Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక  పేజి 11


    "మరి రేపటినుంచి వల విసురుతాను. సూర్యముఖికి ట్రాప్ వేయనా?"

    ఆ మాటలకు ఉలిక్కిపడింది చిత్ర.

    "సూర్యముఖి ఎవరనుకున్నావ్? రెడ్డి కూతురు. అలాంటివాళ్లతో డేంజర్. నిన్నూ నన్నూ బొక్కలో తోసి నిజం కక్కిస్తారు. ఆ తరువాత రెడ్డి మనిద్దరం ఇంట్లో వుండగా బాంబులువేసి చంపేస్తాడు"

    ఆ మాటలకు భరణికూడా భయపడ్డాడు.

    "మన టార్గెట్ అంతా దిక్కూ మొక్కూ లేని పేద అమ్మాయిల మీదే. వాళ్లకి తెలిసినా శాపనార్దాలు పెడతారు మన ఎదురుగా నిలబడనియ్యలేదు. కాబట్టి నువ్వు వల వేయవలసింది ఎవరికో తెలుసా?" అని ఆగిందో లేదో  "ఎవరికి?" అని అడిగాడు.

    "ఇందుమతికి" అని చెప్పి ఇందుమతైతే తామెంత సులభంగా బైటపడవచ్చో తెలిపింది.
 
    "అయితే సరే" అన్నాడు భరణి.

    ఆ విధంగా అతను కొత్త వ్యాపారంలో దిగాడు. ఇప్పటికి సగం సాధించాడు. ఇక మిగిలింది సగమే.  అదీ సాధించేస్తే అందమైన అమ్మాయిలతో మూడురోజుల శోభనం. ఆ తరువాత యాభైవేల డబ్బూ వస్తుంది. అందుకే అతను ఉత్సాహంగా వున్నాడు.

    "మరి నే వెళ్ళిరానా?" అని బయలుదేరాడు.
 
    "క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగిరా" అంది చిత్ర.

    అతను అంకాళమ్మ గుడికి బయలుదేరాడు.


                         *    *    *   

   
    ఇందుమతి భోజనం ముగించి బయటికొచ్చింది.

    ఇంటి ఆవరణలో వున్న కొబ్బరిచెట్టు  చందమామ తలమీద అలంకరించుకుని కులుకుతోంది. నేలంతా పాలను ఒలకబోసినట్టు వెన్నెల పరుచుకుని వుంది. గాలి ఏదో రహస్యాలను మోసుకెళుతున్నట్టు బరువుగా వీస్తోంది. ఆకాశంలో తెల్లటి మబ్బులు రెల్లుపూలు పొదల్లా వున్నాయి.

    ఇందుమతి కొబ్బరిచెట్టు నీడ కిందకి నులకమంచం వాల్చుకుని పడుకుంది. మరో పావుగంటకు అమ్మ. అమ్మమ్మ భోజనాలు ముగిస్తారు. ఆ కార్యక్రమం అయిపోగానే టీ. వీ.  చూడడానికి వెళుతున్నానని చెప్పి  బయలుదేరి అటునుంచి అంటే అంకాళమ్మ రావిచెట్టు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆమె ప్లాన్.
 
    ఇంట్లో అమ్మ కెదురుగా వుంటే తనలో కలుగుతున్న తొట్రుపాటునంతా అమ్మ కనిపెట్టేస్తుందని  భయం. అందుకే కొబ్బరిచెట్టుకింద చేరింది.

    భరణి తొమ్మిది గంటలనుంచి మూడుగంటల వరకు ఉంటాడు కాబట్టి భయపడవలసింది ఏమీ లేదు. కొద్దిగా ఆలస్యమయినా ఫర్వాలేదు.

    సరస్వతి పిన్ని ఇంటికి వెళ్లకుండా బలిజ వీధినుంచి నేరుగాఏట్లోకి వెళ్లి, అక్కణ్నుంచి శివాలయం మీదుగా కూలీల సెంటర్ కి వెళ్లిపోయి,  అక్కణ్నుంచి బస్సురూటు దాటి ఓ పర్లాంగ్ నడిస్తే అంకాళమ్మ గుడి వచ్చేస్తుంది. మొత్తం అరగంట నడక. మరి అక్కణ్నుంచి ఎటువెళ్లాలో భరణి చెబుతాడు.

    రాత్రి తాను ఇంటికి రాలేదన్న విషయం అమ్మ ఎప్పుడు పసికడుతుంది? మెలకువగా వుంటే పన్నెండుకుకూడా తను రాకపోతే అమ్మ వెదుక్కుంటూ పిన్ని ఇంటికి వస్తుంది.

    తన ఇంటికి రాలేదని పిన్ని చెప్పగానే అమ్మ  ఎలా రియాక్ట్ అవుతుంది? ఓ అబ్బాయితో లేచిపోయానన్న డౌట్ మొదట రాదు.

    ఊరు ఊరంతా వెదుకుతుంది. దాంతో అమ్మలక్కల గుసగుసలు  ప్రారంభమవుతాయి.
 
    'ఇరవై రెండేళ్లయినా పెళ్లి చేయకపోతే ఇదిగో ఇలానే అవుతుంది. ఏ నుయ్యే గొయ్యో చూసుకుని వుంటుంది.

    'శతరూపకు బుద్దిలేదులే. ఎవర్నో ఒకర్ని ముడి పెట్టేయ్యాలిసింది.'

    'తనకి మొగుడ్ని వెదుక్కోడానికే ఆమెకు సరిపోయింది కాలమంతా ఇక కూతురికి ఏం చూస్తుంది?'

    'తన అన్న కొడుకు వున్నాడట. కాలు కుంటి. వాళ్లు చేసుకుంటామని వచ్చినా శతరూప ఆ సంబంధాన్ని పడనివ్వలేదట.'

    'శతరూప భర్త ఆమెను వదల్లేదట. అతనికి అప్పుడప్పుడు  మూర్చవస్తుందట. మూర్చరోగితో తాను కాపురం చేయలేనని ఈమే వచ్చేసిందట.'

 Previous Page Next Page