"ఇక్కణ్ణుంచి అంకాళమ్మ గుడి కిలోమీటరు కదా. ఇప్పుడు బయల్దేరితే తొమ్మిదింటికి అక్కడికి చేరుకుంటాను ఇందు కాస్తంత ముందొచ్చి నేను కనపడక తిరిగి వెళ్లిపోతే ఆరునెలల కష్టం వేష్టవదూ."
"అదీ నిజమే. అయితే బయల్దేరు."
"నేను రెడీనే. కానీ జేబే బలహీనంగా వుంది."
"ఎంత కావాలంటావ్?" అడిగిందామె.
"కనీసం రెండువేలు. నెల్లూరులో మూడురోజులైనా వుండాలి. హోటల్ లో రూమూ, ఖర్చులూ ఎంతవుతుందనుకుంటున్నావ్. చాలానే అవుతుంది"
"మూడురోజుల తరువాత - ఇక్కడ సద్దుమణగగానే నేను వచ్చేస్తా గదా" అన్నది చిత్ర.
"అంతవరకు గడవాలిగదా" అన్నాడు భరణి.
"అయితే వుండు" అని చిత్ర లోపలికెళ్లి డబ్బుతో వచ్చింది. దాన్ని చేతికిస్తూ "ఇప్పటివరకూ ఈ వ్యవహారం కింద మొత్తం అయిదు వేలు ఇచ్చాను. బాంబేలో డబ్బు చేతిలో పడగానే నా అయిదువేలు నేను ఎత్తుకుంటా. మిగిలినదానిలో చెరి సగం. అదేగదా మన ఒప్పందం" అని గుర్తుచేసింది. చిత్ర డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా వుంటుంది.
"ఆఁ" అని డబ్బు తీసుకున్నాడతను.
" ఇంతకీ ఆ పిల్ల వస్తుందంటావా?" చిత్రకు ఇంకా నమ్మకం చిక్కడంలేదు. ఇందుమతి వస్తే తన భాగం కింద ఎట్లాలేదన్న యాభైవేల రూపాయలు వస్తాయి. రాకపోతే పెట్టుబడి పెట్టన అయిదువేలు నష్టం వస్తుంది. అందుకే నమ్మకంకోసం మరోమారు అడిగింది.
"తప్పక వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు - రేపు కాకపోతే ఎల్లుండి" అమావాస్యలోపు రావడం ఖాయం.
"అయితే ఓ. కే. జాగ్రత్తగా డీలే చేయి" అంటూ జాగ్రత్త చెప్పింది చిత్ర.
ఇప్పటివరకూ ఎవరికీ డౌట్ రాకుండా మైన్ టైన్ చేశాం. ఇకనుంచి కూడా అలానే చేద్దాం. బాంబేవరకూ ఇందూకుకూడా అనుమానం రాకుండా మనం జాగరూకతతో వుండాలి" అన్నాడు భరణి.
"నాకు జాగ్రత్తలు చెప్పకు. ఇలాంటివి నాకు కొత్త కాదు" అంది చిత్ర భరోసా ఇస్తూ.
ఆ మాటలు నిజం అమాయకపు అమ్మాయిల్ని బాంబేలో అమ్మడం చిత్రకు కొత్తేం కాదు.
ఇప్పటివరకు ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నలుగురు అమ్మాయిల్ని బాంబేకు తీసుకెళ్లి అమ్మింది. బాగానే డబ్బు సంపాదించింది.
అయితే ప్రేమ పేరిట ఓ అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాలనుకోవడం ఇదే మొదటిసారి. భరణి వచ్చిన నెలరోజులకు చిత్ర యీ ప్లాన్ వేసింది.
భరణి ఆ ఊళ్ళో డిష్ పెట్టాడు. భోజనాలంతా చిత్ర ఇంట్లోనే. ఇద్దరికీ కావాల్సినంత తీరిక వుండడంతో వారం రోజులకల్లా ఇద్దరూ బహుక్లోజ్ అయిపోయారు. ఒకర్ని మరొకరు పూర్తిగా తెలుసుకున్నారు.
ఎదుటివ్యక్తి ఎలాంటివాడో చిత్ర బాగానే అంచనా వేయగలుగుతుంది. భరణిలో ఏ మూలనో వున్న క్రిమినల్ మెంటాలిటీని ఆమె పసికట్టింది. స్త్రీలంటే అతనికివున్న చులకన భావాన్ని అర్దంచేసుకుంది. డబ్బు కోసం, థ్రిల్ కోసం అతను ఎలాంటి చండాలపుపనయినా చేయగలడని ఆమె వూహించింది. అతనిలో భయంకూడా తక్కువని, తనలాగే ఎలాంటి మానవత్వపు విలువలు లేని ఆమె గుర్తించింది. అందుకే అతనిచేత ఈ వ్యాపారం చేయాలనిపించింది.
ఓరోజు సాయంకాలం మెల్లగా తన పథకం చెప్పింది. "ముందు లాగా డబ్బు ఆశ చూపిస్తేనో, మంచి జీవితం చూపిస్తానంటేనో ఆడపిల్లలు మోసపోయే రోజులు పోయాయి. అందుకే ఈమధ్య నా వ్యాపారం మూల పడిపోయింది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఓ కొత్త ఐడియా వచ్చింది" అని ప్రారంభించింది.
"ఏమిటది?" అని అడిగాడు భరణి. అమ్మాయికి అమ్మాయి, డబ్బుకి డబ్బూ వచ్చే ఆ ఐడియాను వినాలని అతను ఉత్సాహపడిపోయాడు.
"నువ్వు అందంగా వున్నావ్. చొరవతో దూసుకుపోగలవ్. అందుకే ఆ అమ్మాయిలకు వల వేస్తూ వుండు. ఎవరో ఒకరు పడకపోరు. లేవదీసుకుపోయి పెళ్లిచేసుకుంటానని నమ్మబలుకు. ఆ అమ్మాయి వచ్చేస్తుంది. మూడురోజులు నువ్వు ఆ పిల్లతో శోభనం చేసుకో. ఆ తరువాత నేనువచ్చి జాయిను అవుతాను. నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెబుతాను. అలా ముగ్గురం బాంబేకి బయలుదేరుదాం. అక్కడే కాస్ట్ లీ బ్రోతలింగ్ కంపెనీ నడిపే లక్ష్మి నాకు మంచి దోస్త్. ఆ పిల్లను ఆమెకి అమ్మి తిరిగి రైలు ఎక్కేద్దాం. వచ్చిన డబ్బులో ఫిఫ్టీ ఫిఫ్టీ" అని వివరించింది.