Previous Page Next Page 
జీవనయానం పేజి 10

                                 


    చిన్నగూడూరు దేశముఖు రావుల రంగారెడ్డి. అతడంటే చుట్టు పక్కల గర్భనిర్భేద్యం.తనను వ్యతిరేకించినవాణ్ణి తుపాకితో కాల్చి పారేసేవాడు!

 

    అలాంటి రంగారెడ్డి, లక్ష్మణాచార్యులవారి భక్తుడు. వారు మా పితామహుల ఇంటికి వచ్చి, ఆరెకరాల పొలానికి దరఖాస్తు మీద సంతకం పెట్టవలసింది అన్నారు. 'నేను కిస్తు కట్టలేను. నాకు వద్దు' అన్నారు మా తాతగారు. రంగారెడ్డిగారు అంతటితో మానుకోలేదు. వారే లక్ష్మణాచార్యుల సంతకం పెట్టి, తుమ్మిడి చెరువు, తూము పక్కన, దేశముఖుల పొలాలకన్నముందు నీరు వచ్చే ఆరు ఎకరాల, రెండు పంటల సుక్షేత్రం అయిన మాగాణి ఇప్పించారు. అందులో ఎకరంన్నర రంగారెడ్డిగారి కొడుకు గుంజుకున్నాడు. విశ్వప్రయత్నం చేసీ - మా నాయనగారు దాన్ని సాధించలేకపోయారు. 1979లో మా నాయనగారు పరమపదించిన తరువాత అనాలుగున్నర ఎకరాలు మేము అమ్ముకున్నాం!    

 

    భూమి అంత సమృద్ధంగా ఉన్న రోజులవి కాదనుకుంటా! ఆశ అంత తక్కువగా ఉన్న రోజులవి! ఇప్పుడు భూమి తగ్గలేదు. ఆశ భూమిని మించిపోయింది.

 

    భద్రాద్రిని - రామచంద్రుని వదిలి - అచంచలం అయిన ఆత్మవిశ్వాసంతో తరలివచ్చిన దాశరథి లక్ష్మణాచార్యులవారు చిన్న గూడూరులో పొలం, ఇల్లూ సంపాదించి స్థిరపడ్డారు.

 

    మా నాయనగారుకి - వారి తాతగారి పేరు - వేంకటాచార్యులు అని పెట్టారు. ఇది సర్వసాధారణం. ఈ రోజులవలె పేర్లు గాలించవలసిన పనిలేదు. ఇందులోని సౌలభ్యం ఏమిటంటే - 1. పూర్వుల పేరు తలచుకున్నట్లు అవుతుంది. 2. తాతపేరు వెంటనే గుర్తుకు వస్తుంది.

 

    మా నాయనమ్మ తన తమ్ముడు గోవర్థనం భట్టరాచార్యుల ఇంటికి వచ్చింది కదా! చిన్నగూడూరుకు దగ్గరలోని రాజుల లేక కొంగల కొత్తపల్లికి చెందిన కళకుంట వేంకటాచార్యులవారి కూతురు ఆండాళమ్మతో భట్టరాచార్యులవారి వివాహం జరిగింది. ఆండాళమ్మ అంటే మా అమ్మమ్మ, మా అమ్మ వేంకటమ్మను కని పురిటిలోనే కన్నుమూసింది. మా అమ్మను నేనే సాదానంటుంది మా నాయనమ్మ. నేనే సాదానంటుంది కొత్తపల్లిలోని మా అమ్మమ్మ అక్క.

 

    మొత్తంమీద మా అమ్మ - నాయన కలిసి ఆడుకున్నారు. కలిసి పెరిగారు. మేనరికమే కావడంవల్ల వాళ్ళకు బాల్యంలోనే వివాహం జరిగింది.

 

    మా నాయనగారు మా ఉభయ మహులవద్ద చదువు ముగించారు. ఇహ చదువు లేదు అక్కడ. ఏంచేయాలని మా ఉభయ మహులు - బావ బావమరదులు ఆలోచించారు. గోలకొండ పట్నం - హైదరాబాదు - వెళ్లాలా? చెన్నపట్నం - మద్రాసు వెళ్లాలా అని ఆలోచించారు.

 

    మా తండ్రిగారి జననం 1898. వారికి పది, పదిహేను సంవత్సరాలు అనుకుంటే సుమారు 1912 ప్రాంతంలో చిన్న గూడూరు వంటి ఊళ్ళో ఈ ఆలోచన వచ్చినవారు ఉండి ఉండరు. జ్ఞానతృష్ణ ఇలాంటి ఆలోచనకు కారణం అవుతుంది!

 

    గోలకొండ పట్నంలో మ్లేచ్ఛ విధ్య పనికిరా దనుకున్నారు. చెన్నపట్నం వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకున్నదే తడవు బయలుదేరారు. లక్ష్మణాచార్యులవారు మరొకసారి చిన్నగూడురులో ఇల్లూ - పొలం వదిలి, కేవలం ఆత్మవిశ్వాసంతో - తెలియని భాష - తెలియని ప్రాంతం మద్రాసు చేరుకున్నారు. మా తాతయ్య, నాయనమ్మ - మా అమ్మ, నాయన మద్రాసు చేరుకున్నారు. అంతా కొత్త. అయోమయం. అరవం.

 

    కేవలం ఆత్మ విశ్వాసంతో మా తాతగారు ఆమహా నగరం చేరారు. సత్రంలో ఉండగా మా వాళ్ళకు ఏడుపులు వినవచ్చాయి. మా తాతగారు పరుగెత్తారు. ఒకతను అవసాన దశలో ఉన్నాడు. వెంటనే కంటికి కలికం వేశారు. కుప్పె రంగరించి నాలుకకు రాశారు. ఎవరి అదృష్టమో తెలియదు - అతను బయట పడ్డాడు. కొద్దిరోజుల్లో బాగయినాడు. వారు గోదావరి ప్రాంతపు సంపన్న వైశ్యులు. వారికి తిరువళిక్కేణిలో ఉన్న ఇంటిని మా తాతగారికి వప్పగించారు. వారి వైద్యం గురించి కూడా ప్రచారం చేసిన వైశ్య కుటుంబం స్వగ్రామం వెళ్ళిపోయింది.

 

    ప్రతిభకు ప్రాంతం - భాష - దేశం ఏవీ అడ్డురావు. మా తాతగారి వైద్యం మద్రాసు మహానగరంలో దివ్యంగా సాగింది. మా నాయన మద్రాసు విశ్వవిద్యాలయం "విద్వాన్" లో చేరారు.

 

    స్త్రీ విద్య నిషేధం అన్నది మా కుటుంబానికి వర్తించలేదు. మా అమ్మకు మా తాతగారు - మా నాయన చదువు చెప్పారు. మా అమ్మ వేంకటమ్మగారు పంచకావ్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వారికి ద్రావిడ, సంస్కృతాలతో పరిచయం ఉన్నా ఆంధ్రం వారి అభిమాన విషయం.

 

    మా అమ్మగారు తిరువళిక్కేణ్ణిని గురించీ - పార్థసారథి స్వామి ఆలయాన్ని గురించీ ఎంతో ఆవేశంగా, ఆప్యాయంగా వివరించేవారు. అది మా మీద ఎంతటి ముద్ర వేసిందంటే - మద్రాసు వెళ్ళినప్పుడు తిరువళిక్కేణి - ట్రిప్లికేన్ - పార్థసారథి స్వామి ఆలయానికి వెళ్తాం. ప్రసాదం తీసుకొని అక్కడ కొంతసేపు గడుపుతాం. బహుశా ఈ చోటనే మా తాతగారు - నాయనమ్మ, నా నాయన, అమ్మ తిరిగి ఉంటారు. కూర్చొని ఉంటారు - ముచ్చట్లు చెప్పుకొని ఉంటారు అన్న అనుభూతి పొందుతాం.

 

    జంగమములకన్న స్థావరముల అనుబంధమే మిక్కుటమైనది.
    కాళిదాసు శకుంతలకు చెట్టు చేమలతో విడదీయరాని అనుబంధం కలిగించాడు.
    భవభూతి రాముణ్ణి సీతలేని పర్ణశాల చూపించి ఏడిపిస్తాడు!

 

    వేంకటాచార్యులవారు "విద్వాన్" పట్టా సంపాదించారు. వారి భవిష్యత్తు మద్రాసులో వికసించే సదవకాశం ఉంది.

 

    లక్ష్మణాచార్యుల వారి వైద్యం ఆరుకాయలుగా సాగుతున్నది. అయినా వారు మద్రాసులో నిలవదలచలేదు. వచ్చిన పని అయిపోయింది. భద్రాచాలం, గూడూరు వదిలినట్లే మద్రాసు వదిలారు. ఎందుకు వదిలారు? అంటే, మనిషి తనవాళ్ళమధ్య ఉండాలి అన్నారు. మళ్ళీ తనవాళ్ళమధ్యకు చిన్న గూడూరు వచ్చి చేరారు.

 

 

 Previous Page Next Page