Previous Page Next Page 
దీప పేజి 12


    వెంకట్రావుకు మధుసూదనం చెప్పింది బాగా నచ్చింది, బుర్రకెక్కింది. ఆరోజు చీట్లాటకి సరికొత్త వందరూపాయల నోటు ఇచ్చాడు మధుసూదనం వెంకట్రావుకి.

 

    సాయంత్రం అయిదున్నరకి దీప ప్రయివేట్ ముగించుకుని ఇంటికొచ్చింది. తుఫాన్ ముందు ప్రశాంతంగా తోచింది దీపకి. వెంకట్రావు హాల్లో ఉయ్యాల బల్లమీద కూర్చున్నాడు. కొద్ది దూరంలో కుర్చీలో కూర్చుని పేపరు తిరగేస్తున్నాడు మధుసూదనం. లలిత, ఆదిలక్ష్మమ్మ బియ్యం ఏరుతూ అక్కడే కూర్చున్నారు.

 

    బైటనుంచి వచ్చిన దీప పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. వెంకట్రావు పెళ్ళివిషయం కదిపాడు. ముందు శాంతంగా మాటలతో పోనిచ్చింది దీప. తర్వాత తండ్రి పది మాటంలంటే తాను ఇరవై మాటలంది. తండ్రీ కూతుళ్ళ మాటలు తప్ప మిగిలిన ముగ్గురు చెవులప్పగించి వుండిపోయారు ఆఖరికి... "నువు చచ్చినా నాకిష్టమే నీ శవానికి పెళ్ళిచేస్తాను. మీనాన్న ఏమీ చేయలేడు. ఏమీ చాతగాదు. అసమర్ఢుడనేగా నీ అభిప్రాయం చూపిస్తాను. ఇది పేకాట కాదు, పెళ్ళి. నా చేతిలో వున్న పని. పైనెల నీ పెళ్ళి ఖాయం." అని వెంకట్రావు భుజాన తుండుతీసి దులిపి మళ్ళీ భుజాన వేసుకొని చీట్లాటకి వెళ్ళిపోయాడు పోట్లాట చాలించి.

 

    దీప ముగ్గురువైపు చూసింది. మధుసూదనం పేపరు చాటున ముఖం దాచుకున్నాడు. ఆదిలక్ష్మమ్మ, లలిత బియ్యం చాటలోకి ముఖం దించుకున్నారు.

 

    "హ్హూ! ... చివరికి యీ ఇల్లు మూర్ఖులకి, మూగవాళ్ళకి, చెవిటివాళ్ళకి నిలయమైంది ఫర్వాలేదు. ఆ మూడు లక్షణాలు నాకు లేవు. నా శవానికి పెళ్ళిచేస్తారుట. ముందే చెప్పారు. నా శవం కూడా మీకు దక్కకుండా చూసుకుంటాను" పెద్దగా అని దీప లోపలికి వెళ్ళి పోయింది.

 

    పేపరు చాటునుంచి మధుసూదనం తలకాయ, చాటలోంచి ఆదిలక్ష్మమ్మ, లలిత తలకాయలు పైకి లేచాయి. మూడు రెళ్ళు ఆరు కళ్ళు కలుసుకుని ఆపై తలకాయలు యధాస్థానంలోకి పోయాయి.

 

    పక్కగదిలోంచి దీప కూనిరాగం వినిపించింది. ఏ దిగులు, విచారం లేనివాళ్ళు సంతోషంగా కూనిరాగాలు తీస్తారు. అలా రాగం తీస్తున్నది దీప.

 

                                                                   11

 

    రాత్రి పన్నెండు గంటలయింది.

 

    వీధి తలుపులు ధనధన చప్పుడయింది. మధుసూదనం వెళ్ళి తలుపుతీశాడు. వాకిట్లో నలుగురున్నారు. "ఏమిటి?" అంటూ మధుసూదనం వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. సంగతి కనుక్కుని పరుగున ఇంట్లోకి వచ్చి ఇంట్లో అందరినీ లేపి షర్ట్ తగిలించుకొని వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయాడు.

 

    వెంకట్రావు ఇంట్లో దీపమీద కేకలువేసి పేకాట కెళ్ళాడు. వరసగా అరడజను ఆటలు ఆడాడు. ఎప్పటివలె కాకుండా లక్ష్మీదేవి కరుణించింది. పెద్దమొత్తంలో ఆడారేమో వంద రెండొందలయింది. మొదటిసారిగా హుషారుగా కేకలు వేశాడు. అలాగే గుండె చేత్తో నొక్కి పట్టుకున్నాడు.

 

    "వీడు ఇదివరకు వెంకట్రావు కాదు. ఏమనుకున్నారో, లక్ష్మీదేవి జుట్టు నా చేతిలో వుంది. రండి. ఎన్నాటలయినా సరే, ఎంతడబ్బయినా సరే, రెడీ! ఇహపై వందలు...వేలు...నా సొంతం" అని వెంకట్రావు గుండెమీద చేత్తో నొక్కుకుని "నొప్పి నొప్పి... ప్రాణంపోతున్నది" అంటూ బాధతో మెలికలు తిరిగాడు. అంతే, మాట లేదు, పలుకులేదు. అక్కడున్నవాళ్ళు వెంకట్రావుని ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడు గంట పదకొండున్నర లోపే.

 

    పేకాడటానికి మామగారికి డబ్బిచ్చి పంపిన మధుసూదనం మామగారి కోసం ఆస్పత్రి కెళ్ళి ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాడు.

 

    హార్ట్ ఎటాక్ తో వెంకట్రావు పోయాడన్నమాట. క్షేమంగా ఆ సాయంత్రం దీప మీద ధూం ధాం అన్నవాడు కట్టెలా బిగుసుకుపోయి, ఇహ ఎవరిపై ఎగిరిపడను అన్నట్లు అలా పడుకుని వుంటే అది చూచి అందరు ఒక్కసారి గొల్లుమన్నారు.

 

    ముందు జరగవలసిన కార్యక్రమం తెల్లవారుతూనే మొదలయింది. పోయిన వెంకట్రావు హాయిగా జీవించాడన్నారు. అదృష్టవంతుడు ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడన్నారు. ఉన్నవాళ్ళకే కష్టం. ఆదిలక్ష్మమ్మ దురదృష్టము, పిల్లల దౌర్భాగ్యము అంటూ వచ్చిన ఊరివాళ్ళు సానుభూతి వ్యక్త పరిచారు.

 

    వెంకట్రావు ఏడుకట్ల సవారీమీద రాజాలా వెళ్ళిపోయాడు. జరగవలసిన తతంగా అంతా తూచా తప్పకుండా యధావిధిగా జరిగింది. పదమూడో రోజు కూడా కన్నుమూసి తెరిచేటప్పటికి వెళ్ళిపోయింది.

 

    ఇన్నాళ్ళూ మధుసూదనం ఇక్కడున్నాడంటే దీపని తాను పెళ్ళాడుదామనే ఉద్దేశ్యంతోనే. వెళ్ళకపోతే అవతల బిజినెస్ దెబ్బతింటుంది. ఊరికి బయలుదేరుతూ మరోసారి లలితచేత పెళ్ళి ప్రసక్తి ఎత్తించాడు.

 

    "ఇప్పుడు యీ ఇంటికి మొగ దిక్కు కూడ లేదు. బావని పెళ్ళి చేసుకో. రెండు సంసారాలు ఆయన చూసుకుంటారు" అంది లలిత.

 

    "ఇల్లు గడవటానికి, సంసారం నడపటానికి కావలసింది డబ్బు, తెలివి, దీనికి మగ ఆడ అక్కరలేదు. అమ్మ కాపురానికొస్తూ అమ్మమ్మ ఆస్తితో వచ్చింది. నాన్న చేసింది అమ్మ ద్వారా ఈ లోకంలోకి మన్ని తీసుకురావటం, ఉన్న ఆస్తిని హారతి కర్పూరం చేయటం ఈ ఉపకారమే కదా చేసింది. అక్కా నీకు పెళ్ళయింది. ఈ ఇల్లు ఇహపై పరాయిది. ఈ ఇంటికి ఆడయినా మగయినా నేనే నిలిచి సంసారం చూసుకుంటాను" అంది దీప.

 

    ఏం చూసుకుని దీప అంత ధీమాగా మాట్లాడుతున్నదో అర్ధంకాలేదు. అదే అర్ధంగాక లలిత అడిగింది. "ఏ విధంగా డబ్బు సంపాదిస్తావే దీపా! పెళ్ళి చేసుకోవా?"

 

    "సమయం వచ్చినప్పుడు పెళ్ళి చేసుకుంటాను. సంసారం సంగతంటావ్, నాన్న వున్నప్పుడు ఏంతిన్నామో అదే ఇప్పుడు తింటాము" అంది దీప.

 

    మధుసూదనానికి శరీరం దహించుకుపోతున్నది. "మామగారు పేకాడి సంపాదించేవారు. మరి నువ్వేం ఆడి సంపాదిస్తావు దీపా?" వ్యంగ్యంగా అన్నాడు.

 

    "నాన్న పేకాడి డబ్బులేయటం తప్ప సంపాదించిందేమీ లేదు. నాన్న పేకాడి సంపాదించాడని కదా అంటున్నావ్! అదే డబ్బు పేడ పిసికి పిడకలు కొట్టి అమ్మి డబ్బు సంపాదిస్తాను" అంతకన్నా వ్యంగ్యంగా అంది దీప.

 

    దీపలోవున్న ఆ అందమేగాక ఆ పొగరు వగరు మధుసూదనానికి మహా ఇష్టం. "ఈ పొగరు మోతుపిల్ల ఎక్కడికి పోతుంది. ఇవాళ కాకపోతే రేపు నా కాళ్ళదగ్గరకే చేరుతుంది. ఆలోచించి ఏదో ఒకటి కామ్ గా చేసేయాలి. ఇప్పటికి ఊరుకోటమే ఉత్తమం" అనుకున్నాడు.

 

    "అమ్మా! నాన్న దూరం అయ్యారు. నేనూ నీకు దూరం కావాలంటే ఎంతోసేపు పట్టదు. ఏ విషయంలోనూ నన్ను బలవంతం చేయకు. అన్నీ సవ్యంగా జరిగేట్లు జూస్తాను" అని ఆదిలక్ష్మమ్మతో ముందే చెప్పింది దీప.

 

    భర్త పోయిం తరువాత తనలో తాను కుమిలిపోవటం తప్ప పెదవి కదపటం లేదు ఆదిలక్ష్మమ్మ. ఏం మాట్లాడినా లాభం లేదని లలిత నోరు మూసుకుంది. లలితని కొద్దిరోజులాగి తీసుకెళ్ళతానని మధుసూదనం ఊరికెళ్ళిపోయాడు.

 

    తండ్రి చనిపోయిన తరువాత మూసివేసిన క్లాసు పుస్తకాలు మధుసూదనం ఊరెళ్ళిన రాత్రి తెరిచింది దీప.

 

    భర్తకొట్టినా తిట్టినా, ముండల దగ్గర కెళ్ళినా ఆ కష్టం వేరు భార్యకి. పతికి దైవంగాను, పసుపు కుంకమలే ప్రాణంగాను, భావించే ఆడదానికి వైధవ్యాన్ని మించిన నరకంలేదు. ఆదలక్ష్మమ్మ దీపగాని, లలితగాని, పిలిచినప్పుడు లేచి వెళ్ళి నాలుగు మెతుకులు తిన్నానంటే తిన్నానని తిని వచ్చి గదిలో పైటకొంగు పరుచుకుని తలకింద చేతిని పెట్టుకుని అలా పడుకునే వుంటుంది.

 Previous Page Next Page