Previous Page Next Page 
డాళింగ్ పేజి 10

 

    మరో పదినిముషాల్లో హోటల్ మేనేజర్ తదితరులందరూ హీరో విమల్ సూటు దగ్గర నిలబడ్డారు.
    ఎవరికీ ఏమీ అర్ధం కావడం లేదు.
    విమల్ ఏడీ? ఎక్కడకెళ్ళాడు.
    ఏం జరిగింది?
    గదంతా భయంకరంగా తయారైందంటే........
    ఒక పావుగంట క్రితం వరకూ ఆ రూమ్ లో ఉన్న విమల్ ......లేదంటే .......ఏం జరిగినట్లు!!
    ఏ అభిమానైనా ఫేనటిగ్గా విమల్ మీద దాడి చేసాడా!
    ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చెయ్యడంతో లొకేషన్లో వున్న ప్రొడ్యుసర్, డైరెక్టరూ గుండెలూ గుబగుబ ;లాడుతూ హోటల్ కొచ్చారు.
    ఏవిందసలు?
    ఏడీ హీరో? ఏడీ విమల్?
    ఆ ప్రశ్నకు అక్కడ జవాబు లేదు.
    ఎవడైనా కిడ్నాప్ చెయ్యలేదు గదా?
    "ఏవయ్యా మేనేజర్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఈ సూట్లో ఉంటున్నప్పుడు , ఏదో గొడవ ఈ సూట్లో జరిగినప్పుడు, ఏం చేస్తున్నారయ్యా మీ హోటల్ వాళ్ళు. వేలకు వేలు , రెంటు కడ్తున్నాం. ఆ మాత్రం సెక్యురిటీ లేకపోతె ఎలా? మా హీరో ఏమయ్యాడయ్యా ఏం డైరెక్టరూ మన విమల్ ఎవయ్యాడు" దాదాపు ఏడుపు, ముఖం పెట్టేసాడు ప్రొడ్యుసర్.
    గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలకు అతను నిలదొక్కుకున్నా , ప్రస్తుతం జరిగిన ఇన్సిడెంట్ కి ఏం చెయ్యాలో తెలీకుండా ఉంది.
    "న్యూయార్క్ నుంచి ఓ ఫోన్ వొచ్చిందండి.....గంటసేపు పైగా మాట్లాడాడాయన. ఆ తర్వాతేం జరిగిందో."
    "న్యూయార్క్ నుంచి ఫోనోచ్చిందా, న్యూయార్క్ లో అతడికి ఎవరున్నారయ్యా, అదేదో దొంగ ఫోనేమో, న్యూయార్క్ ఫోన్ కి ఈ రూమ్ ఇలా తయారవడానికి అసలు సంబంధమేంటయ్యా! అర్జంటుగా పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. ఒగ్గంట లోపల హీరో విమల్ ఎక్కడున్నాడో నాక్కావాలి. లేకపోతే మీ హోటల్ మీద కేసు పెడతాను." విసవిస నడుచుకుంటూ అక్కడ నుంచి తన సూట్ లో కెళ్ళిపోయాడు.
    డైరెక్టర్ కి కూడా ఏమీ తోచకుండా వుంది.
    ప్రొడక్షన్ మేనేజర్ని చేత్తోనే సైగచేసి పిలిచాడు.
    "పేకప్ చెప్పేయ్. మన వాళ్ళందర్నీ నాలుగువైపులా పంపు - బస్ స్టేషన్, రైల్వే స్టేషన్."
    మిగతా హోటల్స్, బార్స్ ......అనీ వెతకండి. ఎందుకైనా మంచిది విల్లించ్ ఏరియా, భవానీ డాం ఏరియా, ఆ లోయల్లో వెతకమనండి." ఆర్డర్ జారీ చేసి ప్రొడ్యుసర్ సూట్ వేపు నడిచాడు.
    ఈ విషయమై కంప్లయింట్ చెయ్యడానికి తను స్వయంగా పోలీస్ స్టేషన్ కెళ్ళాడు హోటల్ మేనేజర్.
    మరో అరగంటలో పోలీసు కుక్కలు రంగంలోకి కొచ్చాయి. ఊటీ మొత్తం విమల్ ని వెతుకుతూ , కార్లూ చక్కేర్లూ కొడుతున్నాయి.
    విమల్ వుండే సూట్ లోనూ, ఆ పరిసర ప్రాంతాల్లోనూ , రోడ్ మీద, రాత్రి పదిన్నర ప్రాంతంలో పోలీసు కుక్కలు పరుగెడుతున్నాయి. బస్ స్టాండ్ దాటి రెండు కిలోమీటర్ల వరకూ వచ్చాయి పోలీసు కుక్కలు.
    అక్కడ నేలను వాసన చూసి ఆగిపోయాయి.
    అది నాలుగు రోడ్ల కూడలి. ఒకసారి బెంగుళూరు వేపు వెళుతుంది. అక్కడికి బెంగుళూరు 296 కిలో మీటర్లు. రెండోవేపు వెళ్ళేదారి మద్రాసుకు దారి తీస్తుంది. అక్కడికి మద్రాసు 610 కిలోమీటర్లు. మూడో వేపు బొంబాయికి వెళ్ళేదారి. అక్కడికి బొంబాయి 1,320 కిలోమీటర్లు. నాలుగో దారి సేలం దారితీస్తుంది. సేలం అక్కడకు 200 కిలోమీటర్లు.
    కారు మీదో, బస్సు మీదో హీరో విమల్ ఇక్కడ నుంచి వెళ్లుండాలి. ఈ నాలుగు దారుల్లో ఏ దారి గుండా వెళ్లుంటాడు. పోలీసులకు అదో పెద్ద మిస్టరీ అయిపొయింది. వెనక్కొచ్చిన పోలీసులు, సమీపం లోని అన్నీ పోలీస్ స్టేషన్లకి, బస్ స్టేషన్లకి, రైల్వే స్టేషన్లకి ఇన్ ఫామ్ చేశారు.
    అదే విషయాన్ని ప్రొడ్యుసర్ కి కూడా ఇన్ ఫామ్ చేసారు.
    ఆరో పెగ్గులో వున్న ప్రొడ్యుసర్ , అంతెత్తున లేచాడు.
    అందరికీ విమల్ మాయం - ఓ 'మిస్టరీ ' గా వుంది.
    ఇంతకీ విమల్ ఎక్కడి కెళ్ళినట్లు.
    ఎందు కెళ్ళినట్లు?
    విమల్ సూట్ ఎందుకలా ధ్వంసమై వుంది?
    ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే ........విమల్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి.
    ఇంతకీ విమల్ ఎక్కడున్నాడు?


                                                *    *    *    *

    మద్రాసు -
    విజయా నర్శింగ్ హోమ్.
    ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వున్నాడు మాధురి తండ్రి ధనుంజయరావు.
    సడెన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో జాయిన్ చేశారు.
    ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది మాధురి.
    తెల్లవారుజామున మూడు గంటలైంది.
    కుర్చీలో కూర్చుని ఓ పక్కగా తలవాల్చి నిద్రపోతున్న కూతుర్ని అప్పుడే కళ్ళువిప్పిన ధనుంజయరావు చూసాడు.
    అతని మనసిప్పుడు ప్రశాంతంగా వుంది.
    నిన్న సాయంత్రం ఏదో చిక్కు ముళ్ళ మధ్య చిక్కిపోయినట్లుగా వున్న గుండె ఇవాళ పూలమధ్య వున్నట్టుగా వుంది.
    "అమ్మా! మధూ" నెమ్మదిగా పిల్చాడాయన.

 Previous Page Next Page