Previous Page Next Page 
దీప పేజి 13


    దీపకి పెళ్ళి అంత ఇష్టంగా లేనప్పుడు బలవంతం చేయటం దేనికి, అనుకుని లలిత మాట్లాడలేదు పెళ్ళిగురించి.

 

    దీప ప్రయివేటుకి వెళ్ళటం మొదలుపెట్టింది.

 

    వెంకట్రావు పోయినంత మాత్రాన ఆ ఇల్లేం దెయ్యాల కొంపకాలేదు. మనుషులు మసులుతున్నారు గాబట్టి సందడిగానే వుంది. కాకపోతే అందరి మనుసుల్లో గాడాంధకారం సుళ్ళు తిరుగుతున్నది.

 


                                                       12

 

    ఆ రోజు దీప అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్ళేప్పటికి అన్నపూర్ణమ్మ వంట చేస్తున్నది. దీప సరాసరి వంటగదిలోకి వెళ్ళింది.

 

    "అదేంటి అత్తయ్యా! వంటావిడ ఏమయింది. నువ్వు గరిట పట్టావు" అంది దీప.

 

    "హ్హూ, వంట్లో బాగుండలేదా. ఇప్పుడే వంటావిడ ఊరికెళ్ళింది. మళ్ళీ రావటం లేదు. శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆవిడ కూతురికి పంతులమ్మ ఉద్యోగం దొరికిందిట. ఈ వయసులో కష్టందేనికి వంటమానేసి రమ్మని ఉత్తరం రాసింది. ఈవిడ వెళ్ళిపోయింది. నా ఒక్కదానికీ కాదాయే పనిమనిషికి ఇద్దరు పాలేళ్ళకి తిండి పెట్టాలాయె. అలవాటులేదు నేనేం వండి పెట్టగలను? ఈ పల్లెటూరిలో వంటమనిషి కుదిరి చావదాయె పోనీ పట్నంనుంచి పిలిపిద్దామా అంటే నే ఇచ్చే ఎనభై రూపాయాలకు ఎవరొస్తారు చెప్పు. చచ్చిన చావుగా వుంది. ఏం చేయాలో ఏమిటో" తన బాధంతా వెళ్ళ బోసుకుంది అన్నపూర్ణమ్మ.

 

    దీపకి ఆ ఇంట్లో మొదటినుంచీ చనువేగాబట్టి తరగటానికి అక్కడ పెట్టిన దొండకాయలు, సొరకాయ ముక్క చూసి కత్తిపీట అందుకుని కూరలు తరగటం మొదలు పెట్టింది.

 

    "ఎన్నాళ్ళని ఇలా బాధపడతావు అత్తయ్యా!" అంది దీప దొండకాయలు చకచకా చక్రాలులా తరుగుతు.

 

    "అదే నాకు అర్ధం కావటంలేదు" అంది అన్నపూర్ణమ్మ.

 

    దీప ఆలోచిస్తూ వుండిపోయింది.

 

    "మనూకి పెళ్ళి చేస్తే కోడలొచ్చేది సాయంగా వుండేది. కోడలిచేత వంటచేయిస్తా ననుకునేవే దీపా! రాగానే గరిట అప్పగించనులే, ఒకరి కొకరం తోడు అంతే."

 

    "అయితే ఆలస్యం దేనికి మనూ పెళ్ళి చేసెయ్యి."

 

    "వాడి చదువు పూర్తికావాలి కదా! ముందే పెళ్ళి చేస్తే ముచ్చటగా వుంటుందని మొన్న శెలవులకి వచ్చినప్పుడు పెళ్ళి మాటెత్తాను. పెళ్ళి కిప్పుడేం తొందరన్నాడు. ఏ వయసు ముచ్చట ఆ వయసుది. మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామని చాలామంది కబుర్లు చేస్తున్నారు. ఒకటుంటే ఒకటుంటంలేదు. పిల్ల బొమ్మలా వుంటే సాంప్రదాయం సరిగాలేదు. గౌరవ మర్యాదలుగల పెద్దింటిపిల్ల కాకిపిల్లలా వుంది. ఇలా వున్నాయి సంబంధాలు."

 

    "ఓ సలహా చెప్పనా అత్తయ్యా!"

 

    "చెప్పవే దీపా! నీ తెలివిమీద నాకు పూర్తి విశ్వాసం వుంది. ఏం చేయమంటావ్?"

 

    "గుణంలేని రంభకన్నా, కులమింటి కోతి నయం అన్నారు. మనూకి ఓ కోతిపిల్లను చూడు."

 

    "ఆసి నీ ఇల్లు బంగారం గానూ! ఇంకేం సలహా చెపుతావో అని నోరు తెరుచుకుని వింటున్నాను. ఇదా నీ సలహా."

 

    దీప ముసిముసి నవ్వులు నవ్వుతూ వుండిపోయింది.

 

    "మీ బావ ఏమంటున్నాడే దీపా?" కాసేపాగి అడిగింది అన్నపూర్ణమ్మ.

 

    "ప్రస్తుతం ఏమంటంలేదు. ఊరు చెక్కేశాడు." సొరకాయముక్క చెక్కుతీస్తూ అంది దీప.

 

    "పెళ్ళి విషయం ఎత్తి మళ్ళీ గోలచేస్తున్నాడా?"

 

    "ఊరెళ్ళే ముందు చేసే వెళ్ళాడు. మళ్లీ ఊరినుంచి వచ్చిం తరువాత మొదలెట్టాలి గోల."

 

    "ఏమిటో మీ ఇంటి పరిస్థితులు క్షణాలలో మార్పు చెందాయి. లలితకి ఆ ఆపరేషనేమిటి, ఇలా మీ నాన్న పోవటం ఏమిటి? మధ్యలో నీ పెళ్ళి గోల. నీ పెళ్ళి అయినా జరిగి వున్నట్లయితే ఈ గోల వుండేది కాదేమో? నీకేం బంగారపు బొమ్మలా వున్నావ్, పెళ్ళికాదని దిగులేం లేదు. పిల్లని చూసి పెళ్ళాడటానికి ముందుకొస్తారు. పెళ్ళికి పూనుకుని చేసేవాళ్ళు పోయి, పెళ్ళిచేసుకుంటానని తయారయ్యారు కదా!?"

 

    "ఫరవాలేదత్తయ్యా! అవతలివాళ్ళు తయారయివస్తే యివతలివాళ్ళు సిద్ధంగా లేరుగా! రెండుచేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి. అన్నట్లు ఏమిటీ అన్నావ్? బంగారుబొమ్మలా వున్నాగాబట్టి పెళ్ళాడటానికి ముందుకొస్తారా. మర్చిపోయావా అత్తయ్యా. ఇంతక్రితం ఏమన్నావ్. మనూ పెళ్ళి విషయంలో పిల్ల బాగుంటే సాంప్రదాయం బాగుండలేదు. సాంప్రదాయం బాగుంటే బాగున్న పిల్ల కనబడటం లేదు అన్నావా? నా విషయము అంతే."

 

    "ఇప్పుడు నీకేమిటి! మీ సాంప్రదాయానికి లోటేమిటి?"

 

    "నీకు కనబడదులే అత్తయ్యా! పెళ్ళిచూపులకి వచ్చిన వాళ్ళకి కనబడుతుంది. ఎందుకంటే వచ్చినవాళ్ళకి వంక లెతకటమే పనికదా? పెళ్ళిళ్ళ విషయంలో, పెళ్ళికూతుర్ని పరీక్షచేసే విషయంలో ఇంకా మనవాళ్ళు ఎదగలేదు."

 

    దీప మాటలు అన్నపూర్ణమ్మకి సూటిగా తగిలాయి. మారు మాట్లాడలేదు.

 

    "మనూకి నీవు చూసిన పిల్ల, నీకు అన్నివిధాలా నచ్చిన మనూకి నచ్చదనుకో అత్తయ్యా. అప్పుడేం చేస్తావ్?" అంది దీప కత్తిపీట మూలకిపెట్టి.

 

    "వాడు నామాట కాదంటాడా దీపా?"

 

    "ఏమో అనొచ్చు, అనకపోవచ్చు. మీ పెద్దవాళ్ళు తరచు ఓ సామెత చెపుతుంటారుగా. అడ్డాలనాడు బిడ్డలుగాని, గడ్డాలు మొలిచిననాడు బిడ్డలా? అని...ఓ పని చెయ్ అత్తయ్యా, ఈ తఫా మనూ వచ్చినప్పుడు, రెండు మాటలడిగి చూడు."

 

    "ఏమని?" అన్నపూర్ణమ్మ ఆతృత వ్యక్తపరిచింది.

 

    "ఏమనా? నాయనా మనూ! నిన్ను చదువుకోటానికి బస్తీ పంపించానుగాని ఫాషన్స్ నేర్చుకోటానికి కాదు. చీంబోతులా మెడలదాకా చెవులు మూసుకు పోయేటట్లు ఇలా జుట్టు పెంచటం ఏమిటి, మంగలి కరువా? క్షవరానికి డబ్బులు కరువా? పూర్వంలా సమ్మర్ క్రాపు చేయించుకో, అను. ఆ తర్వాత... ఈ లంగాగుడ్డలు ఎక్కడ దొరికాయిరా నాయనా! ఇంకోడు దీంట్లో దూరొచ్చు. లాగూ చొక్కా గుడ్డలు అక్కడ దొరక్కపోతే మన వెంకటసామి గుడ్డల కొట్టుందిగా అతని దగ్గర కావలసిన గుడ్డలు తీసుకో" ఇలా అని చూడత్తయ్యా.

 

    అన్నపూర్ణమ్మ దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచింది. "అయిందే అమ్మాయీ! ఆ సంబడము అయింది. సరీగా నువ్వన్నట్లే నేను అడిగాను. ఏమన్నాడో తెలుసా? కాలాన్ని బట్టి వేషధారణ మారుతుందమ్మా! నా తాతగార్ల కాలంలో తలపాగాలు, బుర్రమీసాలు, చెవిపోగులతో వుండేవారు. అదే నాన్నగారి కాలం వచ్చేటప్పటికి పాగాలు... మీసాలు...పోగులు-పోయాయి. ఇప్పుడు నా... అంటే ఈ కాలంలో ఇవి వచ్చాయి అన్నాడు. మాటలతో మాట దాటేశాడు. అంతేగాని తన వేషం మార్చుకోటానికి ఒప్పుకోలేదు" అంది.

 

    దీప కిలకిల నవ్వింది.

 Previous Page Next Page