Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 11


  
    
    అర్ధం చేసుకున్న త్రిలోకసుందరి వాతావరణంలో వేడిని కంట్రోల్ చేయదలచి "బామ్మా! ఈపూట వంటేంచేశావు?" అంది.
    
    "అన్నంలోకి ఆధరువులా, వంకాయ బండపచ్చడి, కొత్తి మీరచారు, పుదీనా ఆకు పప్పు, బంగాళాదుంపలు ఓ రెండు వేయించాను." అంటూ వివరం చెప్పింది బామ్మగారు.
    
    "ఆంజనేయుడి తల్లెవరు?" అంది త్రిలోకసుందరి.
    
    "పిచ్చిపిల్లా! ఇంత చిన్న విషయం తెలియదుటే తల్లి. అంజినీదేవి. అంజనీ పుత్రుడు కాబట్టే ఆంజనేయులయ్యాడు."
    
    "ఆంజనేయులు హనుమంతుడెలా అయ్యాడు?"
    
    "బహుశా తండ్రిపేరు హనుమయ్యో మరేదో అయి వుంటుంది" అన్నాడు మదన్ గోపాల్ మధ్యలో కలగజేసుకుని.
    
    "రామ రామ" అంటూ బామ్మగారు చెవులు మూసుకుని బాధపడి చెవులమీదనుంచి చేతులు తీసేసి "దేముళ్ళ విషయంలో తెలిసితెలియకుండా వాగొద్దన్నానా? మొన్నటికి మొన్నా అంతే కృష్ణుడికి అంతంత మహత్యాలుంటే సీత కన్ని కష్టాలెందుకు? అని అడిగావ్. రాముడి భార్య సీత అని చెపితే రాముడూ కృష్ణుడూ ఒకరేగా అని రెట్టిస్తివి" అంది బామ్మగారు.
    
    "ఇహ్హిహ్హి...." అంటూ పైకే నవ్వింది వైజయంతి.
    
    తలకొట్టేసినట్లయింది మదన్ గోపాల్ కి, రాముడి భార్య సీతని తెలీక కాదు. బామ్మ నేడిపించటానికి ముద్దుగా వాదనకి దిగుతుంటాడు. అలాంటి సందర్భంలో సీత కధలోకి కృష్ణుడిని లాక్కొచ్చాడు అంతే.
    
    "రాముడు కృష్ణుడు మరి ఒకరేకదా?" అంది త్రిలోకసుందరి.
    
    "తెలీపోతే తెలీనట్లుండాలి ఇలాటి చచ్చు ప్రశ్నలు పుచ్చుప్రశ్నలు వెయ్యకు ఉత్త తెలివితక్కువ ముఖం అనుకుంటారు." అని త్రిలోకసుందరిని గట్టిగా కోప్పడింది వైజయంతి. కోప్పడేటప్పుడు "ఈ మాటలు నీకు వర్తిస్తాయి అన్నట్లు మదన్ గోపాల్ వేపు చూసింది.
    
    "హతోశ్మి" అనుకున్నాడు మదన్ గోపాల్.
    
    "విష్ణుమూర్తి వేరువేరు అవతారాలే శ్రీరాముడు శ్రీకృష్ణుడు. అసలేం జరిగిందంటే..." అంటూ అర్ధనీలిమ నేత్రాలతో ఆ పరమాత్ముడిని చూస్తూ కధ మొదలుపెట్టింది బామ్మగారు.
    
    "అమ్మబాబోయ్ బామ్మగారు మళ్ళీ పురాణం మొదలుపెట్టారు" అని భయపడి "ఇలాంటివి అమ్మకికూడా చాలా యిష్టం అమ్మని పిలుచుకువస్తాను. ఈ లోపల మీ మనవడని చెప్పండి" అంటూ వైజయంతి లేచింది.
    
    "అవునేవ్ మర్చిపోయా" అంటూ త్రిలోకసుందరి లేచింది.
    
    "తొందరగా రండి" అంది బామ్మగారు.
    
    వైజయంతి త్రిలోకసుందరి బయటికి పరుగుతీశారు.
    
    మదన్ గోపాల్ వైపు తిరిగి "అసలేం జరిగిందంటే" అంటూ మళ్ళీ చెప్పబోయింది బామ్మగారు.
    
    "ఇందాక మెంతులు అయిపోయాయి తెమ్మన్నావుగా తెస్తా నాన్నమ్మా!" అంటూ కధ వినాలేమో అని భయపడి పోయి కుర్చీలోంచి లేచాడు మదన్ గోపాల్.
    
    "ఇప్పుడు తేలేను బద్దకంగా వుంది సాయంత్రం తెస్తా నన్నావుకదరా?"
    
    "బద్ధకం పోయింది నాన్నమ్మా!"
    
    "తొందరేంలేదు సాయంత్రం తేవచ్చులే."
    
    "ఎప్పటి పనులప్పుడే చేయాలి. లేకపోతే బద్ధకం పెరిగిపోయే ప్రమాదంవుంది" అంటూ చొక్కా తగిలించుకుని బయటపడ్డాడు మదన్ గోపాల్.
    
    "పిచ్చితండ్రి నామాటంటే ఎంతగురో!" అనుకుంది బామ్మగారు,
    
    మదన్ గోపాల్ బయటికొచ్చేటప్పటికి వీధి గేటుదగ్గర త్రిలోకసుందరి వైజయంతి వున్నారు.
    
    మదన్ గోపాల్ ని చూడగానే "చూశావా త్రిలోక సుందరీ! నా అంచనా ఎంత కరెక్టో?" అంది వైజయంతి.
    
    "నువ్వు చెప్పినట్లే జరిగిందే. మనలాగానే గురుడు బెదిరిపోయాడు" అంది త్రిలోకసుందరి.

 Previous Page Next Page