శం నో దేవీరభీష్టయే శంనో భవన్తు పీతయే |
శం యోరభిప్రవన్తునః ||
నాలుగవ అధ్యాయము
మొదటి ఖండము
ఋషులు :- 1. భరద్వాజుడు. 2,7. వామదేవుడు. 3. ప్రియమేధ. 4. ప్రగాథుడు. 5. శ్యావాశ్వ ఆత్రేయ. 6. శంయు. 8. మధుచ్చందసుడు.
1. ఇంద్రుడు సోమపిపాసి. సర్వజ్ఞుడు. గమ్యమునకు చేర్చువాడు. యజ్ఞములకు చేరువాడు. అగ్రగామి. నరులారా! మీరు అట్టి ఇంద్రునకు సోమము అర్పించండి.
2. మిత్రమా! ఇంద్రా! నీవు అనేక పర్వత గుహల నుండి సోమరూప అన్నమును తెచ్చినావు. దానితో లోకము నందలి ఆకలి దప్పులను తొలగించుము.
3. ఇంద్రా! నీవు బలశాలివి. పరాక్రమవంతుడవు. హింసకులను హతమార్చువాడవు. సజ్జన పోషకుడవు. మాకు రక్షణలు, సుఖములు కలుగుటకుగాను, రథమును వలె నిన్ను నడిపించుచున్నాము.
4. ఇంద్రుని అనుగ్రహము సంపాదించు కర్మలను దేవతల పితరుడగు మనువు ఏర్పరచినాడు. ఇంద్రుడు యజమానులు చేయు అట్టి కర్మలను ఆశించుచు వచ్చును.
5. ఇంద్రా! ఏ యజ్ఞమునకు ప్రకాశమాన, శీఘ్రగామి మరుత్తులు రథము మీద నిన్ను చేర్చుచున్నారో ఆ యజ్ఞమున మధుర, మాదక సోమపానము చేయుము. వర్షము కలిగించి అన్నము పుట్టించుము.
6. ఇంద్రుడు భక్తులకు అనుగ్రహించువాడు. బలములకు నాథుడు. శత్రుంజయుడు. నేత యజ్ఞాదులందుండువాడు. విశ్వధని. అట్టి ఇంద్రుని స్తుతించున్నాను.
7. జయశీలుడు, అశ్వరూపుడు, వేగవంతుడగు దధిక్రావనామక అగ్ని దేవతను కీర్తించుచున్నాను. అతడు మా ఇంద్రియములను శక్తివంతములు, సుఖవంతములు చేయును గాక. మా ఆయుష్యములను పొడిగించును గాత.
8. ఈ ఇంద్రుడు శత్రుపురధ్వంసి, నిత్య తరుణుడు, విద్వాంసుడు, అమిత పరాక్రమశాలి, సర్వకర్మ పాలకుడు, వజ్రి, బహుజన స్తుతుడు అగుచున్నాడు.
రెండవ ఖండము
ఋషులు :- 1,3,5. ప్రియమేధ 2,10. వామదేవుడు 4. మధుచ్చందుడు. 6. భరద్వాజుడు. 7. అత్రి 8. ప్రస్కణ్వుడు. 9. ఆప్త్యాస్త్రితుడు.
1. అధ్వర్యులారా! శూరవందనీయుడగు ఇంద్రునకు ముప్పూటల అన్నము అందించండి. అతడు మీచే యజ్ఞము చేయించును. యజ్ఞఫలము కలిగించును.
2. సర్వజ్ఞుడగు ఇంద్రునకు రెండు అశ్వములు ఉన్నవి. అవి సమస్త కర్మలకును, యజ్ఞములకును సాగును. ఆ విషయము ధృవపరచుకొని వానిని రథమునకు కట్టుదురు. అట్లని విద్వాంసులు వచించుచున్నారు. వారు స్వర్గార్హులు.
3. నరులారా! ఇంద్రుని అర్చించండి. విశేషముగా అర్చించండి. యజ్ఞ ప్రేమికులారా! ఇంద్రుని అర్చించండి. ప్రార్దించండి. బిడ్డలారా! వరదుడు, శత్రుహంత యగు ఇంద్రుని అర్చించండి అర్చించండి "అర్చస్తు అర్చత"
4. బహుశత్రు వినాశకుడగు ఇంద్రుని వర్ధన స్తుతులు, మంత్రములచే కీర్తించండి. అప్పుడు ఇంద్రుడు మీ పుత్రులను, మిత్రులను అనుగ్రహించును.
5. ఇంద్రుడు పగతుర మీద దండెత్తువాడు. శత్రువు ముందు తలవంచనివాడు. బలములకు అధిపతి. మరుత్తులారా! మీ సేనలు, వాటి గమనము, రథములను రక్షించుట కని ఇంద్రుని ఆహ్వానించుచున్నాను.
6. నరుడు కర్మానుష్టానము చేయును. సన్మార్గవర్తి అగును. తేజోవంతుడగు ఇంద్రుని స్తుతించును. స్తోతయగును. అతడు ఇంద్రుని ప్రకాశ రక్షణలందు తన శత్రువులను పాపములను దాటును.
7. శతక్రతూ! నీవు బహుధనవంతుడవు. నీ దానము అతిభారము. కావున విశ్వద్రష్టవు, మంగళ మయుడవగు ఇంద్రదేవా! మాకు ధనమును ప్రసాదించుము.
8. శుభ్రవర్ష ఉషోదేవీ! నీ వెలుగులు వ్యాపించినంత నరులు, పశువులు జాగ్రుతులు అగుదురు. పక్షులు ఆకాశమున సంచరించును.
9. సూర్యుడు ప్రకాశించినంత ఆకసమున నిలుచు దేవతలారా!
కద్వః ఋతం కద్వసృతం కాప్రత్నా వ ఆహుతిః ! ఏది సత్యము? ఏది అసత్యము? ఏది సనాతనము? ఏది నీ ఆహుతి?
10. హోత, ఉద్గాతలారా! మీరు అనుష్టించు ఋక్ సామములనే మేము ఆరాధింతుము. అవి ప్రకాశవంతములై దేవతలకు యజ్ఞమును చేర్చును.
మూడవ ఖండము
ఋషులు :- 1. రేభుడు. 2. సువేద శైలూషి. 3 వామదేవుడు. 4. సవ్య ఆంగిరసుడు. 5. విశ్వామిత్రుడు 6. కృష్ణ ఆంగిరసుడు. 7,8. సవ్యుడు. 9. భరద్వాజుడు 10. మేధాతిథి. 11. గర్భస్రవణ్యుపనిషత్తు.
1. విశాలరంగములందలి సేనలు దండెత్తుటకు కూడినవి. శత్రుహంతయగు ఇంద్రుని ఆయుధవంతుని చేయుచున్నవి.
సూర్యుని వలె ప్రకాశించు ఇంద్రుని, స్తోతలు యజ్ఞములందు సాక్షాత్కరింప చేయుచున్నారు.
ఇంద్రుడు కర్మిష్టులందు శ్రేష్ఠుడు. స్థిరుడు. శత్రుహంత. ఉగ్రుడు. పరమతేజస్వి. బలశాలి. అట్టి ఇంద్రుని ధనము కోరి స్తుతించుచున్నాము.
2. ఇంద్రదేవా! నీ యొక్క ప్రధాన క్రోధమునకు శ్రద్దగా ప్రణమిల్లుచున్నాను. ఆ కోపము తోనే నీవు దస్యులను వధించినావు. మేఘములందున్న నీటిని ఈ లోకమునాకు చేర్చినావు. ద్యావాపృథ్వులు నీ అధీనమున ఉన్నవి. విశాల అంతరిక్షము నీ బలమునకు కంపించును.
3. విశ్వమా! స్వర్గ బలములకు స్వామియైన ఇంద్రునకు స్తుతులు, హవిస్సులు సమర్పించుము. ఇంద్రుడు ఒక్కడే యజమానికి అథితి. శత్రుంజయుడు. నవీనుడు. అతడు ఒక్కడే విజయమార్గమున నడిపించగలవాడు.
4. ఇంద్రా! నీవు అధిక ధనవంతుడవు. అనేకులచే కీర్తించబడువాడవు. మేము నీ వారలము. నిన్ను ఆశ్రయించి యజ్ఞములు చేయుచున్నాము. నీవు వినా అన్యుడు స్తుతియోగ్యుడు కాడు. భూమి ప్రాణులను పోషించినట్లు నీవు మా స్తుతులను పాలించుము.
5. నరపాలకుడు, ప్రశంసనీయుడు, బలవర్ధకుడు, పురుహూతుడు, అమరుడు ఇంద్రుడు. అతనిని సుందర, బృహత్తర స్తుతులచే నిత్యము స్తుతించండి. సకల దిశలందు స్తుతించండి.
6. స్త్రీలు పరిశుద్దులు, దోషరహితులు, ధనవంతులగు తమ భర్తలను తమ రక్షణల కొరకు ఆలింగనము చేసి కొందురు. అట్లే స్వర్గసుఖముల కొరకు స్తుతులు ఇంద్రుని కౌగిలించుకొనును.
('పరిష్వజంత' అనుట వరించుట కావచ్చును.)
7. ఇంద్రుడు ప్రసిద్దుడు. శత్రువును ఎదిరించు వాడు. కీర్తనీయుడు. ధనార్ణవుడు. అతనిని స్తుతించండి. ప్రసన్నుని చేయండి. ఇంద్రుడు సూర్యుని వంటి మానవ హితకారి. అతడు కిరణముల వలె సంచరించును. అతడు మహానుడు. మేథావి.
సుఖముల కోరి అట్టి ఇంద్రుని అర్చించండి.
8. ఇంద్రుడు విశ్వభూపతి. శత్రుస్పర్ది. దాత. రథము వలె గమ్యమునాకు చేర్చువాడు. అశ్వము వలె యజ్ఞములకు చేర్చువాడు. నా రక్షణకు అట్టి ఇంద్రుని సుందర స్తుతులచే నుతించుచున్నాను. శత ప్రదక్షిణలు చేయుచున్నాను.
9. ద్యావాపృథ్వులు, జలవంతమై ప్రాణులను పోషించు ధరిత్రి జలనిధి, సుందరుడగు వరుణుని శక్తి వలన నిలిచి ఉన్నవి. నిత్య బీజవంతములు అగుచున్నవి.
10. ఇంద్రదేవా! నీవు ఉషస్సువలె ద్యావాపృథ్వులను కాంతులతో నింపుచున్నావు. దేవా, మానవులకు ప్రభువగు నిన్ను అదితిదేవి కన్నది. నీ వంటి పుత్రునకు జన్మనిచ్చి అదితి మహా జనని అయినది.
11. ఋత్విజులారా! స్తుతియోగ్య ఇంద్రుని హవిస్సులు, స్తుతులతో అధికముగా అర్చించండి. ఇంద్రుడు 'ఋత్విశ్వు' ని వెంటపెట్టుకొని కృష్ణాసురుని గర్భవతులగు భార్యలను హతమార్చినాడు. అట్టి వరదుడు, వజ్రహస్తుడగు ఇంద్రుని మమ్ము రక్షించుమని మిత్రుని వలె ఆహ్వానించుచున్నాము.
('ఋజిశ్వుడు' 'ఓశిజ' పుత్రుడు. "విప్రు" "కృష్ణగర్భ" లతో జరిగిన యుద్దమున ఇంద్రునాకు సాయము చేసినాడు.)
నాలుగవ ఖండము
ఋషులు :- 1. నారదుడు. 2,3. పృక్త్వశ్వసూక్తి 4. పర్వతుడు. 5,6,7,10. విశ్వమనా వైయశ్వుడు. 8. నృమేధ 9. గోతముడు.
1. ఇంద్రా! అభిషుత సోమపానము చేసిన నీవు యజమాని, స్తోతల బలములను వర్ధిల్లచేసి వారిని పావనులను చేయుచున్నావు. అతడు నిశ్చయముగా మహామహుడు. "మహాన్ హి సః"
2. స్తోతలారా! పురుహూతుడు - అనేకులచే పిలువబడువాడును, పురుష్టుతమ్ - అనేకులచే స్తుతించబడువాడును అగు ఇంద్రుని స్తుతులు పాడండి. మహామహుడగు ఇంద్రుని మంత్రములచే అర్చించండి.
3. వజ్రధారి ఇంద్రా! నీవు వరదుడవు. యుద్దములందు శత్రుహంతవు. లోకకర్తవు. హర్యశ్వుడవు. మేము నీ సోమపాన జనిత హర్షమును ప్రశంసించుచున్నాము.