"డాక్టర్! యూ ఆర్ బికమింగ్ టూ ప్రొఫెషనల్! వృత్తి ధర్మాన్ని మరీ అతిగా పాటించేస్తున్నావ్."
"కట్టుకున్న భర్తని కూడా నిర్లక్ష్యంచేసి - అవునా?"
ఇది విన్నదే, రోజూ వున్నదే! అని హమ్ చేసి, "చెప్పండి, ఎలా వున్నారు మా పేషెంట్లు?" అంది.
వెంటనే చెప్పలేదు సుధీర్.
తర్వాత తీరిగ్గా చెప్పాడు. డాక్టర్ వీరభద్రరావు రెండుసార్లు వచ్చి అందర్నీ చూసి వెళ్ళాడని చెప్పాడు. ఆయన సలహా మీద ఇస్తున్న ట్రీట్ మెంట్ చెప్పాడు.
శ్రద్దగా వింది శశి.
"ఆ అమ్మాయి యెందుకు వెళ్ళిపోయింది?" అని మాటల మధ్యలో హఠాత్తుగా అడిగి అతని మొహంలోకి చూసి, "మర్చిపోయాను! నోము వుందని చెప్పింది కదూ!" అంది.
కలవరపాటుని అణుచుకున్నాడు సుధీర్.
3
"శారదా!"
"ఊ!"
"ఓ శారదా!"
"ఊ!"
"ఎందుకలా ఉన్నావ్?"
తెప్పరిల్లినట్లు చూసింది.
"బాగానే వున్నాను."
"బాగానే ఏమిటి? చాలా బాగున్నావని తెలుసు. డల్ గా వున్నావేమని అడుగుతున్నాను."
ఉత్సాహం లేని చిరునవ్వు నవ్వింది శారద.
"ఏమీ లేదు"
రిక్షా అతను పెడల్సు మీద దాదాపు నిలబడి తొక్కుతున్నాడు. ఒక రెండొందల గజాలమేర రోడ్డు చాలా ఎత్తుగా వుంది.
"ఏమయ్యా! దిగాల్న?" అన్నాడు శంకర్రావు.
ఆ మాట అనడమే చాలు అన్నట్లుగా రిక్షా అతను రిక్షా ఆపాడు. అతని మొహమంతా చెమటలు ధారలు. వీపుమీద వున్న బనీను ఒక పాతికభాగం చినిగిపోయింది. బట్టవున్నంతమేరా అది చెమటతో తడిసి ముద్దయిపోయింది.
శంకర్రావు దిగాడు. శారద కూడా దిగబోయింది.
"మీరు కూకోండమ్మా!" అంటూ హాండిలుమీద ఏటవాలుగా వాలిపోయి, నేలని కాళ్ళతో తన్నిపెట్టి రిక్షా లాగుతూ తీసుకెళుతున్నాడు. వెనకే నడిచి వస్తున్నాడు శంకర్రావు.
'అలా ఎదుటి మనిషి కష్టాన్ని అర్ధం చేసుకునే వాళ్ళెంత మంది ఉంటారు? చిన్న చిన్న విషయాల్లో ఆయన మంచితనం బయటపడిపోతూ ఉంటుంది' అనుకుంది శారద.
అక్కడే ఒక పూల దుకాణం వుంది. అటువైపు వెళ్ళాడు శంకర్రావు. సంపెంగలు! హైదరాబాద్ అరుదుగా తప్ప దొరకని ఆకుపచ్చ సంపెంగలు! చూడ్డానికి సింపుల్ గా ఆకుపచ్చ తొడిమల్లా ఉన్నా, మైమరపించే సుగంధం వెదజల్లుతున్న సంపెంగలు!
సంపెంగలలాగా నిరాడంబరంగా, మామూలుగా, అల్పంగా కనబడుతున్నా-తన మంచితనంతో ఎదుటి వాళ్ళని మైమరపించే మనిషి శంకర్రావు.
"చారనా కొక్కటి, సాబ్!" అన్నాడు షాపతను. నాలుగు కొందామన్న సరదాతో వెళ్ళిన శంకర్రావు రెండే పువ్వులు కొని, భద్రంగా చేతిలో పట్టుకుని వచ్చి, శారదకిచ్చాడు. విషాదపు రేఖ కనబడుతున్న చిరునవ్వుతో శారద రెండు చేతులూ వెనక్కి పెట్టి, పూలు జడలో తురుముకుంది.
ఇల్లు చేరేసరికి సాయంత్రమైపోయింది.
ఇంటి తాళం తీశాడు. అది పది కాపురాలున్న కాంపౌండులో ఇక పోర్షను. ఒక రూమూ, ఒక కిచెనూ బలహీనంగా పసుపురంగు కాంతి వెదజల్లుతున్న రెండు బల్బులూ-అంతే ఆ ఇల్లు!
గోడలకి ఐదారు చౌకరకం కాలెండర్లూ, ఒక ఖరీధైన కాలెండరూ, వేలాడుతున్నాయి. అవన్నీ శంకర్రావు సేకరించినవే! కిరాణా షాపతను ఇచ్చినవీ, ఎగ్జిబిషన్లో కత్తిపీట కొంటే ఇచ్చినవీ - అలా!
ఒకదాన్లో శ్రీరామచంద్రుడు - శంకర్రావుకి ఇష్టదైవం! అతని ఆదర్శం!
తక్కిన కాలెండర్లన్నీ పసిపాపల బొమ్మలున్నవి. ఆ ఖరీదైన కాలెండరు మందుల కంపెనీ వాళ్ళది ఆరోగ్యంగా, బొద్దుగా, ముద్దుగా ఉన్న ఒక పిల్లాడు బోసినోరంతా తెరిచి నవ్వుతున్నాడు. శశివదనని నోరంతా తెరిచి అడిగి మరీ తెచ్చుకున్నాడు శంకర్రావు ఆ కాలెండర్ని.
"చీకటిపడిపోయింది. ఇంక వంటపని ఏం చేస్తావ్? ఇవాల్టికి హోటల్లో భోంచేసేద్దామా?" అన్నాడు శంకర్రావు.
"ఒద్దు! ఇవాళ నేనే వండి పెడతాను. మీరు మార్కెట్ కెళ్ళి మీ కిష్టమైన కూర తీసుకురండి!"
అతను సందు మలుపులో ఉన్న కూరగాయల బండీల దగ్గర లేత బెండకాయలు కొనుక్కొచ్చాడు.
అన్నం వండింది కూర చేసింది. తర్వాత తీరిగ్గా స్నానంచేసి, నాలుగు నెలల క్రితం కొనుక్కుని కట్టకుండా పెట్టెలోనే దాచేసిన లేత ఆకుపచ్చ ప్రింటు ఉన్న చీర కట్టుకుంది. అగరొత్తులు వెలిగించి, దేముడి పటం ముందు పది నిమిషాలు మవునంగానే కూర్చుని నమస్కారం పెట్టుకుంది.