Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 12


    ఇలా తను చేసిన పనికి అమ్మను ఆడిపోసుకుంటుంది లోకం. అమ్మ చాలా కష్టాలే పడింది. కానీ అవేమిటో పూర్తిగా నాకు తెలియదు.  ఎవరో ఇరుగు పొరుగు దొంగచాటుగా  అనుకుంటూ వుంటే తను విన్నది. తను లేచిపోగానే మళ్లీ జనమంతా  తన అమ్మను బలిపశువుని చేస్తారు. వున్నవీ లేనివీ ఒకటికి పది కల్పించి అమ్మకు అంటగటతారు.
 
    ఈ సందర్బంగా తననూ వదిలిపెట్టరు అసలు కథానాయిక తనే కాబట్టి.

     'ఇందుమతి పైకి అలా వుంటుందిగానీ లోతు మనిషి ఎడమచేయికి  తెలియకుండా  కుడిచేత్తో చేసే రకం.'

    'కాలేజీలోకూడా ఇంతేనట. ఎవరో అబ్బాయిని మరిగి వ్యవహారం చాలాదూరమే పోయిందట'

    'ఆ పిల్ల నడిచేటప్పుడు ఎప్పుడయినా చూశావా? ఏం కులుకులు పోతుందని?'

     'చూపులుకూడా అంతే. పరువైన ఆడపిల్ల చూపులు కావవి. మగాడు వీధిలో నడిచిపోతుంటే చాలా తినేసేటట్టు చూస్తుంటుంది.'

    'మా ఆయనో, లేక మావోడో ఆ వగలాడి బుట్టలో పడిపోతారేమో నని హడలి చచ్చాననుకో.'

     "భరణి ఆ ఊరిలో అడుగు పెట్టినప్పట్నుంచి ఈ భాగోతం నడుస్తోందట. ఈ మధ్య అబార్షన్ కూడా చేసుకుందట నెల్లూరులో."

    ఇలా తాము వెళ్లిపోయిన  రోజునుంచి తమ ఊహాశక్తి మేరకు కథలు అల్లడం ప్రారంభిస్తారు. పాపం అవన్నీ ఎలానోవోలా తల్లి చెవిన చేరతాయి. కాని ఇలాంటివన్నీ తప్పవు. ఒకటి కావాలనుకున్నప్పుడు మరోదాన్ని వదిలించుకోక తప్పదు.

    "రెండోసారి గర్భం వస్తే ఇక వీలుకాదని రాత్రికి రాత్రే లేచి పోయారట" అన్న ఊహాగానమే  బలం పుంజుకుని చివరికి నిజంగా స్థిరపడిపోతుంది.

    నిజానికి ఊరణికీ, తనకీ మధ్య అంత సంబంధం ఎప్పుడూ లేదు. వ్యవహారం అంతవరకు రావడమే అరుదు. వచ్చినప్పుడు తనే ఒప్పుకోలేదు. పాపం భరణి కూడా తనను ఎక్కువ వత్తిడి చేయలేదు.  ఏదో మాటవరసకి అడుగుతున్నట్టు అడిగేవాడు.

     ఓ రోజు ఏం జరిగిందీ కళ్లముందు మెదిలింది. ఇందుమతికి. మామూలుగా సాయంత్రం ఆరుగంటలకల్లా ఇంటికి వచ్చేసేది అమ్మ. ఆ రోజు ఏడుగంటలైనా రాలేదు. ఇందుమతి కంగారుపడుతూ వుంటే రామదాసు వచ్చి.... " ఈ రోజు ఆరోగ్య కార్యకర్తల మీటింగ్ వుంది నెల్లూరులో.... అమ్మ ఈ పూటకి రాదు. ఇంట్లో జాగ్రత్త" అని చెప్పాడు.
 
    విషయం ఏమిటో తెలిసిపోయింది గనుక ఇందుమతి స్థిమిత పడింది.

    టెంపరరీ ఉద్యోగమే అయినా, అయిదారు నెలలకి జీతం ఇచ్చినా మీటింగ్ లకి  ఏమీ తక్కువ లేదనుకుంటూ పొయ్యిదగ్గర కూర్చుంది.

    మధ్యాహ్నం చేసుకున్న  కూర వుంది కాబట్టి అన్నం వండుకుంటే చాలు.

    ఆ పని పూర్తయ్యేటప్పటికి ఏడున్నర అయింది.

    చీకటి లొకాలని నల్లటి కంబళిలా కప్పుతోంది. చుక్కలు పెట్రోమాక్స్ లైట్లలా వెలుగుతున్నాయి.  గాలి చల్లగా ఆహ్లాదంగా వుంది.

    మామూలుగా  సాయంకాలం భరణి డిష్ కనెక్షన్ లు చెక్ చేస్తున్నట్లు అలా వచ్చేవాడు.
 
    తనకోసమే అతను వీధిలో నడుచుకుంటూ వెళతాడని తెలిసిన ఇందుమతి ఆ వేళప్పుడు ద్వారానికి కట్టిన మామిడాకుల తోరణయే అయిపోయేది. కనకాంబరాల పూలమాలల్ని దూరం నుంచి విసిరినట్టు చూపుల్ని అతని కళ్లల్లోకి తోసేది.

    ఆ రోజు ఎందుకోగానీ భరణి రాలేదు. ఏమైందబ్బా అని దిగులుపడుతోందామె.  ఒక్క క్షణం అతనిని చూడకపోతే గుండెంతా అమావాస్య ఆకాశం అయిపోతుంది. మనసంతా కల్లోల కెరటాల సముద్రమైపోయింది. కళ్లు నీళ్ళెప్పుడూ నిలవుండే జలశయాలైపోతాయి. శరీరం దిగులుతో కూరుకుపోయిన ఎదురు దబ్బుల బొంగైపోతుంది.

    అందుకే కాలుగాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతూ వుండిపోయింది ఇందుమతి.

    అమ్మమ్మకు భోజనం పెట్టిందిగానీ తను తినలేకపోయింది.  ప్రేమిస్తున్నవాళ్ళు ఎందుకు సన్నబడిపోతారో మొదటిసారి తెలిసింది.

    తొమ్మిది గంటలైంది. ఊరుఊరంతా నిద్రకుపక్రమించడానికి దుప్పట్లు పరుచుకుంటోంది. ఇంకా మాటలు కాని ఒకరిద్దరు మాత్రం వీధి తెన్నెల మీద కూర్చుని  రాత్రికి వేడెక్కిస్తున్నారు.

    పెరటి తలుపులు మూయడానికి ఇందుమతి ప్రయత్నిస్తుండగా కుంతీదేవి మంత్రం జపించగానే సూర్యుడు ప్రత్యక్షమైనట్టు ద్వారానికి అటువైపు భరణి కనిపించాడు ఆనందం మనసులోంచి ఎగజిమ్ముతుండగా "నువ్వా?" అంది ఆశ్చర్యంగా.

 Previous Page Next Page