్పటిదాకా దూరంగా నిలబడి ఉన్న ఆ బస్తి జనంలోంచి హర్షద్వానాలు వినబడ్డాయి.


    అప్పటిదాకా బంద్ ని 'జయప్రదం' చేసిన ఆ బక్కజీవులంతా వచ్చి కచ్చగా ఆ శవాల మీద ఉమ్మేశారు.


    ఒక శతవృద్దు అయిన స్త్రీ ఇంకోసారి ఓ గూండా శవం మీద ఉమ్మేసి, "మా ఉసురు తగిలిందిరా మీకు! రెక్కాడితే గాని డొక్కాడని బీదోళ్ళని బందు పేరుతొ చంపుకు తింటార్రా, గాంధీగార్ని నేను జూసిన! ప్రజలకోసం సత్యాగ్రహం చేయించరయాన. హర్తాళ్ళు చేయించాడు! చివరికి ప్రజల కోసమే చచ్చిండు! మీరు! మీరు! మీ కోసం ప్రజల్ని పలావు వండుక తింటార్రా! ధూ!" అని ఖండ్రించి మళ్ళీ ఉమ్మేసింది.


    చుట్టూ పరిశీలనగా చూశాడు డైమండ్ రాజా.

 Previous Page Next Page