"వివాహం కాకపోయినా ఫరవాలేదు జీవితాంతం బ్రహ్మచారిణిగా వుండిపోతాను. బావకు మటుకు భార్యను కాను. నా ఇష్టంతో నిమిత్తం లేకుండా బలవంతాన బావతో పెళ్ళిచేయ ప్రయత్నించారా నా శవం బావిలో తేలుతుంది. ఆ తర్వాత ఏడ్చి మొత్తుకున్నా నలుగురిలో నవ్వుల పాలయినా ఆ బాధను మీరు పడాల్సిందే గాని నాకేం తెలియదు కదా. ఈ ప్రయత్నాన్ని విరమించుదలుచుకున్నారో నా శవాన్ని చూడదలుచుకున్నారో మీ ఇష్టం." అని తను గట్టిగా చెప్పేసింది. అంతే తాను ఇంట్లోవాళ్ళకి బద్ధ శత్రువైపోయింది.
"ఏమిటి దీపా! చదువుకుంటున్నావా. ఆలోచిస్తున్నావా" చాలాసేపటినుంచి గుమ్మంలో నుంచుని చెల్లెలిని గమనిస్తున్న లలిత అంది.
దీప ఉలిక్కిపడ్ సర్దుకుంది. "ఏక కాలంలో రెండూ చేస్తున్నాను" అంది.
లలిత వచ్చి దీప ప్రక్కనే కూర్చుంది.
"నువ్వు పట్టిన పట్టు విడవవా దీపా!"
"పదిసార్లు చెప్పినా నీకు అర్ధం కాదా అక్కా!"
"నా బాధ నువ్వర్ధం చేసుకోటం లేదు."
"బాధా? దేనికి? పిల్లలు పుట్టరనా? ఈ పిల్లలను కన్న వాళ్ళంతా సక్రమంగా పిల్లల్ని పెంచుతున్నారా? నాకు కొన్ని సంసారాలు చూస్తుంటే మనుషులకి, పందులకు తేడా లేదనిపిస్తుంది. మొగుడు (కట్టుకున్నవాడు) పరాయి ఆడదానితో పోతే చీమూ నెత్తురు వున్న ఏ భార్యా భరించదు. నువ్వు నన్ను బావని పెళ్ళాడమని చెపుతున్నావా? నోరెలా వచ్చిందక్కా? పిల్లలు లేకపోవటానికి కారణం బావ. ఆ బావని దూషించు. నన్ను బలవంతం చేయకు. పిల్లల మీద అంత ఆపేక్ష వుంటే మన తమ్ముడినో, చెల్లెలినో తీసుకెళ్ళి పెంచుకోండి"
"నా మాట వినవన్నమాట."
ఎప్పుడొచ్చాడో మధుసూదనం మధ్యలో కలుగజేసుకున్నాడు.
"లల్లీ! ఏమిటా బలవంతం! దీప మనసులో ఎవరైనా వున్నారేమో? కనుక్కో పెళ్ళి చేద్దాం."
"మనసులో ఎవరూ లేరు. ఉన్నా ఆ శ్రమ మీకక్కర లేదు. నా పెళ్ళి నేను చేసుకోగలను. ఈ మాట వినిపించిందో లేదో కనుక్కో అక్కా!"
"ఫరవాలేదు దీపా! ఇరవై ఏళ్ళు దాటాయి. కోరికలు నిన్ను బాధించటం లేదంటే నేనమ్మను. ఎవరినో ప్రేమించే వుంటావు. చెప్పు, నీ మనసులో ఎవరుందీను."
దీప తీక్షణంగా మధుసూదనం మొహంలోకి చూసింది. "నా మనసులో ఎవరూ లేరు. ఉన్నా తప్పులేదు. భార్య వుండి పరాయి ఆడదానిమీద మనసుపడే మగవాడు, భర్తవుండీ పరాయి మగాడిమీద మనసుపడే భార్య కన్నా ఓ యువతి, ఓ యువకుడిపై మనసు పడటంలో తప్పులేదు."
మధుసూదనం దీప మాటలు నిర్లక్ష్యంగా తీసుకుని లలితవైపు తిరిగాడు. "లల్లీ! ముందే నే చెప్పానా. నీ చెల్లెలు ఎవడినో ప్రేమించిందని, కాదన్నావ్!" అన్నాడు.
లలిత అనుమానంగా దీప వైపు చూసింది.
దీప కోపాన్ని బలవంతానా నిగ్రహించుకుని పుస్తకం మూసి లేచి నిలబడింది.
"అక్కా! ప్రేమించటం పెళ్ళి చేసుకోటం నేరం కాదు. అది నా స్వవిషయం. బలవంతం మనువు. భర్త సుఖం అపర స్వాధీమణిలా నీ త్యాగం. పెళ్ళాం వుండగా పెళ్ళికి సిద్ధమయిన పెళ్ళికొడుకు ఆ కాలంలో ధర్మం, న్యాయ సమ్మతము కావచ్చు. ఈ కాలంలో ఇది ధర్మంకాదు. న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోదు. మీ తీరు ఎలా వుందంటే నయానో భయానో నన్ను పెళ్ళికి ఒప్పించాలని తాపత్రయ పడుతున్నట్లు వుంది. పిల్లలకోసం అయితే ఎవరినో ఒకరిని దత్తత తీసుకోండి. అంతేగాని నా మెడ లొంచాలని ప్రయత్నించకండి. ఫలితం తీవ్రరూపం దాలుస్తుంది. నేనెవరినో ప్రేమించానని ఊహించాడు నీ నాధుడు. నాలాంటిదాన్ని పెళ్ళాడటానికి బావలాంటి ఉత్తముడు సిగ్గుపడాలి. ఛ...ఛ... అనుకోవాలి, నీకు తెలియదుకానీ అక్కా! ప్రేమ విషయం బావకి బాగా తెలుసు. ఆ...అన్నట్లు మన ఊరికి పచ్చ కామెర్లు బాగుచేసే డాక్టరు వచ్చాడు. ఎవరికయినా పచ్చకామెర్లు వస్తే నాతోచెప్పు. డాక్టర్ అడ్రస్ ఇస్తాను." అని దీప పుస్తకాలు తీసుకుని చరచర బైటి కెళ్ళిపోయింది.
దీప మాటలకి కంగుతిన్న మధుసూదనం, లలిత ముఖముఖాలు చూసుకున్నారు.
ప్రశాంతంగా కూర్చుని చదువుకోవచ్చని అనిల్ ఇంటికి వెళ్ళిపోయింది. దీప ఇంట్లో గోల ఎక్కువయిం తరువాత దీప తరుచు అనిల్ ఇంట్లోనే పార్వతమ్మ దగ్గర కూర్చుని చదువుకుంటున్నది.
పార్వతమ్మవద్ద గల చనువువల్ల దీప జరిగిందీ, జరుగుతున్నది ఏదీ దాచకుండా పార్వతమ్మతో చెప్పింది. ఆమె అర్ధం చేసుకుంది.
"ఉద్యోగం చేయటానికి ఊళ్ళేలటానికి మాత్రమే కాదు. విజ్ఞానానికి కూడా చదువు అవసరం. నువ్వెంత శ్రద్ధగా చదువుకుంటావో అంతకు పదిరెట్లు శ్రద్ధగానే చదువు చెపుతాను" అన్నాడు అనిల్.
"దీపం వెలగటానికి చమురు కావాలి. చదువు చెప్పటానికి (విద్య బోధించటానికి) గురువు కావాలి." తన ఆలోచనకి చిన్నగా నవ్వుకుంది దీప.
10
దీపకి ఎదురు నిలిచి పెద్దగా పోట్లాడలేడు, వాదించలేడు వెంకట్రావు. అలవాటుకి బానిస అయిన వ్యక్తి, ఓ విధమైన అసమర్ధుడు. అసమర్ధత పిరికివాడి లక్షణం. ఈ రకమైన అన్ని లక్షణాలు వెంకట్రావులో వున్నాయి.
పొలం అమ్మే అవసరం లేకుండా ఎప్పుడయితే మధుసూదనం డబ్బుసర్దాడో అప్పటినుంచి వెంకట్రావుకి తెలివితేట లెక్కువయ్యాయి. వంశాంకురం కోసం అల్లుడు వేరే వివాహం చేసుకోవచ్చు. దీప పెళ్ళికెదిగి వుంది. కట్నం పెళ్ళి ఖర్చులు పెట్టుకునే స్థితి లేదు. పరాయివాడిని వెతికి తెచ్చే బదులు దీపని మధుసూదనానికి ఇచ్చి ముడిపెడితే డబ్బు సమస్య, పెళ్ళిసమస్య పరిష్కారం అవుతాయి. పెళ్ళి విషయం దీప ముందు ఎత్తటం అపరకాళిలా దీప లేచి ఎదిరించి బెదిరించటంతో ఏం చేయాలని మధుసూదనాన్నే సలహా అడిగాడు.
"మధుసూదనం! నువు చూస్తూనే వున్నావు కదా! దీప నా మాట వినటం లేదు. ఆడదాని కుండాల్సిన అణకువ బొత్తిగా దీపలో లేదు. మగరాయుడయిపోయింది. లలిత చూడు. ఇది నా బిడ్డ అని నలుగురిలో చెప్పుకుని గర్వించవచ్చు. ఇది వుంది ఆడరౌడీ. నాకు మీ అత్తగారికి దీపని నీకిచ్చి వివాహం చేద్దామని వుంది. దీప కొరగాని కొయ్యలా తయారయింది. నా మతి పోతున్నది. ఏం చేయమంటావ్?"
"మీ అసమర్ధత కనిపెట్టి బావిలో దూకుతా చెరువులో దూకుతా అని బెదిరిస్తుంది. మీరు తండ్రి. దీప వయసు ఎక్కడ, మీ వయస్సెక్కడ మీ ఇష్టప్రకారం జరగాల్సిందే ఇవాళ గట్టిగా చెప్పేసేయండి. మధుసూదనంతో నీ వివాహం ఖాయం. పై నెలలో వివాహంకి ముహూర్తం పెట్టిస్తున్నాను. నీ బెదిరింపులకి లొంగను. ఈ ఇంటికి పెద్దని, మగవాణ్ని నువ్వా? నేనా? నువు గంగలో దూకు, కృష్ణలో దూకు. నీ శవంతో అయినా సరే ఈ పెళ్ళి జరుపుతాను. అని గట్టిగా బెదిరించండి. మెమ్మెమ్మె అనొద్దు." మధుసూదనం సలహా ఇచ్చాడు.
"దీప మహా మొండిది. నిజంగా దేనిలో అయినా దూకితే?"
"మీరు మీ మాటమీద నిలబడండి. దీప గంగలో దూకకుండ, గోదావరిలో దిగకుండ, కృష్ణలో మునగకుండ, ప్రతి నిమిషం నీడలా వుండి నే చూసుకుంటాను. ఆ మూడుముళ్ళు పడితే ఇది మునిగేది సంసారంలోనే."