Previous Page Next Page 
జీవనయానం పేజి 11


                                                               మూడు

 

    జననీ జన్మభూమిశ్చ:

 

    అపిచేత్ స్వర్ణఘయీ లంకా న మమరోచతే
    జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.

 

    వాల్మీకి రామాయణంలోని శ్లోకం. "లంక స్వర్ణమయం అయింది. అయినా నాకు రుచించదు. జనని, జన్మభూమి - ఈ రెండు స్వర్గంలో కూడా లభించవు" అంటాడు రాముడు.

 

    మాతృదేశం అయిన భరతభూమి రాజకీయుల చేతులలో పడి తన రూపాన్ని విధిలేక మార్చుకుంటుంది. దక్షిణ పీఠభూమితప్ప భారతదేశం అనేకసార్లు - రాజులు - రాజకీయుల బలాబలాల్నుబట్టి. మారుతూ వచ్చింది. మారుతున్నది.

 

    మేరువుకు దక్షిణాన సముద్రం తాకేవరకు భారతదేశం వ్యాపించిన రోజులు ఉన్నాయి. ఇరాన్ -ఆర్గాన్ - భారతదేశంలో భాగం కూడా కావచ్చు. అన్ని దేశాల హద్దులు రాజకీయులే మారుస్తారు.

 

    రాజకీయ భారతం కంటే సాంస్కృతిక భారతం సువిశాలం అయింది. సుమారు ఆసియా ఖండం నిండా - మతాల ప్రసక్తికి అతీతంగా - భారత సంస్కృతీ పరిణామాలు వ్యాపించి ఉన్నాయి. ఇవి ప్రజల హృదయాల్లో నిక్షిప్తమయి ఉన్నాయి. రాజకీయుల సంకుచితత్వాలు వాటిని చేరలేవు.

 

    ఇస్లాం ఒకే భగవంతుని విశ్వసిస్తుంది. ఇస్లాం ఒకే సంస్కృతిని విశ్వసిస్తుంది. ఇన్ని ముస్లిం రాజ్యాలు ఎందుకు? ఒకటిగా ఉండరాదా? రాజకీయం పడనీయదు.   

 

    యూరొప్ మొత్తం సుమారు ఒకే సంస్కృతి - ఒకే మతం! కలిసి ఉండవచ్చు కదా? మళ్లీ రాజకీయం! అనేక రాజ్యాలు!!

 

    రాజకీయం మనిషిని చీల్చగలదు. ఏకం చేయలేదు!!


    సాహిత్యం, సంస్కృతి మనిషిని ఏకం చేస్తాయి. చీల్చలేవు!!!

 

    ఆంగ్లేయుల దుష్టచింతన కారణంగా తొలి భారత స్వాతంత్ర్య సమరం తరువాత భారతదేశం రెండుగా చీలింది. ఒకటి బ్రిటిషు భారతం. ఇది భారతదేశంలో సుమారు మూడింట రెండు వంతులుంటుంది. ఇది బ్రిటిషు ప్రభుత్వ పాలనలోనిది. అంటే, అంత విశాల భారతం ఒకే ప్రభుత్వం క్రింద ఉంది. దానిని బ్రిటిషు పార్లమెంటుకు జవాబుదారీ అయిన మంత్రిమండలి పాలిస్తుంది.

 

    రెండోది విదేశీయ భారతం. ఇది మూడింట ఒకవంతు వైశాల్యం కలది. దీనిలో చిన్నా, పెద్దా 600 సంస్థానాలున్నాయి. ఈ 600 మంది పాలకులకు హక్కులు తప్ప బాధ్యతలు లేవు. నిరంకుశత్వం తప్ప శాసనం లేదు. విలాసాలు తప్ప విజ్ఞత లేదు.

 

    బ్రిటిషిండియాలో మహాత్ముని నాయకత్వాన మహోద్యమం సాగింది. మహాత్ముని అహింసాయుధాన్ని ప్రపంచంలోని మేధావులందరూ ఆసక్తితో గమనిస్తున్నారు.  

 

    భారతదేశంలో స్థితిగతులను గురించి విచారించడానికి బ్రిటిషు ప్రభుత్వం సైమన్ నాయకత్వాన ఒక కమీషన్ నియమించింది. దాని పేరు "సైమన్ కమీషన్." ఆ కమీషనులో ఒక్కడూ భారతీయుడు లేడు. ఆ కారణంగా కాంగ్రెస్ సైమన్ కమీషన్ను బహిష్కరించింది. అనేక చోట్ల "సైమన్ తిరిగిపో" అని నల్లజండాల ప్రదర్శనలు జరిగాయి. లాఠీఛార్జీలు - కాల్పులు సాధారణం అయిపోయాయి.       

 

    ఆ సందర్భంలోనే లాలా లజపతిరాయ్ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. అతని రొమ్ముమీద లాఠీలతో బాదారు. ఆ దెబ్బలకు కొద్దికాలం తరువాత లాలాజీ అమరులయినారు. లాలాజీ మరణం భారత వ్యాప్తంగా రోషాన్ని ప్రజ్వరిల్లచేసింది.  

    

    అదిగో, అదే సంవత్సరం నిరంకుశ నిజాం రాజ్యపు పీడిత తెలంగాణంలోని వరంగల్లు జిల్లా, మహబూబాబాదు తాలూకా చిన్న గూడూరు గ్రామంలో నేను జన్మించాను.

 

    అది 1928 వ సంవత్సరం.

 

    విభవనామ సంవత్సర అధిక శ్రావణ శుక్ల సప్తమి మంగళవారం ఉదయం అయిదు గంటలకు దాశరథి రంగాచార్య జన్మించాడు.

 

    వాస్తవం ఇంత కచ్చితంగా ఉండగా పుట్టిన తేదీని గురించి ఒక నిర్దిష్టత లేదు.

 

    వాస్తవం ఎంత గహనం అయిందో తెల్పడానికి ఈ విషయం చెపుతున్నాను.

 

    1952లో ఆంద్ర మెట్రిక్యులేషను పరీక్షకు కట్టేప్పుడు దామాషాగా నా జనన తేది 12-3-1930 అని వ్రాశాను. అందుకు కారణం మా కుటుంబ విచ్ఛత్తి. మా తండ్రిగారు మాకు దూరంగా ఉండడం.

 

    ఆ తరువాత 1966లో మా నాయనగారు నా పుట్టినరోజు జాతక చక్రం ఇచ్చి ఇంగ్లీషు తేది 24-8-1928 అని వ్రాసి ఇచ్చారు.

 

    ఆ తరువాత ఒక జ్యోతిష మిత్రుడు ఇంగ్లీషు తేదీ సరియైంది కాదని, 24-7-1928 సరియైంది అని చెప్పారు!

 

    మా తల్లిదండ్రులు శ్రీరంగయాత్ర చేసి వచ్చిం తరువాత నేను పుట్టానట. అందువల్ల నాకు "రంగడు" అని పేరు పెట్టారు.

 

    మా అన్నయ్య మహాకవి, డాక్టర్, ఆస్థాన కవి "దాశరథి" అనే కలం పేరుగల దాశరథి కృష్ణమాచార్యులవారు. క్రోధననామ సంవత్సర శ్రావణ శుక్ల విదియ 22-7-1925న జన్మించారు.   

 

    ఇక్కడ మహబూబాబాదును గురించి చెప్పాలి. దాని అసలు పేరు మ్రానుకోట. మ్రానుకోట అంటే చెట్లే కోటగా గలది. ఇది ఆనాడు మహారణ్య ప్రాంతం. అరవ నిజాం మహబూబలీ బాదుషా ఇక్కడికి వేటకు వచ్చాడు. వారి శుభాగమన సందర్భమున మ్రానుకోట మహబూబాబాదుగా మారింది.

 

    చిన్న గూడూరు మ్రానుకోట తాలూకాలోనిది.

 

    ఈ విధంగా మతాంతరీకరించిన మరిన్ని పేర్లున్నాయి. ఇందూరు నిజామాబాదు అయింది. పాలమూరు మహబూబ్ నగర్ అయింది. ఎలగందల కరీంనగర్ అయింది. ఎద్దులపల్లి ఆదిలాబాదు అయింది. ఇలాంటివే హుజూర్ నగర్- హుజూరాబాదు మొదలైనవి.

 

    వాస్తవపు భాగ్యనగరం హైదరాబాదుగా మారెను కదా!

 

    "హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితమ్ ముఖమ్" అంటుంది ఈశావాస్యోపనిషత్తు.

 

    సత్యము యొక్క ముఖమును బంగారు పాత్ర మూసివేసినది. బంగారు పాత్ర అంటే, సంపద కావచ్చు, అధికారం కావచ్చు. ఈ రెండు సత్యపు ముఖానికి మసి పూస్తాయి. ఎలా పూస్తాయీ అంటే మనం మసినే సత్యం అనుకుంటాం!

 

    అధికారము - సంపద అంత దుష్టములు. అంత క్రూరములు. అంతకుటిలములు. అయినా, సమాజం వాటిమీదనే ఆధారపడి ఉంటుంది. అది తప్పదు.

 

    కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ విలపించే సత్యాదిదేవత కన్నీరు తుడిచేవారూ - ఓదార్చేవారూ ఉండరు. ఉండరుగాక ఉండరు. ఇదీ లోకం మహానుభావా!

 

    నా చిన్ననాటి చందమామ చిన్నగూడూరు. అది అందాలరాశి. వప్పుల కుప్ప. వయారిభామ. అది వసంతం. అది గ్రీష్మం. అది హేమంతం. అది శరత్తు. అది వర్షం. అది శిశిరం.

 

    చిన్న గూడూరు కరువనున్న కారు మబ్బు. మబ్బుకు ఎండపొడ తగిలి విరిసిన ఇంద్ర ధనుస్సు. అది వెన్నెల. అది ఎండ. అది పైరుగాలి. అది తోట. అది చేమ. అది ఏరు. అది వనము.

 

    అది తామరలు నిండి చెరువు. తామరాకుల మీద నీటి బిందువులు. సూర్యకిరణాలకు తళతళలు. విచ్చుకున్న తామరలు - అరవిచ్చినవి - మొగ్గలు. వాటిపై ఝుమ్మని తిరిగే తుమ్మెదలు!  అబ్బో - ఎంత అందం! అది అందానికి అందం!! అక్షరానికి అందని అందం.

 

    "తామరపూలు" కథ వ్రాశాను. అదంటే నాకు ముద్దు!

 

    మొత్తం మీద చిన్నగూడూరు ప్రకృతిమయం. అనాకృతమూ - అప్రాకృతమూ ఎరుగని కాలం అది. పంచభూతాలు తమ పనులు తాము చేసుకున్నాయి. వాటిలో మనిషి జ్యోక్యం లేదు. ఈనాటి వలె పంచభూతాలను కలుషితం చేయలేదు. మనిషి వాటిని 'రేప్' చేయలేదు హింసించలేదు.

 

    'కలుషితం' అనే పదం ఆనాటి భాషలో లేదు. నిఘంటువులో లేదు. మనిషి ఎరుగడు.

 

    చిన్నగూడూరుకు ఒకవైపున "ఆకేరు. నిర్మలంగా స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. దానికి కట్టలు లేవు. స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఆకేరుకూ వరద వస్తుంది. ఉప్పెన వస్తుంది. పొంగుతుంది. మనకు ఏ శాస్త్రమూ తెలియదు, అన్నీ మేమే నేర్పాం అంటారు ఆంగ్లేయులు. మనం బానిసలం కదా - నమ్ముతాం.

 

    వాస్తు తెలియనే తెలియదని తెల్లవారి ముద్రపడిన మన వాస్తు నిపుణులు ఎంతటి వరద వచ్చినా ఊరికి అంటనంతటి భద్రమైన స్థలంలో ఊరు నిర్మించారు. చిన్నగూడూరే కాదు - అన్ని ఊళ్ళు అలాగే నిర్మించారు.

 

    మానవుడు దురాశాపరుడు అయినాడు. ఆ హద్దులను దాటి ఇళ్లు కట్టుకున్నాడు. మునిగాడు. ముంచింది ఆశ - వరద కాదు!   

 Previous Page Next Page