అతని చూపులు ప్లేయర్స్ లోనే వున్న ఒక అమ్మాయి మీద నిపిచిపోయాయి. పాలరాతి శిల్పంలా వుంది ఆ అమ్మాయి. పాదాల దగ్గర బిగువుగా వుండి, పైనంతా బాగా వదులుగా వున్న ఎర్రసిల్కు చుడీదార్, పైన అదేరంగు కుర్తా వేసుకుని వుంది. కుర్తామీద చెమ్కీతో మిలమిల మెరిసిపోతున్న ముదురు నీలం జాకెట్ లాంటి కోట్ వేసుకుని వుంది.
ఆ అమ్మాయి చూపులు తన చూపులతో కలిసేదాకా ఆగి చూస్తుండిపోయాడు మెకానిక్.
అతనికి తెలుసు ఒకసారి తనవైపు చూసిన అమ్మాయి అయస్కాంతంచేత ఆకర్షింపబడినట్లు ఆకర్షితురాలయి పోతుంది.
తన కళ్ళలో సమ్మోహన శక్తి వుంది. కవ్వింపు వుంది.
కొద్ది సెకండ్ల తర్వాత తనవైపు ఎవరో తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది. తట్టి పిలిచినా దానిలాగా అతనివైపు తిరిగింది ఆ అమ్మాయి.
చిన్నగా స్మైల్ చేశాడు అతను.
కొద్దిసేపు మంత్రముగ్ధలా అతనివైపే చూస్తుండిపోయింది ఆ ఆమ్మాయి. తర్వాత, అతి కష్టమ్మీద చూపులు మరల్చుకుంది.
నవ్వుకున్నాడు మెకానిక్. మెసేజ్ అందుకుంది. ఇంక మర్చిపోలేదు ఈ పిల్ల.
ప్లేయర్స్ ఎవరు, ఎవరితో ఆడాలన్నది నిర్ణయించడానికి లాట్స్ తీస్తున్నారు. మెకానిక్ కి తీవ్రంగా అనిపించింది. గేమ్ లో ఆ అమ్మాయి తనకి పార్ట్ నర్ గా గానీ, కనీసం ప్రత్యర్ధిగాగానీ రావాలని.
కానీ అలా కాలేదు.
అతనికి ప్రత్యర్ధిగా ఒక బట్టతలా, బానబొజ్జా వున్న బిజినెస్ మాగ్నెట్ పేరు వచ్చింది.
"షిట్!" అనుకుని ఆ అమ్మాయివైపు చూశాడు మెకానిక్.
అప్పటిదాకా అతనివైపే చూస్తూ వున్న ఆమె కనురెప్పలు వాలిపోయాయి.
ఆట మొదలైంది.
చదరంగం బోర్డులా వున్న ఆ ఫ్లోరింగ్ మీద నలుపు, తెలుపు వేషాల్లో వున్న రెండు పక్షాలు ఎదురెదురుగా నిలబడి వున్నాయి. మహా సంగ్రామానికి సర్వసన్నద్ధంగా వున్న శత్రు సైన్యంలాగా.
మొదటి ఎత్తు బిజినెస్ మాన్ వేశాడు.
గుర్రం వేషంలో వున్న ఒకతను రెండుగళ్ళు ముందుకెళ్ళి, ఒక గడి పక్కకు జరిగి నిలబడ్డాడు.
తర్వాత ఎత్తు తను వేశాడు మెకానిక్.
తర్వాత బిజినెస్ మాన్ -
హఠాత్తుగా చెక్ చెప్పాడు మెకానిక్.
బిజినెస్ మాన్ ఆట కట్టయిపోయింది అతని మొహం వాడి పోయింది.
ఆ తర్వాత ఆటకి లాట్స్ ప్రకారం ఆ బిజినెస్ మాన్, ఆ ఎర్ర చుడీదార్ అమ్మాయికి పోటీ పడింది.
మళ్ళీ గళ్ళలో నిలబడ్డారు పావులు.
ఉత్సుకతతో చూస్తున్నాడు మెకానిక్.
ఆట మొదలయింది.
మొదటి ఎత్తు ఆ అమ్మాయి వేసింది. ఏస్ ప్లేయర్ లా, గ్రాండ్ మాస్టర్ లా మొహం పెట్టి.
కొంచెం ఆలోచించి, పై ఎత్తు వేశాడు బిజినెస్ మాన్.
అది చూసి నుదురు చిట్లించి ఆ అమ్మాయి ఈసారి ఎత్తు వేయడానికి చాలా వ్యవధి తీసుకుంది.
పావుల వేషాల్లో వున్న మనుషులు ప్లేయర్స్ సైగాలని అందుకుని గళ్ళలో అటూ ఇటూ మారుతున్నారు.
ఎత్తులకి పైఎత్తులు జరిగిపోతున్నాయి.
ఐదు నిమిషాలు పూర్తికాకముందే, ఆ అమ్మాయి నుదుటిమీదంతా చిరుచెమటలు పట్టేశాయి.
ఆమె చాలా కన్ ఫ్యూజ్ అయిపోతున్నట్లు అర్ధమవుతోంది చూస్తున్నవాళ్ళకి.
అంతటి అందగత్తెను అయోమయంలో పడేస్తున్నందుకు ఆనందంతో వెలిగిపోతోంది బిజినెస్ మాగ్నెట్ మొహం.
నవ్వొస్తోంది మెకానిక్ కి. తన చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఆ బిజినెస్ మాన్ ఆ అమ్మాయిని ఆయాస పెట్టేస్తుంటే!
ఆ అమ్మాయి అంటే జాలేస్తోంది కూడా!
ఇంకో రెండు ఎత్తులువేసి, ఆ అమ్మాయిని ఓడించేశాడు బిజినెస్ మాగ్నెట్.
ఆ అమ్మాయి మొహం ఎర్రబడిపోయింది. హ్యాండ్ బ్యాగ్ లో నుంచి హాంకీ తీసి మొహం తుడుచుకుని, ఓ ప్రక్కగా నిలబడి తక్కిన ప్లేయర్స్ ఆట చూడటం మొదలు పెట్టింది.
నాలుగు ఆటల తర్వాత మళ్ళీ మెకానిక్ టర్న్ వచ్చింది. ఈసారి అతని ప్రత్యర్ధి ఒక డాక్టర్. సరిగ్గా నాలుగు ఎత్తుల్లో డాక్టర్ ఆటకట్టించాడు 'మెకానిక్'.
రాత్రి పదవుతుండగా, అందరి ఆట పూర్తయింది. వరుసపెట్టి అందరినీ ఓడించెయ్యగలిగాడు మెకానిక్.
ఓడిపోయినవాళ్ళు చాలామంది అప్పటికే లాంజ్ లోకి, లాన్ లోకి వెళ్ళిపోయి డ్రింక్స్ లో పడిపోయారు.
ఆ అమ్మాయి మాత్రం యింకా అక్కడే నిలబడి మెకానిక్ నీ, అతని ఆటనీ తదేకంగా చూస్తోంది. ఆమె యింకా ఎందుకు అక్కడ నిలబడి వుందో అర్ధమయింది మెకానిక్ కి.
తనలో ఉన్న యానిమల్ మేగ్నటిజమ్.
తన కళ్ళలో వున్న సమ్మోహన శక్తి దానికి కారణం!
తను క్రీగంట చూస్తే చాలు, ఆడవాళ్ళలో కూడా అంతర్గతంగా వుండే పాశవికమైన కోర్కెలు బుసకొడుతూ లేస్తాయి.
నిదానంగా ఆ అమ్మాయి దగ్గరికి నడిచాడు మెకానిక్.
"వెయిటింగ్ ఫర్ సమ్ బడీ?" అన్నాడు ఫ్రెండ్లీగా.
నవ్వింది ఆమె.
"కారు చెడిపోయింది. మా మెకానిక్ దానితో తంటాలు పడుతున్నాడు. అందుకే ఆగిపోయాను."
"మీ కారు క్లబ్బులో ఉంచెయ్యండి. నా కారులో డ్రాప్ చేస్తాను"
"మీకెందుకు శ్రమ!" అంది ఆ అమ్మాయి సంకోచంగా. ఆ అమ్మాయి ఊపిరి బరువుగా వస్తోంది.
"ఇటీజె ప్లెజర్! రండి!"
హ్యాండ్ బ్యాగ్ లోంచి కాష్మీర్ షాల్ తీసి భుజాల చుట్టూ కప్పుకుని అతన్ని అనుసరించి వెళ్ళింది ఆ అమ్మాయి.
తను డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఆమెకోసం ఫ్రంట్ డోర్ తెరిచాడు మెకానిక్.
"ప్లీజ్ కమిన్"
ఫ్రంట్ సీట్ లో అతని పక్కన కూర్చుంది ఆమె.
"ఎక్కడ మీ ఇల్లు?" అన్నాడు.
చెప్పింది.
కొంతదూరం పోయాక అన్నాడు మెకానిక్.
"నా అపార్టుమెంటు ఇక్కడే! ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళకూడదూ?"
"టైం లేదు" అంది ఆ అమ్మాయి. తన గొంతు మారిపోయి పావురం కువకువలాడుతున్నట్లు వినబడుతోంది.
"ఏం ఫర్వాలేదు! ఒక్క పది నిమిషాలు" అని ఒక అపార్టుమెంటు ముందు కారు ఆపాడు మెకానిక్.
లిఫ్ట్ ఎక్కాక, ఆమె కళ్ళలోని బెదురుగా గమనించాడు అతను. ధైర్యం చెబుతున్నట్లు ఆమె చేతిని పట్టుకుని మృదువుగా ఒత్తాడు.
అపార్టుమెంటుని సమీపించాక తలుపు తెరిచి పట్టుకుని, "కమ్!" అన్నాడు.
తల వంచుకుని లోపలికి నడిచింది ఆ అమ్మాయి.
తలుపు వేసేసి బోల్టు పెట్టాడు మెకానిక్.
అప్పుడు గమనించింది ఆ అమ్మాయి. అక్కడ సోఫాల మధ్య సెంటర్ పీస్ మీద ఉన్న ఒక ఛెస్ బోర్డుని.