Previous Page Next Page 
ఖజురహో పేజి 11


    
    "బాయ్ ఫ్రెండా?" అనూరాధ అడిగింది.
    
    "చూసావుగా అబ్బాయిలాగే అనిపించాడు" చాయ వెక్కిరింపుగా అంది. అందరూ ఆమె జోక్ కి నవ్వేశారు.
    
    "అందగాడేనా? బాగా డబ్బున్నవాడు కూడానా?" అనూరాధ ఆరాగా అడిగింది.
    
    చాయ ఆ ప్రశ్నకి గతుకుమన్నట్లు చూసింది.
    
    నిజమే! తను కనీసం అతని స్థితిగతులైనా తెలుసుకోవలసింది అనిపించినా వెంటనే సర్దుకుని-
    
    "వాళ్ళ నాన్నగారు మల్టీ మిలియనీర్ ఇతనూ ఈ మధ్యే స్టేట్స్ నుంచి వచ్చి ఏదో ఎక్స్ పోర్ట్ బిజినెస్ పెట్టాడు" అనేసింది తేలిగ్గా.
    
    "ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు?" సంధ్య వస్తూ అడిగింది.
    
    "చాయ బాయ్ ఫ్రెండ్ గురించి" చెప్పింది అనూరాధ.
    
    "ఏం చదివాడు?" స్మిత అడిగింది.
    
    "ఎమ్ బిఎ" తడుముకోకుండా చెప్పింది చాయ.
    
    "సేల్స్ సైడ్ అయితే మగవాళ్ళు భలే కబుర్లు చెబుతారు" సంధ్య నవ్వుతూ అంది.
    
    చాయ కాస్త అనుమానంగా ఆమెని చూసింది. ఆ నవ్వులో ఏమీ వ్యంగ్యం కనిపించలేదు.
    
    "ఇంతకీ మీ నాన్నగారేం చేస్తారు?" అడిగింది చాయ సంధ్యని.
    
    "బిజినెస్ స్టేట్స్ లో వున్నారు. త్వరలో వస్తారు" అంది సంధ్య.
    
    "జేసీలాబ్స్, జేసీ ఇండస్ట్రీస్ అని వింటూ వుంటాం చూడు అవన్నీ వాళ్ళ నాన్నగారివేనట. పైగా సంధ్య ఒక్కగానొక్క కూతురుట" అనూరాధ కళ్ళు పెద్దవి చేసి గొప్పగా చెప్పింది.
    
    అంత ప్రఖ్యాతిగల ఫర్మ్స్ వాళ్ళవంటే నమ్మకం కలగనట్టుగా, చాయ కళ్ళు ఆశ్చర్యంగా పెట్టి సంధ్యని చూసి "నిన్ను చూస్తే అంత గొప్పవాళ్ళ అమ్మాయిలా అనిపించవు" అంది.
    
    "థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ గొప్పతనం బట్టలవల్లరాదు. గుణాలవల్ల రావాలి అన్నారు స్వామి వివేకానంద...." అని నవ్వేసింది సంధ్య"
    
    "పదండి క్లాసుకి టైమవుతోంది" అంది స్మిత.
    
    చాయ నడుస్తూనే కళ్ళ కొసలనుండి సంధ్యని గమనించింది.
    
    సంధ్య ఓ చేతికి వాచీ పెట్టుకుంది. మెడలో సన్నని చెయిన్ వేళాడుతోంది. ఖరీదయిన చెప్పులు తొడుక్కుంది. గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని గట్టిగా జడ అల్లుకుంది. ఆ జడలో ఓ ఎర్రగులాబీ పెట్టుకుంది. నుదుట చిన్నబొట్టు ఎర్రగా చుక్కలా మెరుస్తోంది. ఇంతకుమించిన అలంకరణలేం చేసుకోలేదు. కానీ ఆ అమ్మాయి ముఖం ఏదో వింత ఆకర్షణతో వెలిగిపోతోంది. ఆ శక్తి ఆమె కళ్ళల్లో వుంది. నిర్మలమైన చూపు. భగవంతుని సాన్నిధ్యంలో మనం కళ్ళు మూసుకునేటట్లు చేసే శక్తిగల చూపు. ఆ చూపులోని చల్లదనానికి చాయ వెన్నులో నరం వణికినట్లయింది.
    
                                         * * *
    

    "హాయ్ బడ్డీ!"
    "యా....నోయార్! అభీనై."
    "జానేదోయార్."
    "నో కిడ్డింగ్....యూ సిల్లీ."
    "హే సంగీత్ లో పిక్చర్ చూశావా?"
    "అరెరె లీవ్ మీ ఐసే."
    "పొట్టీ అబ్బా షైరే"
    "బహుత్ ఫకర్ హైరే."
    "కమాన్ లెట్స్ మూవ్."
    
    ఎటుచూసినా పకపకా నవ్వులు. సన్నని కీచుగొంతులతో అరుపులు.
    
    నేపధ్యంగా దమాదమ్ మస్త్ కలందర్ సన్నని స్టీరియోలోంచి వినబడుతోంది.
    
    ఒకమ్మాయి తొడమీద ఒకబబాయి దరువు వేస్తున్నాడు.
    
    ఇంకో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి క్రాఫ్ దువ్వుతోంది. చుట్టువున్నవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు.
    
    అమ్మాయిలు షోకేసుల్లోంచి బయటకొచ్చిన బార్బీ డాల్స్ లా వున్నారు.
    
    అబ్బాయిలు మోడలింగ్ చేస్తూ, హోర్డింగ్స్ లోంచి పొరపాటున బయటికిజారి పడిపోయినట్లు వున్నారు.
    
    ఆ వాతావరణం చాయకి చాలా ఆసక్తికరంగా వుంది. ఆ ఐస్ క్రీమ్ పార్లర్ లో జంటలు జంటలుగా వున్న యువతీ యువకులు అప్పుడే స్వర్గం నుండి దోసిళ్ళతో అమృతం తాగి వస్తున్న అమరుల్లా కనిపిస్తున్నారు.
    
    హుషారుగా, ఉల్లాసంగా, సంతోషాన్ని కడకొంగున కట్టుకున్నంత ధీమాగా వున్నారు.
    
    యవ్వనమంతా అక్కడే ఇమిడిపోయినంత రమ్యంగా వుంది.
    
    అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిమీద ఒకరు పడిపోతూ, గట్టిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ జీవించడం అంటే ఇదేసుమా అని ఎలుగెత్తి చెబుతున్నట్టున్నారు.
    
    "ముందు ఐస్ క్రీమ్ తిను" కిరణ్ ఆమెకి కప్పు అందిస్తూ అన్నాడు.
    
    "కిరణ్ వీళ్ళకేం చీకూ చింతా లేదా?" మనసులో అనుకున్నట్లు పైకే అనేసింది చాయ.
    
    కిరణ్ నవ్వి వూరుకున్నాడు.
    
    చాయ కళ్ళప్పగించి వాళ్ళనే చూస్తూ తింటోంది. డబ్బంటే లెక్కలేకుండా వున్నారు. పర్సులోంచి నోట్లు తీసి వెదజల్లుతున్నారు. అమ్మాయిల కన్నుల్లో సరదా, అబ్బాయిల జేబుల్ని రెచ్చగొడుతున్నట్లుంది. అందరి మొహాల్లో నవ్వు. ఆరిపోని వెలుగులాంటి, పాలపొంగులాంటి, గోదారి నురగలాంటి స్వచ్చమైన నవ్వు. అవును..... డబ్బుంటే అంత ఆనందం స్వంతం అవుతుంది. వీళ్ళంతా పెట్టి పుట్టారు. ప్రొద్దుటే టాయ్ లెట్ల దగ్గర క్యూలు కట్టి నిలబడనక్కర్లేదు.
    
    చుక్కచుక్క టప్ టప్ అని రాలుతున్న పంపులక్రింద బకెట్లు పెట్టి పడిగాపులు పడాల్సిన పనిలేదు. బ్రాసరీ దగ్గర్నుంచీ కాలికి వేసుకునే చెప్పువరకు, పిన్నీసులు పెట్టి మరమత్తులు చేసుకునే ఖర్మలేదు. చాలీచాలని చిరుగుల దుప్పట్లలో కాళ్ళు ముడుచుకుంటూ నల్లుల్ని, దోమల్ని, ఎలుకల్ని, బొద్దింకల్ని సహనంగా భరిస్తూ వాటితో పక్క పంచుకోనక్కర్లేదు.
    
    వారికి నవ్వడం మాత్రమే నేర్పిన తల్లిదండ్రులున్నారు. వారి నవ్వుని మాయనివ్వకుండా నోట్ల కట్టలిచ్చి కాపాడుకుంటారు. తిరగడానికి కార్లు, నోటికీ చేతికి అన్నీ అందించడానికి నౌకర్లు విలాసాలకి, సరదాలకి బాయ్ ఫ్రెండ్స్! ఓహ్....లైఫ్ అంటే అదీ....పుడితే అలా పుట్టాలి. లేకపోతే అసలు పుట్టనేకూడదు.
    
    "మేడమ్ చాయాదేవి.....ఏ లోకంలో వున్నారు?" కిరణ్ ఆమె కళ్ళముందు చిటికెలు వేస్తూ అన్నాడు.

 Previous Page Next Page