అంతలోనే ఆమె పెదిమలను తన పెదిమలతో మూసేసాడు భర్త.
అరవై సెకండ్ల సేపు గింజుకుంటూనే భర్తకి సహకరించింది.
పైనుంచి చూస్తున్న మయూషకు ఆ దృశ్యం చూడముచ్చటగా కన్పిస్తోంది.
ఎవరో అదృశ్య వ్యక్తి తననే ముద్దుపెట్టుకుంటున్నాడేమో అన్నంతగా సిగ్గుపడిపోతూ రెండు చేతుల్నీ ముఖానికి అడ్డం పెట్టుకొని చేతి వేళ్ళ మధ్య నుంచి విచిత్రంగా చూస్తోంది మయూష.
మయూష గుండెల్లో దడ వెన్నెముక మీద పట్టిన చిరుచెమట__
"అయింది గదా వదిలేయండి" అంది భర్త చేతుల్లోంచి తప్పించుకుంటూ.
అతను భార్యను వదలకుండానే ఆమెను టాప్ లెస్ చేసే పనిలో నిమగ్నమయిపోయాడు.
అతనిచేతులు ఆమె వంటిమీద ఎక్కడెక్కడో తిరిగాడుతున్నాయి వేగంగా.
"మీకు సిగ్గులేదు" అంది భర్త వేపు చిరుకోపంతో చూస్తూ.
"నువ్వు కూడా సిగ్గులేకుండా దొరికిపోతావ్__అప్పుడు నీ డైలాగ్ నీకు తిప్పికొట్టకపోతే నా పేరు గాయత్రీ హజ్ బెండే కాదు" ఆమె ముక్కును పట్టి లాగుతూ అన్నాడు గాయత్రి మొగుడు.
"ఛీ...." అంటూ బాత్ రూమ్ తలుపు తీసుకొని బయటపడి కిచెన్ రూమ్ లోకి పరుగెత్తింది గాయత్రీ.
అతను పెద్దగా నవ్వి బకెట్లోంచి నీళ్ళు తీసిపోసుకొని "తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్..... తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్...." పాటని హమ్ చేస్తూ సబ్బు రుద్దుకుంటూ-
అప్రయత్నంగా పక్కింటి డాబావేపు చూసి నిర్ఘాంతపోయాడు.
ఏదో ఆలోచనలో పడిపోయిన మయూష....గాయత్రి అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఎటో దిక్కులు చూస్తుండిపోయింది.
"హలో...." నెమ్మదిగా పిల్చాడు గాయత్రి మొగుడు.
తల తిప్పి కిందకు చూసి అక్కడ నుంచి కదలబోయేటంతలో.....
"అంతా చూసేసావా పిల్లా....." గాల్లో ఆ స్వరం గుసగుసలుగా వినబడింది.
ఆ మాటకు ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది మయూష. అక్కడ నుంచి కదలడానికి మరొక్క అడుగు ముందుకు వేసింది.
"హలో కాసేపు ఆగొచ్చుగా" మళ్ళీ విన్పించిందా గొంతు.
అదే సమయంలో కిచెన్ రూమ్ లోంచి వరండాలోకొచ్చి కత్తిపీట తీసుకుని లోనికెల్తోంది గాయత్రి.
"పనిలో ఉన్నాను వరండా మీద నన్నాగమంటారేవిటీ వేగిరం స్నానం చేసుకొని రండి" అనేసి లోపలికి వెళ్ళిపోయింది.
"నిన్ను కా....." అనబోయిన మొగుడు అనకుండానే మయూష వేపు చూశాడు.
మయూష సన్నగా నవ్వింది.
సరిగ్గా అదే సమయంలో-
"మయా.....మయూష" అంటూ పిలుపు వినబడడంతో "వస్తున్నా" అంటూ పారిపోయింది మయూష లోపలికి.
"పేరు చెప్పకనే మరుగయ్యావా బాలా....బాలా....నాబాలా" పాట పాడుకుంటూ టవల్ తో జుత్తు తుడుచుకుంటూ బయటికొచ్చిన గాయత్రి మొగుడు గాయత్రిని చూసి నాలిక్కరుచుకున్నాడు.
"ఏ సినిమాలోని దండీ ఈ పాట?" మామూలుగానే అడిగిందామె.
"ఇదా పక్కింటి అమ్మాయి అని.....పందొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిందిలే. అప్పుడు నువ్వు పుట్టలేదు" కంగారుగా లోనికెళ్ళి పోయాడతను.
"నాకు తెలుసుగా మీ డేటాఫ్ బర్త్. అప్పుడు మీరు కూడా పుట్టలేదు" అంది గాయత్రి నవ్వుతూ.
అప్పుడే వాళ్ళత్తగారు పూజ గదిలోంచి బయటికొచ్చింది.
* * * *
బర్కత్ పురా మెయిన్ రోడ్ మీద వెళుతోంది స్కూటర్. ముందు సీట్లో తండ్రి పీతాంబరం కూర్చున్నాడు .....వెనక మయూష కూర్చుంది.
"సాయంత్రం నాలుగ్గంటలకి కాలేజీ దగ్గర కోస్తాను రెడీగా వుండు....షాపింగ్ కు వెళదాం" అన్నాడు పీతాంబరం.
ప్రతి ఏటా పండుగ బట్టల్ని, ఇంట్లో వాళ్ళందరికీ మయూషె సెలక్ట్ చేస్తుంది ప్రతి ఏటా దీపావళికి బట్టలు తీస్తాడు తండ్రి.
"కొత్త గవర్నమెంట్ కదా.....ఏరియర్స్ ముందుగా ఇస్తున్నారు పండుగొచ్చినపుడు డబ్బులుండాలి గదా....డబ్బులొచ్చినపుడే బట్టలు తీసేస్తే ఒక పనయిపోతుందని స్కూటర్ని సిటీ బస్టాఫ్ దగ్గర స్లోచేస్తూ అన్నాడాయన.
తండ్రి పీతాంబరం స్కూటర్ జనం మధ్యన కల్సిపోయింది.
కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఒకటుంది. వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర్నుంచి వారికొక అంబాసిడర్ కారు ఫాలో అవుతోందని!
ఆ కారులో డ్రయివర్ కాక, వెనక సీట్లో భుజంగపతి విలాసంగా కూర్చున్నాడు.
"మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్.....?" అడిగాడు డ్రైవర్.
"సెక్రటేరియట్ కి....ఆ స్కూటర్ని చూస్తున్నావ్ గా....." అన్నాడతను.
డ్రైవర్ మౌనంగా తలూపాడు.
* * * *
మధ్యాహ్నం సరిగ్గా పదకొండున్నరైంది-
సెక్రటేరియట్ లోని ఆ సెక్షన్ లోని ఉద్యోగస్తులందరూ ఎవరి పనిలో వారున్నారు.
మిగతా రోజుల్లో ఆ సెక్షన్ లోని సిబ్బంది ఆ సమయంలో క్యాంటీన్ లోనో, పాన్ పాప్ దగ్గరో వుండేవారు.
కానీ ఇటీవలే విదేశాల ట్రిప్ వెళ్ళి సంబంధిత రాష్ట్రమంత్రి క్రితం రోజే తిరిగొచ్చాడు.
ప్రస్తుతం ఆయన చాంబర్లో వున్నాడు-
అందుకే సిబ్బంది బిక్కచచ్చిపోయినట్టుగా వున్నారు.
సరిగ్గా అదే సమయంలో....
ఫ్యూన్ వచ్చి "మీ కోసం ఎవరో వచ్చారు సార్" అని చెప్పే సరికి సీట్లో ఏదో ఫైల్ తిరగేస్తున్న సెక్షన్ హెడ్ పీతాంబరం తలెత్తి చూశాడు.
ఎదురుగా భుజంగపతి.
"నన్ను విశ్వమోహన్ రావు పంపించాడు. నా పేరు...." తన పేరు చెప్పాడతను.
విశ్వమోహన్ రావు పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు పీతాంబరం.
"ఏంటి పని...." నెమ్మదిగా అడిగాడు.
"మీకభ్యంతరం లేకపోతే.....క్యాంటీన్లోకెళ్ళి మాట్లాడుకుందాం" భుజంగపతి మాటకు సీట్లోంచి లేచాడు పీతాంబరం.
* * * *
కాఫీలయ్యాక త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ఆఫర్ చేశాడు భుజంగపతి.
"విశ్వమోహనరావు నాకు బావమరిది వరస అవుతాడు. మీ ఇద్దరిమధ్యా చాలా కాలంగా డీలింగ్స్ వున్నాయట కదా.....పీతాంబరం నాకు మంచి ఫ్రెండని చెప్పాడులెండి.... జైజవాన్ కన్ స్ట్రక్షన్స్ కి చెందిన ఫైల్ చాలాకాలంగా మీ దగ్గర పెండింగ్ లొ వుంది. ఆ కన్ స్ట్రక్షన్స్ లొ నేను పార్టనర్ ని. పాత గవర్నమెంట్ వాళ్ళు లేనిపోని రూల్స్ చెప్పి ఏవో అడ్డంకులు పెట్టారు. పది లక్షలు ఖర్చయినా ఫైల్ కి మోక్షం రాలేదు. మీకు తెలుసు కదా" నెమ్మదిగా అన్నాడు భుజంగపతి.