Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 11

   

     కరుణానిధి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? కరుణానిధి కొడుకు స్టాలిన్... సారా కాంట్రాక్టర్ల దగ్గర్నించి.... కొన్ని వందల కోట్లు పార్టీకి నిధులుగా వసూలు చేశాడని.... ఇప్పటికీ... అక్కడ పొలిటికల్ లాంచీల్లో కదలు కధలుగా చెప్పుకుంటారు.....అలాగే జయలలిత గవర్నమెంటు వచ్చాక, ప్రతి వీధికీ బార్లు రావడానికి కారణం ఏమిటి? నిన్నగాక మొన్న, జయలలిత ప్రభుత్వం మూడువేల బార్లను ఒకే ఒకసారి మూసివేయడానికి లైసెన్స్ లను రిజెక్ట్ చెయ్యడానికి కారణం ఏమిటి?
    
    సారా సిండికేట్ల మధ్య, ప్రభుత్వం మధ్య ఏర్పడిన అగాధమేనని పేపర్లు రాస్తున్నాయి.... సారా సిండికేట్లను రూపుమాపిన నాడు..... ఈ దురాచారం....ఆటోమేటిగగా నాశనమౌతుంది" ఆవేశంగా చెప్పాడు చీఫ్ సెక్రట్రీ వరదరాజన్.
    
    వరదరాజన్ సాధారణంగా ఆవేశపడడు.....ఆయన ఆవేశానికి కనుబొమల కదలిక ద్వారానే ఆనందాన్ని వ్యక్తం చేసింది త్రిభువనేశ్వరీ దేవి.
    
    "ఐ డూ ఎగ్రీ విత్ యూ మిస్టర్ వరదరాజన్....మద్యపానం అనాదిగా వస్తున్న సామాజిక, దురాచారమని అందరికీ తెలుసు.... ఇది ఒక్కరోజులో వచ్చింది కాహ్డు.....ఒక్కరోజులో పోయేది కాదు.....పారిశ్రామిక విప్లవంతో పాటు, మద్యం కూడా ఒక వ్యాపార సరుకు (కమోడిటీ) గా మారింది. ఈస్టిండియా కంపెనీ మన భారతదేశంలో రాజకీయ అధికారం చేపట్టేంత వరకూ మద్యం, మనదేశంలో ఏ ప్రభుత్వానికీ ఆదాయ వనరు కాదు.
    
    1886లో బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ చట్టంతో దాని రూపే మారిపోయింది. సారా ప్రభుత్వ ఆదాయ వనరుల్లో ప్రధాన భాగమై పోయింది. అప్పటి నుంచి ఎక్సయిజ్ చట్టంలో అనేక మార్పులు వచ్చినా, స్థూలంగా పాత మూసలోనే మన ఎక్సైజ్ చట్టాలు ఉన్నాయి.
    
    స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ మధ్యపానానికి వ్యతిరేకంగా గొప్ప ఉద్యమం నడిపారు 1920-21 ప్రాంతంలో దేశవ్యాప్తంగా సారా వ్యతిరేక ఉద్యమం సాగింది. మన రాష్ట్రంలో కోస్తా ప్రాంతంలో కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్ అనే నినాదాలు మారుమోగాయి.
    
    ఆ కాలంలోనే నెల్లూరుజిల్లా ఆ ఉద్యమంలో అగ్రభాగాన నిల్చింది. ఆ జిల్లాలో ఒక సంవత్సరం సారాపై ఆదాయం, ఒక రూపాయికి పడిపోయింది.
    
    సారా నిషేధానికి, ప్రభుత్వం నుంచి చట్టపరమైన తోడ్పాటు అవసరమే కానీ అదొక్కటే సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వ చట్టాల ద్వారా మద్యపాన నిషేధం అమలు సాధ్యం కాదనేది మన రాష్ట్రానికే స్వంత అనుభవం ఉంది. ప్రపంచంలో పలుదేశాల అనుభవం ఇదే..
    
    1937 నుంచీ 1968 వరకూ ఆంద్రప్రాంతంలో మద్యపాన నిషేధం విఫలమైంది. 1987లో రష్యాలో మిహయిల్ గోర్బచేవ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఓడ్కా తదితర డ్రింకులపై రేషనింగ్ పెట్టారు. ఫలితంగా దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా బట్టీలు వెలిసాయి. సారా అక్రమంగా తయారుచేసి పంపిణీ చేసే సారా మాఫియా ముఠాలు ఆవిర్భవించాయి.
    
    మద్యపాన నిషేధం ఖచ్చితంగా దీర్ఘకాలం అమలు జరిగిన సంఘటనలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతి ప్రయత్నం ఒక ప్రయోగంగానే ముగిసింది.
    
    కానీ....
    
    ప్రస్తుతం మనం తలపెడుతున్న ఈ యజ్ఞం.... మరో ప్రయోగంగా మిగిలి పోకూడదనే నా బాధ" సీరియస్ గా చెప్పి, వరదరాజన్ వేపు సూటిగా చూసింది సి.ఎం. త్రిభువనేశ్వరి.
    
    ఎవరూ మాట్లాడలేదు ఒక రాజయ్య తప్ప.
    
    "1991-92లో 850 కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాయి. సారా నిషేధం వల్ల ఈ 850 కోట్ల రూపాయల్ని మనం కోల్పోతామనే కదా? ప్రస్తుతానికి మనం నిషేధిస్తున్నది సారానే, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ని కాదు..."
    
    "దాన్ని కూడా నిషేధిస్తే....గవర్నమెంట్ 'అవుట్' 'మేడమ్" వెకిలిగా నవ్వుతూ అన్నాడు రాజయ్య.
    
    "దాన్ని కూడా నిషేధిస్తాను.... కానీ ఇప్పుడు కాదు... సారా నిషేధం తర్వాత...." కోపంగా అంది రాజ్యవేపు చూస్తూ త్రిభువనేశ్వరి.
    
    అంతలోనే ఆమె మాట ప్రసన్నంగా మారింది.
    
    "నేను సారా నిషేధించడానికే నిశ్చయించుకున్నాను.....ఎవరు అడ్డు పెట్టినా నా నిర్ణయం మారదు.... మిస్టర్ కమీషనర్, అండ్ చీఫ్ సెక్రటీ! రాష్ట్రంలోని 22 డిస్టిరీలకు పని కల్పించి, వాటి ద్వారా ఐ.ఎం. ఎఫ్.ఎల్ ని రెక్టిఫైడ్ స్పిరిట్ ను (ఆర్.ఎస్) ఉత్పత్తి చెయ్యడం ద్వారా మన రెవెన్యూ పెంచుకోడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రెక్టిఫైడ్ స్పిరిట్ ను, మన ఫార్మా స్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అలాగే ఐ.ఎం.ఎఫ్.ఎల్ హోల్ సేల్ వ్యాపారాన్ని గవర్నమెంటే స్వయంగా నిర్వహిస్తుంది.
    
    ప్రభుత్వం ఐ.ఎం.ఎఫ్ ఎల్. వ్యాపారులకు, వైన్ డీలర్లకు అయిదు సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తుంది....కానీ వారు అయిదేళ్ళకు ఒక్కసారిగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.... ప్రతి రెండు నెలలకొకసారి ఫీజు చెల్లిస్తారు... దిసీజ్ మై న్యూ ఎక్సయిజ్ పాలసీ. ఈ పాలసీకి అనుగుణంగానే వైన్ మర్చంట్స్ స్పందన కూడా ఉందని మన కమీషనర్ గారు చెప్పారు అలాగే గతవారంలో వైన్ మర్చంట్స్ పేపర్స్ ప్రకటన ఇచ్చి దీనిని సపోర్ట్ చెయ్యడం కూడా అమీరు గమనించే ఉంటారు" చెప్పడం ఆపింది త్రిభువనేశ్వరి.
    
    "దీనిమీద సారా కాంట్రాక్టర్స్ కోర్టుకెళ్తే..." వెంటనే ప్రశ్న వేసాడు ఎక్సయిజ్ మినిస్టర్ రాజయ్య.
    
    "మీరు సారా కాంట్రాక్టర్స్ గురించి ఆలోచిస్తున్నారా....గవర్నమెంట్ పాలసీ గురించి ఆలోచిస్తున్నారా ....చెప్పండి రాజయ్యగారూ..."
    
    "అది కాదమ్మా! ఇప్పటికే రాష్ట్రంలో పదిజిల్లాల్లో సారా పాటలై పోయాయి....మిగతా జిల్లాల్లో రేపో, నేదో జరగడానికి సిద్దంగా ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు ఆలోచించాలి. నా సిన్సియర్ ఒపీనియన్ చెప్పమంటారా మేడమ్.... ఈ ఏడాదికి ఈ సారా జోలికి మనం వెళ్ళకుండా ఈ సంవత్సరామంతా మన ఇన్ ఫర్ మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖ ద్వారా గ్రామ గ్రామాల్లోనూ సారా నిషేధ ప్రచారం చేసి కాంట్రాక్టర్లతో మీటింగులు పెట్టి....వాళ్ళను ఒప్పించి వచ్చే సంవత్సరం....గాంధీ జయంతినాడు సారా నిషేధం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం."
    
    "యూ ఆర్ రాంగ్ రాజయ్యగారూ....పాముని కొట్టేటప్పుడు...ఎవరూ... నేను కొడుతున్నానని చెప్పడు. ఇదీ అంతే....మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుంది" చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ అన్నాడు.
    
    "న్యూ ఎక్సయిజ్ పాలసీని ఇంప్లిమెంట్ చెయ్యడమే కాదు. సారాని నిషేధిస్తే....దొంగసారా ప్రబలడం ఖాయం....దాన్ని పటిష్టంగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలి." ఎక్సయిజ్ కమీషనర్ అన్నాడు.
    
    "చర్యలు తీసుకోవాలని మీరు స్టేట్ మెంట్ ఇవ్వడం కాదు....చర్యలు తీసుకునే డిపార్టుమెంట్ మీది ....మన డెసిషన్ సక్సస్ కావాలంటే.... మీ డిపార్టు మెంట్ పకడ్బందీగా ఉండాలి..." అంది సి.ఎమ్. త్రిభువనేశ్వరీ దేవి స్థిరంగా.
    
    "కమీషనర్ గారూ... ఏంటలా చూస్తారు....ధూల్ పేట మీద మనం ఎన్నిసార్లు దాడి చేశామో.... ఎన్ని కల్తీ సారా కేసుల్ని బుక్ చేశామో ఆ ఫైల్ ఒక్కసారి మేడమ్ గారికివ్వండి....మా ప్రయత్నం మేం చేస్తూనే వున్నాం మేడమ్- అక్రమ వ్యాపారుల్లో కూడా ఈ మధ్య తెలివితేటలు పెరిగిపోయాయి మేడమ్- నిన్న మా సబ్ కమిటీ మీటింగులో కూడా అదే డిస్ కస్ చేసాం.... చెప్పండి కమీషనర్ గారూ."
    
    కమీషనర్, ఎక్సయిజ్ మినిస్టర్ రాజయ్యవేపు అదోరకంగా చూస్తూ ఓ ఫైల్ ని సి.ఎం.కి అందించాడు...ఆ ఫైల్ వైపు అసలు చూడలేదు త్రిభువనేశ్వరీదేవి.

 Previous Page Next Page