అంతలో అటుగా వచ్చింది జయమ్మ.
జయమ్మ భారీగా వుంది. మనిషి నడుస్తూ వుంటే గున్న ఏనుగులా వుంటుంది. ఆమె ముఖంలో పునీస్త్రీ కళ కాగడా పెట్టి వెతికినా కనిపించదు. పదవనాటి ముత్తయిదువులా వుంటుంది. ఆరుగురు పిల్లల తల్లయినా ఆమెకి అలంకరణలో యావ చావలేదు. ఆ మాట కొస్తే ఆమెకు చావని యావలు చాలా వున్నాయి.
ప్రతిరోజూ మట్కా ఆడుతుంది. ఓపెన్ కి కొంత, క్లోజ్ కి కొంత, బ్రాకెట్ కి కొంత అని విడివిడిగా ఎలాట్ చేసుకుని డబ్బు కడుతూ వుంటుంది. భర్త పైసా విదల్చడు.
అందుకని యింట్లో కొడుకులకి, కూతుళ్ళకి తెలియకుండా బియ్యము. కందిపప్పు అమ్ముతూ వుంటుంది. అంతేకాకుండా అయిదారు నెలలు వాడిన చీరలు, రవికలు నూర్ మహమ్మద్ కి సగం రేటుకి అమ్ముతుంది. ఈ డబ్బే ఆవిడకి అన్నిటికి పెట్టుబడి.
"ఏరా వీరయ్య! ఎక్కడికి వచ్చావ్?" అని అడిగింది జయమ్మ.
"ఏం లేదమ్మా! అయ్యకు డబ్బిచ్చి వెడుతుండాను"అన్నాడు వీరయ్య.
ఈర్ష్యగా చూసింది జయమ్మ.
"నీదే అదృష్టం వీరయ్య! ఒక కొడుకు మిల్లులో పని చేస్తూ వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు కూతురు భార్యా కులీనాలీ చేసి సంపాదిస్తున్నారు. నీవు పొలాలు కౌలుకి తీసుకుని సంపాదిస్తున్నారు. మీకంతా ఆదాయమే అంది. నవ్వాడు వీరయ్య.
"కుంటను చూసి, సముద్దరం అసూయపడితే ఎట్లా" ఆమ్మా అన్నాడు.
"సరే!సరే!" అని అటూ ఇటూ చూసి "వీరయ్య! బియ్యం కావాలంటే తీసుకపో.....సంక్రాంతి వస్తుంది కదా!" అంది.
"వద్దులే అమ్మా! పరిగ ఏరుకుని తెచ్చిన వడ్లున్నాయి. దంచుకుంటాం" అని "వస్తానమ్మా చేనితట్టు కెళ్ళాల" అని కదిలాడు.
"వీరయ్య! కాసిన్ని కూరగాయలు పంపిస్తావా" అంది ఆమె.
"అట్లాగే అమ్మా! మాపటియాళ తెస్తాను" అని వెళ్ళిపోయాడతను.
ఇంటికి వెళ్ళిన వీరయ్య తన పక్కింటివాళ్ళ గోడకు బొగ్గుముక్క తీసుకుని రెండు పందులు గుర్తు రాసుకున్నాడు. ఈ నాలుగయిదేళ్ళలో అతను రామలింగయ్యకు యిచ్చిన డబ్బంతా ఎప్పటికప్పుడు ఆ గోడ మీద గుర్తు రాసుకుంటూవస్తున్నాడు. ఒక్కసారి అంకెల వంక తృప్తిగా చూసి లెక్క పెట్టి "మూడువేల నాలుగొందల అరవై" అనుకున్నాడు.
ఆ మొత్తాని చూశాక కొద్దిగా గరం తలెత్తింది.
"సిన్నదానికి యాన్నైన్న సంబంధం చూసి ముడి పెట్టాలా" అంది సుబ్బమ్మ వీరయ్య తల్లో పేలు కుక్కుతూ.
అదో రకమైన పారవశ్యంలో వున్న వీరయ్య "ఊ ఊ" అన్నాడు.
"అది ఎదిగి యాడదవుతోంది. మీ అక్క కొడుకు శేషయ్యని అడగరాదా?"
"వాడా? మన మాట యింటాడాఅబ్బా సదువుకుంటున్నాడు కదా! సదువుకున్న పిల్లే కవాలంటాడేమో మరి"
"అసంబడం! ఎనకా ముందర ఏమి లేదు. సదువుకుంటే సాలా. వుజ్జోగం రావద్దూ?"
"అడికేమే! ఫాద్రినాస్తంగా వుంటాడు. అళ్ళ దేశం ఎళదామా అని కూడా అడిగాడంట.
"అయితేనేం- మన గిరిజని చూస్తే కాదన బుద్ది అవుతుందా?"
అతంటితో ఆ సంభాషణ ఆగిపోయింది.
వీరయ్య పక్కింటి ఆసామి పరంధామయ్య బాగా వున్న మోతుబరి రైతు. నలుగురు కొడుకుల తర్వాత అపురూపంగా పుట్టిన జయంతికి బాగా చదువుకుని కలెక్టరేట్లో పనిచేస్తున్న జయరామ్ కి ఖాయం చేశాడు. పెళ్లి యింకో నెలరోజులుంది భారి ప్రయత్నాలు ప్రారంభించాడతను. మేడ వుంటేనే ఘరానాగా వుంటుందని అందరూ అంటే పైన ఓ గది వేయించాడు.
ఇంటిముందు కాంపౌండ్ వాల్ కట్టించాడు. మంచి ఇనుప గేటు వేయించాడు. గేటు నుంచి వసారా వరకు కొత్త మట్టి తోలించాడు. రకరకాల మొక్కలు నటించాడు. మధ్య రోడ్ లాగా ఇసుక పోయించాడు. ఇంటికి నాలుగువైపులా వెల్ల వేయించాడు.
ముందు భాగానా రంగులు వేయించాడు.
అలనాడు జానకి పరిణయ వేళ జనక మహారాజు పొంగి పోయినట్లు ఆనందంతో పొంగిపోయి అన్ని తన ఘనతకి తగినట్లు చేస్తున్నాడు. ఉరందర్కి పెళ్ళి నాటికీ డాన్సర్ ని పిలిచి బ్రహ్మాండంగా డాన్సులు వేయించాలని రికార్డులు ధనులతో ఆకాశం దద్దరిల్లి పోవాలని, ఎన్ని విధాల భారి పెళ్ళి అనిపించాలో అలా చేయాలని ప్లాన్స్ వేయసాగాడు పరంధామయ్య.
"ఏమయ్యో! నీకేం సీమ కుట్టినట్టుగా కూడా లేదే?" అంది సుబ్బమ్మ భర్తకి పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ. వడ్డించిన అన్నాన్ని చింతకాయ పచ్చడితో కలుపుకుంటూ "ఏందే? అని అడిగాడు వీరయ్య. పరంధామయ్య బిడ్డా పెళ్ళి సేస్తున్నాడు. జయంతమ్మ మన గిరిజ ఒకిడు వాల్లే."
"కాన్లేయే! అళ్ళకూ మనకూ యాడకుదుర్తది. "నోట్లో ముద్ద పెట్టుకుంటూ అన్నాడతను. 'ఏమె మనకేం తక్కువే మనకూ తగింది మనం చేస్తాం. నా మాటిను శేషయ్యను అడిగిరా." రేపు ఎల్తాలేయ్యే అన్నాడు వీరయ్య భోం చేస్తూ రెట్టించలేదు వీరయ్య భార్య.
ఆ మరుసటి రోజు ఉదయమే లేచి భార్య పెట్టిన సద్ది అన్నం తిని బయలుదేరాడు వీరయ్య. బసు దిగి నడిచి వెళ్ళి మధ్యాహ్నానికల్లా అక్కగారి వూరు చేరుకున్నాడు వీరయ్య. అతని అక్కయ్య వీరమ్మ తమ్ముడి రాకకు చాలా సంతోషించింది.
ఆప్యాయంగా భోజనం పెట్టింది. కుశల ప్రశ్నలు వేస్తూ కబుర్లు చెపుతూ అన్ని విషయాలూ అడుగుతూ ప్రేమని వర్షించింది వీరమ్మ. అక్కగారి అప్యాయతకి అనురాగానికి మురిసిపోయాడు వీరయ్య. తప్పకుండా గిరిజని శేషయ్యకు చేసుకుంటుందని పొంగిపోయాడు. అన్నాలు తిన్నాక ఆకు వక్క పగాకు కూడా యిచ్చి తమ్ముడి పక్కనే కూర్చుంది. వీరమ్మ ఆకు నములుతూ అక్కా! పనిమిదోచ్చానే అన్నాడు వీరయ్య.
"ఏందిరా ఆ పని?"
"గిరిజమ్మని నీ కోడల్ని సేసుకోయే"అన్నాడు వీరయ్య.
నవ్వింది వీరమ్మ. "ఒరేయ్! అది పుట్టినాటినుంచి నా కోడలే కదా అనుకుంది. ఈయాల కొత్తగా అడుగుతావెందిరా" అని అంది.
గుండెలపై బరువు దించినట్లయింది విరయ్యకు.
"అక్కా! దాని పెళ్ళికోసమని మూడేలకి పైన్నే దాశానే! అదంత దానికే నీ యిష్టం ఖర్చు యెంతయినా పెట్టుకో. మిగిలింది శేషయ్యకే అన్నాడు వీరయ్య. అవున్రా! యీ రోజుల్లో అందరికి అసె ఎక్కువైంది. కొడుకుల్ని గొడ్లని అమ్ముకున్నట్టు అమ్ముకుంటున్నారు. అయినా నాకు లేక్కందుకురా? నీ అల్లుడికే యిచ్చుకో. అడిట్టం. నీ యిట్టం అంది వీరమ్మ.