"నే ఎల్లోస్తానే, ఊరికెళ్ళి ముహూర్తాలు పెట్టించి జాబు రాయిస్తే" అని లేచాడు వీరయ్య. ఇంకా రెండు రోజులుండి పొమ్మని బలవంతం చేసింది వీరమ్మ. అయినా వీరయ్య వినకుండా వెళ్ళిపోయాడు.
ఆ రోజు ఉదయమే లేచి పశువుకి గడ్డి కోసుకుని రావటానికి వెళ్ళింది గిరిజ. చకచక గడ్డి కోసుకుని మోపు కట్టుకుని తిరిగి యింటికి వద్దామనుకునే సమయానికి రామలింగయ్య కొడుకు ప్రభాకర్ ఆమెని చూసి అటుగా వచ్చాడు.
ప్రభాకర్ హైస్కూల్ చదువుని దాటలేక ఆగిపోయి గ్రామంను సర్వే చేస్తూ వుంటాడు. ఎప్పుడైనా గాలి మళ్ళితే అలా పొలాల వేపు వస్తాడు. అందునా అతని స్వార్ధమే వుంది.
"ఏమే గిరిజా! గడ్డి కోసం వచ్చావా?" అని ప్రశ్నించాడతను.
తలూపింది గిరిజ.
"ఎక్కువగా కోసినట్టున్నావు. మోపు బరువుగా వుంటుందేమో? ఎత్తి పెట్టనా? అని అడిగేడతను.
"ఒద్దులే బాబూ! ఎత్తుకోగలను" అంది గిరిజ.
"ఫరవాలేదులే మనలో మనకేమిటి చేయి వేయని" అని ముందుకి వచ్చి మోపు ఎత్తబోయాడు. అతనికి కదల్లేదది, నవ్వింది గిరిజ.
కొద్దిగా అవమానం అయినట్లు ఫీలయ్యాడతను. నీవూ చేయి చేయి కలిపితే కదా ఎత్తగలిగేది అన్నాడు.
చేయి వేసి ఎత్తింది గిరిజ.
ఆమె చేయి అతని చేయి కలిశాయి.
విద్యుత్ ప్రవహించినట్లు అయింది అతనికి. చేయి వదిలాడు. మోపుజారి పడింది.
గిరిజ తూలింది. ఆ ఊపుకి" ఆ ఆ పడతావు అని పట్టుకున్నాడు ప్రభాకర్."
నిలదొక్కుకున్న గిరిజ అతని పట్టువిదిపించుకోబోయింది ప్రభాకర్ వదల్లేదు. "గిరిజా! నీవు చాలా అందంగా ఉంటావే" అన్నాడు యింకా దగ్గరికి లాక్కుంటూ.
గిరిజకి గుండెలు దడదడలాడేయి.
దైర్యాన్ని పుంజుకుంటు అతన్ని విదిలించి కొట్టింది. తూలి పడ్డాడు ప్రభాకర్ గడ్డి సంగతి గాలి కొదిలేసి పరుగెత్తసాగింది. వెంటపడ్డ ప్రభాకర్ కు గిరిజ చిక్కలేదు.
కాటునించి తప్పించుకున్న మనిషిని చూచి పోగరైన జాతి నాగుపాము చూసి పగబట్టినట్టుగా బుస కొట్టాడు ప్రభాకర్.
అదేరోజు సాయంకాలం వూరిచివరి నుంచి షికారు నుంచి తిరిగోస్తున్న ప్రభాకర్ కి వీరయ్య చిన్న కొడుకు రంగయ్య కనిపించాడు.
"రిక్షా" అని కేకేశాడు ప్రభాకర్.
రిక్షా ఆపలేదు రంగయ్య.
"ఒరే అపరా రిక్షా" అన్నాడు మళ్ళీ.
అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిశ్చయిచుకుని "ఎందుకురా?" అన్నాడు తిరిగి రంగయ్య.
"ఒరే గాడిద కొడకా! నన్ను ఒరే అంటావా" మళ్ళీ కోపంగా అరిచాడు ప్రభాకర్.
"ఏం నీకు కొమ్ములు మొలిచాయా! గాడిద బుద్దులు నీవిరా" అన్నాడు రంగయ్య మళ్ళీ.
కోపం ఆపుకోలేక రంగయ్య పైకి దూకేడు ప్రభాకర్. అంతే! తర్వాత ఫటా! ఫట్! ధనా ధన్! గుద్దులు రక్కు కోవటాలు, బాదుకోవటాలు ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియనంత వేగంగా బాక్సింగ్ జరిగింది.
పది]నిముషాలు గడిచేసరికి నీరసంగా పడిపోయాడు ప్రభాకర్. బుద్ది తెచ్చుకుని మర్యాదగా నడుచుకో ఆడపిల్లల జోలికి మళ్ళీ వెళ్ళావో యీ సారి ప్రాణాలు తీస్తా" అని ఆయాసంగా రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు రంగయ్య.
అవమానంతో ఆక్రోశంతో బుసలు కొడుతున్న ప్రభాకర్ కి మరో గంటకి కానీ తేరుకుని యిల్లు చేరలేకపోయాడు.
కోపంతో, దుఃఖంతో ఆవేదనతో ప్రశ్నించిన తల్లికి కధంతా రిక్షా కట్టమంటే ఒరే అన్నానని పేచీ వేసుకుని పోట్లాడి కొట్టిపోయాడని చెప్పాడు ప్రభాకర్. జయమ్మ మనసు అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా మండిపోయింది.
"భర్తరానీ వాడి బాబు సంగతి తేలుద్దాం" అనుకుంది ఆమె.
పరంధామయ్యగారింట్లో మంగళవాద్యాలు మధుర మధురంగా మోగుతున్నాయి. వియ్యాలవారికి విడిది చూపించి కాఫీ, టిఫిన్లు స్నానపానాదులలకి బెండు మేళం తో యింటికి తెస్తున్నాడు ఆయన. వీధి వీధంతా ఆ సంగీతంతో మార్మోగిపోతోంది.
"అయ్యగారూ! ఆ డబ్బు యిప్పిస్తారా" వీరయ్య అడిగాడు.
"ఏడబ్బురా?"
అదేనయ్యా మికాడ దాచుకున్న లెక్క.
"నా వద్ద దాచుకున్నావా? ఎంతరా?"
అదేమిటి సామి? అలా అడుగుతున్నావ్. నీకాడ మూడు వేళా నాలుగొందలు ఇరవై దాసుకున్నాను. నా బిడ్డ పెళ్ళి రేపు. ఆ లెక్క తీసుకుని నేను మా అక్క ఊరికి వెళ్ళాలి. నీవు యిప్పిస్తే వెళ్ళిపోతాను. ముందుగా సేప్పలేదనుకొండి. మీకేం మా రాజులూ ఎప్పుడడిగినా ఉంటాదిలెమ్మని ముందు సేప్పలేదు.
నవ్వేడు రామలింగయ్య.
అటుగా వచ్చిన ఆ వూరి సర్పంచి వెంకట రెడ్డి వేపు చూసి "చూశావా అన్నా! వీడు ఎంత ఎట్టేశాడో నా దగ్గర మూడువేల నాలుగొందలఅరవై దాచుకున్నాడట. అది ఈ రోజు కావాలట. బిడ్డ పెళ్ళికి కావాలట. మంచి ప్లానే" అని
"ఒరే వీరయ్య! నమ్మకస్తుడివి అని పొలం కౌలుకిచ్చి గింజాగట్రా సహాయం చేసినందుకు ఆఖరికి నాకే ఎసరు పెడుతున్నావా బావుందిరా బావుంది. ఇలాగయితే మాలాటివాళ్ళు క్పురాలు చేసినట్టే అన్నాడు. ఆయన ముఖంలో కోపం లేదు ప్రశాంతంగానే అన్నాడిదంతా.
నిర్ఘాంతపోయడు వీరయ్య. తన కళ్ళలో నీళ్ళు తిరిగాయ్ సామీ! నన్ను ఇప్పుడు అన్నాయం చేయకండి, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను. ధర్మప్రభువులని తమకాడ దాసుకున్నాను. ఈనాడు యిట్టా అంటే నాకు సావే గతి."