Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 11

 

    "నిన్న రాత్రి కాలుజారి పడ్డాను" అంది శారద.
    
    "బాధగా వుందా?" అన్నాడు శంకర్రావు.
    
    "చాలా! భరించలేనంత బాధగా వుంది" అంది శారద.
    
    సుధీర్ శంకర్రావు చెప్పింది విన్నాడు. అతని మొహంలో ఏ భావం కనబడలేదు. కానీ, అతనికి మనసులో చాలా రిలీఫ్ గా అనిపించింది.
    
    "శశివదన రాగానే నీ భార్య నొకసారి తీసుకొచ్చి చూపించు - లేకపోతే ఆమెకి కోపం వస్తుంది" అన్నాడు.
    
    తలూపాడు శంకర్రావు. కడుపు నొప్పి అనే వంకతో టీచర్ దగ్గర్నుంచి పర్మిషన్ సాధించి స్కూలునుంచి ఇంటికెళ్ళిపోతూ వున్నంత సంబరంగా వుంది శంకర్రావుకి.
    
    సుధీర్ నర్సుని పిల్చి ఆ రోజుకి కావల్సిన మందులన్నీ ఇమ్మని చెప్పాడు.
    
    రిక్షాతేవడానికి రోడ్డుమీద కెళ్ళాడు శంకర్రావు. అది బాగా ధనవంతులుండే లొకాలిటీ కావడంవల్ల అటువైపు కార్లూ, ఆటోలే తప్ప రిక్షాలు ఎక్కువగా రావు. రిక్షాలు వుండే చోటుకి వెళ్ళాలంటే ఒకటి రెండు ఫర్లాంగులు నడవాలి.
    
    ఈ లోపల శారద గదిలోకి వచ్చాడు సుధీర్. అందంగా కండలు తిరిగినట్లు చెక్కిన గ్రీకు శిల్పంలా వున్నాడతను.
    
    శారదకి ఒక్కక్షణంకూడా ఆ గదిలో వుండాలని లేదు. తనకోసం శంకర్రావు ఇంటినుంచి తెచ్చిన బట్టలు ప్లాస్టిక్ వైరుతో అల్లిన బుట్టలో పెట్టేసుకుని గుమ్మం దగ్గరే నిలబడి వుంది. శంకర్రావు రాగానే తక్షణం వెళ్ళిపోవడానికి వీలుగా. సుధీర్ ని చూచి తాచుపాముని చూసిన దానిలా ఒక్క అడుగు వెనక్కి వేసింది.
    
    రెండు చేతులూ పాంటు జేబులో పెట్టుకుని గుమ్మాని కానుకు నిలబడ్డాడు సుధీర్.
    
    అతని మొహంలో భయంలేదు. -బెదురు లేదు - తప్పుచేశాననే భయంలేదు.
    
    ప్రాక్టికల్స్ పూర్తయ్యాక తన శరీరం అంతా పరిశోధింపబడి ప్రాణాలు కోల్పోయి బయట చెత్తలో పడిపోవటానికి సిద్దంగా వున్న కప్పనో, పావురాయినో చూసినంత చులకనగా చూశాడు శారదని.

 

    "నీ పేరేమిటి? శారద కదూ? శారదా! ఇంకోసారి చెబుతున్నాను. అల్లరి చేస్తే అల్లరైపోతావు! అరిటాకూ, ముల్లూ సామెత నీలాంటి వాళ్ళకోసమే రాశారు. నోరెత్తకుండా బుద్దిగా కాపరం చేసుకో లేదా...."
    
    శారద మాట్లాడలేదు, వింటోంది. నిశ్చలంగా చూస్తూంది. తన జాకెట్ కీ, బ్రాసరీకి మధ్య దాచుకున్న చిన్న బాటిల్ గురించే ఆలోచిస్తూంది.
    
    ఇది అతి ప్రమాదకరమైన విషమని దానిమీద రాసి వుంది. ఇంటికెళ్ళగానే తాగేస్తుంది. చచ్చిపోతుంది. తర్వాత పోలీసులూ, పోస్టుమార్టం. అంత తీవ్రమైన విషం తనకెలా దొరికిందని ఆరా! తను నర్సింగ్ హోమ్ లో చేరినట్లు తెలియడం...అనుమానం సుధీర్ మీదకు...
    
    తను ఉత్తరం కూడా రాసిపెట్టనక్కరలేదు. రహస్యాన్ని తనంతట తనే బయట పెట్టుకోనక్కర్లేదు. మవునంగానే అతనికి వుచ్చు బిగించెయ్యవచ్చు.
    
    శంకర్రావు వచ్చాడు.
    
    "ఈ టాబ్లెట్లు పొద్దునొకటీ, సాయంత్రం ఒకటీ వేసుకో. ఈ మందు భోజనం చెయ్యగానే పొద్దునా, రాత్రీ వేసుకో" అన్నాడు సుధీర్ తొట్రుపడకుండా మాట కలిపేస్తూ. మందులు వున్న కవరు శంకర్రావు చేతికి అందించాడు.
    
    అవి తీసుకుని రిక్షా ఎక్కారు శారదా, శంకర్రావు.
    
    ఇంతలో టెలిగ్రాం వచ్చింది శశి దగ్గర్నుంచి.
    
                                                                      * * *
    
    ఆడపిల్లల వూరేగింపు సుధీర్ ఇంటిని దాటిపోయింది.
    
    "మానభంగానికీ - మరణశిక్ష!"
    
    అతని చెవుల్లో గింగురుమంటున్నాయి వాళ్ళ నినాదాలు. మొహానికి చెమటలు పట్టేశాయి. కారు స్టార్ట్ చేసి వేగంగా ఎయిర్ పోర్ట్ వైపు వెళ్ళిపోయాడు.
    
    పెద్ద జెట్ విమానం. సొరచేపలా వుంది. పెద్దగా రొద చేస్తూ రన్ వే మీద లాండ్ అయి టెర్మినల్ దగ్గరికి వచ్చి ఆగింది.
    
    అయిదు నిముషాల తర్వాత లాడర్ మీద నుంచి దిగుతున్న శశివదన కనపడింది.
    
    దిగుతున్న వాళ్ళలో బెంగాలీ అమ్మాయిలు వున్నారు. పంజాబీ అమ్మాయిలు వున్నారు. అయ్యంగార్ల అమ్మాయిలు వున్నారు. పార్శీలు వున్నారు. ఒకళ్ళిద్దరు అమెరికన్ అమ్మాయిలు కూడా వున్నారు.
    
    అందరికంటే అందంగా, అందరికంటే హుందాగా చిన్నప్పట్నుంచీ విమానాల్లో తిరిగిన నిబ్బరంతో, పెద్ద పెద్ద గాగుల్స్ పెట్టుకుని ప్లేన్ దిగుతోంది డాక్టర్ శశివదన. వెనకనుంచి ఆమెని కొద్దిగా జెలసీతో చూస్తూంది ఒక ఎయిర్ హోస్టెస్.
    
    ఆమె కట్టుకున్నది గ్రే కలర్ కాశ్మీర్ సిల్కు చీర. ఆమె కట్టుకోవడం వల్ల ఆ చీరకి అందం హెచ్చింది.
    
    డాక్టర్ శశివదన. డాక్టర్ చందమామ. తనభార్య!
    
    సుధీర్ కి సంతోషంతో వళ్ళు జలదరించింది.
    
    అంతదూరంనుంచి శశి చిరునవ్వు కనబడుతోంది. తొట్రుపడని నడక. లయబద్దకంగా, నీటి కెరటాలమీద మెల్లగా వూగుతూ వెళ్ళే హంస విన్యాసంతో, ప్రయత్న పూర్వకంగా కాకుండా సహజంగానే వచ్చిన వయ్యారంతో నడుస్తూంది. అడుగుతీసి ముందుకేసినప్పుడు ఒక విధమైన విన్యాసం. రెండో అడుగెయ్యగానే ఆ చలనాన్ని బ్రేక్ చేసినట్లయి మూవ్ మెంట్ మారుతోంది. కెరటాలు ఒడ్డుదాకా వచ్చి, అంతలో మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ ముందుకొస్తున్నట్లు ఆమె నడకలో అపురూపమైన నృత్యభంగిమ కనబడుతోంది.

 Previous Page Next Page