"థాంక్స్ మామ్"
"అసలు ఆస్తి వదిలేసే ప్రశ్న ఎందుకొచ్చింది." అంది విషయంలోకి వచ్చేస్తూ.
"షి హేట్స్ రిచ్ పీపుల్ మామ్"
"ఈజ్ షీ పూర్?"
"యస్ మామ్"
"వెరీ పూర్?"
"అఫ్ కోర్స్! మామ్....."
"అయితే ఆ పిల్లని ఎందుకు ప్రేమించావ్? ప్రేమించినంత మాత్రాన పెళ్లెందుకూ? ఆర్యూ ఏ సెంటిమెంటల్ ఫూల్?"
"ఐ వాంట్ మారీ హర్...."
"వై?"
"బికాజ్ షి ఈజ్ బూటిఫుల్"
"నాన్సెన్స్"
"బికాజ్ షీ ఈజ్ ఏ వెరీ గుడ్ గర్ల్" అన్నాడు జెయ్ చంద్ర.
"మంచితనం ముంచేస్తుంది సన్నీ! మంచితనం అంటేనే చేతకానితనం యీ రోజుల్లో" అంది సునీతాసుందరి.
"షీ ఈజ్ ఏ లివింగ్ గాడెస్ మామ్......" అన్నాడు జెయ్ చంద్ర భక్తిగా.
"ఈ భూమ్మీద రాక్షసులు తప్ప మనుషులు కూడా వుండలేక వెళ్ళిపోతున్నారు సన్నీ! ఇంక దేవతలెక్కడుంటార్రా? టేక్ దిస్ మనీ! గోటూ ఎ డిస్కో అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్" అంది సునీతాసుందరి.
తల అడ్డంగా ఊపాడు జెయ్
"లాభంలేదు మామ్" అన్నాడు.
"అంటే?" అంది సునీతాసుందరి తోకతొక్కిన తాచులా నిటారుగా నిలబడుతూ.
"అయ్ వాన్నా మారీ హర్"
"ఓహ్ గాడ్"
"నిజంగానే మామ్"
"అయితే ఈ ఆస్తి గొడవేమిటి?"
"ఆ అమ్మాయికి డబ్బున్నవాళ్ళంటే ఎలర్జీ"
"అయితే?"
"ఆ అమ్మాయి కోసం అన్నీ త్యాగం చేసెయ్యదల్చుకున్నాను నేను."
"చివరికి నన్ను కూడానా?"
"నువ్వు డబ్బు కోసం నన్నెప్పుడో త్యాగం చేసేశావుకదా మామ్"
"షటప్! నీ మైండ్ ని పాయిజన్ చేసేసింది అది" అంది ఆమె ఆరోపణగా, ఆక్రోశంగా.
"కాదు! నా కళ్ళు తెరిచేలా చేసింది" అన్నాడు అతను.
"ఈమధ్య సినిమాలు మరీ ఎక్కువ చూస్తున్నావ్ గదా! ఏ సినిమాలో డైలాగిది?" అంది అవహేళనగా.
"ఇంక ఎక్కువ మాట్లాడటం అనవసరం' అన్న భావం కనబడింది అతని మొహంలో.
"ఓకే మామ్! ఈ విషయం నీతో చెప్పాలని అనుకున్నాను. చెప్పేశాను" అన్నాడు ఫైనల్ గా.
అంటూనే వెనక్కి తిరిగాడతను.
"ఆగు" అంది సునీతాసుందరి.
ఆగి, తిరిగి చూశాడతను.
"ఎక్కడికి వెళుతున్నావ్?" అందామె కమ్చీతో కొడుతున్నట్లు.
"నా కాళ్ళమీద నేను నిలబడడానికి"
"ఎలా బ్రతుకుతావ్? ఎలా తింటావ్?"
"ఉర్దూలో ఓ సామెత వుంది మామ్"
"ఏమిటది?"
"దాల్ దాల్ పే ఖానే వాలేకా నామ్ లిఖాహువా రహతా హై అని"
"అంటే.....ప్రతి గింజమీదా తినేవాడి పేరు రాసి వుంటుందనేనా?"
"అవును"
"పిచ్చి సామెత.....! ఎందుకూ పనికిరానివాళ్ళకు పనికొచ్చే సామెత....."
ఇంక మాట్లాడాల్సిన అవసరం లేనట్లు వెనక్కి తిరిగాడతను.
"ఆగు" అందామె మళ్ళీ.
మళ్ళీ ఆగాడతను.
"నిజంగా నీకు ఆ పిల్ల అంటే అంత యిష్టమా?"
"అవును"
ఆమె మొహంలో భావం చటుక్కున మారిపోయింది. అతి ప్రసన్నంగా అయిపోయింది.
"జెయ్" అంది ఆప్యాయంగా.
అనుమానంగా ఆమెవైపు చూశాడు అతను.
"జెయ్! మై సన్......! మీ అమ్మ ఉత్తరాక్షసి అని అనుకుంటున్నావా?"
ఇబ్బందిగా మొహం పక్కకి తిప్పుకున్నాడతను.
"నిజంగానే ఆ పిల్లంటే నీకంత యిష్టమయితే నేను వద్దంటానా జెయ్?" అందామె మృదువుగా.
"మామ్" అన్నాడు ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకే చూస్తూ.
చటుక్కున లేచి అతని దగ్గరకొచ్చింది ఆమె.
అతని నుదుటిని మృదువుగా చుంబించింది.
"జెయ్....." అంది ఆప్యాయంగా.
"మామ్" అన్నాడతను ఆర్ద్రంగా.
"నాతోరా" అంది.
అంటూనే ఇంట్లో నుంచి బయటికి వచ్చింది ఆమె. వాళ్ళ వీధి ఒక బ్లయిండ్ లాన్.
ఆ రోడ్డుకి ఒకవైపున వాళ్ళ ఇల్లు వుంది.
చాలా ఫ్యాషనబుల్ గా ఉండే బంగళా అది!
చాలా పెద్ద కాంపౌండు.
ఎత్తయిన గేటు దగ్గర పొట్టిగా, పసుపుపచ్చగా ఉండే ఒరిజినల్ నేపాలీ ఘూర్కా.
ఆ కాంపౌండ్ లో చాలా డిసిప్లిన్ తో పెరిగిన ఆరు కుక్కలు!