Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 12

 

    బయటికి కనబడుతూ ఉండే అయిదారు ఎయిర్ కండిషనర్లూ.
    
    ఇంటి చుట్టూ అందమైన పూలతోట!
    
    భయభక్తులతో తోటపని చేసుకుంటున్న తోటమాలి!
    
    అలాంటి సెటప్ తో ఆ ఇల్లు అలా వుండగా -
    
    ఆ ఇంటికి, రోడ్డుకి రెండో వైపున వున్న యిళ్ళన్నిటినీ తనే వరసబెట్టి కొనేసింది డాక్టర్ సునీతాసుందరి.
    
    ఒకటి కాదు రెండూ మూడూ కూడా కాదు. ఏకంగా ఎనిమిది ఇళ్ళు.
    
    ఆ విధంగా ఆ రోడ్డు మొత్తం ఆమె ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది.    
    
    ఆ కొత్తగా కొన్న పాత ఇళ్ళన్నిటినీ వరసబెట్టి పడగొట్టించేసింది డాక్టర్ సునీతా సుందరి.
    
    వాటి ప్లేస్ లో పెద్ద ఎనిమిదంతస్తుల బిల్డింగు కట్టిస్తోంది. మామూలుగా అయితే మామూలు మనుషులకి నాలుగైదు అంతస్తులకంటే ఎక్కువ ఎత్తు కట్టడానికి పర్మిషన్ దొరకదు.
    
    కానీ డాక్టర్ గారికి హాయ్ సర్కిల్స్ లో కాంట్రాక్టులు వున్నాయి.
    
    తను తల్చుకోవాలేగానీ నిమిషాల మీద పన్లు జరిపించేసుకోగలదు ఆవిడ!
    
    తన పన్లకి అడ్డం వచ్చే రూల్స్ ని రబ్బరుతో తుడిచినంత ఈజీగా తుడిపెయ్యగలదు కూడా.
    
    అంచేతే ఎనిమిదంతస్తుల బిల్డింగుకి అతి సునాయాసంగా పర్మిషన్ తెచ్చేసుకుని, వర్కు మొదలు పెట్టేసింది.
    
    అందులో యిప్పుడు అత్యంత ఆధునికమైన సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ పెట్టబోతోంది తను.
    
    బిల్డింగు వర్కు యింకా పూర్తికాలేదు.
    
    స్ట్రక్చర్ మాత్రం రెడీ అయింది.
    
    అంతస్థుల మధ్య గోడలు యిప్పుడిప్పుడే లేస్తున్నాయి.
    
    "కమ్! సన్నీ! కమ్!" అంది డాక్టర్ సునీతా సుందరి చకచకా ఆ బిల్డింగు మెట్లెక్కేస్తూ.
    
    ఆశ్చర్యంగా చూస్తూ ఆమె వెనకే నడిచాడు జెయ్.
    
    చురుగ్గా మెట్లు ఎక్కేస్తోంది డాక్టరుగారు.
    
    ఎనిమిదో అంతస్తుకొచ్చేశారు.
    
    అక్కడ కూలీలు చీమల్లాపన్లు చేసేసుకుంటున్నారు. వాళ్ళమీద ఇంజనీరు కర్రపెత్తనం చెలాయిస్తున్నాడు.
    
    అమ్మగార్ని చూడగానే భయభక్తులతో ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఇంజనీరు.
    
    కన్ స్ట్రక్షన్ గురించి అతన్ని అనేకమైన ప్రశ్నలడిగింది డాక్టర్ సునీత. కొన్ని ఇన్ స్ట్రక్షన్స్ కూడా యిచ్చింది.
    
    ఆ తర్వాత అతనితో అంది -
    
    "అదిగో! అక్కడున్నాడే! ఆ మగకూలీని యిలా రమ్మను!"
    
    ఇంజనీరు కేకేసి కూలీని పిల్చాడు.
    
    పరిగెత్తుకుంటూ వచ్చాడు కూలీ.
    
    అప్పుడు జెయ్ చంద్రవైపు తిరిగింది డాక్టర్ సునీతా సుందరి
    
    "సన్నీ! నీ గర్ల్ ఫ్రెండుకి ఎంగేజ్ మెంటు రింగు యివ్వవూ?"
    
    "ఇవ్వాలి మామ్!" అన్నాడు జెయ్ వెంటనే. తన కళ్ళ ముందు జరిగి పోతున్నదాన్ని నమ్మలేకపోతున్నాడు అతను.
    
    "రింగు మళ్ళీ వేరే కొనడం ఎందుకూ? నా డైమండ్ రింగే ఆ పిల్ల వేలికి తొడిగి ప్రధానం చేసేసుకో సన్నీ!"
    
    జెయ్ చంద్ర కళ్ళు డైమండ్ రింగ్ లెవెల్లో మెరిశాయి.
    
    "థాంక్స్ మామ్! యూ ఆర్ సచ్ ఎ డియర్!" అన్నాడు ఆనందంగా.
    
    తనచేతి వేలికి వున్న వజ్రపుటుంగరం తీసింది డాక్టర్ సునీతాసుందరి.
    
    కూలీని పిల్చింది.
    
    "రేయ్! ఇలారా!" అంది.
    
    దగ్గరికి వచ్చాడు కూలీ.
    
    "ఈ ఉంగరం తీసుకో!"
    
    "అమ్మా!" అన్నాడతను అయోమయంగా.
    
    "తీసుకోమంటుంటే వినబడట్లేదురా?"
    
    అసందిగ్ధంగా చూస్తూ డైమండ్ రింగుని అందుకున్నాడు కూలీ.
    
    "అక్కడ ఆ ఇనపదూలం కనబడుతోందా?" అంది డాక్టర్ సునీత.
    
    "ఏదమ్మా? గా ముందుకి వచ్చివుంది. గా దూలమా?" అన్నాడు కూలీ.
    
    ఎనిమిదో అంతస్తు అంచున ఒక ఇనప దూలం ఆరడుగులమేర ఆకాశంలోకి చొచ్చుకుని వచ్చి వున్నట్లు కనబడుతోంది.
    
    "ఆ ఇనప దూలం చివర్లో ఈ ఉంగరం పెట్టేసిరా!" అంది డాక్టర్.
    
    కూలీ ఉంగరాన్ని అందుకుని, తనను లాఘవంగా బాలెన్స్ చేసుకుని దూలం చివరికి వెళ్ళిపోయి వుంగరాన్ని అక్కడ వుంచి, వెనక్కి వచ్చేశాడు.
    
    "పెట్టేసినానమ్మా!" అన్నాడు వినయంగా. అతనికలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం నిత్యకృత్యమే.
    
    అప్పుడింక జెయ్ చెంద్ర వైపు తిరిగింది డాక్టర్.
    
    "సన్నీ!" అంది ఆమె గొంతులో అదో విధమైన అవహేళన!
    
    "చూశావుగా! ఉంగరం ఆ దూలం అంచున వుంది. వెళ్ళు! వెళ్ళి దాన్ని తీసుకొచ్చి, నీ గర్ల్ ఫ్రెండుకి ప్రజెంట్ చేయి!" అంది.
    
    అతనెలాగూ ఆ పని చేయలేడనే ధైర్యం ఆమె మొహంలో కనబడిపోతోంది.
    
    "ఓ.కే. మామ్!" అన్నాడు జెయ్ చంద్ర క్షణం కూడా ఆలోచించకుండా.
    
    మాట పూర్తి అయిన మరుక్షణంలోనే అతను ఆ ఎనిమిదో అంతస్తు అంచున వున్నాడు.
    
    ఆ తర్వాత క్షణంలో దూలం మీదికి ఎక్కేశాడు.
    
    తక్షణం మొహంలో ప్రాణభయం కనబడింది.
    
    అతని మొహంలో కాదు -
    
    ఆమె మొహంలో!
    
    "జెయ్!" అంది ఆర్తనాదంలాంటిది చేస్తూ.
    
    "జెయ్! సన్నీ! వద్దు! వెనక్కి వచ్చేయి" అంది గాభరాగా.
    
    అయినా అతను వినిపించుకోవట్లేదు.
    
    ఒడుపుగా బాలన్స్ చేసుకుంటూ దూలం మీద ఒక్కో అడుగే వేస్తూ ముందుకెళ్ళిపోతున్నాడు.

 Previous Page Next Page