1. దేవతలారా! ఈ బాలకునకు వస్త్రము ధరింపచేయండి. అతనిని తేజస్విని చేయండి. వార్ధక్యము వరకు బ్రతికించండి. దీర్ఘాయువు ప్రసాదించండి. బృహస్పతి సోమరాజునకు ఈ వస్త్రము ధరించుటకుగాను ఇచ్చినాడు.
2. బాలకా! నీవు ఈ వస్త్రమును నీ క్షేమము కొరకు ధరించుము. గోవులను హింసించకుము. రక్షించుము. పాలించుము. 'శతంచ జీవ శరదః' - నూరేండ్లు జీవించుము. నీకు ధనపుష్టియు, సమృద్దియు కలుగును గాక. పుత్ర, పౌత్రాదులచే వర్ధిల్లుము.
వ్యాఖ్య - పూర్వ కాలమున మానవులు తమ శరీరములను ఆచ్చాదించు కొనుటకు దేవతలు గోవు చర్మమును ప్రసాదించినారు. ఇప్పుడు వృ వస్త్రములను ఇచ్చినారు. బట్ట కట్టక ఎవరును గోవు వద్దకు పోరాదు. ఏలనన నగ్నముగా వచ్చువాడు తన చర్మమును తీయునేమో అని గోవు భయపడును. అందుకే బట్టకట్టిన బాలుడు గోవులను హింసించకుండ రక్షించమనుచున్నాడు.
మొదట మానవుడు చర్మములనే కట్టినాడు. శివస్వామి పులిచర్మము కట్టినవాడు కదా! అందువలన జంతుహింస పెరిగి పాడి, పశువులు తరిగినట్లున్నవి. అప్పుడు మనిషి వస్త్రమును కనిపెట్టినాడు. హింసను, జంతుహింసను మాన్పించినట్లున్నాడు. ఈ మంత్రము మానవజాతి చరిత్రపు ఆ దశను వివరించుచున్నది.
4. బాలకా! రమ్ము కుడికాలు పెట్టి ఈ రాతిని ఎక్కుము. నీ దేహము రాతివలె గట్టిదై రోగరహితము అగును గాక. కృణ్వన్తు విశ్వేదేవా ఆయుష్టే శరదః శతమ్ - విశ్వేదేవతలు నూరు శరత్తుల ఆయుష్మంతుని చేయుదురు గాక.
5. బాలకా! నీవు ధరించి పరిహరించిన వస్త్రమును మేము తీసికొనుచున్నాము. సమస్త దేవతలు నిన్ను రక్షించెదరు గాక. నీవు సమృద్ది కలిగి శోభిల్లుదువు గాక. పశు, పుత్ర, ధనములచే వర్ధిల్లుదువు గాక. నీవెన్ను దన్ని అనేకమంది సోదరులు జన్మించెదరు గాక.
నాలుగవ సూక్తము - 14
వినియోగము :-
1) బిడ్డ పోయిన తల్లి సంతాన నాశకమును దూరము చేయుటకు మూడు మండపములందు ఉదక పాత్రలను ఉంచవలెను. జలమును, సీసమును సంపాతము చేయవలెను. ఆ సీసము మీద ఆ తల్లిని కూర్చుండపెట్టి, ఆ జలముతో స్నానము చేయించవలెను. తదుపరి ఇంటికి తెచ్చి శాంత్యుదకమున అభిషేకము చేయించి, పురోడాశపు ముద్దను అలంకారమును అభిమంత్రించి ఇవ్వవలెను. లేక ఒకే మండపమున ఆమెచే ఔదుంబర సమిధలు పెట్టించి ముందు చెప్పినట్లు శాంత్యుదక స్నానాదులు చేయించవలెను.
2) గొడ్డుబోతు ఆవు ఉన్న ఇల్లు దైవోపహతమన బడును. దోష నివారణార్థము ఆ వంధ్య గోవు తోనే యాగము చేయవలెను. ఆ యాగమున ఈ సూక్తముచే పర్యాగ్నికరణము చేయవలెను.
3) క్రవ్యాదులు చేరి, అగ్ని రహిత మగు ఇంటి శాలాప్రోక్షణమున ఇది వినియోగము.
4) చాతన, మాతృనామక గణములందు వినియోగము.
1. నిః సాల మనునది సంతానమును మ్రింగునది. సాలవృక్షమంతటిది. ఘర్షించునది. భయపెట్టునది - దానిని అభిభవించు 'ధిషణ' రాక్షసిని - ఒకే కఠోర వాక్యము ఉచ్చరించు 'ఏకవాద్య' ను - భక్షించు స్వభావము గల రాక్షసిని నాశనము చేయుచున్నాము. 'చండీ' నామక పాపగ్రహమును, దుఃఖము కలిగించు పిశాచినులను ధ్వంసము చేయుచున్నాము.
2. మగున్ధ్యా దుహితారో! మిమ్ము గోశాల నుండి తరిమి వేయుచున్నాము. జూదగృహము నుండి వెళ్ళగొట్టుచున్నాము. ధాన్యాగారము, శకట శాలనుండి పంపించి వేయుచున్నాము. నివాస గృహముల నుంచి దొబ్బివేయుచున్నాము. అంతేకాదు మిమ్ములను పూర్తిగా ధ్వసము చేయుచున్నాము.
3. ఇది భూలోకము. దీనికి దూరమున మరొక లోకమున్నది. దీని క్రింత పాతాళ లోకము ఉన్నది.
పుణ్య కార్యములకు విఘ్నములు కలిగించునట్టియు, అలక్ష్మీ రూపమగు 'అదాయి' రాక్షసి ఈ లోకము విడిచి పాతాళము చేరును గాక. 'సేది' నామ రాక్షసియు, సమస్త పిశాచములును పాతాళమునకు చేరుదురు గాక.
4. భూతపతి రుద్రుడు పిశాచములను మా ఇంటినుండి తరుమును గాక. ఇంద్రుడు సహితము వానిని వెళ్ళగొట్టును గాక. మా ఇంటి అడుగున ఉన్న పిశాచములను ఇంద్రుడు తన వజ్రముచే తిరిగి లేవకుండ అణచివేయును గాక.
5. పిశాచములారా! మీరు వంశానుక్రమ రోగకారకులైనను, శత్రుప్రేరితులైనను, ఏ విధముగా చేరినవారైనను నశించండి.
6. పిశాచములారా! అశ్వము లక్ష్యము చేరి, ఆక్రమణ పూర్తి చేసి నిలిచినట్లు నేను మీ నివాసముల నన్నింటిని నలువైపులా నుంచి జయించి నిలిచినాను. మీ సమస్త రణములను గెలిచినాను. మీ స్థానములను ఆక్రమించినాను. కావున మీరు నిరాశ్రయులైనారు. నశించండి.
ఐదవ సూక్తము - 15
వినియోగము :-
ఆయుష్కామి ఈ సూక్తముచే స్థాళీపాక అన్నమును శాంతి జలముచే ప్రోక్షించి అభిమంత్రించి భుజించవలెను.
1. ద్యులోకము, భూలోకము ఒకరికి ఒకరు భయపడరు. నాశనము చేసికొనరు. అట్లే నా ప్రాణములు భయపడకుండును గాక.
వ్యాఖ్య - దేహము, ప్రాణము భూలోక ద్యులోకము వలె పరస్పర ఆశ్రితలు. అందువలన ఒకరికి ఒకరు కలసి ఉన్నంత కాలము భయపడవలసిన పనిలేదు.
2. రాత్రింబవళ్ళు ఒకరికి ఒకరు భయపడరు. నాశము చేసికొనరు.
"ఏవా మే ప్రాణ మా బిభేః" అట్లే
నా ప్రాణము భయపడకుండును గాక.
3. సూర్యచంద్రులు ఒకరికి ఒకరు భయపడరు. నాశనము చేసికొనరు.
"ఏవా మే ప్రాణ మా బిభేః"
4. యథా సత్యం చానృతంచ నభిభీతో న రిష్యతః |
"ఏవా మే ప్రాణ మా బిభేః ||
5. యథా భూతంచ భవ్యంచ నబిభీతో న రిష్యతః
"ఏవా మే ప్రాణ మా బిభేః ||
వ్యాఖ్య - ప్రాణము భయపడదు అని మాత్రమే అన్నాడు. 'నరిష్యత' అనలేదని గమనించవలెను. ఉపమానములు అందముగా ఉన్నవి.