"ఆక్కా! అక్కా" రూప గొంతు బైట నుంచి వినబడటంతో చటుక్కున ప్రకాష్ రాసిన లెటర్ దాచేసింది సీత.
రూప తలుపు నెట్టి లోపలికొచ్చింది. ఆదెంటక్కా ముఖం అంతా అలా చెమట పట్టింది.
"అదా?....అది....అది...గాలిలేఖ....!"
"భలేదానివే అక్కా గాలి బాగా వేస్తుంటే!"
"వేస్తున్నదేస్తున్నది. నాకు మరి...."
"సరేలే. ఎందుకో అందుకు చెమట పట్టింది గాని, నేచేప్పేది విను నేనట సినిమస్టారులా చాలా అందంగా వుంటానుట రూప పేరు రూపానికి తగినట్లు వుందిట ఇలా అని కామాక్షి అత్తయ్యగారు అంది. అక్కడితో వూరుకోవచ్చా నేను ఊ అంటే పైసా కట్నం లేకుండా వాళ్ళ శివానికి కిచ్చి పెళ్ళి చేస్తుందిట. వాణ్ణి చేసుకునేకన్నా కోతి పిల్లనో పిల్లి పిల్లనో పెళ్ళాడితే నయం.
రూప తొందరపాటు తెలిసిన సీత కొంపదీసి అదేమాట ఆవిడతో అని రాలేదు కదా? అంది.
"నాకేం భయం, ముఖాన అనోచ్చాను.
ఛా...ఛా... అలా మాటకి మాట అని రాకూడదు రూపా! ఆవిడ భాదపడదు?
'ఆవిడా మాటనేటప్పుడు నే భాధపడతానో లేదో ఆలోచించిందా తెల్లగా అందంగా వుంటానని ప్రతివాళ్ళు అనేవాళ్ళే. నాకేమిటి పెళ్ళి కాకపోతే గదా! నేని కొండ ముచ్చుల్ని మాత్రం ఛస్తే చేసుకోను. నన్నేదయినా అంటే వురుకోను.
"నీ పెళ్ళి ఎవరూ బలవంతానా చేయ్యరులేవే"
"చేయ్యరులే. ఓవేళ చేస్తానన్నా నా కిష్టం లేంది నే ఛస్తే చేసుకోను."
రామచంద్రం వచ్చిన గుర్తుగా వాకిట్లోంచి మాటలు వినరవటంతో సీత పైట కొంకుతో ముఖం తుడుచుకుంటు బైటికి వచ్చింది.
తన అందం గురించి ఆలోచిస్తూ రూప అక్కడే మంచం మీద కూర్చుండిపోయింది.
8
మొండితనం, పిచ్చి ధైర్యం ఒక్కోసారి కలిసి వస్తాయి. బాబాకి, నిజంగా కలిసే వచ్చింది. బి.ఎ. ఫస్ట్ క్లాసులో పాసయి ఓ చిన్న ఉద్యోగం కోసం ఎన్నో యేళ్ళు ఎదురు చూస్తున్న ఎందరో నిరుద్యోగులు అలాగే ఉన్నారు అత్తెసరు మార్కులతో బి.ఏ. పాస్ అయిన బాబాకి మాత్రం పెద్ద కంపినీలో అయిదొందల జీతంతో ఉద్యోగం వచ్చింది. కాని ఉద్యోగం వచ్చింది హైద్రాబాద్ లో..
ప్రతినెలా బాబా యింటికి రెండొందలు పంపిస్తున్నాడు. ఈ తఫా మాత్రం వంద రూపాయలే పంపి ఓ లెటర్ రాశాడు. బట్టలు కుట్టించుకొవటం వల్ల మరో వంద పంపించలేక పోతున్నానని. ప్రతినెలా నే పంపే డబ్బులో ఐ వంద ఆడపిల్ల పెళ్ళిళ్ళకి దాస్తున్నారు. కాబట్టి వంద యిక్కడే నే దాస్తాను ఇహ పై వంద రూపాయలు మాత్రమే ఇంటి ఖర్చులకి పంపిస్తుంటాను....' అంటూ ముగించాడు.
లెటర్ చదివిన సీత 'నన్నా మీద బాబాకి నమ్మకం లేదా! తను దాయటం అనే మాట ఎంతవరకు నిజం? అనుకుంది.
పోస్టు రావటం మనియార్డరు లెటరు అందుకున్న సీత వరండాలో నిలబడి వుండటం చుసిన ప్రకాష్ గోడ దగ్గరకు చేరాడు. సీతా! అంటూ నెమ్మదిగా పిలిచాడు.
సీత తల ఎత్తి చూసింది.
"నేనే సీత: ప్రకాష్ ని. మాట్లాడితే నీ నోటి ముత్యాలు రాలుతాయని భయమా?"
"కాదు ఎదుటి వారి నోట్లో పళ్ళు ఊడి పడతాయని, అంతదాకాదేనికని..."
"ఏమిటో నీ మాట అర్ధమే కావటంలేదు. నా లెటర్ కి జవాబు లేదేం సీత"
"పేరురాసే ధైర్యం లేదు ప్రేమ లేఖ మాత్రం రాశావు"
"ఓ పేరు రాయలేదని కోపమా, ఈ తఫా నా పూర్తి పేరుతొ లెటర్ రాస్తాను సరేనా"
"సిగ్గులేకపోతే సరి ." అని సీత గిరుక్కున తిరిగి ఇంట్లోకి వచ్చేసింది.
ప్రకాష్ గోల సీతకి ఎక్కువయింది చూడటానికి అందంగా వుండి డబ్బున్న వాళ్ళబ్బాయి అంతవరకు బాగానే వుంది. ఇది నిజంగా ప్రేమా! ఉత్త అవేశామా? సీత కర్ధంకాని విషయం తిట్టినా పట్టించుకోడు ఎలా?