Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 12


    
    దగ్గరకొచ్చింది శశి దయగా చూసే పెద్దపెద్ద కళ్ళు. 'నిర్దయగా నలిపెయ్యాలి' అనిపించే ఒళ్ళు. చిరునవ్వుతో అరవిచ్చుకున్న పెదిమల మధ్య మల్లెపూల దండలాంటి పలువరస.
    
    "వెల్ కమ్ టు హైదరాబాద్!" అన్నాడు సుధీర్ సరదాగా.
    
    "థాంక్యూ!" అంది మెల్లగా నవ్వుతూనే.
    
    "మూడు రోజులయింది నిన్ను చూసి. మూడు రోజులయింది నిన్ను చూడక."
    
    "అందుకే రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేశాను" అంది ఇష్టంగా అతని వైపు చూస్తూ.
    
    "నా కోసం కాదు - నీ పేషెంట్లకోసం."
    
    "మీరూ నా పేషెంటే." అంది నవ్వేస్తూ. "ప్రేమ జ్వరం! పెళ్ళయి అయిదేళ్ళయినా తగ్గలేదు."
    
    సుధీర్ భుజాలెగరేశాడు. తర్వాత లగేజ్ కౌంటర్ దగ్గరి కెళ్ళాడు - సూట్ కేస్ తీసుకురావడానికి.    
    
    కాఫీ స్టాల్ దగ్గర నిలబడి వుంది శశి. దాదాపు ఎయిర్ పోర్టులో ఉన్న ప్రతి మగాడూ శశివదనని ముందునుంచి చూసి తర్వాత పక్కగా నడుస్తూ ఆమె ఫ్రొఫైల్ ని దొంగ చూపులతో చూసి, ఆమెని దాటి వెళ్ళిపోయాక మళ్ళీ తల వెనక్కి తిప్పి ఆమెని వెనకనుంచి చూస్తున్నారు. వెనుకనుంచి చూసినవాళ్ళు పని గట్టుకుని అదే క్రమంలో ఆమె పక్కనుంచి నడిచి ముందు కెళ్ళిపోయి, తల వెనక్కి తిప్పి ఆమె మొహాన్ని చూస్తున్నారు. కొంతమంది ఇంకా తనివితీరక, రకరకాల యాంగిల్స్ లోంచి ఆమెని చూడాలని ప్రయత్నిస్తున్నారు. సూట్ కేస్ పట్టుకుని అక్కడికి వచ్చిన సుధీర్ కి కొద్దిగా కోపం, ఎక్కువ గర్వం కలిగాయి.
    
    "యూ ఆర్ సెన్సేషనల్" అన్నాడు కారు దగ్గరికి నడుస్తూ.
    
    "ఛీ!" అంది శశి చిరుకోపంగా అతనలా ఎందుకన్నాడో ఆమెకి అర్ధం అయింది. పమిటలాగి, భుజం చుట్టూనిండుగా కప్పుకుంది.
    
    నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు సుధీర్.
    
    ప్రయాణం చేసి రావడం వల్ల లావుపాటి జడ కొద్దిగా వదులై, జుట్టు మొహం మీద పడుతోంది. శశి మొహంమీద పడ్డ జుట్టు కారు వేగానికి అటూ, ఇటూ కదులుతూంది. అదీ అందంగానే వుంది.
    
    కొద్ది కిలోమీటర్లు పోయాక ఒక సందులోకి రాష్ గా టర్న్ చెయ్యబోతూ ఆ సందులోంచి మెయిన్ రోడ్డు మీదికి రాబోతున్న రిక్షాకి డాష్ కొట్టబోయి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు సుధీర్.
    
    "అమ్మో!" అంది శశి భయభ్రాంతురాలై.
    
    రిక్షాలోంచి శంకర్రావు దిగాడు. కారునీ, అమ్మగారినీ గుర్తుపట్టాడు.
    
    "నమస్కారం, అమ్మగారూ!" అన్నాడు సంతోషంగా.
    
    "నువ్వేనా! లేచిన వేళ మంచిది. పెద్దగండం గడిచి పోయింది" అంది శశి తమాయించుకుంటూ.
    
    'గండం గడిచిందా' అనుకుంది శారద. 'రిక్షాలోనేనొక్కదాన్నే ఉండి, ఈ దెబ్బకు ఈ రిక్షాలోంచి కారు చక్రాల కిందపడి, చచ్చిపోయి వుంటే ఎంత హాయిగా వుండేది' అనుకుంది.
    
    "అరె శారద కూడా వుందే! ఏం, శారదా! నే నొచ్చేదాకా నర్సింగ్ హోమ్ లో ఉండమన్నాను గదా! అప్పుడే వెళ్ళిపోతున్నావేమిటి?" అని, శారద నుదుటి మీద గాయాని కంటించిన ప్లాస్టర్ చూసి - "ఆ ప్లాస్టరేమిటి? ఏమయింది?" అంది.
    
    శారద ఒక్కసారి కళ్ళెత్తి నిశ్చలంగా సుధీర్ వైపు చూసింది. తర్వాత శశివదన వైపు చూసి పెదిమలు అస్పష్టంగా కదిలించి తల వంచుకుంది.
    
    "ఏమయింది, శారదా?"
    
    "నాకిక్కడ బాగులేదు" అంది శారద మెల్లిగా.
    
    శంకర్రావు ఎగిరి పడ్డాడు. "బాగాలేదేమిటి...బాగా లేదు! అది కాదండమ్మ గారూ! రేపు శ్రావణ శుక్రవారం కదా నోము నోచుకోవాలని పట్టుబడుతోంది. అందుకని...." అన్నాడు సర్ది చెబుతూ.    

 

    "అవును! రేపు శ్రావణ శుక్రవారం కదూ! నేనూ నోము నోచుకోవాలి. మళ్ళీ ఎల్లుండి తప్పకుండా రా, శారదా!" అంది శశి. "వీలైతే రేపు సాయంత్రం పేరంటానికి రా!" అంది మళ్ళీ.
    
    తటపటాయిస్తూ తల ఊపింది శారద.
    
    "వెళదామా!" అంది శశి సుధీర్ వైపు తిరిగి.
    
    అప్పటిదాకా అతను పాలిపోయిన మొహంతో వీళ్ళ మాటలు వింటున్నాడు. శశి 'వెళ్దామా' అనగానే ఉలిక్కిపడి కారు ముందుకు పోనిచ్చాడు.
    
    ఒకసారి శారదని పరీక్షగా చూసి, తర్వాత సుధీర్ ని చూసింది శశి.
    
    కారు పోర్టికోలో ఆగింది.
    
    నౌకరు వచ్చి సూట్ కేస్ అందుకున్నాడు. లోపలికి వెళ్ళగానే - "చెప్పండి, డాక్టర్! ఎలా ఉన్నారు మన పేషెంట్లు?" అంది, టవల్ భుజాన వేసుకుని బాత్ రూంలోకి వెళ్ళబోతూ.
    
    "నువ్వు స్నానం చేసిరా, చెప్తాను."
    
    తీరిగ్గా షాంపూ చేసుకుని తలకు టవల్ తో సహా జారుముడి వేసుకుని వచ్చి అతని పక్కన కూర్చుంది శశి.
    
    "ఊ! చెప్పండి."

 Previous Page Next Page